కాళేశ్వరం నీరు జులై నుంచే…

  ఎత్తిపోతలకు అవసరమైన విద్యుత్‌ను సిద్ధం చేయండి జూన్ 10లోగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌజ్‌ల నిర్మాణం పూర్తి కావాలి గోదావరి నుంచి ఏటా 540-600 టిఎంసిలు ఎత్తిపోసి 45లక్షల ఎకరాల్లో రెండు పంటలకు నీరివ్వడమే లక్ష్యం కరెంట్ ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది ఎత్తిపోతల ద్వారా విద్యుత్ ఉత్పాదన అవకాశాలు పరిశీలించాలి ప్రగతిభవన్ సమీక్షలో విద్యుత్, రెవెన్యూ అధికారులతో ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్: ఈ ఏడాది జులై చివరి నుంచే కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయడానికి […] The post కాళేశ్వరం నీరు జులై నుంచే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎత్తిపోతలకు అవసరమైన విద్యుత్‌ను సిద్ధం చేయండి
జూన్ 10లోగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల
పంపుహౌజ్‌ల నిర్మాణం పూర్తి కావాలి
గోదావరి నుంచి ఏటా 540-600 టిఎంసిలు ఎత్తిపోసి 45లక్షల ఎకరాల్లో రెండు పంటలకు నీరివ్వడమే లక్ష్యం

కరెంట్ ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది
ఎత్తిపోతల ద్వారా విద్యుత్ ఉత్పాదన అవకాశాలు పరిశీలించాలి
ప్రగతిభవన్ సమీక్షలో విద్యుత్, రెవెన్యూ అధికారులతో ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్: ఈ ఏడాది జులై చివరి నుంచే కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన విద్యుత్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలని విద్యుత్ అధికారులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశించారు. జూన్ 10వ తేదీ లోగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌజ్‌ల నిర్మాణం పూర్తిచేయాలని ఇరిగేషన్ అధికారులకు గడువు విధించారు. ఈ ఏడాది నుంచి రోజుకు 2 టిఎంసిలు, వచ్చే ఏడాది నుంచి 3 టిఎంసిల నీళ్లను గోదావరి నుంచి ఎత్తిపోయాలని నిర్ణయించినట్లు సిఎం చెప్పారు. ఇందుకు ఈ ఏడాది రోజుకు రెండు టిఎంసిల చొప్పున నీటిని ఎత్తిపోయడానికి 3,800 మెగావాట్లు, వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి రోజుకు మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేయడానికి మొత్తం 6,100 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా వేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. కావాల్సినంత విద్యుత్ ను సమకూర్చుకుని, గోదావరిలో నీటి ప్రవాహం ఉండే ఆరు నెలల పాటు నిర్విరామంగా 24 గంటల పాటు సరఫరా చేయాలన్నారు.

గోదావరి నుంచి ఏటా దాదాపు 540 నుంచి 600 టిఎంసిల నీళ్లను ఎత్తిపోసి 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిఎం వివరించారు. ఎత్తిపోతల పథకాలకు వినియోగించే కరెంటు కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సిఎం వెల్లడించారు. ఎత్తిపోతల పథకాల ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలు పరిశీలించాలని సిఎం సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని లిఫ్టు చేయడానికి అవసరమయ్యే విద్యుత్ సరఫరా చేసే అంశంపై ముఖ్యమంత్రి గురువారం ప్రగతి భవన్ లో విస్తృత సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు, ఎంపి జె.సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఇఎన్సీ మురళీధర్ రావు, ట్రాన్స్ కో జెఎండి సి.శ్రీనివాసరావు, జెన్ కో-ట్రాన్స్ కో డైరెక్టర్లు సూర్య ప్రకాశ్, వెంకట్రాజం, జగత్ రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

గోదావరి నీటిలో తెలంగాణ వాటాను సంపూర్ణంగా వినియోగించాలని, ఇందుకోసం నీటి లభ్యత ఉన్న మేడిగడ్డ నుంచే నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం ఉందని సిఎం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి రోజుకు రెండు టిఎంసిల చొప్పున నీటిని లిఫ్టు చేయడానికి అవసరమైన నిర్మాణాలు పూర్తి కావచ్చాయని, పంపుల ట్రయల్ రన్లు కూడా విజయవంతమయ్యాయన్నారు. ఈ ఏడాది జూలై నుంచే నీరు లిఫ్టు చేయాలని, ఇందుకు 3,800 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని సిఎం వివరించారు. వచ్చే ఏడాది నుంచి మేడిగడ్డ నుంచి మూడు టిఎంసిల నీరును లిఫ్టు చేస్తామని, ఇందుకోసం 6,100 మెగావాట్ల విద్యుత్ అవసరం పడుతుందని చెప్పారు. గోదావరిలో నీటి ప్రవాహం ఉండే జూన్ నుంచి డిసెంబర్ వరకు నీటిని లిఫ్టు చేసే అవకాశం ఉంటుందని, జూన్, నవంబర్ మాసాల్లో రోజుకు 2 టిఎంసిల చొప్పున, జూలై నుంచి అక్టోబర్ వరకు నెలకు మూడు టిఎంసిల చొప్పున నీరు లిఫ్టు చేయవచ్చు. డిసెంబర్ మాసంలో కూడా ఒక లిఫ్టు నడిపి కొంత నీరు తీసుకోవచ్చు. ఏ నెలలో ఎంత నీరు తీసుకోవచ్చని సిఎం వివరించారు. ఇందుకు అవసరమయ్యే విద్యుత్‌ఫై శాస్త్రీయ అంచనా వేయాలని, ఆ సమయంలో సరిపడే విద్యుత్ సరఫరాకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు.

రాష్ట్రంలో ఉన్న 85 శాతం భూభాగంలో వ్యవసాయానికి, మంచినీటికి, పరిశ్రమలకు అవసరమైన నీటిని గోదావరి నుంచే తీసుకోవాలన్నారు. గోదావరిలో తెలంగాణకు 954 టిఎంసిల నీటి వాటా ఉంది. ఈ నీటిని వాడుకోవడానికి అన్ని రకాల అనుమతులున్నాయని, \ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం కూడా చేసుకున్నామని, 44 ఏండ్ల సి.డబ్ల్యు.సి. లెక్కల ప్రకారం మేడిగడ్డ వద్ద పుష్కలమైన నీటి లభ్యత ఉందన్నారు. కాబట్టి గోదావరి నదిలో నీటి ప్రవాహం ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వీలైనంత ఎక్కువ మొత్తంలో నీటిని లిఫ్టు చేయాలన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి, అక్కడి నుంచి మిడ్ మానేరుకు ఈ ఏడాది 2 టిఎంసిలు లిఫ్టు చేయాలన్నారు. ఈ నీటిలో రివర్స్ పంపింగ్ ద్వారా ఒక టిఎంసిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు, మరో టిఎంసిని మల్లన్న సాగర్ కు లిఫ్టు చేయాలని, వచ్చే ఏడాది ఎల్లంపల్లి వరకు మూడు టిఎంసిలు, కొండపోచమ్మ సాగర్ వరకు రెండు టిఎంసిలు నీటిని తరలించి, రిజర్వాయర్లను, చెరువులను నింపాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతిపాదించిన 22 లక్షల ఎకరాలకు మాత్రమే కాకుండా, శ్రీరాం సాగర్ ఆయకట్టుకు, గుత్ప-అలీసాగర్ పథకాలకు, నిర్మల్- ముధోల్ నియోజకవర్గాలకు, గౌరవల్లి ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గానికి నీరివ్వాలి. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు ఏడాదికి రెండు పంటలకు నీరందించాలని, ఏడాదికి 90 లక్షల ఎకరాల్లో పంటలు పండించాలని, కేవలం సాగునీరే కాకుండా మంచినీటికి, పరిశ్రమలకు కూడా కాళేశ్వరం ద్వారా నీరందించాలని అధికారులకు సిఎం దిశానిర్ధేశం చేశారు.

