బెంగాల్‌లో ప్రచార విఘ్నం

  బెంగాల్‌లో చివరి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రచార ఘట్టాన్ని ఒక రోజు ముందే ముగించాలని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం బయటికి సమర్థించదగినదిగా కనిపించవచ్చు. లోతులకు వెళ్లి చూస్తే ఇసి చర్యలోని అసంబద్ధత అర్థం కాక మానదు. ప్రచార ఘట్టానికి ఇలా ఒక రోజు ముందే తెర దించిన సందర్భం దేశ ఎన్నికల చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ లేదు. ఇటువంటి అపూర్వ చర్య తీసుకోడానికి తగినంత కారణమూ కనిపించడం లేదు. భారతీయ జనతా […] The post బెంగాల్‌లో ప్రచార విఘ్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బెంగాల్‌లో చివరి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రచార ఘట్టాన్ని ఒక రోజు ముందే ముగించాలని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం బయటికి సమర్థించదగినదిగా కనిపించవచ్చు. లోతులకు వెళ్లి చూస్తే ఇసి చర్యలోని అసంబద్ధత అర్థం కాక మానదు. ప్రచార ఘట్టానికి ఇలా ఒక రోజు ముందే తెర దించిన సందర్భం దేశ ఎన్నికల చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ లేదు. ఇటువంటి అపూర్వ చర్య తీసుకోడానికి తగినంత కారణమూ కనిపించడం లేదు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కోల్‌కతా రోడ్ షోలో మంగళవారం నాడు చోటు చేసుకున్న హింస, ఉద్రిక్తతలను దృష్టి లో పెట్టుకొని ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నది. 19వ తేదీ ఆదివారం నాడు జరగవలసిన పోలింగ్‌కు ప్రచారం శుక్రవారం సాయంత్రానికి ముగిసిపోవలసి ఉండగా గురువారం నాటితోనే స్వప్తి చెప్పాలని ఇసి నిర్ణయం తీసుకున్నది. పరిస్థితి అంతటి విషమ స్థాయికి చేరుకున్నదని ఇసి భావించి ఉంటే ప్రచార ఘట్టాన్ని మంగళవారం నాటి ఘర్షణల అనంతరం తక్షణమే రద్దు చేసి ఉండాల్సింది.

లేదా బుధవారం సాయంత్రానికే ముగించేలా ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చు. ప్రధాని మోడీ సభలకు వీలు కల్పించడం కోసమే బుధవారం బదులు గురువారం సాయంత్రం నుంచి ప్రచారాన్ని నిలిపివేయాలని ఇసి నిర్ణయం తీసుకున్నదన్న ప్రతిపక్షాల విమర్శ అర్థం లేనిది కాదనే అభిప్రాయానికి తావు కలుగుతున్నది. ఇంత వరకూ తన మీద వచ్చిన విమర్శలకు ఈ చర్య ద్వారా ఇసి బలాన్ని చేకూర్చినట్టయింది. ఇంకే రాష్ట్రంలోనూ లేనంతగా బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచార పోరు ఆది నుంచి ఉద్రిక్తంగా సాగింది. భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య చావో రేవో అనే పరిస్థితి తల ఎత్తింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎదురు కాబోయే నష్టాన్ని కొంత మేరకు బెంగాల్‌లో పూడ్చుకోవాలని బిజెపి చాలా కాలం నుంచే పథకం వేసుకున్నది. అందుకు బొత్తిగా సందు ఇవ్వకూడదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ దృఢ సంకల్పం వహించారు. తన రాష్ట్రంలో బిజెపి పాచికను పారనివ్వరాదని నిర్ణయించుకున్నారు. బిజెపి, తృణమూల్ కాంగ్రెస్‌లు రెండూ దండిగా కార్యకర్తల బలగమున్న పార్టీలే. మోడీ, మమతాబెనర్జీ మధ్య మాటల యుద్ధం ప్రధానికి కాంగ్రెస్ అధ్యక్షుడికి జరిగిన దానికంటే వేడిగా, వాడిగా సాగింది. అదే స్థాయిలో ఆ రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నది.

అమిత్ షా సభలకు అనుమతిని నిరాకరించడం ద్వారా మమత ప్రభుత్వం తన తడాఖా చూపించింది. ఒక దశలో ఆయన హెలికాప్టర్‌ను దిగనీయకుండా వెనక్కి పంపించారు. ఆ స్థాయిలో కొనసాగిన వైరుధ్యం మంగళవారం నాటి అమిత్ షా రోడ్ షోలో రాళ్లు రువ్వుడు తదితర విధ్వంసకర దాడులకు దారి తీసింది. బెంగాలీలు అమితంగా ప్రేమించి ఆరాధించే ప్రముఖ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహం ఈ ఘర్షణలో ధ్వంసం కావడం విషాదకర పరిణామం. ఈ పనికి బెంగాలీలే పాల్పడి ఉంటారని అనుకోలేము. అందుచేత అది బయటి నుంచి వచ్చిన బిజెపి కార్యకర్తల పనే అని మమతాబెనర్జీ చేస్తున్న ఆరోపణను కొట్టి పారేయలేని స్థితి. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు చేసిన జై శ్రీరాం నినాదాల మీద కూడా వివాదం చెలరేగింది. ఈ నినాదం చేసిన వారిని మమత స్వయంగా నిలదీశారని వార్తలు వచ్చాయి. మొన్న అమిత్ షా రోడ్ షోలో రామ లక్ష్మణ సీత వేషాలు వేసుకున్న వారి హంగామా కనిపించిందని సమాచారం.

బెంగాలీల ప్రధాన ఆరాధ్య దేవత కలకత్తా కాళిక అనే సంగతి తెలిసిందే. రాముడిని పూజించే ఉత్తరాది వారికి బెంగాలీలకు మధ్య సాంస్కృతికంగా ఈ తేడా కనిపిస్తుంది. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహం కూల్చివేత మిగిలిన ఒక విడత లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి ప్రతికూల అంశంగా పనిచేసే అవకాశం లేకపోలేదు. ఇదంతా ఇలా ఉన్నప్పటికీ ప్రచారాధ్యాయాన్ని అర్థంతరంగా ముగించవలసిన స్థాయి హింస చెలరేగే సూచనలు లేవు. అటువంటిది ఉంటే మంగళవారం నాటి ఘర్షణల తర్వాతనే అది భగ్గుమని ఉండేది. బెంగాల్ రాష్ట్రమంతా కంపించి పోయే పరిస్థితి తల ఎత్తేది. బుధవారం నాడు అటువంటిదేమీ కనిపించలేదు కాబట్టి ప్రచారాన్ని యధావిధిగా గడువు వరకు కొనసాగనిచ్చి ఉంటే బాగుండేది. ప్రజాస్వామ్యానికి, ఎన్నికలకు ప్రాణం వంటి ప్రచార ఘట్టాన్ని తగిన బందోబస్తు, భద్రత మధ్య తుదికంటా జరిపించడం ఇసి ముఖ్య బాధ్యతల్లో ఒకటి. అందుకే ఎన్నికల వేళ దానికన్ని విస్తృతాధికారాలను ఆర్టికల్ 324 ద్వారా కల్పించారు. అందులో ఇసి విఫలమైంది. తాను కఠినంగా వ్యవహరిస్తున్నానని చాటడానికి తీసుకున్న ఈ నిర్ణయంలోనూ ‘స్వామి’ భక్తిని చూపుతున్నదనే విమర్శకు ఇసి దొరికిపోయింది.

 

Election Campaign Closed by EC in West Bengal

 

The post బెంగాల్‌లో ప్రచార విఘ్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.