పిహెచ్‌సిలను పటిష్ఠం చేయాలి

  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ముఖ్యంగా పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడానికి, అంటు వ్యాధులు నివారణకు, కుటుంబ నియంత్రణ ప్రణాళిక అమలు పరచడానికి, మాతా శిశు సంరక్షణ , పలు వ్యాధులపై సమాచార సేకరణ, నివేదించడం, రోగులకు ప్రాథమిక పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేయడం, కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాలను గ్రామ స్థాయిలో అమలు పరచడం, ప్రజల ఆరోగ్యంపై ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ , మార్గనిర్దేశం చేయడం లాంటి గొప్ప లక్ష్యాలతో ప్రాథమిక ఆరోగ్య […] The post పిహెచ్‌సిలను పటిష్ఠం చేయాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ముఖ్యంగా పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడానికి, అంటు వ్యాధులు నివారణకు, కుటుంబ నియంత్రణ ప్రణాళిక అమలు పరచడానికి, మాతా శిశు సంరక్షణ , పలు వ్యాధులపై సమాచార సేకరణ, నివేదించడం, రోగులకు ప్రాథమిక పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేయడం, కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాలను గ్రామ స్థాయిలో అమలు పరచడం, ప్రజల ఆరోగ్యంపై ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ , మార్గనిర్దేశం చేయడం లాంటి గొప్ప లక్ష్యాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పడం జరిగింది. అదే విధంగా గ్రామాలలో సురక్షిత మంచినీటి, పారిశుద్ధ్యం, పౌష్టికాహారం, కాలానుగుణ వ్యాధులపై అవగాహన కల్పించడం జరుగుతుంది. కానీ నేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గర్భిణీల సంరక్షణ, పిల్లల వ్యాధి నిరోధక టీకాలు, జాతీయ, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణకే పరిమితమై సామాన్య ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడంలో వైఫల్యం చెందాయి.

దేశంలోని రోగుల్లో 80 శాతం మంది గ్రామీణులే. వారికి వ్యవస్థీకృత వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వలన అర్హత లేని వైద్యులను ఆశ్రయించడం, నాటు వైద్యం అనుసరించడం జరుగుతోంది. దీని వల్ల వైద్యం వికటించి అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ‘అందరికీ ఆరోగ్యం’ అనే గొప్ప లక్ష్యంతో ప్రభుత్వ నిధులతో అందుబాటులో ఉచిత వైద్య సేవలు అందించడానికి మూడంచెల ఆరోగ్య సేవా కేంద్రాలను నెలకొల్పడం జరిగింది. అవి సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు అని వివిధ స్థాయిల్లో జనాభా ఆధారంగా ఏర్పాటు చేశారు.

వీటిలో ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామాల ప్రజలకు వైద్య సదుపాయాలు అందించడంలో కీలక భూమిక వహిస్తూ వైద్యునికి, సమాజానికి మధ్య మొట్టమొదటి సంప్రదిత కేంద్రంగా పని చేస్తాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వ్యాధులపై సమగ్రమైన అవగాహన కల్పిస్తూ వ్యాధి నిర్ధారణ, నివారణకు కృషి చేస్తూ పునరావాస సేవలను అందించే సమగ్ర ఆరోగ్య సేవా కేంద్రాలు అని ‘జాతీయ ఆరోగ్య విధానం 2017’ స్పష్టంగా పేర్కొన్నది. గ్రామీణ భారతానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కీలకంగా పని చేస్తాయనడంలో సందేహం లేదు. ప్రస్తుత భారత ఆర్థిక సర్వే ప్రకారం భారత దేశంలో జనవరి 2019 నాటికి 33,235 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ముఖ్యంగా పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడానికి, అంటు వ్యాధులు నివారణకు, కుటుంబ నియంత్రణ ప్రణాళిక అమలు పరచడానికి, మాతా శిశు సంరక్షణ , పలు వ్యాధులపై సమాచార సేకరణ, నివేదించడం, రోగులకు ప్రాథమిక పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేయడం, కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాలను గ్రామ స్థాయిలో అమలు పరచడం, ప్రజల ఆరోగ్యంపై ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ , మార్గనిర్దేశం చేయడం లాంటి గొప్ప లక్ష్యాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పడం జరిగింది. అదే విధంగా గ్రామాలలో సురక్షిత మంచినీటి, పారిశుద్ధ్యం, పౌష్టికాహారం, కాలానుగుణ వ్యాధులపై అవగాహన కల్పించడం జరుగుతుంది.

కానీ నేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గర్భిణీల సంరక్షణ, పిల్లల వ్యాధి నిరోధక టీకాలు, జాతీయ, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణకే పరిమితమై సామాన్య ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడంలో వైఫల్యం చెందాయి. తద్వారా గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ప్రభుత్వ ఆరోగ్య సేవలపై నమ్మకం కోల్పోయి ప్రవేట్ హాస్పిటల్ ను ఆశ్రయించడం జరుగుతుంది తద్వారా ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్య ఖర్చులు భరించలేక ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా నష్టపోయి అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సాధారణ వైద్య సేవలను అందించడంలో అనేక రూపాలలో విఫలమవుతున్నాయి. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సరిపడా మందులు కొరత, రోగ నిర్ధారణ పరీక్షలకు సదుపాయాలు అరకొరగా ఉండడం, వైద్య కేంద్రం వద్ద అపరిశుభ్రత వాతావరణం, మౌలిక వసతుల కొరత, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చికిత్స పరికరాలు, అంకిత భావం గల డాక్టర్లు, సిబ్బంది కొరత వేధించడం జరుగుతుంది. కొన్ని ఆరోగ్య కేంద్రాలలో రెగ్యులర్ వైద్యులు అందుబాటులో లేక కింది స్థాయి సిబ్బంది అయినా నర్సులు, కాంపౌండర్లు రోగులను పరీక్షించడం మూలంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యంపై ప్రజలు నమ్మకం కోల్పోయి రోగులు రాక వెలవెలబోతున్నాయి. అదే విధంగా వైద్యాధికారుల పర్యవేక్షణ లోపం వలన పారదర్శకత లోపించి సమాజ భాగస్వామ్యం తగ్గిపోయి ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు రోజురోజుకు విశ్వాసం తగ్గిపోవడం జరుగుతుంది. తద్వారా సామాన్య ప్రజానీకానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ఏర్పాటుచేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రథమ చికిత్స కేంద్రాలుగా మారాయి.

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ ఉచిత నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడం ప్రభుత్వం బాధ్యత, పౌరుల ప్రాథమిక హక్కు అని భారత రాజ్యాంగంలో 21 వ ప్రకరణలో స్పష్టంగా పేర్కొనబడింది. ప్రభుత్వాలు పునరాలోచించి ప్రైవేట్ హాస్పిటల్‌లకు దీటుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడానికి తక్షణ, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. ప్రతి ఆరోగ్య కేంద్రానికి వైద్యులను, వైద్య సిబ్బందిని ఖచ్చితంగా నియమించాలి. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆరోగ్య కేంద్ర పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, రోగ నిర్ధారణ పరీక్షలకు లాబరేటరీని ఏర్పాటు చేయాలి.

నేడు విజృంభిస్తున్న కాలానుగుణ వ్యాధులకు వైద్య సదుపాయాలు, మందులను ప్రతి ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేసి 24 గంటలు వైద్య సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను గణనీయంగా పెంచుతూ ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలి. ప్రతి వారం ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామ పంచాయతీలకు డాక్టర్లు, సిబ్బంది కలిసి వ్యాధులపై, పారిశుద్ధ్యంపై క్యాంపులు నిర్వహిస్తూ అవగాహన కల్పించాలి. ప్రస్తుతం అమలు చేస్తున్న ‘జాతీయ ఆరోగ్య మిషన్’ కార్యక్రమాలను పటిష్టంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అమలు జరిగేటట్లు చూడాలి.

ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ 2017 ‘జాతీయ ఆరోగ్య విధానం’ లో ప్రకటించినట్లుగా ప్రజారోగ్యంపై చేసే వ్యయాన్ని స్థూల జాతీయోత్పత్తిలో 3.5 శాతానికి పెంచాలి. ఆ మేరకు ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి నిధుల కేటాయింపు జరగాలి. తద్వారా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి గట్టి కృషి జరిగి ‘ఆరోగ్య భారత్’ కోసం పునాది పడుతుంది అప్పుడే ‘సార్వత్రిక ఆరోగ్య రక్షణ’ సాకారం అవుతుంది.

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పిహెచ్‌సిలను పటిష్ఠం చేయాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: