రంజాన్ స్పెషల్ …హలీమ్…

ఖమ్మం : పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పలు రుచికరమైన ఆహార పదార్దాలను తీసుకుంటారు. రోజంతా ఉపవాసదీక్షలతో గడిపి సాయంత్రం ఇఫ్తార్ విందులో భాగంగా ఈ టెస్టీఫుడ్ ను ఆరగిస్తారు. ఈ రుచికరమైన ఆహారపదార్దాల్లో అన్నింటికన్నా ముందుండేది ఘుమఘుమలాడే హలీమ్. రంజాన్ సీజన్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది కూడా హలీమే. ఈ నెల రోజులు హలీం వాసనలు నోరు ఊరిస్తాయి. రంజాన్ మాసంలో నెలరోజుల పాటు ఈ హలీం భోజన ప్రియులను మైమరిపిస్తుంది. రోజంతా ఉపవాసం […] The post రంజాన్ స్పెషల్ … హలీమ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఖమ్మం : పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పలు రుచికరమైన ఆహార పదార్దాలను తీసుకుంటారు. రోజంతా ఉపవాసదీక్షలతో గడిపి సాయంత్రం ఇఫ్తార్ విందులో భాగంగా ఈ టెస్టీఫుడ్ ను ఆరగిస్తారు. ఈ రుచికరమైన ఆహారపదార్దాల్లో అన్నింటికన్నా ముందుండేది ఘుమఘుమలాడే హలీమ్. రంజాన్ సీజన్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది కూడా హలీమే. ఈ నెల రోజులు హలీం వాసనలు నోరు ఊరిస్తాయి. రంజాన్ మాసంలో నెలరోజుల పాటు ఈ హలీం భోజన ప్రియులను మైమరిపిస్తుంది. రోజంతా ఉపవాసం చేసి ఉన్న ముస్లిం సోదరులకు ఈ హలీం తక్షణ శక్తిని ఇచ్చేందుకు దోహదపడుతుంది. ముస్లింలే కాకుండా ఇపుడు దీన్ని అన్ని మతాల వారు స్వీకరిస్తున్నారు.
రంజాన్ నెలలో ఎక్కడ చూసినా హలీం సందడి కనిపిస్తుంటుంది. చాలా రకాల హలీంలు మార్కెట్‌లోకి వచ్చాయి. ఫిష్ హలీం, కంజు హలీం, ఇలా చాలా రకాలు హలీంలు జనాలకు నోరూరిస్తున్నాయి. పబ్లిక్ డిమాండ్‌ను బట్టి ఫ్యామిలీ ప్యాక్, పార్టీ ప్యాక్, కపుల్ ప్యాక్, జంబూ ప్యాక్ , సుప్రీం ప్యాక్ వంటివి కూడా ఉంటాయి. రకాలను బట్టి వీటి ధరలు ఉంటాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది 10 శాతం ధరలు పెరిగాయంటున్నారు నిర్వాహకులు. ఇక శాఖాహార ప్రియుల కోసం రంజాన్ మాసంలోనే ప్రత్యేక వెజ్ హలీంలను కూడా తయారుచేస్తున్నారు. వివిధ రకాల కూరగాయలు, పప్పు దినుసులు, పాలు, డ్రైఫూట్స్, నెయ్యి, మసాలా దినుసులతో దీన్ని తయారుచేస్తున్నారు. ఇపుడు రెస్టారెంట్ల వాళ్లు కూడా హలీంను తయారు చేస్తున్నారు. అంతేకాదు ఇపుడు హలీంను ప్యాకెట్లలో కూడా లభ్యమవుతోంది. ఖమ్మం నగరంలోని స్టేషన్‌రోడ్, కస్పాబజార్, ఖిల్లా బజార్, తదితర ప్రాంతాల్లో హలీంను ప్రత్యేకంగా తయారుచేస్తున్నారు. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు దీన్ని తయారుచేసేందుకు పదిమంది యువకులు ఒక్కో దుకాణం వద్ద కష్టపడుతుంటారు. రుచికరంగా తయారుచేసేందుకు బాగా శ్రమిస్తారు. హలీం రూ. 100లు, హరీస్ రూ. 70 లుగా విక్రయాలు జరుపుతున్నారు. షాదీఖానా వద్ద , రైల్వేస్టేషన్‌వద్ద, వైరారోడ్, కస్పాబజార్ , ఖిల్లా బజార్‌ల వద్ద హలీం, హరీస్ దుకాణాలు వెలిశాయి. సాయంత్రం కాగానే పలువురు ముస్లిం సోదరులు వచ్చి హలీంలను కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. తద్వారా ఒక్కో హలీం దుకాణం రోజుకు రూ. 30వేల వరకు వ్యాపారం సాగిస్తుంది. అందులో సగానికి సగం ఖర్చులు పోతాయి. అయితే ఈ హలీం ద్వారా ఈ నెలరోజుల పాటు పదిమందికి ఉపాధి దొరుకుతుంది. ఈ సారి రంజాన్ మాసం ప్రారంభం నుంచే హలీం లభిస్తుండటంతో జనం తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు హలీమ్ రుచిని ఆస్వాదిస్తున్నారు. నెలరోజుల పాటు హలీం దొరికే అరుదైన మాసం కావటంతో ఇతర మతాల వారు కూడా ఒక్కసారి టేస్ట్ చూస్తే బావుంటుందనే ఆలోచనకు వస్తారు. హలీం రుచి అంత ప్రత్యేకమైనదని చెప్తారు. ఉపవాసంలో ఉన్నవారికి ఇన్‌స్టంట్ శక్తినిచ్చేది ఈ హలీమే. ఇది అనేక పోషక విలువలు గల పదార్దం. హలీంలో  పోషకాలు కూడా బాగా ఉంటాయి. హలీం ఎపుడు ఎలా పుట్టిందో చెప్పేందుకు సరియైన ఆధారాలు లేవు. అయితే ఈ వంటకం సౌదీ అరేబియా నుండి వచ్చిందని చెప్తారు. వందల ఏళ్ల క్రితమే సౌదీ అరేబియాలోని రాయల్ ప్యాలెస్‌లలో ఈ హలీం తయారయ్యేదట. ఉదయం బ్రేక్‌పాస్ట్ లేదా రాత్రి డిన్నర్‌లలో హలీం తప్పకుండా ఉండేదట. మస్తు రకాల మసాలాలు, ప్రోటీన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, ఎసెన్షియల్ ప్యాటీయాడ్స్ ఉంటాయి. వాసన ఎంత కమ్మగా ఉంటుందో రుచి కూడా అంతే గొప్పగా ఉంటుందని హలీం ప్రియులు చెపుతుంటారు. ఒక్కసారి తింటే చాలు మళ్లీ మళ్లీ తినాలనిపించేంత రుచిగా ఉంటుందని చెప్తారు. అందుకే అరబ్ సుల్తానులు దీనిని రోజూ తినేవారట. హలీంలో శరీరంలో శక్తిని పునరుత్పత్తి చేసే లక్షణం ఉంటుందని చెబుతారు. సౌదీ అరేబియాలో రాజుల ఇళ్లల్లో తినే హలీం మొదటి ఇండియా, హైద్రాబాద్, ఆ తరువాత ఖమ్మం వంటి నగరాలకు వచ్చి తన ఘుమఘుమలను చాటుతోంది. నిజాం కాలంలో అప్పట్లో హైద్రాబాద్ రాష్ట్రంలోని అసఫ్‌జాలీ డయాన్టీ అనే నిజాం రాజు, నిజాం రాజులు ఉన్న దేశాల్లోకెల్లా గొప్ప ధనవంతుడు. ఆయన రాజ్యంలో అన్నీ ఖరీదైన, రుచికరమైన ఆహారపదార్దాలే ఉండేవట. ఆ విధంగా నిజాంల కొలువుల్లో తయారైనవే బిర్యానీ, కబాబ్, ఇపుడు హలీం. వీటిని హైద్రాబాద్‌కు తెచ్చిన నిజాం రాజు ఆలీ మహబూబ్ ఖాన్.

టేస్ట్‌లోనే కాదు… తయారీలోనూ గొప్పే…
హలీం తయారీ అంటే తిన్నంత సులువు కాదు. కఠోర శ్రమ, అంకితబావం ఉంటేగాని ఆ వంటకానికి ప్రత్యేక రుచి, దానితో పాటు పేరు వస్తుంది. గంటల కొద్ది సమయం కేటాయించే ఓపిక ఉండాలి. మంచి పొట్టేలు మాంసం లేతగా బొక్కలతో ఉన్నది తీసుకుని, దీనితోపాటు గోధుమలు, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఎర్రపప్పు, కొంచెం బాస్మతి బియ్యం, నెయ్యి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, మిరియాలు, తోక మిరియాలు, సాజీరా, .జీలకర్ర, అల్లం, ఎల్లిపాయ ముద్ద, పసుపు, ఉల్లిగడ్డ, గులాబీరేకులు, కొత్తిమీర, నిమ్మకాయ తదితర పదార్దాలు అవసరపడతాయి. ఇవ్వన్నీ సిధ్దం చేసుకున్నాక మాంసం, గోధుమలు నానబెడతారు. పప్పులు, మసాలాలతో బాగా ఉడకబెట్టాలి. మాంసం ఐదుగంటలు ఉడకబెడతారు. బాగా ఉడికనాక అడుగు మందంగా ఉన్న పెద్ద గిన్నెలో ఈ రెండింటిని వేస్తారు. పెద్ద పెద్ట గూటా కర్రలతో గంటల కొద్దీ రుబ్బుతారు. పాలు, నెయ్యికూడా పోస్తారు. ఇది బాగా ఉడికి గట్డిపడేదాక తిప్పుతారు. ఇలా తయారైన హలీం మీద నెయ్యి, డ్రైపూట్స్ వేయించిన ఉల్లిగడ్డ, కొత్తిమీర, నిమ్మకాయతో అలంకరిస్తారు. ఈ విధంగా తయారైన హలీంను చూస్తే చాలు నోట్లో నీళ్లు ఊరుతాయి. హలీం తయారీలో బట్టీలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. పెద్ద మొత్తంలో హలీం తయారవ్వాలంటే స్టౌవ్‌లతో పని జరగదు. దీనికోసం ప్రత్యేకంగా బట్టీలు పెట్టాలి. ఇటుకలు, ఎర్రమట్టితో కట్టే కట్టెలపొయ్యే బట్టీ. ఇది సగం కట్టాక పెద్ద అండ (రంధ్రం) పెడతారు. దీని చుట్టూ కూడా ఇటుకలతో మూసివేస్తారు. ఈ రంధ్రం బయటకు కనిపించదు. రంజాన్ మాసం ప్రారంభం అవుతుందనగా ఈ బట్టీలను కడతారు. బలవర్దమైన ఆహారం హలీం. అందుకే రంజాన్  స్పెషల్ డిష్ గా హలీంకు పేరుంది. చికెన్ హలీంను హరీస్ అంటారు. ఇది మటన్ హలీం కంటే చీప్‌గా దొరకుతుంది. రంజాన్ రుచులు ఆరగించాలనుకునే వారికి హలీం, హరీస్‌లు ప్రత్యేకమనే చెప్పాలి.

Ramzan Special … Haleem …

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రంజాన్ స్పెషల్ … హలీమ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: