కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాలు సిద్ధం

   విధులు, బాధ్యతలు, అధికారాలు వేరే శాఖలకు  రాజీవ్‌శర్మ నేతృత్వంలో కమిటీ అధ్యయనం  కీలక సిఫార్సులు చేసిన కెసిఆర్  అవినీతికి ఆస్కారం లేకుండా కఠిన నిబంధనలతో చట్టానికి రూపకల్పన  ఈ నెలాఖరులోగా సిఎం వద్దకు ఫైలు మనతెలంగాణ/హైదరాబాద్: రెవెన్యూ శాఖకు సంబంధించిన విధులు, బాధ్యతలు, అధికారాలను వేరే శాఖలకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్‌కు సంబంధించిన కొత్త చట్టాల ముసాయిదాలు వేగంగా రూపొందుతున్నాయి. ఈనెల చివరి వరకు దీనికి సంబంధించిన ఫైలును […] The post కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాలు సిద్ధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 విధులు, బాధ్యతలు, అధికారాలు వేరే శాఖలకు
 రాజీవ్‌శర్మ నేతృత్వంలో కమిటీ అధ్యయనం
 కీలక సిఫార్సులు చేసిన కెసిఆర్
 అవినీతికి ఆస్కారం లేకుండా కఠిన నిబంధనలతో చట్టానికి రూపకల్పన
 ఈ నెలాఖరులోగా సిఎం వద్దకు ఫైలు

మనతెలంగాణ/హైదరాబాద్: రెవెన్యూ శాఖకు సంబంధించిన విధులు, బాధ్యతలు, అధికారాలను వేరే శాఖలకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్‌కు సంబంధించిన కొత్త చట్టాల ముసాయిదాలు వేగంగా రూపొందుతున్నాయి. ఈనెల చివరి వరకు దీనికి సంబంధించిన ఫైలును పంపాలని సిఎం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు కొత్త చట్టంపై పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా త్వరలో అమల్లోకి రానున్న కొత్త చట్టంలో కీలక సంస్కరణలను రూపొందిస్తున్నట్టు తెలిసింది. అవినీతికి ఆస్కారం లేకుండా కఠిన నిబంధనలతో ఈ చట్టానికి అధికారులు రూపకల్పన చేస్తున్నారు. కొత్త చట్టంలో భాగంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన విధులు, బాధ్యతలు, అధికారాలను పంచాయతీరాజ్, వ్యవసాయ, మున్సిపల్ శాఖలకు, రిజిస్ట్రేషన్ సేవలతో పాటు మ్యుటేషన్ విధానాలను మున్సిపల్ శాఖకు బదలాయించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ దీనిపై అధ్యయనం చేసి ఆ దిశగా ముసాయిదాను సిద్ధం చేస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.
25వ తేదీలోగా వివరాలు పంపించాలి
కలెక్టర్, ఆర్డీఓ, ఆర్‌ఐల పేర్లను మార్చేందుకు ముసాయిదాలో మార్పులు, చేర్పులు చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగం గానే ముసాయిదాలో కీలక సిఫార్సులు చేసినట్టు తెలిసింది. దీంతోపాటు ధ్రువీకరణ పత్రాల జారీ, పంచాయతీరాజ్ శాఖకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. హోదా మార్పిడితో పాటు ఉద్యోగుల విలీనం అంశంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయ నిపుణుల సలహాలను కూడా తీసుకుంటోంది. ఈ రెండు చట్టాల ముసాయిదాను సిఎం ఓకే చేసిన తరువాతే క్యాబినెట్‌లో పెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల కోడ్ అనంతరం మంత్రివర్గ సమావేశం నిర్వహించి దీనికి ఆమోదం తెలిపేలా అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఈలోగా అన్ని శాఖల అధికారులు సిద్ధం కావాలని, దీనికి సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేయాలని, ఈ నెల 25వ తేదీలోగా దీనికి సంబంధించిన వివరాలను పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.
కార్యాచరణ మొదలుపెట్టిన అధికార వర్గాలు
దస్త్రాల పరిశీలన పూర్తయిన తరువాత చేపట్టాల్సిన అంశాలపై ఇప్పటికే అధికారులకు కెసిఆర్ దిశానిర్ధేశం చేసినట్టు తెలిసింది. సిఎం కెసిఆర్ దీనికి అవసరమైన సలహాలు, సూచనలు అందించినట్టు సమాచారం. అనుకున్న షెడ్యూల్‌లోనే రైతాంగానికి సాయం అందించేలా జూన్ తరువాత కొత్త చట్టం అమల్లోకి వచ్చేలా కెసిఆర్ కీలకమైన సిఫార్సులు చేసినట్టు తెలిసింది. వీటి అమలు దిశగా అధికార వర్గాలు కార్యాచరణను మొదలుపెటాయి. తొలి దశలోనే వివాదరహిత భూముల స్పష్టతతో యాజమాన్య హక్కులు ఇచ్చేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పాస్ పుస్తకాలు, పహాణీలలో సరళమైన తెలుగు పదాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పహాణీ, సేత్వార్, ఫౌతీ లాంటి పదాలను తొలగించారు. భూమి శిస్తు రద్దు చేసినందున భూమి రకాల వర్గీకరణ అవసరం లేకుండా పోయింది. గరిష్ట భూ పరిమితి చట్టం ప్రకారం వర్గీకరించిన భూముల వివరాలను యధావిధిగా కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా అసైన్డ్ ల్యాండ్స్ అంశాలను పరిష్కరించి స్పష్టత తీసుకొచ్చారు. వ్యవసాయం చేసుకునే వారికి అసైన్డ్ భూముల్లో యాజమాన్య హక్కులు ఇవ్వాలన్న యోచన కార్యరూపంలోకి వచ్చింది. కోర్‌బ్యాంకింగ్ తరహాలో భూముల సమాచారం నిక్షిప్తం చేసి 55 లక్షల రైతులకు సంబంధించిన రికార్డులను భద్రపరచనున్నారు. పంట రుణాలు ఇచ్చే సందర్భంలో రైతుల పట్టాదార్ పాస్ పుస్తకాలు కుదువ పెట్టాల్సిన అవసరం లేదని, బ్యాంకులు అడిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అధికారులు పేర్కొంటున్నారు. గ్రామ కంఠ పరిధి, హద్దులను నిర్ణయించే దిశగా అధికారుల కసరత్తు జరుగుతోంది.
82.32 లక్షల మంది రైతుల వాస్తవ వివరాలు వెలుగులోకి..
రాష్ట్రంలో ఉన్న 10,878 రెవెన్యూ గ్రామాల్లోని 2.28 కోట్ల ఎకరాలకు చెందిన భూ రికార్డుల వాస్తవ రికార్డులు ప్రభుత్వానికి చేరాయి. రాష్ట్రంలో 1.63 కోట్ల సర్వే నెంబర్లలో రికార్డులను పరిశీలించి 6,936 గ్రామ సేత్వారీలను సంస్కరించే ప్రయత్నం పూర్తయ్యింది. దీంతో 82.32 లక్షల మంది రైతులు వాస్తవ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వేలో ప్రధానంగా మార్పిడి చేసిన వారు భూమి కొనుగోలు చేసినా యాజమాన్య హక్కులు బదిలీ కానీ వారి వివరాలు బయటకు వచ్చాయి. స్థానికంగా ఉండని వారి వివరాలతో పాటు తరిపొలాలు, నీటి యోగ్యత లేనివి, బోరు బావుల కింద సాగు చేసుకుంటున్న భూములు, ఖుష్కీ భూములు, ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న వారి వివరాల లెక్క తేలింది. వీటితో పాటు అసైన్డ్ భూములు, చేతులు మారిన వివరాలు, ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న వారి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేశారు. ఈ రికార్డుల ప్రక్షాళనలో ప్రధానంగా గ్రామ రికార్డుల్లో కీలకమైన పహాణీ గ్రామలెక్క 3ని, మండల స్థాయిలో 1బి రికార్డు, అసైన్డ్‌మెంట్ రిజిస్ట్రర్, ఇనాం రిజిస్ట్రర్, రక్షిత కౌలుదారుల రిజిస్ట్రర్‌లను కీలకంగా పరిశీలించి వాస్తవాలతో అధికారులు నివేదికను సిద్ధం చేశారు. కచ్చితమైన రికార్డుల దిశగా గ్రామస్థాయిలో ప్రక్షాళన పూర్తిగా జరిగిందని అధికారులు పేర్కొంటుండగా, రికార్డుల తనిఖీలో అనేక ప్రాంతాల్లో విస్తీర్ణాల మార్పులు బయటపడ్డాయి. భూమి క్రయ, విక్రయాలు రికార్డుల్లో నమోదు కాకపోవడం, కంప్యూటర్ తప్పులు, ఫౌతీదోషాలు, సర్వే నెంబర్‌లో కొంత విస్తీర్ణం నమోదు చేసుకొని మరికొంత నమో దు చేయించుకోకపోవడం వంటి వాటిలో తేడాలను సరిచేశారు.

The post కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాలు సిద్ధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: