సీతారాముల జానపదాలు

  జానపదులనగా పల్లె ప్రాంతంలో నివసించేవారు. వారి పాటలే జానపద గేయాలు. ఈ గేయాలు ఒకరి నోటి నుండి మరొకరి నోటికి వెంటనే ప్రాకిపోతాయి. ఎన్ని సంవత్సరాలైనా రాతలేని ప్రతుల్లా నిలిచిపోతాయి. ఆలంబనముననుసరించి విభజిస్తే పిల్లల, స్త్రీల, పౌరాణిక, శృంగార, హాస్య మొదలగు పదకొండు భేదాలుగా వీటిని విభజించవచ్చును. జానపద గేయాలలో తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రసిద్ధ పౌరాణిక గాథలన్నిటినీ చూడగలం. ఈ గాథలపై ప్రజలభక్తి చెప్పరానిది. వేదాల తర్వాత మనకు రామాయణ, భారత, భాగవతాలే మహనీయాలు. […] The post సీతారాముల జానపదాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జానపదులనగా పల్లె ప్రాంతంలో నివసించేవారు. వారి పాటలే జానపద గేయాలు. ఈ గేయాలు ఒకరి నోటి నుండి మరొకరి నోటికి వెంటనే ప్రాకిపోతాయి. ఎన్ని సంవత్సరాలైనా రాతలేని ప్రతుల్లా నిలిచిపోతాయి. ఆలంబనముననుసరించి విభజిస్తే పిల్లల, స్త్రీల, పౌరాణిక, శృంగార, హాస్య మొదలగు పదకొండు భేదాలుగా వీటిని విభజించవచ్చును.

జానపద గేయాలలో తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రసిద్ధ పౌరాణిక గాథలన్నిటినీ చూడగలం. ఈ గాథలపై ప్రజలభక్తి చెప్పరానిది. వేదాల తర్వాత మనకు రామాయణ, భారత, భాగవతాలే మహనీయాలు. రాముడు, కృష్ణుడు, ధర్మరాజు భారతీయులకు పూజ్యులు. సుఖానికి, దుఃఖానికి మనకు రామ నామ స్మరణం తప్ప వేరేమున్నది.

రామాయణ సంబంధాల గేయాలు జానపదులలో లెక్క లేనన్ని కలవు. వాల్మీకి మహర్షి ఎన్ని సంఘటనలు రాసారో జానపదులు కూడా అన్ని గేయాలను పాడుకొంటారు. జానపదులకు తెలిసినంత శ్రీరామ చరిత్ర పండితులకు తెలియదేమో!
శ్రీరామ చంద్రుడు తెలుగు వారికి కన్నతండ్రి. సీతమ్మ కన్నతల్లి. వీరిపై పాటలనేకం. శ్రీరాముల ఉగ్గుపాల నుండి సీతమ్మ జననం నుండి అనేక గేయాలను జానపదులు వినిపిస్తారు.

లాలి మాధవుడలాలీ / గోవిందలాలి అచ్యుతుడలాలీ / లాలకేశవుడలాలీ / హరిహరిబాల రఘురామరాలీ, / ఇలా ఎన్నో పాలిపాటలు జోల పాటలు కలవు.
రామలాలీ మేఘ శ్యామలాలీ / తామరస నయన దశరథ తనయా లాలీ.
పిల్లలను తొట్టెలో పెట్టడం మనకు ప్రాచీనం నుండి ఆచారం. జానపదులు శ్రీ రాములను కూడా తొట్టెలో వేసి అనేక రకాలుగా వినిపింస్తారు. సీతమ్మను
లాలి బంగారు బొమ్మ / లాలి మాయమ్మ / లాలి ముద్దుల గుమ్మ /లాలి సీతమ్మ.
వెదకీ పన్నీరు జల్లురే / శ్రీరాములపై / వెదకీ పన్నీరు జల్లురే / వేణుగోపాలునిపై / మగువలందరు గూడి / మన సీతారాములపై / ॥వెద॥
సంపెంగ తైలమంటి / సఖియాలందరు గూడి / సరసముతో సీతకి
సఖియా శ్రీరాములపై ॥వెదకి॥
పెళ్లి సమయంలో పన్నీరు చల్లడం జానపదుల ఆచారం. కాంత లందరు గూడి కస్తూరి తిలకం సీతారాములపై నుంచుమని బంగారు శాలువ కప్పమని భద్రాద్రి రామునిపై పాడుకొంటరు.
సువ్వి సువ్వి రామచంద్ర / సువ్వి సువ్వి కీర్తిసాంద్ర / సువ్వి సీతమ్మమాకు / శుభములీవమ్మా ॥సువ్వి॥
వాటమైన కుందనపు / మేటి కుందెయందు నిల్పి / గాటమైన పసిడి / రోకళ్లు పట్టుక ॥సువ్వి॥
మోదమొనను పెండ్లిపీట / మీద శ్రీరాముల సరస / ఆదిలక్ష్మియైన / సీతమ్మ నుంచిరా ॥సువ్వి॥
సువ్వి కస్తూరి రంగ / సువ్వి కావేటి రంగ / సువ్వి రామాభిరామ/ సువ్వి లాలీ / ఆ సువ్వి ఆ సువ్వి / తుమ్మ కర్ర రోలు దోసి / తూము దొడ్లు వాయు వేసి / దంచు దామా బియ్యం / దంచు దామా / ఆ సువ్వి ఆ సువ్వి….
సీతారాముల పెండ్లంటా / చూతము రారే మీరంతా / రాముడు సీతకు పుస్తెకట్టును / రాముని సీత వదలక యుండు.
మరో గేయంలో
సీతా రాముల లగ్నంబు / సూతము రారే ఆడోళ్లు / సూసిన వారికి పున్నెంబు / సూడనివారికి పాపంబు
ఇక సీతమ్మను అత్తవారింటికి పంపేటపుడు జానపదుల అప్పగింతల పాటలు లెక్కకు లేవు.
మా యమ్మ సీతదేవి / పోయిరావమ్మా / పోయి మీ అత్తింటా / బుద్ధి కలిగుండు ॥మాయ॥
గడపై కూర్చుండి / జడ విప్పబోకు / కూర్చున్నపుడే తల్లి / కురులూ దులపాకు ॥మాయ॥
వెండి మెట్టెలతో మెల్లిగా నడువుమని పర పురుషుని చూచి నవ్వద్దని పోయిన దగ్గర బుద్ధి కలిగుండుమనీ ఎన్నో చెపుదురు. శ్రీ నేదు నూరి గంగాధరంగారు సేకరించిన వాటిలో
బాలా పన్నెండేళ్ల బాల సుమ్మి / మన సీత పన్నెండేళ్ల లేతసుమ్మి / ఆ బాలకెవ్వరు సరిలేరు సుమ్మి ॥బాల॥
రద్దు సేయకు యాడు కొద్ది సుమ్మి / మీకిద్దరికి మంచి ఈడు సుమ్మి
/ఈడు జోడు సుమ్మి బుద్ధులో నేరదు / ముగ్ధ సుమీ మా పట్టి / బుద్ధి వచ్చినదాక దిద్దుకో నా స్వామి ॥బాల॥
వాల్మీకి చెప్పినారో లేదో కాని జానపదులు మాత్రం సీతమ్మకు 12 సంవత్సరాలు ఉన్నవని బుద్ధి వచ్చు వరకు దిద్దుకోమని తెలియచేసినారు.
బంగారు పల్లకిలో సీతారాములను ఊరేగింపు చేయుచూ ఉద్యాన వనంలో వసంతోత్సవం జరుపుకొంటారు.
పూల వసంత మాడేనే / సీతమ్మ యాడేనే / అయోధ్యా రాములతో ॥పూల॥
చుట్టు జల్తారు సీరె / మల్లె మొగ్గాల రయికె / సంపంగి దండాలు
ఘుమ ఘుమ వాసనతో
రాముల వారి ఊరేగింపు దారిలో రకరకాలుగా ఆట లాడుతారు
సూడరా ఓ రన్నా / ఈమన్న కొండను / మట్టె కూడ సూసినా
బండాగానున్నాది బండలో గుండులో / ఉన్నాడు రామన్న రామకొండ దేవుడు / మన కాది దేవుడు.
మహబూబ్‌నగర్ జిల్లాలో కోయిల కొండకు పశ్చిమ దిశలో రాముడున్నాడని జానపదులనమ్మకం. అక్కడ శ్రీరామ నవమికి ఉత్సవాలు కూడా జరుపుతారు.
ఉత్తముని పేరేమీ ఊరి పేరేమీ? / సత్య పురుషులగన్న సాధ్వి పేరేమీ?
ఉత్తముడు దశరథుడు ఊరు అయోధ్య / సత్య పురుషులగన్న సాధ్వి కౌసల్య / శ్రీ రామ జయ రామ శృంగార రామ / కారుణ్య గుణధామ కల్యాణ రామ / జగతిపై రామయ్య జన్మించినాడు / సత్యమ్ములోకాన స్థాపించినాడు
వన వాసానికి ముందు సీతమ్మ ఆటలాడి నటులనట్లు సందె గొబ్బిలో తెలియుచున్నది.
సీతమ్మ వాకిట్లా వలలో / సిరిమల్లె చెట్టు వలలో / సిరిమల్లె చెట్లు వలలో / చితుక బూసింది వలలో / చెట్టు కదలకుండా వలలో / కొమ్మ వంచండి వలలో
పూలు బుట్టడీ నింపి దండలు తయారు చేసి సీతకిమ్మని దాసుకో సీతమ్మ దొడ్డి దగ్గర దొంగలున్నారని పాడుకొంటారు.
సీత గడియ పాటలో మనోజమైన గేయం బాధ్యతగా పెద్ద కోడలు అత్తమామలకు పాదసేవ చేసి పొద్దుపోయి రాత్రి పతి కడకు వెళ్లగా కొత్త కాపురము కదా! రామచంద్రుడు ఎంత సేపు ఓపికతో ఉండగలడు. చూచి విసిగి కోపంతో గడియవేసుకొంటాడు. సీతమ్మ వచ్చి ఎంత వేడినా తలుపు తీయడు.
నిలుచుండు, పాదాలు చేతులూ నొచ్చె/ దంతంపు తలుపులూ, తీయవోయి నాధ / కరుణించి తీస్తివా కాళ్లకాడనైన / మరచి వక నిద్రైన శరణంది పోదు / తలుపు తీయమనగా రాముడు / నిద్ర నీకు లేకుంటె నాకేమి సీత / గంటవలె దీపమ్ము అది నాకు తోడు / నీవు నిల్చుంటేను నాకేమీ సీత / పట్టె మంచము పరుపు అది నాకు తోడు / అని బదులు పలుకును.
సీతమ్మ సుఖం కంటె దుఃఖం ఎక్కువగా అనుభవించినట్లు వారి పాటల వలన తెలియజేస్తున్నది.
“పత్తి చెట్టు వంక పత్తాకు వంక / రాజ్యంలో సీతమ్మ రాతి ఫలం వంక
శ్రామిక స్త్రీలు రాట్నం త్రిప్పుతూ తమ ఏకాంతానికి పాటలను తోడు చేసికొని భారాన్ని మరచిపోడానికి పాడుకొంటారు.
సీతమ్మ సీతమ్మ చిన్నబోయినావు / సీతమ్మ నీ సుతుడు ఎందుబోయినాడు / ఏడొక్క నెలలాయె ఏడమ్మ సుతుడు
రాముని మీద కంటె సీతమ్మపై జానపద పాటలు అనేకం. సీత పుట్టుక, కల్యాణం, దాగుడు మూతలు, ఆటలు మొదలైనవి యక్షగాన, చిరుత నాటంలో ఇంకా ఎన్నో కలవు.
స్త్రీలతో ప్రత్యేకం మంగళ హారతులు వారు వారిద్దరిపై అనేక రకములైన గేయాలను వినిపిసారు.
రామ మంగళం మా సీత మంగళం/ జయ మంగళం మీకిదే మంగళం / జయాజయా హారతి గైకొనుమమ్మా జానకి/ శరణు వేడితిమిమ్ములను దేవి నీకిదే సీతమ్మ ॥జయా॥
మల్లె పూలల దండలు ఇదిగో మాతా మెడలో వేసెరా / శరణు నీకు చేసెదా అమ్మా నిన్నె వేడెదా / పెండ్లి రోజున పండుగ మేము / జరుపుకొంటిమి ఈ దినము / శుభ దినమే మానితులకు ॥ జయా॥
ఈ విధంగా శ్రీ రాములపై సీతమ్మపై జానపద గేయాలు కనిపిస్తాయి. ఏది ఏమైనా కక్షలేని రక్ష శ్రీరామ రక్ష మన కందరికి రక్షఅని జానపదుల నమ్మకం.

Article about seethaRamula janapadalu

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సీతారాముల జానపదాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: