నోట్ల రద్దువల్లే నిరుద్యోగం

    నోట్ల రద్దు తర్వాత 50 లక్షల ఉద్యోగాలు పోయాయి. నవంబర్ 8, 2016 అనగానే మనకి గుర్తుకు వచ్చేది మాత్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం. ఇది ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం అప్పట్లో అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇటీవల కాలంలో నిరుద్యోగం పెరగడానికి కారణాలేంటి? అని పరిశోధనలు చేస్తున్న వివిధ సంస్థలు చెబుతున్నదేమిటంటే అన్నింటికన్నా ముఖ్యమైన కారణంగా పెద్ద నోట్ల రద్దునే వెల్లడిస్తున్నాయి. ఈ నోట్ల రద్దు ప్రభావం […] The post నోట్ల రద్దువల్లే నిరుద్యోగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

నోట్ల రద్దు తర్వాత 50 లక్షల ఉద్యోగాలు పోయాయి. నవంబర్ 8, 2016 అనగానే మనకి గుర్తుకు వచ్చేది మాత్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం. ఇది ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం అప్పట్లో అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇటీవల కాలంలో నిరుద్యోగం పెరగడానికి కారణాలేంటి? అని పరిశోధనలు చేస్తున్న వివిధ సంస్థలు చెబుతున్నదేమిటంటే అన్నింటికన్నా ముఖ్యమైన కారణంగా పెద్ద నోట్ల రద్దునే వెల్లడిస్తున్నాయి. ఈ నోట్ల రద్దు ప్రభావం అన్నిరంగాల్లో కనిపించిందని ముఖ్యంగా చిన్న తరహా ఉత్పత్తి రంగానికి, వ్యవసాయ రంగానికి నోట్ల రద్దు కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది. వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటివి కొనుగోలు చేయడానికి తెచ్చుకున్న డబ్బు చెల్లుబాటు కాకుండా పోవడంతో సంబంధిత వ్యాపారులూ దెబ్బతిన్నారు. తమ వద్దనుండే పంటలను తెగనమ్ముకున్న రైతులు దివాలా తీశారు. వ్యవసాయంలో కల్పించగలిగే పని దినాలూ తగ్గిపోయాయి. చిన్న తరహా వ్యాపారులు, ఉత్పత్తిదారులూ నగదు సరఫరా నిలిచి పోయి దెబ్బతిన్నారు. కాంట్రాక్టు కార్మికులు, దినసరి కూలీలు, వలస కార్మికులు నానా అవస్థలు, అగచాట్లూ పడ్డారు. ఆర్థిక, ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయి లేదా మందగించాయి. ఫలితంగా నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఇదే విషయం వివిధ సర్వే నివేదికల ద్వారా వెల్లడవుతోంది. పెద్ద నోట్ల రద్దు సమయంలోనే నిరుద్యోగ సమస్య మొదలైందని ఓ నివేదిక చెబుతోంది. 2016 నుంచి 2018 మధ్యకాలంలో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయినట్టు న్యూ రిపోర్ట్ వెల్లడించింది. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్శిటీ సెంటర్ ఫర్ సస్టయినబుల్ ఎంప్లాయిమెంట్ (ఎపియుసిఎస్) జరిపిన సర్వే ఆధారంగా బెంగళూరులో కొత్త నివేదిక విడుదల అయింది. స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2019 నివేదిక ప్రకారం.. దేశంలో నిరుద్యోగ సమస్య 2011 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోందని నివేదిక చెబుతోంది. 2018 ఏడాదిలో నిరుద్యోగ రేటు 6 శాతానికి పెరిగిపోయింది. 2000 నుంచి 2011 మధ్యకాలంలో కంటే రెండింతలు పెరిగినట్టు తెలిపింది. కంజ్యూమర్ పిరమిడ్స్ సర్వే ఆఫ్ ద సెంటర్ డేటా ఆధారంగా ఈ నివేదిక వెల్లడించింది. గత జనవరిలోనే లీకైన పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఆధారంగా ఇండియాలో నిరుద్యోగం రేటు 45 ఏళ్లలో 2017 -18లో అత్యధికంగా 6.1 శాతం రికార్డు అయినట్టు తెలిపింది. మహిళల్లోనే నిరుద్యోగ రేటు ఎక్కువ. ఉన్నత విద్య చదివిన 20 నుంచి 24 ఏళ్ల వయసు కలిగిన వారిలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లోని పని చేసేవారి జనాభా 13.5 శాతం ఉంటే నిరుద్యోగులు 60 శాతం మంది ఉన్నారు. వీరిలో ఉన్నత చదువులు చదువుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. తక్కువ చదువులు చదివిన ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలు కోల్పోయారని, 2016 నుంచి ఉద్యోగ అవకాశాలు బాగా తగ్గిపోయాయని తెలిపింది. ఉన్నత చదువులు చదివిన మహిళల్లోనే నిరుద్యోగ రేటు ఎక్కువ స్థాయిలో ఉంది.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ దేశ వ్యాప్తంగా మొత్తం 1 లక్ష 60 వేల నివాసులు, 5 లక్షల 22 వేల మంది వ్యక్తులపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేను నాలుగు (ప్రతి ఏడాది జనవరి ఆరంభంలో) నెలల్లో మూడు మార్గాల్లో నిర్వహించింది. 2010లో 2-3 శాతం నిరుద్యోగ రేటు ఉండగా.. 2015లో క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2018లో 6 శాతం మేర నిరుద్యోగ రేటు పెరిగినట్టు నివేదిక తెలిపింది. ఇదే సమయంలో మొత్తం మీద నిరుద్యోగ రేటు 3 శాతం రికార్డు అయితే విద్యావంతులై ఉండి.. నిరుద్యోగులుగా మారిన వారు 10 శాతం వరకు పెరిగారు. 2011లో 9 శాతం పెరిగితే.. 2016లో 15 నుంచి 16 శాతం నిరుద్యోగ రేటు పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. భారత్‌లో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. 2019 ఫిబ్రవరిలో దేశంలో నిరుద్యోగిత శాతం అత్యధికంగా 7.2 శాతానికి చేరింది. 2016 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగం పెరగడం ఇదే తొలిసారి. నోట్ల రద్దు, తర్వాత ఆగమేఘాలపై వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి తేవడంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడిందని, ఆ రంగాల్లో పని చేస్తున్న వారంతా ఉద్వాసనకు గురి కావాల్సి వచ్చిందని ఈ నివేదిక తేల్చింది. అయితే గతేడాది ఫిబ్రవరిలో నిరుద్యోగిత 5.9 శాతంగా ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) తాజాగా విడుదల చేసిన ఓ నివేదికను పేర్కొంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగంపై ఆందోళన కలిగించే అంశాలను ఈ నివేదిక బయటపెట్టింది. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే మేరకు నిర్ధారించిన అంశాల ఆధారంగా సిఎంఐఇ నివేదికను వెల్లడించింది. ఉద్యోగార్థుల సంఖ్య తగ్గినా.. నిరుద్యోగ రేటు పెరిగిందని ముంబైకి చెందిన ఓ సంస్థకు హెడ్ అయిన మహేశ్ వ్యాస్ తెలిపారు. ఉద్యోగం చేస్తున్న వారి సంఖ్య ఫిబ్రవరిలో 400 మిలియన్లు ఉంటుందని అంచనా వేశామన్నారు. గతేడాది ఉద్యోగాలు చేస్తున్న వారు 406 మిలియన్ల మంది అని సర్వేలో తేలింది. పెద్దనోట్ల రద్దు, ఆగమేఘాలపై అమలు చేసిన జిఎస్‌టి వల్ల 2018లో దాదాపు 1.10 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సిఎంఐఇ జనవరి నివేదిక వెల్లడించింది. కానీ నోట్ల రద్దు ప్రభావం ఉద్యోగాలపై ఏ మేరకు ఉందో తెలిపే సమాచారం తమ వద్ద లేదని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో 85 శాతం మంది నిరుద్యోగంతో బాధ పడుతున్నారు. ఇటీవల దేశంలో నిరుద్యోగిత 45 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నదని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఒ)ను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. కానీ అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయని కేంద్రం సమర్థించుకున్నది. ఈ ఏడాది వేతన జీవులకు నిరాశే ఎదురు కానున్నదని ఏఆన్ హెవిట్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనం తేల్చింది. వేతనాల్లో రెండంకెల వృద్ధి ఇక గత వైభవమే’ నని ఆ సర్వే పేర్కొంది. 2019లో సగటు వేతన పెంపు భిన్న రంగాల్లో 9.7 శాతమని హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ సంస్థ ఏఆన్ అంచనా వేసింది. 2017లో సగటు వేతన వృద్ధి 9.3 శాతం, 2018లో 9.5 శాతం కాగా ఈ ఏడాది స్వల్పంగా వేతన వృద్ధి పెరిగినా రెండంకెల వృద్ధికి దూరంగా నిలవడంతో వేతన జీవులకు నిరాశ మిగలనుంది. 2007లో సగటు వార్షిక వేతన వృద్ధి అత్యధికంగా 15.1 శాతం నుంచి ఆ తర్వాత గణనీయంగా తగ్గుతోందని ఏఆన్ హెవిట్ డేటా తెలిపింది. ఎన్నికల ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యయాలు పెరిగినా 2020లో మెరుగైన వేతన వృద్ధిని అంచనా వేయవచ్చని, అయినా 12-, 13 శాతం వేతన వృద్ధి మాత్రం గత వైభవమేనని తాము అంచనా వేస్తున్నామని ఏఆన్ ఎమర్జింగ్ మార్కెట్స్ హెడ్, భాగస్వామి అనందర్ప్ ఘోష్ స్పష్టం చేశారు. కీలక నైపుణ్యాలు కల వారికే మెరుగైన వేతన వృద్ధి పరిమితమవుతందని, సగటు వేతన పెంపు మాత్రం వృద్ధి చెందదని అంచనా వేశారు. ఈ ఏడాది కేవలం ఇంటర్‌నెట్ కంపెనీలు, ప్రొఫెషనల్ సేవలు, లైఫ్ సైన్సెస్, ఆటోమోటివ్, కన్జూమర్ ఉత్పత్తుల రంగాల్లోనే రెండంకెల వేతన వృద్ధి పరిమితమవుతుందని ఈ సర్వే అంచనా వేసింది.

Article about Demonetisation

The post నోట్ల రద్దువల్లే నిరుద్యోగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: