బిజెపిపై దళిత ధర్మాగ్రహం…

  ఉత్తరాఖండ్ తెహ్రీ: ఘర్వాల్‌లో ఒక దళిత యువకుడిపై దాడి జరిగింది. రాజస్థాన్‌లో అల్వార్ జిల్లాలో థనఘాజీలో 18 సంవత్సరాల దళిత అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది. గుజరాత్ అరావళి జిల్లాలో దళిత వరుడు గుర్రమెక్కాడని అతనిపై రాళ్ళ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా దళితులపై జరిగిన కొన్ని దాడులు ఇవి. ప్రజాస్వామ్య పండుగ ఎన్నికలు జరుగుతున్నప్పుడే ఈ సంఘటనలు జరిగాయి. ఇవి చెదురుమదురు సంఘటనలు కావు. 2006 నుంచి 2016 వరకు దళితులపై నేరాలు […] The post బిజెపిపై దళిత ధర్మాగ్రహం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఉత్తరాఖండ్ తెహ్రీ: ఘర్వాల్‌లో ఒక దళిత యువకుడిపై దాడి జరిగింది. రాజస్థాన్‌లో అల్వార్ జిల్లాలో థనఘాజీలో 18 సంవత్సరాల దళిత అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది. గుజరాత్ అరావళి జిల్లాలో దళిత వరుడు గుర్రమెక్కాడని అతనిపై రాళ్ళ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా దళితులపై జరిగిన కొన్ని దాడులు ఇవి. ప్రజాస్వామ్య పండుగ ఎన్నికలు జరుగుతున్నప్పుడే ఈ సంఘటనలు జరిగాయి. ఇవి చెదురుమదురు సంఘటనలు కావు. 2006 నుంచి 2016 వరకు దళితులపై నేరాలు 25 శాతం పెరిగాయని నేర గణాంకాలు తెలియజేస్తున్నాయి.

అవమానాలు, భౌతికదాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దళితుల్లో నానాటికి ఆగ్రహం మిన్నంటుతోంది. ఈ ఆగ్రహం ఇప్పుడు బిజెపికి ఎన్నికల్లో శరాఘాతంగా మారబోతోంది. లోక్ నీతి సియస్‌డి ప్రీ పోల్ సర్వే ప్రకారం మోడీ కాలంలో ఎలాంటి అభివృద్ధి లేదని, కేవలం కార్పొరేట్లకే ప్రయోజనం కలిగించాడని 50 శాతం దళితులు అభిప్రాయపడ్డారు. కేవలం 41 శాతం మంది మాత్రమే అభివృద్ధి అందరికీ లభించిందని చెప్పారు. బిజెపి పట్ల దళితుల ఆగ్రహం హఠాత్తుగా వచ్చింది కాదు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ఆత్మహత్య మొదలు 2016 లో గుజరాత్ ఉనాలో ఆవు చర్మం ఒలిచారని దళితులను చావగొట్టిన సంఘటన, 2018లో మహారాష్ట్ర, భీమా కోరెగాంవ్ లో మహర్లపై దాడులు ఇవన్నీ దళితుల ఆగ్రహానికి కారణాలే. బిజెపి అధికారంలో ఉండడం వల్ల అగ్రవర్ణాలు మరింత రెచ్చిపోయి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయన్న అభిప్రాయం కూడా దళితుల్లో బలపడుతోంది. దళితులపై దాడి చేసే ముందు నా మీద దాడి చేయండని ప్రధాని చెప్పినా, దళితుడిని రాష్ట్రపతి చేసినా సగటు దళితుడికి ఒరిగిందేమీ లేదు. బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు అగ్రవర్ణాలు రెచ్చిపోతున్నారనేది దళితుల అభిప్రాయం. పైగా అగ్రవర్ణాలకు బిజెపి రక్షణ కల్పిస్తుందని కూడా చాలా మంది భావిస్తున్నారు. దళితులు పోలీసు స్టేషనుకు వెళ్ళి ఫిర్యాదు నమోదు చేయాలని ప్రయత్నించినా పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదు. కులహింస కేసుల్లో పోలీసులు అగ్రవర్ణాలకు వత్తాసు పలకడం బిజెపి పాలనా కాలంలో అధికమవుతుందని దళితులు భావిస్తున్నారు.

దళితులపై దాడులు జరిగినప్పుడు ఎస్‌సి, ఎస్‌టి చట్టం వారికి కొంత రక్షణ కల్పిస్తుంది. అయితే 2018లో సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని నీరుగార్చే ఉత్తర్వులిచ్చింది. దీనికి కారణం ప్రభుత్వ వైఖరి. అంటే దళితులకు ఉన్న ఒకే ఒక్క రక్షణ కూడా బిజెపి లేకుండా చేసిందనే కోపం వారికి ఉంది. 2018 ఏప్రిల్‌లో దళిత సంఘాలు భారత్ బంద్ నిర్వహించాయి. బిజెపి ప్రభుత్వంపై నిరసన తెలిపాయి. కాని అగ్రవర్ణ సంఘాలు వారిపై దాడులకు పాల్పడిన ఆరోపణలు బలంగా వచ్చాయి. ప్రయివేటు వ్యక్తులు కాల్పులు జరుపుతున్న చిత్రాలు కూడా వచ్చాయి. ఇది ఒక మలుపు వంటి సంఘటన. ఈ సంఘటన తర్వాత దళితులు పూర్తిగా బిజెపికి దూరమయ్యారని చెప్పాలి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దీని ఫలితం కనబడింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో కూడా దీనిప్రభావం తప్పక ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ దళిత ఓటర్లను ఆకర్షించడంలో కొంతవరకు సక్సెస్ అయినట్లే కనబడుతోంది. మధ్యప్రదేశ్‌లో జాదవ్ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్ళాయని, రాజస్థాన్ లో కూడా బిజెపికి చుక్కెదురయ్యే సామాజిక పరిణామాలున్నాయని తెలుస్తోంది. రాజస్థాన్‌లో బిజెపి జాట్ కులస్థులకు కొమ్ముకాస్తుంది. దళితులపై అణచివేతల్లో జాట్ కులస్థులపై అనేక ఆరోపణలున్నాయి. హర్యానాలో పరిస్థితి వేరు. హర్యానాలో జాట్ కులస్థులు రిజర్వేషన్ ఉద్యమం నడిపారు. ఇక్కడ జాట్‌లకు వ్యతిరేకంగా పంజాబీలను బిజెపి నిలబెడుతోంది. జాట్ రాజకీయ ప్రాబల్యాన్ని హర్యానాలో దెబ్బతీయాలని బిజెపి చూస్తోంది. హర్యానాలో జాట్లతో పాటు దళితులు కూడా బిజెపికి వ్యతిరేకంగా ఉన్నారు. దళిత ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు మళ్ళడం లేదు. పెద్ద సంఖ్యలో బహుజన సమాజ్ పార్టీకి మద్దతిస్తున్నారు. హర్యానాలో కొత్తగా ఏర్పడిన లోక్ తాంత్రిక్ సురక్షా పార్టీకి బహుజన సమాజ్ పార్టీ మద్దతిస్తోంది.

పంజాబ్‌లోనూ బిజెపి పరిస్ధితి మెరుగ్గా లేదు. బిజెపికి అకాలీదళ్‌తో పొత్తు ఉంది. ఈ రెండు పార్టీలు దళితులను అణచేస్తున్నాయన్న అభిప్రాయం పంజాబ్ లో బలంగా ఉంది. అయితే బిజెపిని వ్యతిరేకించే వారంతా కాంగ్రెసుకు ఓటేయడం లేదు. ఉత్తరప్రదేశ్ లో ఈ ఓట్లు ఎక్కువగా మహాకూటమికి పడుతున్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్ మాత్రమే కాదు, ఉత్తరప్రదేశ్ పొరుగున ఉన్న రాష్ట్రాల్లో కూడా మహాకూటమి దళితులను ఆకట్టుకుంది. హంగ్ పార్లమెంటు ఏర్పడితే మాయావతికి ప్రధాని అయ్యే అవకాశాలున్నాయనే మాటలు దళితులకు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా బియస్‌పి అభ్యర్ధులను నిలబెట్టినా ఈ రాష్ట్రాల్లో బియస్‌పికి బలం లేదు కాబట్టి ఓట్లు చీలిపోకుండా జాగ్రత్త పడుతూ దళితులు కాంగ్రెసుకు ఓటు వేస్తారని చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. ఇండియా టుడే పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్చిలో చేసిన సర్వే ప్రకారం దళితుల్లో మోడీ కన్నా రాహుల్ పట్ల ఆదరణ ఎక్కువ. 44 శాతం దళితులు రాహుల్ గాంధీని ప్రధానిగా ఇష్టపడ్డారు. మోడీ ప్రధానిగా ఇష్టపడిన వారు 41 శాతం మాత్రమే.విచిత్రమేమంటే, పుల్వామా ఉగ్రదాడి తర్వాత, బాలాకోట్ వాయుసేన దాడుల తర్వాత కూడా మోడీ గ్రాఫ్ పడిపోవడం, రాహుల్ గ్రాఫ్ పెరగడం నమోదయ్యింది. జనవరిలో 47 శా తం దళితులు ప్రధానిగా మోడీని ఇష్టపడ్డారు. 34 శాతం రాహుల్ ను ఇష్టపడ్డారు. మార్చి వచ్చే సరికి మోడీని ప్రధానిగా ఇష్టపడే దళితులు 41 శాతం అయ్యారు. రాహుల్ గాంధీని ప్రధానిగా ఇష్టపడేవారు 44 శాతం అయ్యారు. దళితులపై పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ వాయుసేన దాడుల ప్రభావం ఏమీ లేదని చెప్పవచ్చు.

లోక్ నీతి సియస్‌డి సర్వే ప్రకారం కాంగ్రెసు కన్నా బిజెపికి ఎక్కువ దళిత ఓట్లు లభించింది 2014లో మాత్రమే. 2014లో 24.5 శాతం దళితులు కాంగ్రెసుకు ఓటు వేశారు. కాంగ్రెసుకు కేవలం 19.3 శాతం మాత్రమే ఓటు వేశారు. కాని, ఈ సారి బిజెపికి బెడిసికొడుతోంది. దళితుల ఓట్లను చీల్చడానికి బిజెపి ప్రయత్నిస్తుంది. రిజర్వేషన్ వల్ల దళితుల్లో బలంగా ఉన్న కొన్ని కులాలకే లాభం కలిగిందని, మిగిలిన కులాలు నష్టపోయాయని ప్రచారం చేయడం ద్వారా అనేక ఉపకులాలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాని ఈ ఎత్తుగడ ఫలించే అవకాశం లేదు. బిజెపి అధికారంలో ఉంటే దళితులకు తీవ్రమైన నష్టం తప్పదన్న భావం భీమా కోరెగాంవ్ తర్వాత చాలా బలపడింది. బిజెపిలోని దళిత నేతలు, సావిత్రీ బాయి ఫూలే, ఉదిత్ రాజ్ కూడా పార్టీపై తిరుగుబాటు స్వరం వినిపించడానికి కారణమిదే. బిజెపిపై దళితులు ఆగ్రహంతో ఉన్నారన్నది నిజమే. కాని ఈ ఆగ్రహం వల్ల బిజెపికి ఎంత నష్టం కలుగుతుందన్నది అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. దళిత ఓట్లు కాంగ్రెస్, బియస్‌పి తదితర పార్టీల మధ్య చీలిపోకుండా ఉంటాయా? దళిత ఉపకులాల మధ్య ఎంత సమైక్యత ఉంది? ఈ ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి.

Dalits on the BJP are angry

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బిజెపిపై దళిత ధర్మాగ్రహం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.