నిర్వహణ భారంపై అనుమానాలు… అవగాహనా రాహిత్యమే..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, నిర్వహణ భారంపై కొందరు వెలిబుచ్చే అభిప్రాయాలు పూర్తిగా అవగాహన రాహిత్యంతోకూడుకున్నవని ముఖ్యమంత్రి కెసిఆర్ అభిప్రాయపడ్డారు. ఒక్కో ప్రాంతానికి అక్కడున్న పరిస్థితులను బట్టి వేర్వేరు ప్రాధాన్యతలుంటాయన్నారు. గల్ఫ్ దేశాల్లో మంచినీళ్లు దొరకవని, అక్కడి ప్రభుత్వాలు ఎక్కువ వ్యయం మంచినీళ్ల కోసమే చేస్తాయని, లాస్ వెగాస్ ప్రాంతానికి మంచినీళ్లు అందివ్వడానికి అమెరికా ప్రభుత్వం 600 కిలోమీటర్ల దూరం నీళ్లను పంప్ చేస్తున్నదని ఉదాహరణలు చెప్పారు. తెలంగాణలో వ్యవసాయానికి సాగునీరు ఇవ్వడం ప్రాధాన్యతాంశమని, రైతులను బతికించడానికి, వ్యవసాయం సాగడానికి సాగునీటి కోసం ఖర్చు చేస్తామని, ఒక్కసారి కాళేశ్వరం పూర్తయితే జనం బతికిపోతారని, ఏడాదికి 90 లక్షల ఎకరాల్లో పంట పండుతుందని విశ్వాసం వెలిబుచ్చారు. ఒకటి, రెండేళ్లలోనే ప్రాజెక్టు నిర్మాణానికి పెట్టిన ఖర్చుకు సమానమైన పంట పండుతుందని, దీంతో రైతుల జీవితాలు, తెలంగాణ వాతావరణం మారుతుందని సిఎం వివరించారు.

దేవాదుల, సీతారామకు మరో వెయ్యి మెగావాట్లు
దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నిర్వహణకు మరో వెయ్యి మెగావాట్లు అవసరమవుతుందని సిఎం చెప్పారు. ఎత్తిపోతల పథకాల పంపుసెట్ల నిర్వహణకు అవసరమైన విద్యుత్తును సమకూర్చాలని, దీనికయ్యే ఖర్చు కోసం రైతుల ఉచిత విద్యుత్ సబ్సిడీ మాదిరిగా ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు ప్రత్యేక గ్రాంటు ఇస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎత్తిపోతల పథకాల కోసం నిర్మించిన సబ్ స్టేషన్లు, ఇతర విద్యుత్ సంబంధ వ్యవస్థల నిర్వహణ బాధ్యతను విద్యుత్ సంస్థలే చేపట్టాలని సిఎం చెప్పారు. ఎత్తిపోతల పథకాల ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, ఎక్కడ ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చో శాస్త్రీయంగా సర్వే చేయించాలని సిఎం ఆదేశించారు.

17వేల మెగావాట్లకు సిద్ధం: ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు
ఇతర రంగాలకు 24 గంటల విద్యుత్తును సరఫరా చేస్తూనే, కాళేశ్వరంతో పాటు ఇతర ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్తును నిరాటంకంగా సరఫరా చేస్తామని ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు వివరించారు. సమీక్షలో భాగంగా రాష్ట్ర విద్యుత్ పరిస్థితిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. 11వేల మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చినప్పటికీ ఎక్కడా కోతలు లేకుండా సరఫరా చేశామని ప్రభాకర్ రావు వెల్లడించారు. ఎత్తిపోతల పథకాలకు మరో 6వేల మెగావాట్లు అవసరమైనా సమకూరుస్తామని, మొత్తం రాష్ట్ర డిమాండ్ 17వేల మెగావాట్లకు చేరినా, విద్యుత్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీనికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా విద్యుత్ ఉత్పత్తి కూడా పెరుగుతుందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 16,203 మెగావాట్ల స్థాపిత విద్యుత్ అందుబాటులో ఉందని, ఈ ఏడాది చివరినాటికి 1080 మెగావాట్ల భద్రాద్రి ప్లాం టులో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని, కొద్ది నెలల్లోనే ఎన్.టి.పి.సి. ప్లాంటు ద్వారా 1,600 మెగావాట్లు అందుతుందని వివరించారు. 4,000 మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంటు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం 28వేల మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా, వందకు వంద శాతం పంపిణీ చేయడానికి అనువైన వ్యవస్థ ట్రాన్స్ కో సిద్ధం చేసిందని వివరించారు.

విద్యుత్ పనులు వేగంగా చేశారు: సిఎం కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్ సరఫరా చేయడానికి కావల్సిన వ్యవస్థలను శరవేగంగా పూర్తిచేశారని సిఎం కేసీఆర్ విద్యుత్ సంస్థలను అభినందించారు. విధించిన గడువుకన్నా ముందే పనులు పూర్తి చేశారని, సహజంగా ఇంత త్వరగా పనులు పూర్తి కావని చెప్పారు. ఇదే స్పూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 3 టిఎంసిల నీటిని లిఫ్టు చేయడానికి అవసరనమైన అదనపు ఏర్పాట్లు కూడా వేగంగా పూర్తి చేయాలని సిఎం చెప్పారు.

Kaleshwaram water released from July

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాళేశ్వరం నీరు జులై నుంచే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: