సుప్రీం సముచిత నిర్ణయం

    అయోధ్య వివాద పరిష్కారానికి తాను నియమించిన మధ్యవర్తుల కమిటీ వ్యవధిని ఆగస్టు 15కి పొడిగిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం నాడు తీసుకున్న నిర్ణయం ప్రశంసించదగినది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గత మార్చి 8న ఈ కమిటీని నియమించినప్పుడు దానికి 8 వారాల గడువు ఇచ్చింది. అది మొన్న 8వ తేదీతో ముగిసిపోయింది. వాస్తవానికి ఈ రెండు మాసాల వ్యవధి రామజన్మభూమి బాబ్రీ మసీదు స్థల వివాదంలో చెప్పిన సాక్షాలు, […] The post సుప్రీం సముచిత నిర్ణయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

    అయోధ్య వివాద పరిష్కారానికి తాను నియమించిన మధ్యవర్తుల కమిటీ వ్యవధిని ఆగస్టు 15కి పొడిగిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం నాడు తీసుకున్న నిర్ణయం ప్రశంసించదగినది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గత మార్చి 8న ఈ కమిటీని నియమించినప్పుడు దానికి 8 వారాల గడువు ఇచ్చింది. అది మొన్న 8వ తేదీతో ముగిసిపోయింది. వాస్తవానికి ఈ రెండు మాసాల వ్యవధి రామజన్మభూమి బాబ్రీ మసీదు స్థల వివాదంలో చెప్పిన సాక్షాలు, చూపించిన ఆధారాలుగా పేర్కొం టూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన వేల పేజీల అనువాదాలను కేసులోని ముస్లిం పక్షాలు పరిశీలించడానికే సరిపోయిందని చెబుతున్నారు. సిపిసి (నేర శిక్షా స్మృతి) 89వ సెక్షన్ కింద సుప్రీంకోర్టు ఈ వివాదాన్ని మధ్యవర్తుల కమిటీకి అప్పగించింది.

కమిటీ మొన్న 8వ తేదీలోగా తుది నివేదిక ఇచ్చి ఉంటే ఏమయ్యేది అనే ప్రశ్న వేసుకున్నప్పుడు గుండెల్లో రైళ్లు పెరుగెత్తక మానవు. ఇంకా రెండు విడతల లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మిగిలి ఉన్న ఈ దశలో నివేదిక బహిర్గతమై ఉంటే అది రాజకీయ స్వప్రయోజనపరుల చేతుల్లో ఆయుధమై అల్లకల్ల్లోలానికి దారి తీసి ఉండేదని భయపడడం హేతువిరుద్ధం కాదు. అటువంటి స్థితి ఈ కీలక ప్రజాస్వామ్య సమరంలో ఓటర్లను ప్రభావితం చేసి జనాభిప్రాయాన్ని లోబర్చుకొని ఉండేది. అలాంటి ప్రమాదానికి అవకాశమివ్వకుండా అటు కమిటీ, ఇటు సుప్రీం ధర్మాసనం కూడా ఎంతో విజ్ఞతతో వ్యవహరించాయని భావించవలసి ఉన్నది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎఫ్‌ఎంఐ కలీఫుల్లా చైర్మన్‌గా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధినేత శ్రీశ్రీ రవి శంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచు సభ్యులుగా ఉన్న మధ్యవర్తుల కమిటీ తన చర్చల్లో ప్రగతి సాధించినట్టు సుప్రీంకోర్టుకు నివేదించిందని తెలిసింది.

ఆ మేరకు మొన్న 7వ తేదీన ప్రాథమిక నివేదిక అంటూ ఒక పత్రాన్ని ధర్మాసనానికి సమర్పించినట్టు సమాచారం. సగంలో వున్న మధ్యవర్తిత్వ ప్రక్రియను అర్థంతరంగా నిలిపివేయలేమని కమిటీకి మరి కొంత వ్యవధి ఇవ్వదలచామని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఇంతటి సున్నితం, వివాదాస్పదం అయిన సమస్యకు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం కనుగొనడానికి, వ్యతిరేక ధ్రువాలుగా ఉన్న రెండు వర్గాల మధ్య సమ్మతి సాధించడానికి చాలినంత సమయం కేటాయించడమే హితవైన పద్ధతి. 1992 డిసెంబర్ 6వ తేదీన హిందూ కర సేవకులు కూల్చివేసిన బాబ్రీ మసీదు స్థలం తమకు చెందాలంటే తమకంటూ రెండు మత వర్గాలు కోరుతున్న నేపథ్యంలో అయోధ్యలోని 2.77 ఎకరాల ఆ స్థలాన్ని మూడు భాగాలుగా చేసి హిందూ మహాసభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్‌లల్లా (బాల రాముడు) కి, సున్నీ వక్ఫ్‌బోర్డుకి, మరో హిందూ సంస్థ నిర్మోహి అఖాడాకు చెరి ఒక భాగాన్ని ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు 2010 సెప్టెంబర్ 10వ తేదీన తీర్పు చెప్పింది.

ఈ తీర్పును అఖిల భారత హిందూ మహాసభ, సున్నీ వక్ఫ్‌బోర్డు రెండూ సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. ఈ కేసులో ఏకీభావం దుర్లభంగా కనిపిస్తున్నప్పటికీ మధ్యవర్తిత్వ పరిష్కారం కోసం ప్రయత్నించడం అవసరమని భావిస్తున్నట్టు సుప్రీంకోర్టు కమిటీని నియమించినప్పుడే అభిప్రాయపడింది. అయితే అది వ్యర్థమనే భావన రామ్‌లల్లా తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వొకేటు వైద్యనాథన్, యుపి ప్రభుత్వ ప్రతినిధి తుషార్ మెహతా అన్నారు. మసీదు నిర్మాణానికి తగిన ప్రత్యామ్నాయ స్థలాన్ని వెతకడమొక్కటే జరగవలసి ఉన్నదని వైద్యనాథన్ తేల్చేశారు. సున్నీ వక్ఫ్‌బోర్డు తరపున హాజరైన న్యాయవాది రాజీవ్ ధావన్ మాత్రం మధ్యవర్తి పరిష్కార యత్నాన్ని సమర్థించారు. కరవమంటే కప్పకు విడవమంటే పాముకు కోపం అనే సామెత మాదిరిగా ఉన్న ఈ వ్యవహారం గాజు పాత్రవంటిది.

ఏనాటి అంశాన్నో తవ్వి జాతి తలకెత్తి వివాదాన్ని రేకెత్తించి వేలాది మంది దుర్మరణానికి కారణమైన రాజకీయ శక్తులు భారతీయ సహజీవన మూలాలను కాపాడాలనే మహత్తర ఆశయంతో పరిష్కారాన్ని కనుగొనడానికి బదులు ముందు ముందు మరిన్ని ప్రయోజనాలు పొందాలనే దుర్బుద్ధితో బంతిని కోర్టుల కోర్టులోకి తోశాయి. వాస్తవానికి సంబంధిత పార్టీలకు తప్ప నిత్యం జీవన సమస్యలతో సతమతమయ్యే దేశ ప్రజలకు ఈ కేసు మీద అంతగా ఆసక్తి ఉండదు. సుప్రీంకోర్టు కూడా ప్రజలను రెచ్చగొట్టే వారి బారి నుండి దేశాన్ని కాపాడాలనే మంచి ఉద్దేశంతో కేసును అతి జాగ్రత్తగా నిర్వహిస్తున్నట్టు అర్థమవుతున్నది. వాస్తవానికి ఈ లోక్‌సభ ఎన్నికలలో అయోధ్యను బలమైన ప్రచారాంశంగా చేసుకోవాలని బిజెపి, హిందూత్వ శక్తులు ఆశించాయి. వీలైతే కేంద్రం చేత ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయించి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నాయి. అవేవీ ఫలించకపోడం, ఈ ఎన్నికల సమయంలో మధ్యవర్తుల కమిటీ తుది నివేదిక రాకపోడం దేశానికెంతో మేలు చేశాయి.

SC extends time for mediation panel till August 15 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సుప్రీం సముచిత నిర్ణయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: