అపారమైన ప్రేమ, అనంతమైన విశ్వాసం, అరుదైన నవల ‘అమ్మ’

  అమ్మ అనే పదంలోనే అనంతమైన అవధులు లేని ప్రేమ ఉంది. అమ్మ ఒంటరి కాదు అమ్మ ఒక సమూహం. కొన్ని వేల కోట్ల కోట్ల పాలపుంతలు శోధించవచ్చు కానీ అమ్మను అర్థం చేసుకోవడం, అమ్మ ప్రేమను పరిశోధించడం ఎవరి తరం కాదు. తెలుగు సాహిత్యంలో నాటి నుండి నేటి వరకు వస్తున్న ఏ ప్రక్రియలోనైనా అమ్మను స్మరించకుండా రాయని సాహిత్యవేత్తలు లేరు. 13వ శతాబ్దంలో పాల్కురికి సోమనాథుడు రచించిన ‘బసవ పురాణం’ అనే రచన తెలుగు […] The post అపారమైన ప్రేమ, అనంతమైన విశ్వాసం, అరుదైన నవల ‘అమ్మ’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమ్మ అనే పదంలోనే అనంతమైన అవధులు లేని ప్రేమ ఉంది. అమ్మ ఒంటరి కాదు అమ్మ ఒక సమూహం. కొన్ని వేల కోట్ల కోట్ల పాలపుంతలు శోధించవచ్చు కానీ అమ్మను అర్థం చేసుకోవడం, అమ్మ ప్రేమను పరిశోధించడం ఎవరి తరం కాదు. తెలుగు సాహిత్యంలో నాటి నుండి నేటి వరకు వస్తున్న ఏ ప్రక్రియలోనైనా అమ్మను స్మరించకుండా రాయని సాహిత్యవేత్తలు లేరు. 13వ శతాబ్దంలో పాల్కురికి సోమనాథుడు రచించిన ‘బసవ పురాణం’ అనే రచన తెలుగు సాహిత్యంలో అమ్మను ఆవిష్కరించిన గొప్ప రచన. బెజ్జ మహాదేవి తెలుగు నేల మీద పుట్టిన అమ్మ ‘శివుడికి అందరూ ఉన్నారు కానీ అమ్మ లేదేంటి?’ అనే సందేహం వచ్చి శివుడిని పిల్లాడిగా చేసి పెంచుతుంది. ‘అమ్మలగన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ’ ‘కడుపాఱడి పుచ్చిన యమ్మ’ అని పోతన గారంటే, అమ్మా అని పిలవని నోరు ‘కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటలాంటిదేనని బద్దెన రాసుకున్నారు. అమ్మ అని పిలిపించు కోవడమే మహా భాగ్యం దీని అర్థం.

నాటి పురాణాల నుండి నేటి అభ్యుదయ సాహిత్యం వరకు అమ్మ లేని రచన లేదు. ముఖ్యంగా ఇరవయ్యో శతాబ్దంలో వచ్చిన భావకవిత్వంలో అమ్మపై ఎక్కువగా కవిత్వం వచ్చిందని తెలుస్తోంది. రాయప్రోలు గారు ప్రతి ఒక్కరినీ తీర్చి దిద్దేది అమ్మేనని చాటితే, అలాంటి అమ్మను కొడుకులు పట్టించుకోవడం లేదని జాషువా గారు ఆవేదన చెందుతూ రచనలు చేశారు. నాడు అమ్మ గొప్పదనం, ప్రేమ గురించి రాసిన సాహిత్యవేత్తలు నేడు అదే అమ్మను నిర్లక్ష్యం చేస్తున్నారని, వృద్ధాప్యంలో హీనంగా చూస్తున్నారని ఎక్కువగా రాస్తున్నారు. సాహిత్యవేత్తల పనే అది జరిగే విషయాలను రికార్డు చేసి భావితరాలకు అందించడమే. ప్రపంచ సాహిత్యంలో కూడా ప్రతి సాహిత్యవేత్త అమ్మను కేంద్రంగా చేసుకొని ఎన్నో రచనలు చేశారు. ఎన్ని రచనలు వచ్చినప్పటికీ ప్రపంచ సాహిత్య జగత్తులో ఒక వెలుగు వెలుగుతున్న నవలే అమ్మ.

మాక్సిం గోర్కీ గా ప్రసిద్ధి చెందిన వారి అసలు పేరు అలెక్సీ మాక్సిమోవిక్ పెష్కోవ్ . గోర్కీ మార్చి 28, 1868న రష్యాలోని నిజ్ని నోవోగార్డ్‌లో జన్మించారు. తండ్రి పేరును తన పేరులో కలుపుకొని మాక్సిం గోర్కీగా ప్రాచుర్యంలోకి వచ్చారు. ఈయన రష్యాకు చెందిన రచయిత. ‘సోషల్ రియలిజం‘ సాహిత్య విధానము మరియు రాజకీయ ఉద్యమ స్థాపకుడు. గోర్కీ మూడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నారు. చెప్పులు కుట్టే షాపులో, తాపీ పని, ఓడలో వంట కుర్రాడిగా తన బాల్యాన్ని దీనంగా గడిపారు. తర్వాత రొట్టెల దుకాణంలో, నాటక కంపెనీలో పనిచేశారు. వీధుల్లో తిరిగి పండ్లు అమ్మారు. గుమాస్తాగా, రైల్వే కర్మాగారంలో కూలీగా పనిచేసి అడుగడుగునా కష్టాలు అధిగమిస్తూ పైకి వచ్చిన వారు గోర్కి.

అమెరికాలోని అడిరాన్ డాక్ పర్వతశ్రేణిలో ప్రవాస జీవితం గడుపుతూ, అమ్మ నవల రాశారు గోర్కీ. మొదట ‘అధోజనం‘ ‘మధ్య తరగతులు‘ అన్న నాటకాలుగా వచ్చి తర్వాత ఒక పత్రికలో ప్రచురణ పొంది 1906లో తొలిసారి నవలగా వెలువడింది. అమ్మ నవలను క్రొవ్విడి లింగరాజు తెలుగులోకి అనువదించారు. 1905వ సంవత్సరంలో రష్యాలో జారు ప్రభుత్వం ఉన్నది. ఆ కాలంలోనే రష్యా విప్లవం వచ్చింది. దోపిడీ వర్గాన్ని, కార్మికుల హక్కులను ప్రస్తావిస్తూ సాగిన నవలే అమ్మ. పావెల్ వ్లాసోవ్ నవలలో ప్రధాన పాత్ర. పావెల్ మొదట బాగా తాగేవాడు దానికి కారణం పని చేసి అలసిపోవడమేనని నవలలో కనపడుతుంది. దీని ఉద్దేశం కార్మికులు పగలంతా కష్టం చేసి ఆ నొప్పులను భరించలేరని అందుకే తాగడం అలవాటు అవుతుందని చెప్పే ప్రయత్నం.

నీలోవ్నా పావెల్ తల్లి. పావెల్ తాగి వచ్చినప్పుడు మీ నాన్న కూడా తాగి నన్ని బాదేవారు నువ్వు కూడా తాగుతున్నావని బాధపడుతుంది. పిల్లవాడు కష్టపడుతున్నాడు కాస్త రిలీఫ్ కోసం తాగితే తప్పులేదని తనను తాను సమాధాన పరచుకుంటుంది. ఆ తర్వాత పావెల్ తాగడం మానేస్తాడు. ప్రభుత్వం నిషేధించిన పుస్తకాలు చదవడం మొదలు పెడతాడు. ఆ సమయంలో పావెల్ బాగా బక్కచిక్కి పోతాడు. తల్లి కొడుకు మారినందుకు సంతోషిస్తుంది కానీ పుస్తకాలు ఎందుకంత రహస్యంగా చదువుతున్నాడు. ఎందుకిలా అయిపోయాడని బాధపడుతుంది. ఆ సందర్భంలోనే పావెల్ తల్లిని కూర్చ పెట్టుకొని దోపిడీ వ్యవస్థ మనల్ని దోచుకుంటోందని మన భవిష్యత్ తరం మనలాగే ఉండకూడదని చెప్తాడు. మనకు జ్ఞానం వస్తే వారు దోచుకోలేరు కనుక ఈ పుస్తకాలు నిషేధించారని అమ్మకు వివరిస్తాడు. కొడుకు చెప్పే విషయాలు పూర్తిగా అర్థం కాకపోయినా కొడుకు ఏది చేసిన మంచే చేస్తాడని నమ్ముతుంది. అక్కడి నుండి ప్రతి నిమిషం కొడుకు వెంటే ఉండి పావెల్ చేసే కార్మిక ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

పావెల్ తల్లి.., భర్త చేత హింసించబడి ఉంటుంది. తన బాల్యం కూడా చాలా కష్టాలతో గడిపి ఉంటుంది. వాటితో పోల్చుకుంటే ఇప్పుడు గడిపే బ్రతుకే బాగుంది. నలుగురి కోసం బిడ్డ కష్టపడుతుంటే ఆ కష్టంలో నేనూ ఉన్నానని సంతృప్తి చెందుతుంది. పుస్తకాలు, కరపత్రాలు తాను కూడా చదవాలనే కోరికతో కళ్ళు సరిగా కనపడకపోయినా చదవడం నేర్చుకుంటుంది. పావెల్ జైలులో ఉన్నప్పుడు కరపత్రాలను ఫ్యాక్టరీలోకి తీసుకు వెళ్తుంది. రకరకాల వేషాలు వేసి కరపత్రాలను పంచి పెడుతుంది. జైలులో ఉన్న కొడుకుకు బయట జరిగే సమాచారాన్ని చేరవేస్తుంది. పావెల్ ఇంట్లో సమావేశాలు జరుగుతూ ఉండేవి వాటిని శ్రద్ధగా వినడమే కాకుండా ఎవరు ఏది మాట్లాడుతున్నారు అందులో ఉన్న వాస్తవమెంత అని ఆలోచించేది. పూర్తిగా అర్థం కాకపోయినా వారు ప్రపంచాన్ని మార్చబోతున్నారని అనుకునేది. పావెల్ పై అపారమైన ప్రేమ, అనంతమైన విశ్వాసమే కొడుకు చెప్పేది తూచ తప్పకుండా పాటించేది.

పావెల్ కి మాత్రమే తల్లిగా కాకుండా కార్మిక ఉద్యమంలో కొడుకుతో పాటు పనిచేసి ప్రతి ఒక్కరిని తన పిల్లలుగా భావించేది అందరిని హత్తుకునేది. అందరి బాధలను తన బాధలుగా అనుకోని అందరి గురించి ఆలోచించేది. అప్పుడప్పుడు నా భర్త చనిపోయాడు నా కొడుకేమో ఇలా ఉద్యమం చేస్తున్నాడని ఆలోచిస్తూ కొడుకుకు ఏమైనా అయితుందేమోనని బాధ పడేది. పావెల్ మాత్రం తల్లికి అన్ని విషయాలు చెప్పేవాడు. తాను జైలుకు వెళ్ళే సమయం కూడా వస్తుందని ముందే తల్లికి చెప్పేవాడు. అలా ప్రతి విషయంలో తల్లిని గట్టి పరుస్తాడు. నవలలో తల్లి, కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని, ఒకే రకమైన అభిప్రాయాలను గమనించవచ్చు. ఉదాహరణకు పావెల్ జైలు నుండి తప్పించుకు వస్తాడని నవలలోని ఒక పాత్ర అంటే లేదు నా బిడ్డ అలాంటి పనులు చేయడని చెప్తుంది. ఆ తర్వాత జైలులో పావెల్ ని కలిసినప్పుడు అదే అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చుతాడు. సాధారణంగా ఎక్కువ శాతం తల్లులు తమ పిల్లలు ఉద్యమాలు చేయడాన్ని వ్యతిరేకిస్తారు. పావెల్ తల్లి ఉద్యమాలు చేయకూడదని బాధపడదు కాని బిడ్డకు ఏమైనా జరుగుందేమోనని తనలో తాను బాధ పడేది ఆ తర్వాత దానిని కూడా అధిగమిస్తుంది.

మే 1వ తేదినా పావెల్ ఉద్యమ జండాను చేత పట్టుకొని అశేషమైన జనవాహిని మధ్యలో నడుస్తాడు. నినాదాలు చేస్తాడు. ప్రజలకు దోపిడీ వ్యవస్థ గురించి అక్కడున్న ప్రభుత్వం తమని ఎలా దోచుకుంటుందో చెప్తాడు. ఆ సందర్భంలో పావెల్ ని అశేషమైన జనం అనుసరించడం తల్లికి అత్యంత సంతృప్తిని ఇస్తుంది. పావెల్ జైలుకి వెళ్ళినా కొడుకు ఒంటరివాడు కాదని తనతో పాటు చాలామంది ఉన్నారనే ధైర్యాన్ని కూడగట్టుకుంటుంది. కొడుకును మళ్ళీ అరెస్ట్ చేసినా ఏమాత్రం చెక్కు చెదరకుండా జైలులో ఉన్న కొడుకు చెప్పినట్టు చేసేది. బయట ఉన్న ఉద్యమకారులతో చురుకుగా పనిచేసిది.

విచారణ సందర్భంలో పావెల్ ఉదాహరించిన ఉపన్యాసంలోని అంశాలు ఇప్పటికీ కూడా మారలేదు ఇంకా దిగజారిపోయాయి. ప్రభుత్వం దోపిడీ వర్గానికే వంతపాడుతోంది. కార్మికుల కష్టాలు ఏమాత్రం మెరుగుపడకపోగా దారుణంగా మారిపోయింది. నవలలో పెద్దగా బూతులు కనపడలేదు. మూడు చోట్ల మాత్రం లంజముండా అనే పదాన్ని వాడినారు.

పాత్రలు ఎక్కువగా ఉండటంతో అన్ని పాత్రలను గుర్తుపెట్టుకోవడం కష్టమే. ఈ నవలను నాటకీకరణ చేశారు ప్రజాకవి, రచయిత వడ్లమూడి నాగేశ్వరరావు. నవల చాలా పెద్ది అయినప్పటికీ నాటకంగా మార్చడమంటే సాహసమే. ఇదే నవల సినిమా రూపంలో కూడా ఉన్నది. పావెల్ రెండో సారి జైలులో ఉన్నప్పుడు నవల సాగిన విధానం కాస్త క్లంజిగా అనిపించింది. విస్తారంగా సాగిన నవల కనుక సన్నివేశాలను చాలా వివరంగా ఇవ్వడం జరిగింది. ఉద్యమం, పోరాటంతోనే దోపిడీ వ్యవస్థను ప్రశ్నించాలని కార్మికులకు చెప్తుంది ఈ నవల. ఈ నవలలో అన్ని రకాల ప్రతినిధులు కనపడ్డారు. అమ్మ నీలోవ్నా, రైతు రీబిన్, పాతతరం వారు. పావెల్ మరియు తన స్నేహితులు నేటి తరానికి చెందినవారు. యువ విప్లవకారుల్లో మహిళలు గణనీయంగా కనపడతారు. తద్వారా పురుషులతో మహిళలు ఏమాత్రం తీసిపోరని నిరూపించారు. ఉదాహరణకు ఏ విషయంలోనైనా చురుకుగా ఆలోచించే సోఫియా, పావెల్ స్నేహితురాళ్లు నటాషా, టాన్యా పురుషులకు తీసిపోని విధంగా పనిచేస్తారు.

ప్రపంచ కార్మికులంతా ఒక తల్లి బిడ్డలేనని మా విశ్వాసమే తల్లి అని పావెల్ సన్నిహితుడు ఆన్‌ద్రేరు సహోర్క చెప్తాడు. ఇలాంటి పాత్రలు చాలా కనపడతాయి. నిరుత్సాహం, నిరాశ, నిస్ప్రూహ లాంటివి నవలలో కనపడవు. ఉత్తేజం, పోరాటం, దోపిడీ వ్యవస్థపై దాడి, చైతన్యం, నాస్తిక వాదం, సమిష్టి కృషి, నాయకత్వం, సత్యాలను నిక్కచ్చిగా చెప్పే సంభాషణలు, ఉపన్యాసాలు కనపడ్డాయి. వస్తు పరంగా ప్రపంచ సాహిత్యంలో అత్యంత అరుదైన నవల. రచయిత ప్రతి పాత్ర నుండి ఎన్నో విషయాలను సమాజానికి అందించారు. ఇన్ని సంవత్సరాలు దాటిన నవల యొక్క ప్రాముఖ్యత తగ్గిపోకుండా ఉండటానికి కారణం నవలలో చర్చించిన సమస్యలు ఇప్పటికీ కూడా ఉండటమే. నాకు తెలిసి మనిషి బ్రతికి ఉన్నంత వరకు ఈ నవల ప్రాచుర్యంలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ నవల మరుగున పడుతుందో అప్పుడు సమాజం మారిపోయిందని అర్థం.

                                                                                                                                  – అఖిలాశ
Article about Rare novel Amma

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అపారమైన ప్రేమ, అనంతమైన విశ్వాసం, అరుదైన నవల ‘అమ్మ’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: