ఇలాంటి కథలొద్దు…!

  ఇదేంటి స్రవంతీ ఇలాగయిందీ… నేను నమ్మలేక పోతున్నాను. ఈ ఇల్లేమిటీ? నువు ఇక్కడేమిటీ… ఓ గాడ్‌” ప్రమీల ఏడవటం మొదలుపెట్టింది. “అరే ఊరుకోవే బాబూ… ఇక్కడంతా ఎలా చూస్తున్నారో చూడు. ఇప్పుడేమయిందీ. నేను పని చేస్తున్నాను అంతేకదా. నాకు చాతనైన పని… ఎన్నో ఏళ్లు నేను మేనేజ్ చేసిన వ్యవహారం. నాకేం ఇబ్బంది లేదు ఊరుకో”. “ఇదేం పని స్రవంతీ. నువు వంట పని చేస్తున్నావా? నువ్వేనా? అసలేమయింది. శేఖర్‌ని తలుచుకుంటేనే ఇప్పుడు గుండె చెరువయిపోతోంది.” […] The post ఇలాంటి కథలొద్దు…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇదేంటి స్రవంతీ ఇలాగయిందీ… నేను నమ్మలేక పోతున్నాను. ఈ ఇల్లేమిటీ? నువు ఇక్కడేమిటీ… ఓ గాడ్‌” ప్రమీల ఏడవటం మొదలుపెట్టింది.
“అరే ఊరుకోవే బాబూ… ఇక్కడంతా ఎలా చూస్తున్నారో చూడు. ఇప్పుడేమయిందీ. నేను పని చేస్తున్నాను అంతేకదా. నాకు చాతనైన పని… ఎన్నో ఏళ్లు నేను మేనేజ్ చేసిన వ్యవహారం. నాకేం ఇబ్బంది లేదు ఊరుకో”.
“ఇదేం పని స్రవంతీ. నువు వంట పని చేస్తున్నావా? నువ్వేనా? అసలేమయింది. శేఖర్‌ని తలుచుకుంటేనే ఇప్పుడు గుండె చెరువయిపోతోంది.”
“నువు యు.ఎస్‌లో ఉన్నావు. నీకు చెప్పే సమయం లేదు. పైగా అసలు నువు గుర్తొచ్చే అవకాశం కూడా లేదు. శేఖర్ హఠాత్తుగా పోయాడు. జస్ట్ కొన్ని నిమిషాలు, కార్డియాక్ అరెస్ట్… అంతే ”
ప్రమీల కళ్లు తుడుచుకొంది. చుట్టూ తనను విచిత్రంగా చూస్తున్నారు.

“స్రవంతి నేను క్రితం వారం వచ్చాను. ఈ ఇల్లు మా బావగారిది. నీకు తెలుసు కదా… మా బావగారు, అన్నయ్య నీకు పరిచయం కదా! వాళ్లింట్లో ఫంక్షనయితే నీకే కేటరింగ్ ఇచ్చారా?” ప్రమీల మొహం కోపంతో కందిపోయింది.
“ప్రమీలా కూల్. నీ తోడికోడలు సుభాషిణి నాకూ ఫ్రెండ్. అందుకే ఈ ఆర్డర్ నాకు వచ్చింది. ఇలాంటి స్నేహితులే నన్ను నిలబెట్టారు. ఇంకో గంటలో ఇదంతా ముగించుకొని వస్తాను” అంటూ వెళ్లిపోయింది స్రవంతి.
ప్రమీల నోట మాట రానట్లు చూస్తోంది. స్రవంతితో పాటు పది మంది ఆ ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ కోసం, వంట వండి వ్యాన్‌లో తీసుకొచ్చారు. ఇంటి ముందు షామియానాలో స్రవంతి మిగతా వాళ్లతో పాటు వడ్డన చేస్తోంది. ఇలాంటి ఫంక్షన్‌లో ఒంటి నిండా నగలతో పట్టు చీరతో మొహాన చిరునవ్వుతో అందరికీ అన్నీ అందాయో లేదో చూసే స్రవంతి కళ్లముందు కనిపిస్తోంది.

“ఏమైంది? శేఖర్ కాంట్రక్టర్‌గా కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు. పిల్లలు టాప్ స్కూల్లో చదువుకొంటున్నారు. వాకిటి ముందు రెండు పడవల్లాంటి కార్లు, ఇంద్రభవనం వంటి ఇల్లు ఏమయ్యాయి. శేఖర్ పోయిన ఏడెనిమిది నెలల్లో ఆస్తులన్నీ ఎట్లా మాయం అయ్యాయి?”
కళ్ల ముందు ఏదో మేజిక్ లాగా వడ్డనలు అయిపోయాయి. ఖాళీ అయిన గిన్నెలు, గ్లాసులు సర్దుకొని వ్యాన్ బయలు దేరింది. చేతులు, మొహం తుడుచుకుంటూ స్రవంతి ప్రమీల దగ్గరకు వచ్చి కూర్చుంది. మామూలు సిల్కుచీర, ఒంటిపైన ఎలాంటి ఆభరణాలు లేకుండా పని అలవాటైన మనిషిలా ఉంది స్రవంతి. ప్రమీల చేయి పట్టుకొంది.
“నువ్వు బాధ పడకు. శేఖర్ కూడా ఊహించి ఉండడు. ఇంట్లో భర్త చాటు భార్యగా నేను సుఖాలు అనుభవిస్తూ ఉన్నాను. పిల్లలు స్కూలుకు వెళ్లేదారి కూడా డ్రైవర్ లేకపోతే నాకు తెలియదు. వాళ్ల ఫీజులు, ఇంటి ఖర్చుల బ్యాంక్ బాలెన్స్, ఆయన వ్యాపారం ఏదీ తెలియదు. నేనెప్పుడూ అడగలేదు ఆయన చేసే బిజినెస్, అకౌంట్స్, ఆస్తులు కొనటం, అమ్మటం… అస్సలు చివరకు నాకు క్రెడిట్, డెబిట్ కార్డులు కూడా వాడటం రాదు.

నగలన్నీ ఇంట్లో నేనొక్కదాన్ని ఉంటాననీ, తను ఎప్పుడైనా బయటకి వెళితే ఇంట్లో డబ్బు ఉంటుందనే విషయం ఆఫీస్ స్టాఫ్ కూడా ఊహించకుండా, అంతా అందరికీ తెలిసేలా లాకర్‌లో పెట్ట్టేవాడు. ఆ లాకర్ ఆయన బుక్ చేయలేదు. మా మేనేజర్… అట్లాగే బిజినెస్ లావాదేవీలు ఆయన చెక్ సంతాకం తప్పించి, మేనేజర్ మిగతా విషయాలన్నీ చూశాడు. మామగారు లేరు కదా! అత్తయ్య నా కంటే అధ్వానం. ఆవిడ నెలకో పట్టుచీర, గుళ్లూ గోపురాలు, యాత్రాస్పెషల్స్, విజయవాడో, తిరుపతో ప్రయాణాలు, కొడుకు ఏం కావాంటే అది బుక్ చేయించి, ఎంత డబ్బు కావాలంటే అంత మేనేజర్ తెచ్చి చేతిలో పెట్టేవాడు. అసలు మా జీవితాలు మేనేజర్ చేతిలోనే ఉన్నాయి.

ఆయన ఈ రాత్రి పోయారు. తెల్లారి రెండు కార్లు లేవు. బంధువులు వచ్చారు. ఆయన్ని సాగనంపారు. ఊరంతా భోజనాలు పెట్టారు. మేనేజర్ కనుసన్నల్లో అంతా అయిపోయింది. బంధువులు వచ్చిన వాళ్లు వచ్చినట్లే వెళ్లిపోయారు. తెల్లవారి అత్తయ్య పాపం కళ్లు తిరిగి పడిపోయింది. హాస్పటల్‌కు తీసుకుపోయేవాళ్లు లేరు. మేనేజర్ గాయబ్. నేను నా గదిలోంచి బయటకి వచ్చి, ఆవిడను హాస్పటల్‌కు తీసుకుపోయి వచ్చాను. నెమ్మదిగా మేనేజర్, ఆడిటర్ వచ్చారు. క్యాష్ లేదు, బిజినెస్ లేదు. రూపాయి ఎవరికి ఇవ్వాలో తెలియదు. శేఖర్ బిజినెస్‌లో ఇవ్వవలసిన వాళ్లు ఎంతోమంది వచ్చారు. నెలలోపుగా నేను పిల్లలు అత్తయ్య ఇల్లు ఖాళీ చేయవలసి వచ్చింది.”

“అదేంటి స్రవంతి. మన ఫ్రెండ్స్, బంధువులు, మీ తోటి కోడళ్లు ఎవ్వళ్లూ పట్టించుకోలేదా?”
“అందరూ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ప్రతిదీ పకడ్బందీగా కాగితాలు, సంతకాలు చెక్కులున్నాయి. ఈయన బిల్డర్ కదా. వేటి కోసమో సంతకాలు చేసిన చెక్కులు, పేపర్లు, డాక్యుమెంట్లు అన్నీ మిస్ యూజ్ అయ్యాయి.”
‘ఇంకా…’ అంది ప్రమీల.
“ఇంకేముంది నా మెడలో నాంతాడు, నల్లపూసలు, గాజులు, చిన్న చిన్న వస్తువులు అమ్మి వేరే ఇల్లు అద్దెకు తీసుకుని చాలా కొద్ది సామానుతో వచ్చాం. ఖరీదైన వస్తువులు కూడా అప్పుల కింద పోయాయి.”
పిల్లల స్కూళ్లు మార్చి, అత్తయ్య ఈ అనాయానికి లేచి కూర్చుని దిక్కులు చూస్తే, స్నేహితులు, అంతా కలిసి ఈ బిజినెస్ మొదలు పెట్టింది వాళ్లే. ఒకళ్ల కొకళ్లు చెప్పుకొని దీన్ని ఓ దారికి తెచ్చారు. తలా కాస్తా దాన ధర్మం చేస్తామని ముందుకు వచ్చి అంటే నేనూ పిల్లలు, అత్తయ్య ఈ పాటికి ఏ నుయ్యో, గొయ్యో చూసుకొనే వాళ్లం. ఎవళ్లూ నన్నంత కష్టపెట్టలేదు. ”
“అయినా ఏముందో, ఏంలేదో, నగలు, డబ్బుల గురించి తెలియలేదా” అంది ప్రమీల.
‘ఉహూ’ అంది ఏడవకుండా స్రవంతి.
***
ఇలాంటి కథలు ప్రతిచోటా ఉంటాయి. ఎవ్వరూ ఊహించరు. చాలా మంది ఇల్లాళ్లు స్రవంతి లాగే ఉంటారు. చాలామంది భర్త్తలు శేఖర్‌లాగే అన్నీ వాళ్ల పెత్తనంలోనే ఉంచుకొంటారు. కానీ ఎవ్వరూ రేపటి సంగతి ఆలోచించరు.
నిష్టూరంగా ఉన్నా ఇది వాస్తవం. ఇంటి యజమాని ఆజ్ఞకు లోబడి ఉండే రోజులు పాతవి. అప్పుడు వ్యవసాయం వృత్తి. ఇంట్లో అందరికీ ఎక్కడ ఏమున్నాయో, పంట పొలాలు, రాబడి ఖర్చులు తెలుస్తాయి. ఇటు వ్యాపారాలు పెరిగి వ్యాపార పంటలు మొదలైన తర్వాత డబ్బు లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఇంట్లో అందరూ ఈ డబ్బు సంగతి పట్టించుకోవలసిన అవసరం వస్తోంది. ఆస్తులు, అప్పులు అన్నీ ఉంటాయి. ఇంటికైనా, వ్యాపారంలో అయినా ఒక రికార్డ్‌బుక్ అవసరం. అసలు ఆస్తులు, డబ్బు, ఎవరికి ఇవ్వాలి ఎవరి దగ్గర నుంచి రావాలి. అది తీర్చేది ఎవరు? మనం ఇంట్లో ఉండని క్షణం వస్తే ఎవరికి అప్పగిస్తున్నాం అన్న విషయం ఆలోచించాలి.

మరణమే కాకపోవచ్చు, ఒకవేళ అనారోగ్యం ఆపరేషన్లు, యాక్సిడెంట్లు ఏదైనా విపత్తు వస్తే ఇంట్లో ఏం జరగాలి. ప్రతి విషయం ఇంట్లో భార్యా బిడ్డలకు తెలియాలి. జీవితంలో ఎన్నో అనుభవాలు వస్తాయి. ఏదైనా జరిగితే ఇంట్లో ఆధారపడ్డ మనుష్యులు ఏమవుతారు అన్న ప్రశ్న వేసుకోవాలి.
పైగా సాంకేతికత పెరిగాక, ఇంట్లో ఉండే కంప్యూటర్‌కు కూడా పాస్‌వర్డ్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్, డెబిట్ కార్డుల నెంబర్లు, ఆన్‌లైన్ బ్యాంక్ నడిపితే ఆ పాస్‌వర్డ్, పాన్‌కార్డ్, ఆధార్ పిన్ నెంబర్ వరకు ఇంట్లో ఎవరు తరువాత వాళ్లో వాళ్లకి తెలియాలి. ఒకవేళ, భర్త వ్యాపారి, ఉద్యోగి, యజమాని అయి ఉంటే భార్యకు ప్రతిరోజూ ప్రతి విషయం నూరిపోయాలి. జీవితం తెరచిన పుస్తకంలాగా ఉంచకపోతే కుటుంబం నష్టపోతుంది.

ఇలాంటి ముందుచూపు ఉండటం అవసరం. అంతమాత్రం చేత తెల్లారితే ప్రాణాలు పోతాయని కాదు. నూరేళ్లు బతికినా సరే ప్రతివిషయం కుటుంబ సభ్యులకు తెలియాలి. బంధు మిత్రుల ఫోన్ నెంబర్ల వివరాలు అడ్రస్‌లతో సహా ఒక డైరీ మెయిన్‌టెయిన్ చేయాలి. ఇదే సందర్భం పెద్దతనంలో ఉన్నవాళ్లకూ వర్తిస్తుంది. ఇప్పుడు పిల్లలు ఎక్కడో ఉద్యోగాల్లో ఉంటారు. తల్లిదండ్రులు స్వదేశంలో ఉంటారు. ఇక్కడ ఉండే ఆస్తుల వవహారాలు భార్యాభర్తలకు తెలిసి ఉంటే కదా! జీవిత చరమాంకంలో చేయవలసిన విల్లు రాయటం, ఆస్తి పాస్తులు ఎవరికి చెందాలో రాయటం చాలా అవసరం. లేకపోతే పల్లెటూర్లలో ఉండే ఇళ్లు, పొలాలు, సంపద విషయంలో చాలా చిక్కులు వస్తాయి. మరణం ఎవ్వరికీ చెప్పి రాదు కదా!

అలాగే ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా, కిక్కిరిసిన సామాన్లతో నింపేయటం కూడా దండగే. ప్రతీ వాళ్ల జీవితంలోనూ అద్భుతమైన జ్ఞాపకాలు, ఇష్టమైన వస్తువులు ఉంటాయి. అవన్నీ ఎవరికైనా వ్యక్తిగతం. ఒకవేళ మనకు నచ్చే ఫొటోలు, పుస్తకాలు, కాగితాలు, విలువైన, విలువలులేని వస్తువులు మనం పోయాక దమ్మిడీకి కొరగావు. అవి మనం వాడుకునే టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ వంటివే. మన జ్ఞాపకాలను మన మనసులో పచ్చిగా ఉంచుకొని వస్తువుల రూపేణా వదిలేయటం ఉత్తమం.
ఈ ప్రపంచంలోకి వంటరిగా ఉత్త చేతులతో వస్తాం. జీవించినంత కాలం ఎన్నో బంధాలు, ఆస్తులు కూడబెట్టటం, కొనటం అమ్మటం, అన్ని రకాల వ్యాపారాలు ఉంటాయి. ఉండాలి కూడా. కానీ ప్రతీ మనిషి ఎప్పటికప్పుడు ప్రతీరోజూ సర్దుకొని ఇంకో ఊరికి వెళ్లిపోతునట్లే జీవితం గడిపితే మంచిది. ఇది కథనమైన వాస్తవం. శేఖర్ కథ కల్పితం. ఇంట్లో పొందికగా మాట విని, పిల్లల్ని సాకుతూ నాలుగు గోడల మధ్యన బతికే చాలా మంది ఇల్లాళ్లు , జీవితంలో కాస్తంత కుదుపు వస్తే పూర్తి జీవితం పోగొట్టుకొంటారు. భార్యాభర్తలు శ్రద్ధగా ఉండాలి. ఒకళ్ల గురించి ఒకళ్లు ప్రేమగా ఆలోచించి, ఎవరికి వాళ్లు పక్కవాళ్ల జీవితం భద్రంగా ఉండాలి అనుకోవాలి.

                                                                                                                   -సి. సుజాత

 

Family Members need to know each and every thing

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇలాంటి కథలొద్దు…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.