వధ్యశిలపై బాల్యం!

           బాల్యాన్ని నిర్లక్ష్యం చేసే సమాజానికి భవిష్యత్తు ఉండదు. బాలలను శ్రద్ధగా బాధ్యతగా చూడడం వారి తలిదండ్రులకు పరిమితమైన వ్యవహారమే కాదు, సమాజం, ప్రభుత్వాలు కూడా ఆ బాధ్యతను పంచుకోవలసి ఉంటుంది. బాలల సరైన ఎదుగుదలకు తగిన నేపథ్యాన్ని సృష్టించవలసి ఉంటుంది. అటువంటి చోటనే వారు మంచి ఆరోగ్యం, విద్యా బుద్ధులతో పెరిగి బాధ్యతగల పౌరులై ఆ సమాజానికి, దేశానికి వన్నె తెస్తారు. అందుకే బాలల రక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు […] The post వధ్యశిలపై బాల్యం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

           బాల్యాన్ని నిర్లక్ష్యం చేసే సమాజానికి భవిష్యత్తు ఉండదు. బాలలను శ్రద్ధగా బాధ్యతగా చూడడం వారి తలిదండ్రులకు పరిమితమైన వ్యవహారమే కాదు, సమాజం, ప్రభుత్వాలు కూడా ఆ బాధ్యతను పంచుకోవలసి ఉంటుంది. బాలల సరైన ఎదుగుదలకు తగిన నేపథ్యాన్ని సృష్టించవలసి ఉంటుంది. అటువంటి చోటనే వారు మంచి ఆరోగ్యం, విద్యా బుద్ధులతో పెరిగి బాధ్యతగల పౌరులై ఆ సమాజానికి, దేశానికి వన్నె తెస్తారు. అందుకే బాలల రక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేసి అమలు పర్చాలని భారత రాజ్యాంగం 15 (3) అధికరణ ద్వారా నిర్దేశించింది. బాలలపై అనుచిత భారం మోపడం, అత్యాచారాలకు పాల్పడడం వంటి చర్యలను 39వ అధికరణ నిరోధిస్తోంది. బాలల హక్కులను గుర్తించి తీరవలసిన అవసరాన్ని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొన్నది. ఆ ప్రకారం 2015 నాటి జువెనైల్ జస్టిస్ (బాలలకు న్యాయం, రక్షణ కల్పించడం) చట్టం, 2012 నాటి లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ (పోక్సో) చట్టం వచ్చాయి.

ఇన్ని ఉన్నా దేశంలో పుట్టిన ప్రతి శిశువూ పెరిగి పెద్ద కావడానికి తగిన వాతావరణం ఇప్పటికీ నెలకొనలేదని అనేక అధ్యయనాలు, విశ్లేషణలు చాటుతున్నాయి. 2015లో ప్రపంచంలోకెల్లా అత్యధికంగా భారత దేశంలోనే ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు సంభవించాయని లాన్సెట్ అనే సంస్థ జరిపిన అధ్యయనంలో వెల్లడయింది. అంతేకాదు బాలల మరణాలు పేద రాష్ట్రాలలో అధికంగా, అభివృద్ధి చెందిన వాటిలో స్వల్పం గా ఉన్నట్టు కూడా ఈ నివేదిక కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. 2000 2015 సంవత్సరాల మధ్య దేశంలో వార్షిక బాల మరణాల సంఖ్య 25 లక్షల నుంచి 12 లక్షలకి తగ్గిన విషయాన్ని కూడా గుర్తించిన ఈ నివేదిక ఈ విషయంలో ఇప్పటికీ భారత దేశమే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండడం ఆందోళనకరమని పేర్కొన్నది. నెలల నిండకుండానే పుట్టడం, నయం చేయదగిన అంటురోగాలు ఐదేళ్లలోపు పిల్లల మరణాలకు కారణాలుగా ఉన్నాయని లాన్సెట్ వివరించింది. అంటే దేశంలో మాతా శిశు ఆరోగ్యంపట్ల పూర్తి శ్రద్ధ చూపలేకపోతున్నామని స్పష్టపడుతున్నది.

మాతా శిశు ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీలు వంటివి ఉన్నా నిరుపేదల పిల్లలను కాపాడుకోలేకపోతున్నామని వెల్లడవుతున్నది. టీకాలు వేయడం, శిశువు గరంలో ఉన్నప్పుడు, పుట్టిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలను పెంచడం వంటి చర్యల ద్వారా భారత దేశంలో బాల మరణాల సంఖ్యను నివారించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. దేశంలో పొట్ట చేతపట్టుకొని వలసలు వెళ్లే పేదల సంఖ్య అధికంగా ఉన్నది. గర్భవతులుగా ఉన్నప్పుడు, ప్రసవానంతరం కూడా మహిళలు పని పాట్లు చేసుకోకపోతే ఇల్లు గడవని స్థితిలోని కుటుంబాలు అసంఖ్యాకం. ఆసుపత్రులకు వెళ్లి ప్రసవం జరిపించుకునే అలవాటు, ఆ స్థోమత లేని మహిళలు మారుమూల ప్రాంతాల్లో కనిపిస్తారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలంటే ఉద్యమ స్థాయి కృషి ప్రభుత్వాల నుంచి జరగాలి. ముఖ్యంగా పేద రాష్ట్రాల్లో ఇది నిరంతర వ్యాపకమవ్వాలి. గోవాలో కంటె ఏడు రెట్లు అధికంగా అసోంలో బాలల మరణాలు సంభవిస్తున్నట్టు లాన్సెట్ నివేదిక తెలియజేసింది.

దేశంలో 2000 సంవత్సరంలో ప్రతి 1000 జననాలకు 90.5 మరణాలుండగా, 2015లో ఇది 47.8కి తగ్గింది. అయినప్పటికీ ఇది ఐక్యరాజ్య సమితి పెట్టిన సహస్రాబ్ది అభివృద్ధి లక్షం కంటే ఎక్కువే అని లాన్సెట్ నివేదిక ఎత్తి చూపింది. 25 రాష్ట్రాల్లోని పరిస్థితిని ఈ బృందం అధ్యయనం చేసింది. 2015లో దేశంలో 2.51 కోట్ల మంది పిల్లలు పుట్టగా వీరిలో 12.01 లక్షల మంది చనిపోయారు. ఇందులో 28 రోజులలోపు చనిపోయిన వారే 6.96 లక్షల మంది అంటే ప్రతి వెయ్యి మందిలో 57.9 మంది. పుట్టిన కొద్ది రోజుల్లోనే బాలలు మృత్యు ముఖంలోకి జారిపోడం తల్లుల ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రసవానంతర బాలారిష్టాల పట్ల శ్రద్ధ లేమి వల్ల కూడా ఇవి సంభవిస్తుంటాయి.

పేద రాష్ట్రాలలో మాతా శిశువుల ఆరోగ్యంపట్ల మరింత శ్రద్ధ పెట్టడమే కాకుండా కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధికంగా నిధులు కేటాయించి లక్షాలను సాధించే వైపు ఖర్చు చేయవలసిన అవసరం ఉన్నది. జాతీయ స్థాయి పరిస్థితితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో మెరుగ్గానే ఉన్నట్టు లాన్సెట్ గణాంకాలు తెలియజేస్తున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 2015లో ఐదేళ్లలోపు బాలల మరణాలు ప్రతి 1000 జననాలకు 39.68 కావడం గమనార్హం. తలిదండ్రులలో ముఖ్యంగా తల్లుల్లో నిరక్షరాస్యత, అవగాహన లోపం కూడా శిశు మరణాలకు దారి తీస్తుంది. మూఢనమ్మకాల వంటివీ ఇందుకు కారణమవుతాయి. ప్రభుత్వాలు సమన్వయంతో బాల్యంపట్ల తగినంత శ్రద్ధ కనపరచవలసి ఉంది. నేటి బాలలే రేపటి పౌరులనే సత్యాన్ని దృష్టిలో ఉంచుకొని బాల్యానికి మరింత దృఢమైన రక్షా కవచాన్ని తొడగాలి.

India has world highest child mortality rate in 2015

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వధ్యశిలపై బాల్యం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: