‘పక్షికాశి’లో అక్షర కోయిల

  సాహిత్యం నదిలాంటిది. సాహిత్య నదికి ఆనకట్టలు ఉండవు. నదుల సంగమం జరిగే చోట పుష్కరాలు ఎలా చేసుకుంటామో! సాహిత్య నదులకు కూడా పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పుష్కరుడు అనువాదకుడు. తెలుగు సాహిత్య నది వేరే భాషల్లోకి పారాలంటే అనువాదకుడు ఉండాలి. సాహిత్యంలో అనువాదం లేకపోయి ఉంటే సాహిత్య నది స్వేచ్ఛగా ప్రవహించేది కాదు. అనువాదమంటే సంస్కృత భాషలో పునఃకథనం అని అర్థం. ఒకరు చెప్పిన దానిని మరొకరు చెప్పడం అన్నమాట. ఆధునిక యుగంలో ఒక […] The post ‘పక్షికాశి’లో అక్షర కోయిల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సాహిత్యం నదిలాంటిది. సాహిత్య నదికి ఆనకట్టలు ఉండవు. నదుల సంగమం జరిగే చోట పుష్కరాలు ఎలా చేసుకుంటామో! సాహిత్య నదులకు కూడా పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పుష్కరుడు అనువాదకుడు. తెలుగు సాహిత్య నది వేరే భాషల్లోకి పారాలంటే అనువాదకుడు ఉండాలి. సాహిత్యంలో అనువాదం లేకపోయి ఉంటే సాహిత్య నది స్వేచ్ఛగా ప్రవహించేది కాదు. అనువాదమంటే సంస్కృత భాషలో పునఃకథనం అని అర్థం. ఒకరు చెప్పిన దానిని మరొకరు చెప్పడం అన్నమాట. ఆధునిక యుగంలో ఒక భాషలో చెప్పిన విషయాన్ని మరొక భాషలోకి మార్పిడి చేయడాన్ని అనువాదం‘ అనే పేరు స్థిరపడిపోయింది. భారతీయ భాషలనుండి, విదేశీ భాషల విశ్వ సాహిత్యం నుండి తెలుగులోనికి అనేక అనువాదాలు జరిగాయి. అయితే తెలుగు భాషలోకి అనువాదం అయినట్లుగా, తెలుగు నుండి ఇతర భాషలలోని అనువదించబడిన రచనలు చాలా తక్కువ.

అనువాదాలు రెండు రకాలు: 1.మూల రచనను యథాతథంగా తెలుగులోనికి తర్జుమా చేయడం ఒక పద్ధతి. 2. మూల రచన సారం చెడకుండా స్వేచ్ఛానుసరణ చేయడం ఇంకొక పద్ధతి. తెలుగు అనువాద సాహిత్యాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. భారతీయ సాహిత్యం నుండి తెలుగుభాషలోనికి అనువాదాలు ఒక భాగంకాగా, విదేశీ భాషాసాహిత్యం నుండి తెలుగులోనికి చేయబడిన అనువాదాలు మరొక భాగం. భారతీయ భాషల నుండి అనేకులు అనువాదాలు చేసినప్పటికీ ప్రసిద్ధ అనువాదకులుగా మద్దిపట్ల సూరి, సూరంపూడి సీతారామ్, వేమూరి రాధాకృష్ణమూర్తి, కె.సుబ్బరామప్ప, నిఖిలేశ్వర్, మాలతీ చందూర్ లాంటి వారు ఉన్నారు. విదేశీ సాహిత్యం విషయంలో రష్యన్, ఇంగ్లిష్ సాహిత్యాన్ని తెలుగులోకి ఎక్కువగా అనువాదం చేశారు. రెంటాల గోపాలకృష్ణ, క్రొవ్విడి లింగరాజు, సహవాసి, అబ్బూరి వరద రాజేశ్వరరావు లాంటి వారు అనువాద సాహిత్యానికి ఎక్కువగా కృషి చేశారు.

కన్నడ సాహిత్యానికి అత్యధికంగా ఎనిమిది జ్ఞానపీఠ్ అవార్డులు లభించాయి. తొమ్మిది జ్ఞానపీఠ్ అవార్డులు తీసుకొని హిందీ మొదటి స్థానంలో ఉన్నది. కన్నడ సాహిత్యంలో మొదటి జ్ఞానపీఠ్ అవార్డు స్వీకరించింది కుప్పళ్ళి వెంకటప్పగౌడ పుట్టప్ప. కువెంపుగా ప్రసిద్ధిగాంచిన సాహిత్యవేత్త. డిసెంబరు -29, -1904 జన్మించిన కువెంపు గారు నవంబరు-11, -1994 పరమపదించారు. పురాతన భారతీయ ఇతిహాసమైన రామాయణమును ఆధునిక కన్నడంలో శ్రీ రామాయణ దర్శనం పేరుతో తిరిగి రాశారు. అదే పుస్తకానికి 1967 లో జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. భారత ప్రభుత్వంచే ఆయన పద్మభూషణ్ పురస్కారాన్ని పొందారు. కర్ణాటక రాష్ట్ర గీతమైన ’జయ భారత జననియ తనుజతే’ రచించినది కూడా కువెంపు గారే. చిక్‌మగళూర్ జిల్లా, కొప్ప తాలూకాలోని హిరెకొడిగెలో స్థానిక కన్నడ కుటుంబంలో జన్మించిన వారు శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి యొక్క పచ్చని మాలెనాడు ప్రదేశంలో గల కుప్పళ్ళిలో పెంచబడ్డారు. కువెంపు గారు 1929లో మైసూర్ లోని మహారాజా కళాశాలలో కన్నడ అధ్యాపకుడిగా విద్యా వృత్తిని ప్రారంభించారు. 1936 నుండి బెంగుళూరులోని సెంట్రల్ కళాశాలలో సహాయక ఆచార్యుడిగా పనిచేశారు. 1946లో మైసూర్‌లోని మహారాజా కళాశాలలో మరలా ఆచార్యుడిగా చేరారు. 1955లో ఆయన మహారాజా కళాశాల ప్రిన్సిపాల్ అయ్యారు. 1956లో మైసూర్ విశ్వవిద్యాలయం ఉప-కులపతిగా ఎన్నికై 1960లో పదవీవిరమణ పొందే వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన మైసూర్ విశ్వవిద్యాలయం నుండి పట్టా పొంది ఆ స్థానానికి ఎదిగిన వారిలో మొదటివారు.

మొదట ఆంగ్లంలో కవితలు రాసేవారు. ఆ తర్వాత కన్నడంలోకి మారి కన్నడ సాహిత్య శిఖరంగా ఎదిగారు. వీరి ప్రధమ కవితా సంకలనం కొళలు. నవలలు, పద్య కావ్యాలు, నాటకాలు, స్వీయ చరిత్ర, కథా సంకలనాలు, సాహితి విమర్శ , జీవిత చరిత్రలు, బాలల కథలు ఇలా అనేక సాహిత్య ప్రక్రియలు రాశారు. కువెంపు గారు ప్రకృతి కవి వారి సాహిత్యంలో ఎక్కువగా ప్రకృతి వర్ణన కనపడుతుంది. మహాకవిగా, రస ఋషిగా పేరుగాంచిన వారు పక్షికాశి శీర్షికతో కవితా సంకలనం వేశారు. పుస్తకంలోని కవితలు 1930 నుండి 1940 మధ్య కాలంలో రాసినవి. పక్షికాశి అంటే పక్షులు వాలే స్థలం అని అర్థం. ఈ పుస్తకాన్ని మార్కండపురం శ్రీనివాస గారు తెలుగులోకి అనువాదం చేశారు. వీరు శ్రీశ్రీ, సినారే, ఎన్.గోపి, బాల గంగాధర్ తిలక్, చలం, అద్దేపల్లి రామమోహనరావు లాంటి మహాకవుల గ్రంధాలను అనువాదం చేసిన అనుభవం కలవారు. ఈ పుస్తకంలో కోకిల, సూర్యుడు, ప్రకృతి, ప్రధానమైన వస్తువులు కాగా గోరు వంక, తేనే, క్రౌంచ, బోర, కామల్లి లాంటి పక్షుల గురించి వారి గానం గురించి ఎక్కువగా కవిత్వం చేశారు కువెంపు గారు.

పుస్తకంలో మొత్తం 47 కవితలు ఉన్నాయి. పక్షికాశి శీర్షికతో మొదటి కవితా ప్రారంభం అవుతుంది. ఈ కవితలో కవి రీడర్ ని ఓ వ్యాధుడా అని సంబోధిస్తూ ఈ పక్షికాశికి బింకము, యుక్తి, అహం విడిచిరా నీకు తప్పకుండా మోక్షం లభిస్తుంది అంటారు. కవి ఉద్దేశం కుట్రలు, కుయుక్తులు, అలజడి లాంటివి వదిలి పక్షులు ఉండే ఈ ప్రదేశానికొస్తే నీకు మోక్షం లభిస్తుందని చెప్పడం. కవి పక్షుల గానాన్ని ప్రేమించమని చెప్పడం వెనుక ఉన్న వాస్తవం ఏంటంటే ఈ సమస్త విశ్వంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయని వాటిని ప్రేమగా చూడమని అర్థం. పక్షికాశి పుస్తకంలో కువెంపు గారు శివుడే సకలమని, శివుడే ప్రకృతని అనేక కవితల్లో ప్రస్తావించారు. దానిని బట్టి చూస్తే వారు దేవుడిని నమ్ముతారని భావించవచ్చు అందుకే రామాయణ కావ్యాన్ని తిరిగి రాశారు కూడా. దేవుడిని నమ్మినప్పటికీ ఒక కవితలో దేవుడి కోసం కాశి వెళ్ళాల్సిన అవసరం లేదని పక్షికాశిని సందర్శిస్తే కాశిలో ఉన్న శివుడిని దర్శించినట్టేనని చెప్పారు. అంటే వీరు దేవుడిని నమ్ముతారు కానీ ఆ దేవుడిని జీవుడిలో, సమస్త ప్రాణిలో చూస్తే సరిపోతుందని చెప్పడం జరిగింది.

లలితాద్రి కవితలో కవి రీడర్ ని ఉద్దేశిస్తూ ఇలా అంటారు. పుడమి పోరాటంలో మతి కలచి దెస చెడితే, మిత్రమా రా ఇక్కడా శాంతి ఉన్నది అంటూ సాగే ఈ కవితలో క్షణ క్షణం పరుగులు పెట్టి శాంతిలేని జీవితంలో అలసిపోయావు ఇటురా! ఇక్కడ చూడు ఈ కొండలు, కోనలు చూడు. కాసేపు నిలిచి చూడు తూర్పు పడమరలో, దక్షిణ ఉత్తరములో, గగనము నేలయును ఒక్కసారి పరిశీలించి చూడు సంతోషంగా మారగలవు, చెరువును మౌనంగా, ప్రశాంతంగా చూడు. పొలాలను, ప్రకృతిని పచ్చ పచ్చగా చూడు అంటారు. ఈ కవితలో కువెంపు గారు ప్రకృతిలో జరిగే ప్రతీది ఆస్వాదించమని పరుగు పెడుతున్న మనుషులకు ప్రకృతి అందాలను ఆస్వాదించమని హితబోధ చేశారు. అలాగే నీవు కావ్యం రాయాలన్న, పాటలు పాడాలన్న, ధ్యానము చేయాలన్న ఇక్కడికి రా అంటూ అందరినీ పిలుస్తారు. ఇలా అనేక కవితల్లో ప్రకృతి అందాలను వర్ణిస్తూ, పక్షుల గానాలకు పరవశించినప్పుడు, ఆవు దూడ మేత మేస్తున్నప్పుడు కలిగిన భావనలను వివరిస్తూ రీడర్ ని తన కవిత్వంలోకి ఆహ్వానించారు.

కోయిల-దిన్న అనే శీర్షికలో కోయిల మెరుపు రాగానికి రోమాంచనమవుతున్నది/నేనిక్కడ లేకపోయుంటే? హా నేనెరగను! ఈ అనుభవాన్ని అంటారు ఇక్కడ మనం గమనించవలసినది కోకిల గానం అందరికీ ఇష్టమే కానీ కవి ఆ గానానికి రోమాంచితుడయ్యానని ప్రకటించారు. శివుడి మీద ఒట్టు కోకిల గానం విన్న శరీరం జుమ్మన్నది అన్నారు. ఇక్కడ కవిలోని సున్నితత్వాన్ని గమనించవచ్చు. ప్రతి హృదయం సున్నితత్వమే కాకపోతే దైనందిక జీవితంలో పడిపోయి ప్రకృతిలోని సౌందర్యాన్ని విస్మరిస్తున్నాము. కువెంపు గారు ప్రతి కవితలో ఎందుకు మనుషులు చలించడం లేదు? గడ్డకట్టుకుపోయారనే బాధను వ్యక్త పరిచారు.

ప్రకృతి ఉపాసన కవితలో ఓ శివుడా ప్రకృతి సౌందర్యమును భావనోజ్వలముగా చూడలేని బ్రతుకొక బ్రతుకేనా? సూర్యోదయాన్ని చూసి చలించిపోయిన కువెంపు గారు నాలాగే ఇలా ఎవరైనా చలించిపోతున్నారా లేదా అనే అనుమానం వ్యక్త పరుస్తారు. నాలాంటివారు ఈ మహానగరంలో ఎందరుంటారని సందేహిస్తూనే అలాంటి వారికి దండములు పెట్టారు. ఇలాంటి సౌందర్యాన్ని చూడనివారి బ్రతుకు బ్రతుకే కాదు అంటారు. అయినా కష్ట జీవి కష్టం చేయకుండా సూర్యోదయాన్ని చూస్తూ కూచుంటే వాడికి తిండి ఎలా దొరుకుతుందని తనను తాను ప్రశ్నించుకుంటారు అంతలోనే మనుసుంటే మార్గం ఉంటుంది కదా ప్రకృతి సౌందర్యాన్ని తప్పక అనుభవించాలి, ఆరాధించాలనే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.

పిట్ట కూతను విన్న కువెంపు గారు అః మరొక సారి కూయుము ఎండిన ఎదకి రానీ నీ గానముందలి వరద అంటారు ఎండిన ఎదకు పిట్ట కూత వరదలాంటిదని చెప్పడం వెనుక కవి ఉద్దేశం మనసు ఎండిపోయి ఉన్నది అంటే రాటుదేలింది, చెల్లించడం మానేసింది కావున ఓ పిట్ట నువ్వు మరొక సారి కూయుము అనే పిట్టను ప్రాధేయపడతారు. జడత్వపు పేదరికాన్ని నీ ధ్వనితో జీవపు సిరిగా మార్చమని వేడుకుంటారు. ఓ పిట్ట నీ పాటతో జగత్తు యొక్క ప్రాణ నాడి మళ్ళీ ఉప్పొంగుతుంది అంటారు. ప్రకృతి, పక్షులు ప్రకృతిలో జరిగే వివిధ చర్యలు మానవులు అనుభవించడం లేదనే బాధ కనపడుతుంది. పచ్చ అనే కవితలో ఆకాశము, మేఘము, ఎండా, చినుకు, గాలి, వాన, నేల, శరీరంలోని నెత్తురు అన్నీ పచ్చగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇక్కడ పచ్చదనం అంటే కేవలం ప్రకృతి మాత్రమే కాదు మన మనసు పచ్చగా ఉండాలి, మనుషులు పచ్చగా ఉండాలి అనే భావనను కవి వ్యక్త పరిచారు.

ప్రకృతిని అమితంగా కీర్తించిన కవి 1935 కాలంలో వెళ్ళెదను నేను అనే కవిత రాశారు. ఈ కవితలో కవి నేను ఇక్కడ ఉండలేను కొండలు, కోన, అడవి, చెరువు, నది, పల్లె అక్కడికి వెళ్ళిపోతాను అన్నారు. దీని అర్థం అప్పటికీ ప్రకృతి నాశనం కావడం కవి గమనించి ఉండాలి. ఇదే కవితలో మహా నగరాల జీవన శైలి ఎలా ఉంటుందో చెప్తూ నేను వెళ్లి పోతాను అంటారు. అంటే కవి పల్లె ఆరాధకుడు, ప్రకృతి ప్రేమికుడు. నగర జీవనానికి అలవాటు పడ లేకపోయారు. నేను నా గూడుకు వెళ్ళిపోతాను మనస్సుకి గృహ వాంఛ పట్టింది అనే భావనను కవితలో వ్యక్త పరిచారు.

గదిలో కూర్చొన్న కవి కిటికిలోకి చూస్తూ గుంపుగా ఎగురుతున్న పక్షులను చూస్తూ కిటికి-కన్నుశీర్షికతో కవిత రాశారు. వెండి ముబ్బుల ముక్కలలాగ కొంగల జంటలు ఎగురుతున్నాయి. పక్షి పై పైకి ఎగిరి చుక్కలాగా మారిపోయింది. కువెంపు గారు ప్రకృతిలో జరిగే ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలించారు.

తన జీవితకాలంలో ప్రకృతిని అణువణువునా తన కవిత్వంతో రికార్డు చేశారు. గడ్డి మీద ఉన్న చినుగును చూసి మోహితుడైన కవి దీని ముందు దొరల సిరి ఏపాటిది? అంటారు. దీని అర్థం సమస్తం ప్రకృతేనని దానిని అనుభవించని జీవితం వృధా. కావ్యాన్ని తెలుగులోకి అనువదించిన మార్కండపురం శ్రీనివాస గారికి కృతజ్ఞతలు.
ప్రతిలిపి (తెలుగు విభాగం,రచయితల అనుసంధాన కర్త ) బెంగళూరు
మొబైల్ -7259511956

Translations from university literature of foreign languages

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘పక్షికాశి’లో అక్షర కోయిల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: