బడిబస్సులు భద్రమేనా..?

ఫిట్‌నెస్ పరీక్షలపై ఆసక్తి చూపని యాజమాన్యాలు నేడు రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన మన తెలంగాణ/ఆదిలాబాద్‌ప్రతినిధి: ఆదిలాబాద్ జిల్లాలో 140 స్కూల్ బస్సులున్నట్లు రవాణా శాఖ రికార్డులు చెబుతున్నాయి. వీటిలో గత విద్యా సంవత్సరంలో అన్ని బస్సులకు ఫిట్‌నెస్ టెస్టులు చేశారు. ఈ బస్సులలో కొన్ని 15 సంవత్సరాలు కాలపరిమితి మించిపోయినవి కూడా ఉండగా, మరికొన్ని స్కూల్ యాజమాన్యాలు అనుమతి లేకుండానే కాలం చెల్లిన బస్సులను స్క్రాప్ చేశారు. గతేడాది ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్డు […] The post బడిబస్సులు భద్రమేనా..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఫిట్‌నెస్ పరీక్షలపై ఆసక్తి చూపని యాజమాన్యాలు

నేడు రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన

మన తెలంగాణ/ఆదిలాబాద్‌ప్రతినిధి: ఆదిలాబాద్ జిల్లాలో 140 స్కూల్ బస్సులున్నట్లు రవాణా శాఖ రికార్డులు చెబుతున్నాయి. వీటిలో గత విద్యా సంవత్సరంలో అన్ని బస్సులకు ఫిట్‌నెస్ టెస్టులు చేశారు. ఈ బస్సులలో కొన్ని 15 సంవత్సరాలు కాలపరిమితి మించిపోయినవి కూడా ఉండగా, మరికొన్ని స్కూల్ యాజమాన్యాలు అనుమతి లేకుండానే కాలం చెల్లిన బస్సులను స్క్రాప్ చేశారు. గతేడాది ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్డు మీద తిరుగుతుండగా తనిఖీ నిర్వహించి బస్సులను సీజ్ చేసిన అనంతరం విడిచి పెట్టారు. ఇదిలాఉంటే ఫిట్‌నెస్ గడువు ముగిసిన బస్సులను మళ్లీ ఫిట్‌నెస్ చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే వాటిని నిర్ధేశిత తేదీల్లో రవాణాశాఖ అధికారులు పరీక్షించి ఫిట్‌నెస్ పరీక్షలు జరుపుతారు. ఈ ప్రక్రియను పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు పూర్తి కావాల్సి ఉంటుంది.  జిల్లాలో ఇప్పటి వరకు 20 శాతం మేరకే బస్సులు ఫిట్‌నెస్ అనుమతి పొందాయి. ప్రతి ఏడాది మే 2వ వారం నుంచి జూన్ మొదటి వారం వరకు స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. బస్సుల ఫిట్‌నెస్ పరీక్షించడంతో పాటు వాటిని నడిపే డ్రైవర్లు, అటెండర్ల వివరాలను అర్హతలను కూడా రవాణాశాఖ పరిగణలోకి తీసుకుంటుంది. ఈ సారి ఫిట్ నెస్ కోసం స్లాట్ బుక్ చేసుకునే సమయంలో బస్సుల వివరాలతో పాటు వాటిని నడిపే ఇద్దరు డ్రైవర్లు, అటెండర్ల అర్హత, డ్రైవింగ్ లైనెన్స్, అనుభవం, ఫోటోలు కూడా అప్‌లోడ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

అయితే జూన్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బస్సులను ఫిట్‌నెస్ చేయించుకోవడంలో సంబంధిత పాఠశాల యాజమాన్యాలు నిర్లక్షంగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవాణా శాఖ అధికారులను మచ్చిక చేసుకొని పాఠశాలలు ప్రారంభమైన తరువాత ఫిట్‌నెస్ చేయించుకోవాలని భావిస్తున్నారు. కేవలం 11 రోజులే గడువు ఉండడం, ఇంకా పెద్ద సంఖ్యలో బస్సులు ఫిట్‌నెస్‌కు ఎలా ఆన్‌లైన్లో అప్లై చేసుకుంటారు, వాటినెలా పరీక్షిస్తారనేది అనుమానాలకు కారణమవుతుందని అంటున్నారు. అయితే పాఠశాలలు ప్రారంభానికి మునుపే మారిన నిబంధనలకు అనుగుణంగా ప్రతి పాఠశాల బస్సు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలని, లేనిపక్షంలో బస్సులను సీజ్ చేసి జరిమానాలను విధిస్తామని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ గడువు ముగిసిందని, జిల్లాలో ఉన్న అన్ని స్కూల్ బస్సులు, వ్యాన్‌లు జూన్1లోపు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలని అంటున్నారు. ఆ తరువాత స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ధ్రువపత్రాలు సరిగా లేకపోతే కోర్టుకు పంపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. షోరూం నుంచి వచ్చిన కొత్త స్కూల్ బస్సులకు 2 సంవత్సరాల తర్వాత ఫిట్‌నెస్ చేయించాలని, పాఠశాల యాజమాన్యాలు బస్సును స్క్రాప్ వేయాలన్నా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు. తల్లిదండ్రులు కూడా ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సుల్లో పిల్లలను పంపకూడదని సూచిస్తున్నారు. అయితే ఫిట్‌నెస్ సమయంలో చూపుతున్న డ్రైవర్లను తప్పించడం లేదా అనుభవం కలిగిన వారి వివరాలను పొందుపర్చి ఆ తరువాత అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. గత రెండేళ్ల నుంచి వివిధ ప్రాంతాలలో బస్సులు అదుపు తప్పి విద్యార్థులకు గాయాలైన సంఘటనలు సైతం జిల్లాలో చోటు చేసుకోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న రవాణా శాఖ ఆధ్వర్యంలో స్కూల్ యజమానులకు, స్కూల్ బస్సు డ్రైవర్లకు రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా స్కూల్ బస్సులు, వాటి నిర్వహణపై అవగాహన కల్పించనున్నారు.

నిబంధనలివే…

* బస్సు బాడీ పసుపు రంగులో ఉండాలి
* బస్సుకు కుడి, ఎడమ పక్కన స్కూల్ పేరు, చిరునామా ఉండాలి
* బస్సు 15 ఏళ్ల కాల పరిమితి దాటకూడదు
*వాహనం ఆగితే బ్లింక్ అయ్యేలా పై భాగంలో నాలుగు వైపుల అంబర్‌లైట్లు ఉండాలి
* నేల నుండి 325 మిల్లిమీటర్ల ఎత్తులో మెట్లు, ఎక్కేందుకు హ్యాండ్ రెయిలింగ్ ఉండాలి
* వాహనం ముందు, వెనుక బడి పిల్లల ఛాయాచిత్రాలు స్పష్టంగా ఉండాలి
* పిల్లలు కూర్చున్న సీట్ల కింద బ్యాగ్‌లు ఉంచడానికి ర్యాక్‌లు తప్పనిసరిగా ఉండాలి
* బస్సు పక్కలకు పసుపు రేడియం స్టిక్కర్లు, ముందు తెలుపు, వెనుక ఎరువు స్టిక్కర్లు ఉండాలి
* బస్సు డ్రైవర్ వయస్సు 50 ఏళ్లలోపు ఉండాలి. 5 సంవత్సరాల బస్సు నడిపిన అనుభవం ఉండాలి
* బస్సులో ఫస్ట్‌ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టి సిస్టమ్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బడిబస్సులు భద్రమేనా..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: