విత్తు…విపత్తు

  లేబుల్స్ లేకుండా విత్తనాల విక్రయాలు సరైన రికార్డుల నిర్వహణ కూడా లేదు వ్యవసాయ శాఖ విత్తన దుకాణాల తనిఖీల్లో బట్టబయలు సీజన్ సమీపిస్తున్న వేళ అన్నదాతల్లో ఆందోళన మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో విత్తన దుకాణాల్లో సరైన రికార్డులు నిర్వహించడం లేదు. కొన్ని విత్తన ప్యాకెట్లకు అసలు లేబుల్స్ కూడా ఉండటం లేదు. నేరుగా అలాగే రైతులకు అంటగడుతున్నారు. ఏ విత్తనం ఎక్కడిది.. ఎవరికి విక్రయిస్తున్నారు.. రోజువారీగా ఎంత మొత్తంలో అమ్ముతున్నారు అనే దానిపై ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. […] The post విత్తు… విపత్తు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లేబుల్స్ లేకుండా విత్తనాల విక్రయాలు
సరైన రికార్డుల నిర్వహణ కూడా లేదు
వ్యవసాయ శాఖ విత్తన దుకాణాల తనిఖీల్లో బట్టబయలు
సీజన్ సమీపిస్తున్న వేళ అన్నదాతల్లో ఆందోళన
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో విత్తన దుకాణాల్లో సరైన రికార్డులు నిర్వహించడం లేదు. కొన్ని విత్తన ప్యాకెట్లకు అసలు లేబుల్స్ కూడా ఉండటం లేదు. నేరుగా అలాగే రైతులకు అంటగడుతున్నారు. ఏ విత్తనం ఎక్కడిది.. ఎవరికి విక్రయిస్తున్నారు.. రోజువారీగా ఎంత మొత్తంలో అమ్ముతున్నారు అనే దానిపై ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్యాకింగ్ లేని అనుమతి లేని పత్తి విత్తనాలు, ఇతర నకిలీ విత్తులు యాధేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇవన్నీ రా్రష్ట్ర వ్యవసాయ శాఖ గత రెండు రోజులుగా సెంట్రల్ స్కాడ్ టీమ్స్ పేరుతో నిర్వహిస్తున్న తనిఖీల్లో బట్టబయలైంది. వివిధ జిల్లాల్లోని టీమ్‌లుగా విడిపోయిన అధికారులు విత్తన విక్రయ కేంద్రాలు, జిన్నింగ్ మిల్స్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వీటిలో మంగళవారం రూ.7.20 కోట్ల విలువ చేసే 16,499 కిలోల పత్తి విత్తనాలను విక్రయాలు జరపకుండా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిషేధిత గ్లైఫోసేట్ రసాయానాలను కూడా సీజ్ చేశారు. ఇలా అనేక విత్తన దుకాణాల నిర్వహణ సరిగా లేకపోవడంతో పాటు నకిలీ, నాసిరకం విత్తనాలను నిల్వ చేసుకుంటున్నట్లు గుర్తించారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఇదే అదునుగా భావిస్తున్న నకిలీదారులు రైతులను నట్టేటా ముంచేలా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరిస్తున్నా, క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు తనిఖీలు చేస్తున్నా, సచివాలయ ఉన్నతాధికారుల అండదండలతో ఈ దందాను దళారులు నడిపిస్తున్నట్లు తెలిసింది. అలాగే 52 ఏళ్ల నాటి విత్తన చట్టాన్ని, 35 ఏళ్ల నాటి విత్తన నియంత్రణ చట్టాలలోని కొన్ని అంశాలలో స్పష్టత లేకపోవడంతో దళారులు, కంపెనీలు వీటిని ఆసరగా చేసుకుంటున్నారు.
వచ్చే ఖరీఫ్‌లో 1.29 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దాదాపు 90 కంపెనీల ద్వారా ఈ విత్తనాలు రైతులకు సరఫరా చేయనుంది. ఇక జిల్లాల నుంచి వివిధ రకాల విత్తనాలకు ఇండెంట్ తెప్పించుకున్న ప్రకారం 7.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయనున్నారు. ఇందులో వరి విత్తనాలు 3 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయనున్నారు. హైబ్రిడ్ రకం, ఆర్‌ఎన్‌ఆర్-15064, కెఎన్‌ఎం-118, జెజిఎల్ -18047 రకం విత్తనాలను సరఫరా చేస్తారు. వీటితోపాటు బిపిటి -5204 రకం విత్తనాలను కూడా సరఫరా చేయాలని నిర్ణయించారు. అలాగే 1.70 లక్షల క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలను కూడా సరఫరా చేయడంతో పాటు 20 వేల క్వింటాళ్ల కంది విత్తనాలను కూడా సరఫరా చేస్తారు. పెసర, మినుములు, జొన్న, మొక్కజొన్న, జీలుగ, పిల్లిపెసర, పొద్దు తిరుగుడు, ఆముదం విత్తనాలను కూడా ఖరీఫ్ కోసం అందజేస్తారు. లక్ష క్వింటాళ్ల జీలుగ విత్తనాలను సరఫరా చేస్తారు. మొక్కజొన్న విత్తనాలను 80 వేల క్వింటాళ్లు సరఫరా చేస్తారు.
2017-18, 2018-19లలో ఇలా 
201718 కాలంలో రూ.14.37 కోట్ల విలువ చేసే 24,345 క్వింటాళ్లు విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ. 16.47 కోట్ల విలువ చేసే 6765 క్వింటాళ్లు సీజ్ చేశారు. ఇందులో 6ఎ కింద 50 కేసులు బుక్ చేశారు. ఐపిసి 420 కింద మరో 50 కేసులు నమోదు చేశారు. 49 మందిని అరెస్ట్ చేశారు. 48 కంపెనీలకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా, 38 లైసెన్స్‌లను సస్పెండ్ చేశారు. ఇక 201819 కాలంలో 1944 విత్తన ఔట్‌లెట్స్‌ను తనిఖీ చేయగా, రూ.3.32 కోట్ల విలువ చేసే 4283 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. రూ.9.90 కోట్ల విలువ చేసే 7481 కిలోల ప్యాకెట్లు, 2,18,524 కిలోల లూజ్ విత్తనాలు సీజ్ చేసినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 10 మందిపై ఐపిసి 420 కేసులు నమోదు చేయగా, 32 మందిని అరెస్ట్ చేశారు.

Selling Seeds Without Labels in Telangana

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విత్తు… విపత్తు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: