చిన్నారులకు సేంద్రియ దుస్తులు

  సేంద్రియ పదార్థాలకు ఇప్పడు విపరీతమైన ఆదరణ ఉంది. తినే పదార్థాలే కాకుండా వేసుకునే దుస్తులు ఇలాంటివే తయారుచేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది ఇద్దరమ్మాయిలకు. పర్యావరణ హితంగా రూపొందించే దుస్తులను తయారుచేయడం మొదలెట్టారు. కార్పొరేట్ ఉద్యోగాలను వదిలి సేంద్రియ బాట పట్టారు. ఈ దుస్తులు పిల్లలకి ప్రత్యేకం. ఇద్దరిలో ఒకరైన శ్వేతకి ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే…! ఈ రోజుల్లో పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రతి చిన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. వారికి పెట్టే ఆహారం, ఆడుకునే […] The post చిన్నారులకు సేంద్రియ దుస్తులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సేంద్రియ పదార్థాలకు ఇప్పడు విపరీతమైన ఆదరణ ఉంది. తినే పదార్థాలే కాకుండా వేసుకునే దుస్తులు ఇలాంటివే తయారుచేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది ఇద్దరమ్మాయిలకు. పర్యావరణ హితంగా రూపొందించే దుస్తులను తయారుచేయడం మొదలెట్టారు. కార్పొరేట్ ఉద్యోగాలను వదిలి సేంద్రియ బాట పట్టారు. ఈ దుస్తులు పిల్లలకి ప్రత్యేకం. ఇద్దరిలో ఒకరైన శ్వేతకి ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే…!

ఈ రోజుల్లో పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రతి చిన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. వారికి పెట్టే ఆహారం, ఆడుకునే బొమ్మలు… ఇలా దుస్తుల వరకూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక, మనదేశంలో పత్తి ఉత్పత్తి ఎక్కువ. ఇప్పుడు సేంద్రియ పత్తి సాగులోనూ మనమే ముందున్నాం. శ్వేతతో పనిచేసే ఒక సహోద్యోగిని కూతురికి దుస్తుల వల్ల అలర్జీ రావడం గమనించిందామె. పెద్దలతో పోలిస్తే చిన్నారుల చర్మ రంధ్రాలు తెరుచుకుని ఉంటాయట. వాటివల్ల ఇట్టే బ్యాక్టీరియా, ఇతర రసాయనాల ప్రభావం చర్మంపై పడుతుందనేది నిజం. ఆ సహోద్యోగిని కూతురి విషయంలో వైద్యులు అదే చెప్పారు. అది తెలిసిన శ్వేత చిన్నారులకు మేలు చేసే సేంద్రియ దుస్తులు తయారు చేయాలని నిర్ణయించుకుంది.

శ్వేత ఈ ఆలోచనను ఆచరణలో పెట్టడానికి ఉద్యోగం మానేసింది. అలా రెండేళ్ల క్రితం ‘వైట్ వాటర్ టెక్స్‌టైల్స్’ పేరుతో సంస్థను ప్రారంభించింది. దాని ద్వారా ఆర్గానిక్ దుస్తులను అందిస్తోంది. శ్వేత ఆలోచన నచ్చడంతో ఆమె చెల్లి అంకిత, గతంలో తనతో కలిసి పని చేసిన అవని దేశాయ్‌లు.. కూడా సంస్థలో భాగస్వాములయ్యారు. మొదట ఈ బృందం పత్తి పండించే రైతులను సేంద్రియంగా సాగు చేసేలా ప్రోత్సహించారు. ఆ తరువాత వారి వద్ద నుంచి నేరుగా పత్తిని కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. దుస్తులకు వేసే రంగులూ సహజమైనవే. దానికోసం వెజిటబుల్ కలర్స్‌ని తయారు చేసే యూనిట్‌ని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. వీటితో వస్త్రాలపై అందమైన చిత్రాలను వేయిస్తున్నారు. వాటిల్లో పౌరాణికాలు, ఇతిహాసాలు, జానపదాలను చాటి చెప్పే వంటివెన్నో ఉన్నాయి.

గుజరాత్, తమిళనాడు వంటి ప్రాంతాల్లో చేయితిరిగిన కళాకారుల్ని పిలిపించి ఈ చిత్రాల్ని వేయిస్తున్నారు. ప్రస్తుతం అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఆరేళ్ల పిల్లల వరకూ దుస్తులు, రుమాళ్లు, తువాళ్లు, టోపీలు, బెడ్స్.. ఇలా అవసరమైనవన్నీ వీరిదగ్గర అందుబాటులో ఉన్నాయి. శ్వేత బృందం అందించే ఈ దుస్తులు వందశాతం సేంద్రియమనీ, ఎలాంటి రసాయనాలు కలవలేదని సర్టిఫికెట్ కూడా ఉంది.

వీటిని తమ పిల్లలకు దుస్తులుగా వేసేందుకే కాకుండా బహుమతులుగా అందివ్వడానికి కూడా ఎంచుకుంటున్నారు. వైట్ వాటర్స్ నుంచి కేవలం దుస్తులతోపాటు బొమ్మలు, టీ షర్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఈ సంస్థకు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే వస్త్రాన్ని వృథా కానివ్వరు. ఒకవేళ మిగిలినా ఆ ముక్కలతో రకరకాల బొమ్మలు, గిఫ్ట్ ప్యాకింగ్ వస్త్రంగా తయారు చేస్తారు. దేశవ్యాప్తంగా ఈ సేవల్ని అందిస్తోంది శ్వేత బృందం.

Organic clothing Clean Cotton Fashion For Kids

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చిన్నారులకు సేంద్రియ దుస్తులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: