మట్టిలో మాణిక్యం ‘మనిషొక పద్యం’

  మట్టిలోంచి పుట్టి, మట్టి మనసు ఎరిగిన కవి నేడు మనిషొక పద్యమయ్యాడు. తన జీవితంలోని వెతలను, వ్యథలను కవితలుగా మలిచి కవితాతరువయ్యాడు. చెమటను తన అక్షరాల్లో నింపి శ్రమకవిత్వమయ్యాడు. ఒక్కొక్క మెట్టెక్కి జీవితపు జెండాను ఎగిరేసినట్లు, సాహిత్య శిఖరంపై పద్యమై కవితా పతాకాన్ని రెపరెపలాడించాడు. అడుగడుగునా కనబడే ప్రతి జీవితాన్ని తన కావ్య వస్తువుగా చేసుకున్నాడు. వారి అడుగుల వెంట మన చూపులు ప్రసరిస్తే ఆ అక్షరాల వాస్తవికత మన గుండెలకు హత్తుకుంటాయి. అమ్మయినా, నాన్నయినా, […] The post మట్టిలో మాణిక్యం ‘మనిషొక పద్యం’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మట్టిలోంచి పుట్టి, మట్టి మనసు ఎరిగిన కవి నేడు మనిషొక పద్యమయ్యాడు. తన జీవితంలోని వెతలను, వ్యథలను కవితలుగా మలిచి కవితాతరువయ్యాడు. చెమటను తన అక్షరాల్లో నింపి శ్రమకవిత్వమయ్యాడు. ఒక్కొక్క మెట్టెక్కి జీవితపు జెండాను ఎగిరేసినట్లు, సాహిత్య శిఖరంపై పద్యమై కవితా పతాకాన్ని రెపరెపలాడించాడు. అడుగడుగునా కనబడే ప్రతి జీవితాన్ని తన కావ్య వస్తువుగా చేసుకున్నాడు. వారి అడుగుల వెంట మన చూపులు ప్రసరిస్తే ఆ అక్షరాల వాస్తవికత మన గుండెలకు హత్తుకుంటాయి. అమ్మయినా, నాన్నయినా, గురువయినా, తనకు అండ గా నిలిచిన స్నేహితుడైనా, తన బతుకు మొక్క పెరగడానికి ఊపిరి పోసిన ఏ వృత్తయినా తన కవితలో ఇమిడిపోవలసిందే. అలా వాస్తవిక కవిత్వాన్ని మనిషొక పద్యంతో మన ముందుంచుతున్నారు ప్రముఖ కవి మెట్టా నాగేశ్వర రావు. మొదటగా రుబాయీలు, నానీలు రాసారు. ఇప్పుడిలా వచన కవిత్వంతో ముందుకొస్తున్నారు. మట్టివాసన మరువని మనిషి కాబట్టి కవిత్వంలో పల్లెజీవితం నిండా పరుచుకుంటుంది.

కవిత్వమంటే ఏమిటో తన మొదటి కవిత ‘అల్లిక‘లో చెబుతూ బాల్యం ఎంత కమ్మగా ఉంటుం దో, అమ్మ ఎంత ఆత్మీయంగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుందని కవిత్వానికి నిర్వచనం చెబు తూ ‘కవిత్వానికి హద్దు అనంత విశ్వం‘ అంటూ తన కవిత్వంలోకి తీసుకెళ్తారు.

తన జీవితంలో ఎదురైన ఏ విషయాన్నీ, సంఘటననూ, వస్తువునూ వదల్లేదు. చాకిరేవు, ఇస్త్రీ పెట్టె, పేపరు బచ్చా, సైకిల్ గీతం, ఎద్దు, పల్లె మంగలి, మేకు, సర్కస్ పిల్ల, బోడి మేక, కన్నాపురం సంత, డప్పుతాత, తూము గొడ్డలి, చాకలవ్వ, గాజుల రాజు ఇలా పల్లెలో కనబడే ప్రతి శ్రమజీవిని తమ కవిత్వంలోకి ఒంపుకుంటారు.
చివర్లో అసలు వాక్యమంటే ఎలా ఉండాలో ‘అలాంటి వాక్యం కోసం‘ ఎంతగా పరితపిస్తున్నాడో చెబుతారు.
అసలు వాక్యమంటే
భూమి లోపల తపస్సు చేసి చేసి
మొలకై బయటికొచ్చిన విత్తనంలా ఉండాలి అంటారు. ఈ కవితను ప్రముఖ కవి, అనువాదకులు అయిన శ్రీ సీ.వీ.సురేశ్ గారు ‘For That Sentence‘ అనే శీర్షికతో అనువదించారు. అది పుస్తకం చివర్లో మెరుస్తుంది.

తన అనుభవంలోకి వచ్చిన ప్రతి అంశాన్ని కవిత్వంగా చేశారు. అది మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, చెట్టు పుట్టా కావచ్చు ఏదైనా సరే తన జీవన గమనాన్ని సరైన దారిలో నడవడానికి తోడ్పడినవే అంటారు. తన జీవితాన్ని కవిత్వంగా మలిచి, శ్రమజీవుల చెమటని కవిత్వీకరించి తాత్వికంగా వ్యక్తపరుస్తూనే, మానవీయం కోణంలో, సామాజిక బాధ్యతతో, విశ్వజనీనంగా మలిచారు. భాషలో సరళతరం, భావంలో సులభ గ్రాహ్యం, శిల్పంలో స్వేచ్ఛ కనబడుతుంది. ఊహకందని దృశ్యాలు, కఠిన పదజాలం కనబడవు. తన మనసు ఎలా స్పందించిందో కవితా నడక కూడా అలాగే సాగుతుంది. శిల్పం విషయంలో కాస్త జాగ్రత్త పాటించి ఉంటే కవిత్వం సంక్షిప్తమై మరింత ఆకట్టుకునేది. అయినా మట్టిలోకి నీరు ఇంకినట్లు వారి కవిత్వమూ మెల్లిమెల్లిగా మనసును చేరుకుంటుంది. మెత్తగా చెబుతూనే మంచిని బోధిస్తారు. మాములుగా చెబుతూనే ధర్మాన్ని ఆదేశిస్తారు. తాను పాటిస్తూ, ఇతరులను పాటించమంటారు. కాలువ దాటడానికి వంతెనలా, వెల్లువలో కొట్టుకుపోయే వాడికి చేతిలా వీరి వాక్యం ఉన్నట్లే ఈ ‘మనిషొక పద్యం‘ కూడా సాహిత్య దేహంపై పుట్టుమచ్చలా మిగలాలని ఆశిద్దాం.

                                                                                                                            – పుట్టి గిరిధర్
Meta Nageswara Rao written by Mattilo Manikyam poem

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మట్టిలో మాణిక్యం ‘మనిషొక పద్యం’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: