చెమ్మగిల్లు నయనమ్ము! మోహన్ రుషి ‘స్క్వేర్ వన్’

  రేపెంతో బాగుంటుందని ఆశపడ్డ అన్ని నమ్మకాలూ వమ్మవుతున్నప్పుడు జీవితం ‘స్వ్కేర్ వన్’ గానే అనుభ వంలోకి వస్తుంది. గ్రేట్ డిక్టేటర్‌లో చాప్లిన్ ప్రియురాలు హన్నా జైలు వెలుపలి జైలులో నిస్సత్తువకు లోనై కుప్ప కూలి నప్పుడు, చాప్లిన్ పాత్రధారి ‘హింకెల్’ వలె జీవితంపై ఆశను కలుగజేసే ఒక మంచిహృదయ స్పందన వినిపించన ప్పుడు, ‘స్వ్వేర్ వన్’లే మరల మరలా అనుభవంలోకి వస్తుంటాయి. మోహన్ రుషి ఇటీవలి కవితా సంపుటి ‘స్క్వేర్ వన్’. పుస్తకాన్ని ఒక ఆత్మీయుడు […] The post చెమ్మగిల్లు నయనమ్ము! మోహన్ రుషి ‘స్క్వేర్ వన్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రేపెంతో బాగుంటుందని ఆశపడ్డ అన్ని నమ్మకాలూ వమ్మవుతున్నప్పుడు జీవితం ‘స్వ్కేర్ వన్’ గానే అనుభ వంలోకి వస్తుంది. గ్రేట్ డిక్టేటర్‌లో చాప్లిన్ ప్రియురాలు హన్నా జైలు వెలుపలి జైలులో నిస్సత్తువకు లోనై కుప్ప కూలి నప్పుడు, చాప్లిన్ పాత్రధారి ‘హింకెల్’ వలె జీవితంపై ఆశను కలుగజేసే ఒక మంచిహృదయ స్పందన వినిపించన ప్పుడు, ‘స్వ్వేర్ వన్’లే మరల మరలా అనుభవంలోకి వస్తుంటాయి.

మోహన్ రుషి ఇటీవలి కవితా సంపుటి ‘స్క్వేర్ వన్’. పుస్తకాన్ని ఒక ఆత్మీయుడు చేతుల్లోకి తీసుకున్నాడు. కొన్ని కవితలను చదివి పుస్తకాన్ని ఒక్క క్షణం మూసాడు. ‘జీవితం మళ్లీ మొదటి కొచ్చింది’ అన్నాడు. ఆ గొంతులో పెయిన్ ఉంది. ఆ అభిప్రాయం చెప్పిన వ్యక్తి సాధారణ పాఠకుడు. అతని తక్షణ ప్రతిస్పందన కవిత్వం చేరవలసిన చోటికి చేరుతోంది అనేందుకు ఉదాహరణ.

‘స్పర్శ’ అనే తొలికవితే కవితలన్నిటికీ ఇండెక్స్. నగర జీవితంలో పొద్దున్నే బయట పడి…
‘మలినాల్లో మలినమై, కలుషితాల్లో కలుషితమై, మురికిలో మురికై, రెండు గోల్‌పోస్ట్‌ల మధ్యన తిరుగాడే బంతై, ఉక్కపోతల పనిస్థలం నుంచి అకస్మాత్తుగా గుర్తు తెచ్చుకున్న వాళ్లమై ఒక ఫోన్ కాల్ చేస్తే…’ వార్ధక్యపు జీర గొంతుకతో తల్లి అంటుంది, ‘అన్నం తిన్నవా?’. ప్రేమకూడా ఒక కొండ చరియే. విరిగి మీద పడుతుంది, ఒక్క మాటగా అంటాడు కవి. శబ్దం ద్వారా పాఠకుని ఎదను తాకే కవిత ‘స్పర్శ’.

ఇల్లు పనిస్థలం అనే రెండు పోస్ట్‌ల మధ్య, పనిస్థలం నుంచి ఇంటికి వెళ్లే మధ్యలో కొన్నిసార్లు మజిలీలుంటాయి. ఆ సమయాలెట్ల గడుస్తాయి? ‘ఆనందంలో విషాదంగా కల్సిపోవడం… కల్ హూ న హూల కల్తీగానం… ఈ పార్టిసిపేషన్‌ను అలమటింపు మేళంగా అభివర్ణిస్తాడు ‘మరియొక రాత్రి’ కవితలో. ఇది తన ఒక్కడి జీవితంలోని ప్రహసనమే కాదు కదా. తలుపులు తెరుస్తూ ఎదురుగా నిల్చున్న వందలూ, వేల స్త్రీమూర్తుల ఎదుట ‘మాయమూ కాలేక, మనిషివీ కాలేక, మాటలూ చేతకాక. నీకు మాత్రమే విన్పించే కేక’ను చదువరులం వింటాం.

‘వేసవి రాత్రి’. నిద్దుర పట్టదు. గ్రిల్స్‌లోంచి బయటకు చూస్తే జీవితం కండ్లెదుట కన్పిస్తది. ‘ఒకటే జీవితమని తెల్సీ రెండుగా బతుకుతున్నప్పుడు, రెండవ ప్రపంచంలో ఒంటిగా మిగులుతున్నప్పుడు, తడిని పూడ్చి తన్మయత్వం పొందుతున్నప్పుడు. నువ్వెవడివో తెలిసినా తెలియక, తెలియకా తెలిసి భ్రమిస్తున్నప్పుడు …’ గ్రిల్స్ గుండా చూస్తుంది జీవితం.

మానవ సంబంధాల్లో మనం చాలా దూరం ప్రయాణించామని ‘మందమైన జీవితం’ చెబుతుంది. చేయి చేయి కలపడం, మనిషిని తనివితీరా చూసి, తడిమి, మంచి చెడ్డలు మాట్లాడడం అనే అందమైన జీవితం వెనుకబడి పోయింది కదా. ‘సిగ్నల్స్ దగ్గర మొఖాలు చూసుకుంటం. మొబైల్ల మాట్లాడుకుంటం. ఫంక్షన్ల పక్కపక్కన కూసుంటం. వార్మ్ విషెస్ ఫేస్‌బుక్కుల ఏలాడేస్తం. కాంటాక్ట్ పోయింతర్వాత ప్రతిసారీ పాతఫోన్ పొయ్యిందనే క్యాజువల్ లీవ్‌కి అప్లయ్ చేస్తం…ఇనిపిచ్చిందాంట్ల సంగీతాన్ని, కనిపిచ్చినదాంట్ల జీవితాన్ని దేవులాడుకుంట సెర్చ్ కల్చరయినం. రోడ్డు అవతలి మనిషిని రోడ్డు ఇవతలికల్లే అల్లుకొని బై చెప్పుడు నేర్చినం. మనం, మస్తు నిక్లాయించినం’ అని తనమన నిస్సహాయ పరిస్థితిపై వ్యాఖ్యానం చేస్తడు.

‘స్మైల్ ప్లీజ్’ ఒక విషాదపు అంతర్‌ధ్వని. భిన్నాభిప్రాయాలుగల ఆత్మీయులు తాను చెప్పిందే నిజం అనే తీరున ఉంటే ఇవతల మనిషి ఏం గావాలె? ఏ ఒక్కరు మాత్రమే ఎలా నిజమవుతారని అర్ధం కాక ‘ఎద పిండే గానంతో, మది మండే పానంతో… తొవ్వని తొలిచి, తొలిచిన తొవ్వై, నేను మాత్రమే నేనైన ఒక్క నేనై. ఉండిపోతానిక, నా గుండెలో నేనొక శరణార్ధినై…’!

కుక్కపిల్లలూ, దేవుడూ చల్లని వారే! అనే కవితలో ‘ఎవరైనా వచ్చి ఈ రెండు కుక్కపిల్లలూ ఒక్కచోట ఉండగలిగే ప్రదేశానికి తీసుకుపోతే బాగుణ్ణు’ అనే వాక్యం కవిగా మోహన్ రుషి సౌందర్యాన్ని ప్రతిఫలిస్తుంది. ఈ కవిత చదవవలసినదే కానీ, ఉదహరించవలసినది కాదు. ఏ ఆనందమూ, ఏ వ్యాపకమూ, ఏ సాహిత్యమూ జీవితంపై కొత్త ఆశనివ్వదు. ఇవేవీ సామీప్యంలో మనిషి నుంచి మనిషిని తాకే పరిమళాన్ని వెదజల్లవు అని స్పష్టం చేస్తూ … కరుణకోసం, మనసు కోసం, మాటకోసం, మనిషి కోసం జీవితకాలం నిరీక్షించినా, ఆ కాలం వృధాకానిదే అంటాడు ‘వృధా అయిన కాలం సాక్షిగా…!’

‘జిందా తిలిస్మాత్’. ఈ కవితలో చివరాఖరి వాక్యం బతుకు బాధలకు సర్వరోగనివారిణి, ‘మన బతుక్కి ఎవ్వరూ బాధ్యులు కారు’ అనే ఎరుక. ఏఏ రోగాలకు అనే వైనాలు ఆ పై పంక్తుల్లో తెలుసుకోవచ్చు. నీళ్ల డ్రమ్మూ, ఫ్లోర్ క్లీనర్, నల్లా, … దండెం మీద దగాపడ్డ డ్రాయర్… బాల్కనీలో వస్తువులన్నిటినీ ప్రస్తావిస్తూ ‘నువ్వే కలుగులో దాక్కున్నావురా నీచ్, కమీన్, కుత్తే’ అంటాడు ‘తెలీదు’ అనే కవితలో. అర్ధవంతమైన శీర్షికకు ఈ కవిత ఉదాహరణ. ‘లైఫ్ ఈజ్ డ్యూటిఫుల్’ గొప్ప నిసృ్పహ కవిత. ‘ముఖ్యంగా నిన్ను నీవు అదిమి పెట్టుకోవాలి’ అనే వాక్యంతో మొదలయ్యే ఈ కవిత ‘ఒరిజినల్ ఫీలింగ్సన్నీ ఒజిమాండియాస్ సమాధిలో పాతిపెడ్తే. అప్పుడు కదా, బతుకు బాగుపడేదీ, రేపటికి లేచి కూర్చునేదీ’ అంటూ ముగుస్తుంది. ఒజిమాండియాస్ రారాజుగా జీవించిన వ్యక్తి.

కేవలం కాళ్లు, గుర్తించడానికి వీలు లేని ఇతర శరీర భాగాలు ఈజిప్ట్ ఎడారిలో చెల్లా చెదురై మిగిలాయి. ఒక శిథింలో తన గురించి తాను చెక్కించుకున్న భాగం ‘ నేనే గొప్ప రాజును. గొప్ప రాజులకు రాజును..’ మాత్రం కన్పిస్తుంది. సమకాలీనుల్లో తానెంత గొప్పవాడైతేనేం తరువాత తరాల చేష్టలవలన వర్తమానంలో తనెవరో తెలీదు. తనెవరో తెలుసుకునేందుకు ఎటువంటి ఆధారం మిగల్చని లోకం. షెల్లీ ఒజిమాండియాస్ సానెట్‌ను రాసాడు. రాబోయే కాలాలలో నిన్ను గుర్తుంచుకోవడం అనే పేరాశను అటుంచు, ‘రేపటికి లేచి కూర్చోవాలంటే…’ నిన్ను నీవు న్యూనత పరచుకోవాలి, నటించాలి అనే సమకాలీన సత్యాన్ని ‘ఒజిమాండియాస్ సమాధి’ ప్రస్తావనతో మోహన్‌రుషి ఆవిష్కరించారు.

‘కొందరిలో కొందరు’ కవిత ఆధునిక త్రిభంగము. మొదటి రెండు వాక్యాలలోని ప్రతిపాదనకు మూడవ వాక్యంలో స్పష్టత వస్తుంది. ఏ సిద్ధాంతము, సామాజిక విశ్వాస అవిశ్వాస ప్రస్తావనలు లేకుండా బహు సరళంగా సామాజిక శ్రేణుల గురించి చెప్పిన నాలుగు మూడవ వాక్యాలు… 1. బతుకు భయం లేదు వాళ్లకు 2. నరకం మీద బెంగ లేదు వాళ్లకు 3.మోక్షం మీద ప్రీతి లేదు వాళ్లకు 4. నిశ్శబ్దం మీద భయం లేదు వాళ్లకు. ఎవరు వీళ్లు? కవిత్వాన్ని ఆస్వాదించాల్సిందే.

‘నిత్య తృప్త బంద’ అంటాడు ఊరేగుతున్న విఠ్ఠలుని పురంధరుడు! కవి అరుదైన తృప్త హృదయాన్ని ‘సెల్ఫీ’లో చూడవచ్చు. ‘బాల్కనీలో ఉన్నా. బతుకులోని మాధుర్యాన్ని నెమరేస్తున్నా. గాలికి ఊగుతున్న పువ్వుల్నీ, రాలి పడుతున్న ఆకుల్నీ ఒకే ప్రేమతో చూస్తున్నా… ఈ కవిత చివరి వాక్యం ‘నన్ను నేను పిలుచుకుంటున్నా’లో సంబురం ఉంది. ‘ఆజ్ ఫిర్ జీనేకి తమన్నా’ కూడా అటువంటిదే. కారణాలు రోజువారీ జీవితంలో అద్భుతాలు. ‘దూరంగా ఉన్న మిత్రుడు రింగుమంటాడు. నవ్వించి ఏడ్పిస్తాడు. నిన్నటి అసంతృప్తులెంత అల్పమయినవో తెలియపరుస్తాడు. ఖాళీగా ఉన్న ఎదుటి ప్లాట్లో నవదంపతుల జంటొకటి ముసిముసి నవ్వుల్తో దిగుతుంది. వాళ్ల ఆనందంలోని తునకొకటి నీ మొహాన్ని ప్రేమగా సృ్పశిస్తుంది’. ఎనభైకి పైగా కవితలల్లో ఇటువంటి తునకలు కొన్ని ఇవ్వాళ్ల మళ్లీ జీవించాలనే ఇచ్ఛను కలిగిస్తాయి.

కానీ కాలం అట్ల గడుస్తదా ? బతుకులో ‘బొందికాలం’ ఎక్కువ శాతాన్ని ఆక్రమించిందాయె! ‘బాధగా ఉంటుంది. గోస కమ్ముకుంటుంది…మార్గ మధ్యంలో మాటలు మకిలి పూసుకుని వ్వెవ్వెవ్వె అని వెక్కిరిస్తాయి. పాములు పక్కనే తిరుగుతుంటాయి. రక్తం రంగు మార్చుకుని స్రవిస్తుంది. దిక్కు తోచనితనం ఒక్కటే ఆస్తిగా మిగులుతుంది…చెమ్మ గతం. చేవ నిజం. మన్నువడ. ఇది మాయదారికాలం’ అనే నిసృ్పహ ఆవరిస్తుంది.వృత్తమైనా, చతురస్రమైనా మొదలైన బిందువు వద్దకే వచ్చి పూర్తవుతుంది. ఎన్నో అలమటింపుల అనంతరం ఆశను చిగురించు కుంటూ మొదలు పెట్టిన జీవితం పదే పదే మొదలైన చోటికే వచ్చినట్లు తోస్తుంది. ఎప్పుడు? ‘స్క్వేర్ వన్’లో కొన్ని వచనాలు. ‘ఎదురయ్యే వాళ్లలో ఒక్కరూ నీ మనిషి కారు. ఎన్నిసార్లని వెనక్కి తిరిగి చూస్తావు? కళ్లు నులుముకున్నంత మాత్రాన కాంతి ప్రస్ఫుటం కాదు. దేవతలు అందుబాటులో ఉండరు. మనుషులు మిగిలి లేరు…చివరి నిశ్శబ్దం కూడా మొదట్లోనే తెలిసి. ఇక ముందుకు సాగడమూ వెనక్కు రావడమూ బాధ కలగలిసి. ఒక చావు డప్పుల స్మశానాన్ని సతత హరణ్యంగా భ్రమసి’.

రేపెంతో బాగుంటుందని ఆశపడ్డ అన్ని నమ్మకాలూ వమ్మవుతున్నప్పుడు జీవితం ‘స్వ్కేర్ వన్’ గానే అనుభవంలోకి వస్తుంది. గ్రేట్ డిక్టేటర్‌లో చాప్లిన్ ప్రియురాలు హన్నా జైలు వెలుపలి జైలులో నిస్సత్తువకు లోనై కుప్పకూలినప్పుడు, చాప్లిన్ పాత్రధారి ‘హింకెల్’ వలె జీవితంపై ఆశను కలుగజేసే ఒక మంచిహృదయ స్పందన వినిపించనప్పుడు, ‘స్వ్వేర్ వన్’లే మరల మరలా అనుభవంలోకి వస్తుంటాయి. ‘ నేను తెల్ల నువ్వు నల్ల, నేను మగ నీవు ఆడ, నేను ఉత్తరం నువ్వు దక్షిణం వంటి కనిపించని గీతలు మనిషిని మంటల్లోకి నెట్టుతుంటాయి. ఒకరు మరొకరి ఆనందాన్ని కోరుకునే వ్యక్తులు, ఒకరు మరొకరిని ద్వేషించని వ్యక్తులు, కరిగి ఆవిరైపోతున్న సమాజంలో ముందుకు నడిచినా వెనక్కి నడిచినా ఫరక్‌పడదు.

మోహన్‌రుషి కవితా సంపుటి చదవడం పూర్తి చేసాక పఠాభి జీవితాన్ని మలుపు తిప్పిన ఒక సందర్భం గుర్తొచ్చింది. శాంతి నికేతన్‌లో సాహిత్య విద్యార్ది పఠాభి. ఒక రోజు కలకత్తా నగరంలో తాను బస చేసిన గదినుంచి వీధుల్లోని రాత్రి దృశ్యాన్ని చూసారు. ఇరుకు, మురికి సందుల్లో, దుర్భర జీవితాలు. నిస్తేజపు చలనాలు. నేలపై కాలుష్యపు ధూళిలో చంద్రుడు రసలుబ్ధుడై కన్పిస్తాడు. భావకవిత్వానికి, గురుదేవుని ఆదర్శాలకు, తాను చదువుతున్న సాహిత్యానికి, తాను చూస్తున్న వాస్తవ ప్రపంచంతో సంబద్ధత లేదన్పించింది పఠాభికి. శాంతినికేతన్‌కు స్వస్తి చెబుతాడు. పఠాభిని భావకవిత్వం నుంచి వాస్తవ ప్రపంచంలోకి తెచ్చాయి నగరజీవితపు వెలుగు నీడలు. ఆయన ఉపరితలం నుంచి నగరజీవితాన్ని అనుభూతి చెందారు. పల్లెనుంచి వచ్చి నగరంలో భాగమైన సాదాసీదా మనిషి హృదయస్పందనలెలా ఉంటాయి? స్థలకాలాదులు వేరైనా మోహన్ రుషి ‘స్వ్కేర్ వన్’ అందుకు ఒక ఉదాహరణ. ఇందులో పెయిన్ పోయిట్రీ ఉంది. కానీ, పెయిన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. ఇందులో ఆనందాలూ ఉన్నాయి. అవి నల్లటి మబ్బులకు వెండి అంచులు.

                                                                                                                    – పున్నా కృష్ణమూర్తి

Mohan Rushi write Square One called book

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చెమ్మగిల్లు నయనమ్ము! మోహన్ రుషి ‘స్క్వేర్ వన్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: