బెంగాల్ బెబ్బులితో మోఢీ!

  రాజకీయాలంటే టీ పార్టీ కాదు. నెత్తురు, చెమట, కన్నీళ్ళు చిందించడమే రాజకీయం. ఈ విషయం మోదీ, అమిత్ షాల కన్నా మమతాబెనర్జీకి చాలా బాగా తెలుసు. పశ్చిమబెంగాల్ వీధుల్లో మమతాబెనర్జీతో తలపడినవాళ్ళెవరైనా గాని వాళ్ళు మహాసాహసులైనా కావాలి లేదా పెద్ద మూర్ఖులైనా కావాలి. కోల్‌కతా రోడ్లపై దీదీని ఢీ కొనాలని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ప్రయత్నించాడు. ఆ తర్వాత సంఘటనలు అదుపు తప్పాయి. హింసాకాండ చెలరేగింది. పశ్చిమ బెంగాల్ ప్రజలకు అత్యంత ఆదరణీయుడైన ఈశ్వరచంద్ర […] The post బెంగాల్ బెబ్బులితో మోఢీ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాజకీయాలంటే టీ పార్టీ కాదు. నెత్తురు, చెమట, కన్నీళ్ళు చిందించడమే రాజకీయం. ఈ విషయం మోదీ, అమిత్ షాల కన్నా మమతాబెనర్జీకి చాలా బాగా తెలుసు. పశ్చిమబెంగాల్ వీధుల్లో మమతాబెనర్జీతో తలపడినవాళ్ళెవరైనా గాని వాళ్ళు మహాసాహసులైనా కావాలి లేదా పెద్ద మూర్ఖులైనా కావాలి. కోల్‌కతా రోడ్లపై దీదీని ఢీ కొనాలని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ప్రయత్నించాడు. ఆ తర్వాత సంఘటనలు అదుపు తప్పాయి. హింసాకాండ చెలరేగింది. పశ్చిమ బెంగాల్ ప్రజలకు అత్యంత ఆదరణీయుడైన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని విధ్వంసం చేయడం జరిగింది. ఎన్నికల సంఘం ప్రచార వ్యవధిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కాని ప్రధాని మోడీ ర్యాలీలు పూర్తి చేసుకునే సమయం ఇచ్చింది. ఇవన్నీ బిజెపికి ప్రతికూల పరిణామాలే. చివరకు ఎన్నికల సంఘం మోడీ ర్యాలీలకు అవకాశం ఇచ్చి, ఆ తర్వాత ప్రచారంపై నిషేధాన్ని విధించడం కూడా బిజెపికి ప్రతికూలమే. ఎందుకంటే, బెంగాల్ వీధుల్లో, ఇళ్ళల్లో బిజెపి దుర్మార్గపు రాజకీయాలను ఎలా తీసుకువెళ్ళాలో మమతకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. లాంఛనంగా ప్రచారం ఆమె చేయనవసరమే లేదు.

కోల్‌కతా వీధుల్లోనే కమ్యూనిస్టు మహారథి సోమనాథ్ చటర్జీ వంటి నాయకుడిని 1984లో ఆమె మట్టికరిపించారు. అంతకు ముందు ఆయన ఓటమి ఎరుగని నాయకుడు. దీదీని ఢీ కొన్నాడు. ఓటమి అంటే ఏమిటో రుచి చూశాడు. 1990లో ఆమెను ఇండియా టుడే బెంగాలీ జోనాఫ్ ఆర్క్ అని వర్ణించింది. ఆమెపై భౌతిక దాడులకు పాల్పడినందుకు తగిన మూల్యం చెల్లించవలసి వచ్చింది. తల పగిలి పదహారు కుట్లు పడిన తర్వాత రక్తంతో తడిసిన మమతాబెనర్జీ పోరాటం ఆపలేదు. ధర్నాలతో హోరెత్తించారు. మూడు దశాబ్దాల కమ్యూనిస్టు పాలనను బెంగాల్ నుంచి తరిమేశారు. తృణమూల్ కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రవహించిన నెత్తురు చాలా ఉంది. ఆమె నెత్తురు చిందింది. ఆమె సమర్థకులు రక్తం చిందించారు. ప్రత్యర్థి కమ్యూనిస్టుల రక్తం కళ్ళ చూశారు. ఒకప్పుడు ఆమెను చాలా తక్కువగా జమ కట్టిన వారు ఇప్పుడు బెంగాల్ ఆడ పులిని చూస్తున్నారు. ఆమె స్ట్రీట్ ఫైటర్.

ప్రసంగాల్లో వేడి వాడి, వ్యంగ్యం, హేళన, ప్రత్యర్థులపై తీవ్రమైన దాడి ఇవన్నీ ఆమె సమర్థకులను రెచ్చగొట్టి ప్రత్యర్థులపై దాడులు చేయిస్తాయని కొందరి విమర్శలున్నాయి. కాని, బిజెపి నేతలు మోదీ, అమిత్ షా ప్రసంగాలు కూడా ఇలాంటివే. నిజం చెప్పాలంటే, మోడీ, అమిత్ షాలకు సమవుజ్జీ మమతాబెనర్జీ. తమలపాకుతో ఒకటంటే తలుపు చెక్కతో రెండంటా అనే తీరు ఆమెది. ఎన్నడూ ఆమె డిఫెన్సివ్‌గా మాట్లాడలేదు. దీదీ నాకు కుర్తాలు, మిఠాయిలు పంపించేది అని ప్రధాని చెప్పిన మరుక్షణం, మిఠాయిల్లో కంకర్రాళ్ళు వేసి పంపిస్తాం జాగ్రత్త అని హూంకరించింది. ప్రజాస్వామిక లెంపదెబ్బ కొట్టాలని చెప్పింది కూడా ఆమెయే. ఆమె బిజెపితో కూడా గతంలో చెట్టాపట్టాలేసుకుని వాజపేయి ప్రభుత్వంలో 1999లో భాగమైంది. కాని తెహల్కా కుంభకోణం వెలుగులోకి రాగానే 2001లో బిజెపికి రాంరాం చెప్పేసింది.

అప్పట్లో ఆమెకు ప్రధాన శత్రువులు వామపక్షాలు. ఆమె రాజకీయ యుద్ధాల్లో అనుభవం గడించిన సైన్యాధ్యక్షురాలు. 2006 సింగూరు, 2007 నందిగ్రాంల నుంచి టాటా నానో ప్రాజెక్టు తప్పుకోవలసి వచ్చిందంటే మమతాయే కారణం. అప్పట్లో మార్క్సిస్టులను ఎదుర్కోవాలంటే నానో ప్రాజెక్టును వ్యతిరేకించక తప్పలేదు. ఆమె అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అస్సలు అభివృద్ధి ఉండదని పలువురు భావించారు. కాని 2011లో ఆమె అధికారంలోకి రావడమే కాదు, పశ్చిమ బెంగాల్ ముఖచిత్రాన్ని కూడా మార్చారు. పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, ఇన్ ఫ్రాస్టక్చర్ అన్నింటా తన ముద్ర వేశారు. నోట్లరద్దును నిర్ద్వంద్వంగా ఖండించారు. నోట్ల రద్దు తర్వాత మోడీని పదవి నుంచి దించడమే తన కర్తవ్యంగా ప్రకటించారు.

మోడీ ద్వేషానికి ప్రేమతో జవాబు చెబుతానన్నారు రాహుల్ గాంధీ. కాని మమత అలాంటి నేత కాదు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ ఇదే ఆమె తీరు. ఆమెను హేళన చేస్తే పది రెట్లు ఎక్కువగా ఎద్దేవా చేస్తుంది. స్పీడ్ బ్రేకర్ దీదీ అని మోడీ చెప్పిన వెంటనే, ఎక్స్‌పైరీ బాబు అంటూ తిరుగుటపాలో జవాబు వచ్చింది. మిడ్నాపూర్ జిల్లాలో కొందరు మమతాబెనర్జీని చూసి జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా, ఇలాంటి నినాదాలు చేస్తున్న వారిని ఏమన్నా అంటే హిందు ఓటర్లకు కోపం వస్తుందేమో అని ఇతర రాజకీయ పార్టీలు కాస్త జంకుతాయి. కాని మమతాబెనర్జీకి అలాంటి సంకోచాలేమీ లేవు. ఆమె కారు ఆపి వారిని అడ్డుకోవడమే కాదు, పోలీసులతో అరెస్టు చేయించారు. ఆ వెంటనే బిజెపి ఆమెను విమర్శిస్తూ జై శ్రీరాం అని పలకడం నేరమా? పశ్చిమబెంగాల్లో జై శ్రీరాం అంటే పాపమా? అంటూ ఆమెపై దాడులకు దిగింది. బిజెపి ఇలాంటి దాడులు చేస్తుందని ఆమెకు తెలుసు. అయినా ఆమె లక్ష్యపెట్టదు.

ఆ వెంటనే ఒక ర్యాలీలో మాట్లాడుతూ, నా కారును అడ్డుకుని నన్ను దూషించాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. బిజెపి కార్యకర్తల ఎత్తుగడ జై శ్రీరాం నినాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం. అలాంటి ఆటలు తన వద్ద సాగవన్న సంకేతాలన్ని స్పష్టంగా పంపించింది. జై హింద్, వందేమాతరం అంటానే తప్ప జై శ్రీరాం అనేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ జై హిందు అని బిజెపి అంటే తను జై బెంగాల్ అనాల్సి వస్తోందని హెచ్చరించారు. నరేంద్రమోడీ ఆమెపై దాడి చేస్తూ బెంగాల్లో దుర్గా పూజ చేయడం కూడా కష్టమైపోయిందని అన్నారు. ఆ దాడికి చేతల్లో ఆమె జవాబిచ్చారు. ఒకవైపు ఫానీ తుఫాను భీకరంగా ఉన్నా దుర్గా పూజ ర్యాలీలు జరిగాయి. అంతేకాదు, మోడీపై తీవ్రంగా ఎదురు దాడి ప్రారంభించింది. బెంగాలీల గురించి మాట్లాడాలనుకున్నప్పుడు హోం వర్కు చేసుకోవాలి మోడీ అంటూ హూంకరించింది. బెంగాల్ వచ్చి దుర్గా పూజ లేదంటారా? దుర్గా పూజ ఉందా లేదా, సరస్వతి పూజ ఉందా లేదా, క్రిస్టమస్, రమజాన్, ఛాత్ పూజ అంటూ మోడీకి కూడా తెలియని పూజలన్నీ ఏకరువు పెట్టి ఇక్కడ అన్ని జరుగుతాయి.

మోడీ హవా తప్ప అన్ని జరుగుతాయని ఎద్దేవా చేసింది. మోడీ బాబు హోం వర్కు చేసుకుని రా.. టెలీ ప్రాంప్టరులో అన్నీ జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు అంటూ ఎగతాళి చేసింది. తీవ్రమైన వ్యంగ్యంతో ఆమె చేసే ప్రసంగాలు ప్రజలను ఉర్రూతలూగిస్తాయి. ఒకప్పుడు కాల్చిన బీడీనే రోజుకు మూడు సార్లు దాచుకుని కాల్చుకునే స్థాయిలో ఉన్న పార్టీ ఇప్పుడు వేల కోట్లు సంపాదించింది, పైగా చౌకీదార్లు అంటున్నారు.. ఈ చౌకీదార్లు అని ఆమె అనగానే జనం చోర్ అని జవాబివ్వడం గమనిస్తే, ఈ నినాదాన్ని సృష్టించిన కాంగ్రెస్ కూడా ఆశ్చర్యపోవలసిందే. మోడీని విమర్శించడంలో ఆమెకు ఎలాంటి సంకోచాలు, సంశయాలు, మొహమాటాలు, మర్యాదలు లేవు. చౌకీదార్ చోర్ మాత్రమే కాదు చౌకీదార్ ఝూటా అంటూ కొత్త నినాదం ఇచ్చింది. పశ్చిమ బెంగాల్లో బిజెపికి ఊహించని ప్రత్యర్థి మమతాబెనర్జీ. ఆమెను ఎదుర్కోవడానికి మోడీ, అమిత్ షా ద్వయం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారంటే తప్పులేదు.

                                                                                                        – కావేరీ బాంజాయ్ ( ది ప్రింట్ )
Is Mamata Banerjee a Viable Alternative to Narendra Modi

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బెంగాల్ బెబ్బులితో మోఢీ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: