జెట్ విషాదాంతం!

    అతి పురాతనమైన జెట్ ఎయిర్ వేస్ తాత్కాలిక మూసివేత దాని శాశ్వత నిద్రకు దారితీసే ప్రమాదాన్ని సూచిస్తోంది. దేశంలోని ప్రైవేటు రంగ పరిశ్రమలకు అదే పనిగా ప్రభుత్వం నుంచి పలు మార్గాల్లో ఆక్సిజన్ అందితేగాని అవి నిరంతరాయంగా కొనసాగే అవకాశాలు తక్కువ అని భావించడానికి ఆస్కారం కలుగుతున్నది. పౌర విమానయాన రంగం అంగరంగ వైభోగంగా దూసుకుపోతున్నదంటూ జరిగిన ప్రచారమంతా బూటకమేనని ఇప్పటి జెట్, నిన్నటి కింగ్ ఫిషర్, సహారా, దక్కన్ ఎయిర్‌లైన్ల విషాదాంత గాథలు […] The post జెట్ విషాదాంతం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

అతి పురాతనమైన జెట్ ఎయిర్ వేస్ తాత్కాలిక మూసివేత దాని శాశ్వత నిద్రకు దారితీసే ప్రమాదాన్ని సూచిస్తోంది. దేశంలోని ప్రైవేటు రంగ పరిశ్రమలకు అదే పనిగా ప్రభుత్వం నుంచి పలు మార్గాల్లో ఆక్సిజన్ అందితేగాని అవి నిరంతరాయంగా కొనసాగే అవకాశాలు తక్కువ అని భావించడానికి ఆస్కారం కలుగుతున్నది. పౌర విమానయాన రంగం అంగరంగ వైభోగంగా దూసుకుపోతున్నదంటూ జరిగిన ప్రచారమంతా బూటకమేనని ఇప్పటి జెట్, నిన్నటి కింగ్ ఫిషర్, సహారా, దక్కన్ ఎయిర్‌లైన్ల విషాదాంత గాథలు చాటుతున్నాయి. వ్యాపారంలో ఎప్పటికప్పుడు తల ఎత్తే పోటీని, ఇతర సవాళ్లను వాణిజ్యపరంగా ఎదుర్కొనే తెలివి తేటలు కొరవడి వృథా వ్యయం పెరిగిన చోట ఎటువంటి సంస్థ అయినా మూసివేతకు గురికాక తప్పదని తాజాగా జెట్ ఎయిర్ వేస్ తాత్కాలిక విరమణ ఉదంతం రుజువు చేస్తున్నది. నరేశ్ గోయల్ యాజమాన్యం వైఫల్యం వల్ల గత కొన్నాళ్లుగా జబ్బు మంచం మీద కొనసాగిన ఈ విమానయాన సంస్థ బుధవారం నాడు విమానాలు నడపడం మానేసి కోమాలోకి వెళ్లిపోయింది. అత్యవసరంగా కనీసం రూ. 400 కోట్లు నిధులు విడుదల చేయాలని కంపెనీ చేసిన అభ్యర్థనను రుణ దాతలు నిరాకరించడంతో కార్యకలాపాలు నిలిపివేయక తప్పని పరిస్థితి తలెత్తింది. పర్యవసానంగా 20,000 మందికి పైగా సిబ్బంది భవిష్యత్తు అయోమయంలో పడిపోయింది. ఒకప్పుడు 119 విమానాలు నడిపిన జెట్ తాత్కాలిక మూసివేతకు గురైన సమయానికి కేవలం ఐదింటికి పరిమితమైంది. సీనియర్ మేనేజిమెంట్ సిబ్బంది, పైలట్లు, ఇంజినీర్లు తదితరులతో కూడిన 15% ఉద్యోగులకు మూడు మాసాలుగా జీతాలు లేవు. మొత్తం సిబ్బందికి మార్చి నెల జీతాలు చెల్లించలేదు. అప్పటికే సంస్థను నమిలి వదిలేసిన చెరకు పిప్పిలా మార్చిన నరేశ్ గోయల్ తీవ్రమైన ఒత్తిడికి తలొగ్గి యాజమాన్యం నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఆయన పూర్తిగా వైదొలగి వాటాలను సైతం భారీగా తగ్గించుకుంటేగాని అవసరమైన నిధులు సమకూర్చడం సాధ్యం కాదని రుణ దాతలు హెచ్చరించడంతో గోయల్ సంస్థకు గుడ్‌బై చెప్పక తప్పలేదు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సారథ్యంలోని రుణ దాతలు ఆ వాగ్దానాన్ని నిలుపుకోలేకపోయారు. కంపెనీని ఎవరికైనా అమ్మేసి చేతులు దులుపుకుందామనుకొన్నారు. ఆ పథకం కూడా తక్షణం అమల్లోకి వచ్చేట్లు లేదు. ఏప్రిల్ 8 నుంచి 12 వరకు జరిగిన కొనుగోలుదార్ల ఖరారు ప్రక్రియలో 25 శాతం షేర్లతో ఎతిహాద్ ఎంపికైనట్టు తెలుస్తోంది. అయితే ఇంకా మరెన్నో నిర్ణయాలు జరిగితేగాని ఈ కొనుగోలు వ్యవహారం అంతిమంగా ఒక కొలిక్కి రాదు. అంతవరకు సంస్థను నడిపించడానికయ్యే ఖర్చు కింద వీలయితే రూ. 900 కోట్లు లేదా కనీసం రూ. 400 కోట్లు విడుదల చేయాలన్న కంపెనీ అభ్యర్థనను ఎస్‌బిఐ సహా రుణ దాతల బృందంలోని బ్యాంకులు నిరాకరించాయి. అసలే అస్తవ్యస్త యాజమాన్యం నేపథ్యంలో నష్టాల్లో నడుస్తున్న సంస్థకు ఈ దశలో ఇచ్చే రుణ విత్తం గంగలో పోసినట్టవుతుందనే భయం వారిని పట్టి పీడించిందనుకోవాలి. కొత్తగా కొనుగోలు చేసే సంస్థ మీద ఈ వ్యయ భారం పెట్టాలని అవి భావించాయి. కాని ఆ ప్రక్రియకు మరి కొంత కాలం పట్టేట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో తాత్కాలికంగా బోర్డు తిప్పేయడం తప్ప వేరే దారిలేకపోయింది. నరేశ్ గోయల్ అదుపులోని యాజమాన్యం ప్రభుత్వం వద్ద రాయితీలు తినమరిగిందని తనంత తానుగా పోటీతత్వాన్ని పెంచి సంస్థను లాభాల్లో నడపలేక చేతులెత్తేసిందని బోధపడుతున్నది. ఎప్పటి మాదిరిగానే ‘ఉచిత భోజనం’ లభిస్తే చక్రం తిప్పవచ్చునని అనుకున్నది. కాని అలా జరగలేదు. విమానాలు లీజుకిచ్చిన వారికి కూడా సంస్థ భారీగా బకాయి పడింది. 1993లో ప్రారంభమైన జెట్ ఎయిర్ వేస్ అంతర్జాతీయ రూట్లలో కూడా విమానాలు నడిపి ఆ రంగంలో మేటి అనిపించుకున్నది. 2007లో రూ.2050 కోట్లతో ఎయిర్ సహారాను కొనుగోలు చేసి వ్యయ భారానికి గురయింది. 201112 లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదురు కావడంతో 24 % వాటాలను ఎతిహాద్‌కు 379 మిలియన్ డాలర్లకు 2013లో అమ్మేసింది. తాజాగా 2018 నుంచి మళ్లీ సంక్షోభంలో చిక్కుకుపోయింది. దానితో అత్యున్నత స్థాయి మేనేజ్‌మెంట్ సిబ్బంది జీతాలలో పాతిక శాతం కోత విధించింది. అయినా ఫలితం లేకపోడంతో వంద విమానాలను నడపడం మానుకున్నది. చివరకు ఐదు విమానాల స్థాయికి పడిపోడంతో చేతు లెత్తేసింది. కంపెనీ భవిత్యవంతోపాటు ఉద్యోగుల బతుకులు అర్ధాంతరంగా అయోమయంలో పడ్డాయి. దేశం వెలిగిపోతోందని చెప్పుకున్న ప్రధాని మోడీ ప్రభుత్వానిక జెట్ రూపంలో ఎదురయిన ఈ చీకటిని తొలగించడం ఈ ఎన్నికల మధ్య బహుశా సాధ్యమయ్యే పనికాదు.

Article on Jet Airways pilots strike

The post జెట్ విషాదాంతం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.