బడుగుల బతుకులు ‘ఐతా’ కథలు

  సాహితీ ప్రక్రియల్లో ఎక్కువ సాధన ద్వారా మక్కువ ఫలితాన్నందించేది కథారచన. కథ అంటే అందరికీ ఆసక్తే. పురాణకథలు, జానపద కథల కంటే నేడు సమాజములోని అట్టడుగు వర్గాల జీవన రేఖలను చిత్రించిన సాంఘిక కథలు అధికజనావళి నాకట్టుకుంటున్నాయి. ఆలోచింపజేస్తున్నాయి. తెలంగాణ నైజాం పాలననుండి విముక్తి పొందిన తర్వాత బడుగు వర్గాల జీవితాలు కథల్లో చోటుచేసుకుంటున్నాయి.బడుగు వర్గాల వారిని అక్కున చేర్చుకుని వారి శ్రమైక జీవన సౌందర్యం స్థాయిని పెంచాలనే ఆరాటం ఐతా చంద్రయ్య కథల్లో ప్రముఖంగా […] The post బడుగుల బతుకులు ‘ఐతా’ కథలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సాహితీ ప్రక్రియల్లో ఎక్కువ సాధన ద్వారా మక్కువ ఫలితాన్నందించేది కథారచన. కథ అంటే అందరికీ ఆసక్తే. పురాణకథలు, జానపద కథల కంటే నేడు సమాజములోని అట్టడుగు వర్గాల జీవన రేఖలను చిత్రించిన సాంఘిక కథలు అధికజనావళి నాకట్టుకుంటున్నాయి. ఆలోచింపజేస్తున్నాయి.
తెలంగాణ నైజాం పాలననుండి విముక్తి పొందిన తర్వాత బడుగు వర్గాల జీవితాలు కథల్లో చోటుచేసుకుంటున్నాయి.బడుగు వర్గాల వారిని అక్కున చేర్చుకుని వారి శ్రమైక జీవన సౌందర్యం స్థాయిని పెంచాలనే ఆరాటం ఐతా చంద్రయ్య కథల్లో ప్రముఖంగా కనబడుతుంది.
కథా రచయితగా సాహితీ లోకానికి చిరపరిచితుడైన ఐతాచంద్రయ్య కలం నుండి వెలువడిన వందల కథల్లో సమాజంలోని వెనుకబడిన వర్గాల ప్రజల బతుకు బాటలోని ఒడిదుడుకులు సాహితీ ప్రియుల నలరిస్తున్నాయి అందులో కొన్ని మరుగై పోతున్న కులవృత్తుల వైతే మరికొన్ని జీవన ప్రయాణంలోని పదనిసలు.
తెలంగాణ ప్రాంతములో నిజాం రాజుల పాలనలో వారి తాబేదారులైన భూస్వాములు,గడీల దొరలు సామాన్య ప్రజల కష్టాల సుడిగుండాల్లో ముంచారు.అంతరించిపోతున్న పల్లెల కులవృత్తుల నిరాదరణ వల్ల గ్రామాలలో వివిధ కుల వృత్తుల వారి బతుకులు దినదిన గండంగా తయారైనవి. పెట్టుబడిదారీ వ్యవస్థలో పేదలవెతలు శ్రుతి మించి రాగాన పడినై.
అలాంటి కొన్ని కథల్ని పరిశీలిస్తే రచయిత కౌశలము తెలుస్తుంది.
దొరల జమానాలో ఆడపిల్ల పెళ్లిలో అరణంగా వచ్చిన దాసి కమల. గడీలో నానాయాతన లనుభవిస్తుంది. బాధలు భరించలేక తన కూతురుతో బయటకెళ్లి పోతుంది.బీడీలుచేస్తూ కార్మికురాలిగా స్వతంత్ర జీవనం సాగిస్తుంది.ఇది‘కొత్తమెరుపు‘కథ.
‘వరాల మూట‘ కథలో చాకలిఎల్లవ్వకు కొడుకు కూతురు (మనవరాలి)తో ముడిపడిన అనుబంధం.కొడుకును దూరం చేస్తుంది.మనవరాలినే వరాల మూటగా భావిస్తుంది.కొడుకు రెండో పెళ్ళాం మోజులో సొంత కూతురును అసహ్యించుకోవడం భరించలేదు.మనవరాలు కనబడకుండా పోతే తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బావిలో దూకేందుకెల్తుంది.అక్కడ మనవరాలు కనబడి ఒడిలో చేరుతుంది.నానమ్మాఈ బాయి గోడ నాకెక్కరాదు.
గీబాయిల నన్ను పడేయవా?అనిగుండెలకు అతుక్కుపోతుంది.ఎల్లవ్వ మాత్రం ‘మనం చావద్దు మనల్నిచూసినోళ్ళేకండ్లల్ల కారంకొట్టుకొని చావాలె‘ననిఇంటికి తీసుకెళ్తుంది.
ఆరుగాలం శ్రమించి తనపొలంలో పండించిన ధాన్యాన్ని సన్నకారు రైతు దళారికిఅమ్మకుండా తానే పట్నం మార్కెట్ కు తీసుకువెళ్లి అనుభవించిన కష్టాలను ‘సప్త సముద్రాలు‘ కథ చెప్తుంది.మార్కెట్ యార్డులో వర్షం పడి ప్రవాహానికి తన ధాన్యం కొట్టుకుపోతుంటే రైతు తన ఒంటిమీద గుడ్డల్నివిడిచి ధాన్యంకుప్పమీద వేస్తాడు.గుడ్డలతో సహా ధాన్యం కొట్టుకుపోతుంది
సభ్య సమాజం ఒంటిమీద క్యాన్సర్ గడ్డ లాంటి దురాచారము జోగిని. ఆ దురాచారానికి బలైన గాంధారి, వాళ్ళమ్మ, అమ్మమ్మను, తను కూడా ఆట బొమ్మల వాడుకున్న దొర కొడుకు ఎల్లారావును నిరసిస్తుంది.తన కూతురును బలవంతం చేయబోయిన ఎల్లారావు కొడుకును చంపి జైలుకెళుతుంది.కూతురును చదివించి పెళ్లి చేస్తుంది.అదే జైలు సూపర్నెంటుగా వచ్చిన ఎల్లా రావు గాంధారిని పెళ్ళాడ్తా నంటే ఒప్పుకోదు.ఈ ‘కలికి గాంధారి‘ కథలో గాంధారి‘దొరా! నేను కళ్ళుండి గుడ్డి దాన్నైన ఆ గాంధారిని కాదు.కలియుగ గాంధారిని నీ వంశం అంతమైంది నా వంశం మొదలైంది.అని ఛీకొట్టి విడుదలైపోతుంది.
బుడబుక్కల చెల్లప్ప ఇల్లిల్లు తిరుగుతూ ‘అంబ పలుకు జగదంబ పలుకు‘ పాటతో యజమానులను పొగుడ్తూ అడుక్కుంటాడు.అతని కొడుకును కూడా అదే వృత్తిలో దింపుతా నంటే అంటే కొడుకు పారిపోతాడు.దొరలుశ్రీమంతుల ఇంటి ముందు ఆడి,పాడి అడుక్కోవడం ఇష్టముండదతనికి అది‘రామజోగి‘కథ.
‘దేవుడీ దేవత‘ కథ మనసుల్ని కదిలిస్తుంది. ఆనాటి దాసి వ్యవస్థలో దొరలు పెడుతున్న చిత్రహింసల్ని భరిస్తూ నందగోపాల్ అతని అక్క విజయ అష్ట కష్టాలనుభవిస్తుంటారు. దొరలు,వారి బంధువులు విజయను ఆటబొమ్మగా వాడుకుంటారు.విజయ తన తమ్మున్ని రహస్యంగా బయటికి పంపించి దొరల హింసలకు బలైపోతుంది.నందగోపాల్ అనాధాశ్రమంలో పెరిగి పోలీసుద్యోగై (అక్కలాంటి)అనాధను పెళ్ళాడ్తాడు.
‘ప్రజ్ఞాపూర్ చౌరస్తా‘లోచిరువ్యాపారులు,
అడుక్కునే దివ్యాంగుల బతుకులచిత్రణ వుంది.ఒంటికన్నుయువకుడు,కుంటియువతిఒకరికి
ఒకరై పోతారు. కరువు-కాటకాల ఫలితంగా తిండికిలేక పల్లెటూరు యువకుడు దుబాయ్ కెళ్తాడు.అతని భార్య స్వదేశంలో అనుభవిస్తున్న అగచాట్ల కథ‘దుబాయ్ దస్కం‘.
‘గూటి గువ్వలు‘ లో వీర ముష్టి రాజవ్వ తన దీన గాథ చెప్పి, పాఠకుల సానుభూతి పొందుతుంది.
ఒకనాడు శారదగాళ్ళు గొప్ప కళాకారులు.ఓ శారదగానికిద్దరు భార్యలు. ఆనాడు భార్యలుడుంకీలు వాయిస్తూ తాను వీణ పట్టుకొని గంతులేస్తూ కథ చెప్తూ అందరిని ఆకట్టుకునే వారు. ఆ కళ అంతరించిపోతుంది. అతని కొడుకు కంపెనీ ఉద్యోగం చూసుకుంటాడు.
పలుకుబడి గల బ్రాహ్మణుడు కొందరు పేద బ్రాహ్మణుల్ని సహాయకులుగా చేసుకుని వారితో
పౌరో హిత్వం చేయిస్తూ డబ్బులు తానువసూలు చేసుకుంటాడు.అతని సహాయకుడైన నిరు పేద బ్రాహ్మణుని కష్టాల కడలి ఈత ‘బతుకు బాట‘ కథ.
భారతమాతకు సింధూరంలాంటి కాశ్మీర్లో తెలుగు కుటుంబం అనుభవించిన కష్టాలు,జిహాద్ రాక్షసుల చిత్రహింసల సమాహారము‘భారతి సింధూరం‘ కథ విచిత్రమైన వస్త్రధారణ, పదుగురిని నవ్వుల్లో
ముంచెత్తే మాటలు, నటన తుపాకి రాముని వృత్తి.ఆ నవ్వించే గుణం వెనకున్న హృదయవిదారకం‘సుడిగాలి‘ కథ.
బజార్లో చిత్తుకాగితాలేరుకొనిపొట్ట పోసుకునే పండరి అపెండిక్స్ వ్యాధితో అల్లాడి పోతుంటే డబ్బు లేని కారణంగా అతనికి ఆపరేషన్ చెయ్యనంటాడు డాక్టర్ రఘురాం. అంతకుముందు రోజుల్లో కొంత కాల (క్రితం) ఓ పేషెంట్ (నిరుపేద) తండ్రికోపంతో శాప మిస్తాడు కొద్దిరోజుల్లోనే డాక్టర్ కొడుకు చనిపోతాడు. డాక్టర్ భార్య ఆ సంగతి గుర్తు చేసి పండరికి ఉచితంగా ఆపరేషన్ చేయించడం ‘మనిషిలో మాధవుడు‘ కథ.
‘తిక్క కుదిరింది‘ కథ మహిళా శక్తికి ప్రతీక. పేదబీడి కార్మికురాలు భారతి భర్త జులాయ్ గా తిరుగుతూ, రోజూ తాగి వచ్చి భార్యను హింసిస్తుంటాడు. పొదుపు సంఘం మహిళా గ్రూపు వారు కూడబలుక్కొని అతన్ని చీపుర్లతో కొట్టి తాగుడు కనిపిస్తారు. పేద పద్మశాలి నారాయణ మగ్గంమీద చిలకపచ్చ చీర నేస్తున్నాడు.అతని భార్య బాలమణి కాచీర చాలా బాగుందని ఆ చీరను బతుకమ్మ పండుగ కోసం తనకి వ్వుమంటుంది.సేటు వద్దనూలు తెచ్చి నేసిన చీరనుఅది సేటుకిస్తే కూలి డబ్బులు ఇస్తాడు. కూలీ డబ్బులు లేకపోతే ఇంట్లో అందరూ పస్తులుండాలి. చీరను బాలమణి కివ్వలేనంటాడు. మనసు మారాం చేస్తుంటుంది. నేను నేసిన చీరను నా భార్య కి ఇవ్వలేక పోతున్నాననే మనస్థాపంతో మగ్గానికి ఉరేసుకుని చనిపోతాడు. కూతు రు చంద్రకళ కన్నీరుమున్నీ రైతుంది. ఈ ‘చిలకపచ్చ చీర‘ కథలో అదే చంద్రకళ ఓసారి ఈ దరిద్ర మెప్పుడు పోతుంది నాయనా? నాతోటి ఆడపిల్లలంతా పిల్లల తల్లులైండ్రు. బతుకమ్మ కాడికిపట్టు చీరల్తో వస్తరు. అంటుంటే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతరు.
ఇలాంటి దృశ్యాలు ఎన్నో కథల్లో కనబడి పాఠకుల మనసుల్ని మెలిబెడ్తాయి.
‘నీడల జాడలు‘ కథలో దాసి కొడుకు దొరల కొడుకులకు రోజు వండి పెడుతూ(పట్నంలో) తాను బడికెళ్లి చదువుకుంటాడు. దొర అవమానాలు, పిల్లల ఈసడింపులు భరిస్తూ దివి రాత్రులు శ్రమించి బాగా చదువుకుని ప్రయోజకుడవుతాడు.దొరల పిల్లలతో పట్నం వెళ్లేముందు తల్లి అతన్ని ఒడిలోకి తీసుకుని ఒళ్లంతా ఆత్రంగా ముద్దాడుతుంది.ఓ వైపు కన్నప్రేమ మరోవైపు తన కొడుకు బాగా చదువుకుని పైకి రావాలనే ప్రేమ, నిస్సహాయత కళ్ళల్లో కదిలాయి.‘బిడ్డా! నా బంగారు కొండా! మల్లా నిన్ను ఎప్పుడూ చూ స్తానో తెలియదు. నువ్వు కష్టపడి బాగా చదువుకో. దొరబాబు ల కు కోపమొచ్చి తిట్టినా, కొట్టినా ఓర్చుకో నీకామాత్రం రోషం వ చ్చినా నీకే నష్టం‘ అంటుంటే ఆమె కంటి ధారలు కపోలాలను త డిపేస్తుంటాయి. కొడుకు లేతబుగ్గల్ని సున్నితంగా నిమురుతుం ది. మళ్ళీ కొడుకును చూడకుండానే బావిలో పడి చనిపోతుంది.
‘విశారద‘ కథలో కరుణరసం ప్రవహించింది. జోగిని శారద (తల్లితో) పెళ్లి చేసుకుంటా నంటుంది అమాయకంగా. తల్లి పొత్తికడుపులో పేగులు మెలి పెడుతుంటే ‘మనం జోగినులం. జోగినులు ఇలానే ఉండాలని దేవతల నిర్ణయం. మా అమ్మ, అమ్మమ్మ… ఆనాటినుండి గిదే గుడిల ఉంటున్నాం. దేవుని పేరుమీద గిట్లే బతుకున్నాం‘ అంటుంది. దురాచారాన్ని అసహ్యించుకున్న శారద ‘గిట్లేందుకమ్మా? అందరు ఆడపిల్లలోలే మనం కూడా ఒక్కడినే పెళ్లి చేసుకుని అతనితోనే జీవితాంతం ఉండలేమా? లోకమంటే ఏందో తెలియక ముందే ఏదో తూతూ మంత్రం చేసి నాకు పెళ్లి అయిందంటున్నావు. దేవుడు మొగడు అంటున్నావు. నువ్వేమో 30 ఏళ్లకే ముసలి దానివి అయిపోయినవు. రేపు నా పని అటెన్క నా కూతురు గతిఅంతే.ఇదేం పద్దతమ్మా?‘అని తల్లిని నిలదీస్తుంది. ‘భయానా‘కథలో నారాయణ సన్నకారు రైతు. భూమికి, తనకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. వానలు పడక, ప్రాజెక్టులు లేక వరుసగా కొన్ని సంవత్సరాల కరువు వచ్చింది. బట్ట, పొట్టకు బతకలేక, మరో దారి లేక భూమిని కోళ్ల ఫారం చేస్తానన్నా పట్నం వ్యాపారికి అమ్మేస్తాడు. తన భూమిలోతానే ఉండాలనుకుని వ్యాపారితో‘ ఆ భూమిల కోళ్ల ఫారం వేసినంక దాంట్లో నేను పని చేస్తా నాకు గుమాస్తా నౌకరి య్యాలె‘ అని బతిమాలి తనది కాని తన భూమిలో చౌకీదారుగాఉండిపోతాడు.
ఇలా… మనసుల్ని కదిలించే వందలాది కథల్లో బడుగు వర్గాల బతుకులను చిత్రిస్తూ కథ నడిపే విధానం, సంభాషణలు బడుగు వర్గాల్లో చైతన్యాన్ని కూడగడ్తాయి. అవన్నీ రచయిత రచనా నైపుణ్యానికి అద్దం పడతాయి.

వరుకోలు లక్ష్మయ్య
9704865816

Article about Itha Chandraiah Kathalu

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బడుగుల బతుకులు ‘ఐతా’ కథలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: