చివరి రోజుల ఉత్కంఠ

  లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ రేపు 19వ తేదీన జరిగి, ఆ తర్వాత కొద్ది రోజులకు 23న ఫలితాలు వెలువడనుండగా, అధికారం ఎవరిని వరించనున్నదనే ఉత్కంఠ పరాకాష్ట స్థితికి చేరుతున్నది. ఫలితాలు వచ్చే వరకు ఆగనవసరం లేకుండా ఒకటి రెండు విషయాలు ఈ లోపలే దాదాపు అందరికీ అర్థమైనట్లు కన్పిస్తున్నది. పోటీలోగల రాజకీయ పార్టీలతోపాటు సాధారణ ప్రజలకు కూడా. అధికారపక్షమైన బిజెపికి, ఎన్‌డిఎకి సీట్లు 2014 కన్న తగినన్ని తగ్గుతాయనేది వాటిలో మొదటిది. అట్లా […] The post చివరి రోజుల ఉత్కంఠ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ రేపు 19వ తేదీన జరిగి, ఆ తర్వాత కొద్ది రోజులకు 23న ఫలితాలు వెలువడనుండగా, అధికారం ఎవరిని వరించనున్నదనే ఉత్కంఠ పరాకాష్ట స్థితికి చేరుతున్నది. ఫలితాలు వచ్చే వరకు ఆగనవసరం లేకుండా ఒకటి రెండు విషయాలు ఈ లోపలే దాదాపు అందరికీ అర్థమైనట్లు కన్పిస్తున్నది. పోటీలోగల రాజకీయ పార్టీలతోపాటు సాధారణ ప్రజలకు కూడా. అధికారపక్షమైన బిజెపికి, ఎన్‌డిఎకి సీట్లు 2014 కన్న తగినన్ని తగ్గుతాయనేది వాటిలో మొదటిది. అట్లా తగ్గే క్రమంలో, బిజెపికి పోయిన మారువలె స్వంత మెజారిటీ రాగల అవకాశం కన్పించటం లేదు. బిజెపికి గల అర డజను ఎన్‌డిఎ మిత్ర పక్షాల బలం కూడా ఎంతోకొంత పడిపోవచ్చుగాని పెరిగే సూచనలు లేవు. ఈ రెండు తగ్గుదలల పర్యవసానంగా ఎన్‌డిఎ, ప్రభుత్వం ఏర్పాటుకు కనీస అవసరమైన 273 స్థానాలైనా సంపాదించగలదా లేదా అనేది తర్వాతి ప్రశ్న. దీనిపై అంచనాలు వేయటం తేలిక కాదు. ఏదైనా జరగవచ్చు. ఈ మాట అనేందుకు కొన్ని కారణాలున్నాయి. ఎన్‌డిఎ అధికారానికి వచ్చింది ప్రధానంగా హిందీ రాష్ట్రాలలో, పశ్చిమ భారత రాష్ట్రాలలో గెలిచిన సీట్ల ఆధారంగా. మోడీ పరిపాలనకు మొదటి నాలుగు సంవత్సరాల కాలం ఈ ప్రాంతాలలో పెద్దగా ప్రజాదరణ లభించలేదు. ఎన్‌డిఎలోని ఇతర పార్టీలలో తగినంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వం బిహార్‌లో నితీశ్ కుమార్‌ది. కాని చివరి సంవత్సరం వచ్చే సరికి పరిస్థితులు మారాయి.

నోట్ల రద్దు, జిఎస్‌టి వల్ల పట్టణ ప్రాంతాలలో, మధ్య తరగతిలో ఏర్పడిన వ్యతిరేకతలు కూడా చివరి సంవత్సరం వచ్చే సరికి తగ్గు ముఖం పట్టాయి. గ్రామీణ ప్రాంతాలలో అమలుకు రాసాగిన కొన్ని అభివృద్ధి పథకాలు ( రోడ్లు, విద్యుత్తు, నీరు వంటివి), సంక్షేమ పథకాలు ( రైతులకు నగదు, ఇంటింటికి శౌచాలయాలు, వైద్య సేవల విస్తరణ వంటివి), అదే విధంగా శాంతి భద్రతల పరిస్థితి మెరుగుదల మొదలైనవి ప్రభావం చూపసాగాయి. ఒక స్థాయిలో ఇది జరుగుతుండగా మరొక స్థాయిలో పాకిస్థాన్‌పై ప్రధాని మోడీ వీరాలాపాలు, టెర్రరిజం గురించిన ప్రచారపు హోరు, పుల్వామాకు ప్రతీకారంగా బాలాకోట్‌పై దాడులు, విదేశీ పర్యటనల ద్వారా మోడీ భారత దేశానికి ప్రపంచంలో గొప్ప గుర్తింపు సంపాదించారనే ప్రచారం, దేశానికి కావలసిన బలమైన నాయకుడు, ఆయనేనని, తనకు సాటిరాగల వారు ప్రతిపక్షాలలో ఎవరూ లేరని హోరెత్తించటం, అల్ప సంఖ్యాక వర్గాలకు వ్యతిరేక భావనలను వీలైనంత రేకెత్తించటం, జాతీయతా భావనలు అనబడే వాటిని రెచ్చగొట్టటం మొదలైనవన్నీ కలిసి చివరి సంవత్సరంలో పరిస్థితులను చెప్పుకోదగినంత మార్చాయి.

ఒకవేళ ఎన్నికలు ఒక ఏడాది క్రితం జరిగి ఉంటే బిజెపి దారుణంగా దెబ్బతినేది. సమాజ్‌వాదీ బిఎస్‌పి లోక్‌దళ్ కూటమిది యుపిలో పూర్తిగా పై చేయి అయేది. ఇటువంటి స్థితే ఇతర హిందీ రాష్ట్రాలలోనూ కన్పించేది. అందువల్లనే మూడు హిందీ రాష్ట్రాలలో బిజెపి ఇటీవల అధికారాన్ని కోల్పోయింది. కాని, 2018 మధ్య నాటి నుంచి కొంత, చివరి నుంచి మరింతగా ఈ పరిస్థితులు మారనారంభించాయి. అందువల్లనే ఆ మూడు హిందీ రాష్ట్రాలలో బిజెపి అధికారాన్ని కోల్పోయినా పెద్ద తేడాలతో కాదు. మొత్తం మీద మొదటి నాలుగు సంవత్సరాల బలహీనతలు చివరి సంవత్సరంలో తగ్గాయన్నది గుర్తించవలసిన విషయం. ఈ తగ్గుదల వల్ల నాలుగేళ్ల నష్టాలు పూర్తిగా తీరకపోవచ్చు. కాని తగ్గటమన్నది నిజం. మళ్లీ ఉత్తరప్రదేశ్‌కు వెళితే, ఒకవేళ మాయావతి అఖిలేశ్‌ల పొత్తు లేకపోయినట్లయితే బిజెపికి 2014లో వలె 73 సీట్లు కాకున్నా గణనీయంగానే లభించేవి.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. హిందీ రాష్ట్రాలలో క్షేత్రస్థాయి, గ్రామీణ స్థాయి పరిస్థితులు, ఛప్పన్నారు కులాలు, ఉప కులాలు, వృత్తుల ఆలోచనల గురించి మనకు దక్షిణాదిన ఎప్పుడూ సరిగా తెలియదు. వారి ఆలోచనల గురించి మన దృష్టితో ఊహాగానలు చేస్తుంటాము. అదే విధంగా పాకిస్థాన్‌తో వైరం, టెర్రరిజం, జాతీయతా భావనలు, మతతత్వం, వీటితో ముడిబడిన వీరాలాపాలు, సత్యాలతో అసత్యాలతో కలగలిపిన ప్రచారపు హోరుల ప్రభావం దక్షిణాదిన ఎంత తక్కువో ఉత్తర రాష్ట్రాలలో అంత ఎక్కువ. ఇందుకు కారణాలు చరిత్రలో ఉన్నాయి. ఉత్తర, దక్షిణ భారత చరిత్రలలో కొన్ని మౌలికమైన వ్యత్యాసాలున్నాయి. ఆ వివరాలలోకి ఇక్కడ పోలేముగాని, ఉత్తరాది ప్రత్యేకతలు బాగా తెలుసు గనుకనే మోడీ, బిజెపి ఆయా అంశాలను ప్రచారాస్త్రాలు చేసుకుని గత ఏడాది కాలంలో తగినంత లాభపడటం వాస్తవం. బిజెపి తిరిగి అధికారానికి రావటం అసాధ్యమంటూ చెప్పలేకపోవటం అందువల్లనే.

అధికారం, మెజారిటీ మాట అట్లుంచి బిజెపి/ ఎన్‌డిఎకు అనుకూలంగా కనిపిస్తున్న పరిస్థితి ఇది ఒకటికాగా, వారు ఒకవేళ అతిపెద్ద కూటమిగా అవతరిస్తే చాలు రాష్ట్రపతి వారినే ముందుగా ఆహ్వానించగలరన్న సంప్రదాయం మరొకటి. ఎన్నికలకు ముందే ఏర్పడిన ఐక్య సంఘటనలో ఏది పెద్దది అయితే దానిని రాష్ట్రపతి ఆహ్వానించి, బల పరీక్షకు గడువు నిస్తారు. అది నిబంధన కాదు గాని సంప్రదాయం. మామూలుగానైతే, ఎవరు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరని నమ్ముతారో వారినే పిలవాలి. ఆ వెసులుబాటు రాజ్యాంగంలో ఉంది. దాని ప్రకారమైతే, ఒకవేళ ఎన్‌డిఎ కన్న యుపిఎ సీట్లు తగ్గినా, వివిధ ప్రాంతీయ పార్టీలు తాము యుపిఎను బలపరుస్తున్నట్లు త్వరగా రాష్ట్రపతికి లేఖలను ఇచ్చి, యుపిఎ ప్లస్ ఈ పార్టీలకు కలిపి స్పష్టమైన ఆధిక్యత ఉన్న పక్షంలో, అపుడు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల అవకాశం ఎన్‌డిఎకు కాకుండా యుపిఎకు ఉన్నట్లు రాష్ట్రపతి ప్రకటించి వారినే పిలవవచ్చు కూడా. ఆ నిర్ణయాన్ని కోర్టులు కూడా ప్రశ్నించజాలవు. అదే సమయంలో, సంప్రదాయాన్ని పాటిస్తూ అతిపెద్ద ముందస్తు కూటమి (ఎన్నికలకు ముందు ఏర్పడిన) గా ఎన్‌డిఎను ఆహ్వానించినా ప్రశ్నించలేరు. అపుడు ఉభయ పక్షాలు తమ బలాబలాలను విశ్వాస తీర్మాన సమయంలో నిరూపించుకోవలసి ఉంటుంది.

ఈ చర్చ సందర్భంగా, ప్రతిపక్షాల వైపు కన్పించే ఒక లోటును గురించి చెప్పుకోవాలి. బిజెపి వ్యతిరేక పార్టీలు అన్ని ఎన్నికలకు ముందే యుపిఎలో చేరి ఉంటే పరిస్థితి వేరయేది. అపుడు యుపిఎ అతిపెద్ద ముందస్తు కూటమిగా తప్పక అవతరించినా అవతరించకపోయినా కనీసం అందుకు అవకాశాలు ఉండేవి. కాని, కారణాలు ఏవైతేనేమి అది జరగలేదు. కొన్ని వారాల క్రితం కోల్‌కతాలో జరిగిన 23 ప్రతిపక్షాల ర్యాలీ బిజెపికి వ్యతిరేకంగా ఒక వాతావరణాన్ని అయితే సృష్టించిందిగాని యుపిఎలో మాత్రం కొత్తగా ఏ పార్టీ చేరలేదు. ర్యాలీని నిర్వహించిన మమతా బెనర్జీగాని, ఆ కార్యక్రమాన్ని బాగా ప్రోత్సహించిన చంద్రబాబుగాని, ప్రధానమంత్రి పదవికి తమ అభ్యర్థి రాహుల్ గాంధీ అని ప్రకటించిన స్టాలిన్‌గాని ఇతరులుగాని ఎవరూ చేరక, యుపిఎ పరిమాణం వెనుకటి స్థాయిలోనే మిగిలింది. ఎస్‌పి, బిఎస్‌పి, బిజెడి వంటి ముఖ్యమైన పార్టీలు అసలు ర్యాలీకి వెళ్లలేదు. ప్రధాని పదవికి రాహుల్‌ను తాను అంగీకరించబోనని మమత అప్పటికే ప్రకటించారు. రాహుల్‌కు తగిన రాజకీయ పరిణతి లేదని పట్నాయక్ వ్యాఖ్యానించారు. రాహుల్ పట్ల తన విముఖతను మాయావతి సూచించారు.

విషయమేమంటే ఇటువంటి వివిధ పరిస్థితుల మధ్య అధికారానికి మార్గం ఎన్‌డిఎకు ఉన్నంత మాత్రపు సుగమంగానైనా యుపిఎకు కన్పించటం లేదు. రాజకీయాలలో దేనినీ కొట్టివేయలేము గనుక చివరకు ఫలితాలు వెలువడిన తర్వాత సీట్ల సంఖ్యలను బట్టి ఏదైనా జరగవచ్చు. ప్రాంతీయ పార్టీల కూటమి లేదా ఫెడరల్ ఫ్రంట్ అవకాశాలు కూడా అటువంటివే. కాని యథాతథంగా, ఎన్‌డిఎ, యుపిఎ రెండూ స్వంత మెజారిటీలకు దూరంగా మైనారిటీగానే అంటాయనుకుంటే, ఆ తర్వాత ప్రభుత్వ స్థాపన అవకాశాలు ఎన్‌డిఎ కన్న యుపిఎకు ఎక్కువ కష్టంగా కన్పిస్తున్నాయి.

ఇంతకూ 273 సంఖ్యకు ఎవరెంత దూరంలో ఉండగలరన్నది అంతిమమైన ప్రశ్న. వివిధ ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి ఒక వైఖరి తీసుకుంటాయా లేక ఏది ఎటు మొగ్గుతుందన్నది ఆ తర్వాతి ప్రశ్న. అటువంటి వైఖరులు తీసుకోవటంలో సహజంగానే ఏ పార్టీ కారణాలు దానికుంటాయి. అన్ని పార్టీలకు బిజెపి పట్ల ప్రేమ ఉండటం ఎంత కాని పనో కాంగ్రెస్ పట్ల సానుకూలత కూడా అంతవీలు కానిదే. కనుక ప్రస్తుత ఉత్కంఠ ఫలితాల వెల్లడి తర్వాత కూడా కొనసాగుతుం దనుకోవచ్చు.

Final phase of Lok Sabha Polls to be held on May 19

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చివరి రోజుల ఉత్కంఠ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: