వెల్లూరు రద్దు!

‘ఎట్టకేలకు నీ శక్తి ఏమిటో తెలిసి మేలుకున్నావు, నీ అధికారాలను ఉపయోగించి కొరడా ఝళిపించావు, ఏ అధికారాలూలేనట్టు ఇకముందెప్పుడూ చేతులు ముడుచుకొని కూర్చోవద్దు’ అని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించడం, ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో కోట్లాది రూపాయలు పట్టుబడిన నేపథ్యంలో తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ స్థానం పోలింగ్‌ను ఇసి రద్దు చేయడం ఒకే రోజున జరిగిపోయాయి. ఒక లోక్‌సభ స్థానం పోలింగ్ మొత్తాన్ని రద్దు చేయడం దేశంలో బహశా ఇదే మొదటి సారి. […] The post వెల్లూరు రద్దు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

‘ఎట్టకేలకు నీ శక్తి ఏమిటో తెలిసి మేలుకున్నావు, నీ అధికారాలను ఉపయోగించి కొరడా ఝళిపించావు, ఏ అధికారాలూలేనట్టు ఇకముందెప్పుడూ చేతులు ముడుచుకొని కూర్చోవద్దు’ అని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించడం, ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో కోట్లాది రూపాయలు పట్టుబడిన నేపథ్యంలో తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ స్థానం పోలింగ్‌ను ఇసి రద్దు చేయడం ఒకే రోజున జరిగిపోయాయి. ఒక లోక్‌సభ స్థానం పోలింగ్ మొత్తాన్ని రద్దు చేయడం దేశంలో బహశా ఇదే మొదటి సారి. వెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం ప్రతిపక్ష డిఎంకె అభ్యర్థి కథిర్ ఆనంద్ సన్నిహితుడైన ఆ పార్టీ కార్యకర్త ఒకరికి చెందిన సిమెంటు గోదాములో రూ. 11 కోట్లు పట్టుబడడంతో అక్కడ పోలింగ్ రద్దుకు ఇసి సిఫార్సు చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వెంటనే ఆమోదించారు. అంతకు ముందు యోగి ఆదిత్యనాథ్, మాయావతి, తదితరులపై ఇసి అపూర్వమైన రీతిలో ప్రచార నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదంతా సుప్రీంకోర్టు ఇసిని మందలించిన తర్వాతనే జరిగింది. ఆర్టికల్ 324 కింద ఎన్నికల సంఘానికి గల అపరిమిత అధికారాలను దేశ అత్యున్నత న్యాయస్థానం ములు గర్రతో పొడిచి గుర్తు చేసినంతవరకు ఇసికి తెలిసిరాలేదు.

సరిగ్గా రెండేళ్ల క్రితం 2017 ఏప్రిల్ 12న చెన్నైలోని ఆర్‌కెనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను కూడా ఎన్నికల సంఘం రద్దు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత మరణించిన కారణంగా ఆ ఉప ఎన్నిక అవసరమైంది. జయలలిత స్నేహితురాలు శశికళ బంధువైన దినకరన్ పోటీలో ఉండగా ఆ ఎన్నిక రద్దయింది. ఈ రెండు రద్దులూ ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశించినవేననే అభిప్రాయం వెల్లడయింది. వెల్లూరు లోక్‌సభ స్థానానికి ఈ రోజున (ఏప్రిల్ 18) పోలింగ్ జరగవలసి ఉండగా ఒకే ఒక్క రోజు ముందు రద్దు కావడం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో హోరాహోరీ ప్రచార సమరం సాగిపోయింది. ఎర్రటి ఎండల్లోపడి ఎంతో ఖర్చు చేసి తుది వరకు ముమ్మర ప్రచారంలో మునిగిన అభ్యర్థులు, వారి పార్టీలు, అనుయాయులు, తుదకు ఓటర్లు ఉన్నట్టుండి ఎంతటి నిరాశకు గురై ఉంటారో ఊహించవచ్చు. డిఎంకె నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి కనిమొళి ఇంట్లో కూడా మంగళవారం నాడు భారీ ఎత్తున ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగిపోయాయి. ముందుగా ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసి డబ్బు పట్టుకోడం అనంతరం పోలింగ్ రద్దు కావడం ఒకే విధంగా ఆర్‌కెనగర్, వెల్లూరు ఉదంతాల్లో జరిగింది.

దీని వెనుక ఒక పద్ధతి ప్రణాళిక ఉన్నాయనిపిస్తే ఆశ్చర్యపడనవసరం లేదు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎఐఎడిఎంకె అభ్యర్థులపైనా దాడులు జరుగుతున్నప్పటికీ కేంద్రంలోని పాలక పక్షానికి వ్యతిరేకులైనవారిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారనే అభిప్రాయానికి తావు కలుగుతున్నది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లోనూ, లోక్‌సభ బ్యాలట్ యుద్ధంలోనూ పార్టీలు, అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు వెదజల్లడం మామూలయిపోయింది. తమిళనాడులోనైతే పాలక, ప్రతిపక్షాలు రెండూ ఓటర్లను డబ్బు, కానుకలతో ఆకట్టుకునే పద్ధతి ఇంకెక్కడా లేనంతగా సాగిపోతున్నది. దీనిని అరికట్టడానికి ప్రభావవంతమైన కొత్త చర్యలను తీసుకోవలసి ఉంది. అందుకు సంబంధించిన విధాన నిర్ణయాలు జరగవలసి ఉంది. మచ్చుకు ఒకటి రెండు చోట్ల దాడులు జరపడం అవి ప్రతిపక్ష పెద్దలకు చెందిన ఆవరణలలోనే సంభవించడం ఆదాయపు పన్ను శాఖ నిష్పాక్షికతను కీలకమైన ఎన్నికల వేళ బోనెక్కిస్తుంది. ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని ఆర్థికంగా బలహీనపరిచి పాలక పక్షానికి ప్రయోజనం చేకూర్చడానికే ఇలా జరుగుతున్నదనే విమర్శకు ఇది చోటు కల్పిస్తుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా రూ. 1200 కోట్ల మేరకు డబ్బు, మద్యం, కానుకలు పట్టుపడగా ఈ ఎన్నికల్లో ఇంతవరకు రూ. 2500 కోట్ల మేరకు స్వాధీనం చేసుకోడం గమనించవలసిన విషయం.

ఎన్నికల్లో ధన ప్రవాహం నానాటికీ అపరిమిత స్థాయికి చేరుకుంటున్నది. దీనికి సరైన విరుగుడు కనిపెట్టవలసి ఉంది. వీరు వారు అనకుండా అందరి, అన్ని పార్టీల ధనరాశులను పట్టుకొని ఆటకట్టించే విధంగా ఇసిగాని, ఆదాయపు పన్నుశాఖగాని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌గాని చర్యలు తీసుకున్నప్పుడు వాటి నిష్పాక్షికత మీద గౌరవం కలుగుతుంది. అలాగే ఒక లోక్‌సభ స్థానం మొత్తానికి పోలింగ్‌ను రద్దు చేయకతప్పని పరిస్థితి ఆ నియోజకవర్గంలోని అపరిమిత ధన ప్రభావాన్ని సకాలంలో గుర్తుపట్టలేకపోడం వల్ల తల ఎత్తుతున్నదే. అధికారుల చేతగానితనం వల్ల ఒక నియోజకవర్గ ప్రజలు మిగతా స్థానాల్లోని ఓటర్లతోపాటు ప్రాతినిధ్యం పొందే హక్కును కోల్పోడం మంచిది కాదు.

 cancellation of Lok Sabha poll in Vellore seat by EC

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వెల్లూరు రద్దు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.