సరస్వతి సమ్మానితుడు

  శివారెడ్డి వో సందర్భం, వో మార్గం, వో స్ఫూర్తి “దశలు దశలుగా సాగుతున్న జీవితంలో చరమాంకం ఎట్టుండా స్వీకరించాల్సిందే దుఃఖాన్నయినా ఆనందంగా అనుభవించాల్సిందే అయితే… ఒక పనిలో మునిగిన వాడికి ఏదీ గుర్తుకు రాదు పని తప్ప” అనే చింతనా వైచిత్రిగల కవి, దించలేని జరాభారాన్ని మోసుక తిరుగుతూ, బాధ్యతాయుతంగా, నిష్ఠ, నిబద్ధతతో నిద్రారహిత స్థితితో, సమస్య నలు దిశలకు విస్తరిస్తూ, నిరాకారాలతో దాగిన సాకారతను, కప్పుకుంటున్న కలలు మాగిన కవితా మధుఫలపు పరిమళం కె. […] The post సరస్వతి సమ్మానితుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శివారెడ్డి వో సందర్భం, వో మార్గం, వో స్ఫూర్తి

“దశలు దశలుగా సాగుతున్న జీవితంలో
చరమాంకం ఎట్టుండా స్వీకరించాల్సిందే
దుఃఖాన్నయినా ఆనందంగా అనుభవించాల్సిందే
అయితే…
ఒక పనిలో మునిగిన వాడికి
ఏదీ గుర్తుకు రాదు పని తప్ప”
అనే చింతనా వైచిత్రిగల కవి, దించలేని జరాభారాన్ని మోసుక తిరుగుతూ, బాధ్యతాయుతంగా, నిష్ఠ, నిబద్ధతతో నిద్రారహిత స్థితితో, సమస్య నలు దిశలకు విస్తరిస్తూ, నిరాకారాలతో దాగిన సాకారతను, కప్పుకుంటున్న కలలు మాగిన కవితా మధుఫలపు పరిమళం కె. శివారెడ్డి. రేపవళ్ల ఆలోచనా అంతరంగానికి రేపటిని వేలాడ దీస్తూ, కలల సాకార మర్మ మెరిగిన కవితాశక్తి ఈయనిది. అత్యంత స్థిరమైన వ్యక్తిత్వంతో, ప్రగతి కాముకునిగా, ఉద్యమ నిర్మాణవాదిగా, సామాజిక చీకటి కోణాల ఆంతర్యమెరిగిన అభ్యుదయ వాదీయన. ప్రజా ఉద్యమాల నేపథ్యంతో, చారిత్రక పరిణామాలను అవగాహనించుకుంటూ, నేటి సామాజిక రాజకీయ ఆర్థిక దృష్టి కోణంతో విశ్లేషించుకుంటూ, క్రమబద్ధమైన వివరణాత్మకమైన అనుశీలనంతో వచన కవిత్వానికి వన్నె చిన్నె లద్దిన ప్రజాకవి శివారెడ్డి. వీరి కవిత్వంలో విప్లవ జ్యోతులు కనిపిస్తాయి., ప్రాపంచిక దృక్పథం వెలుగులు కనిపిస్తాయ్, కుల, మత, వివక్షను అధిగమించే విముక్తి పోరాటాల నీడలు కనిపిస్తాయి. అనేక సూక్ష్మ దోపిడీ రూపాల మూల స్వరూపాల జాడలు కనిపిస్తాయి. అందుచేతనే శివారెడ్డి కవిత్వం అణగారిన జీవితాల్ని విప్లవీకరించడంలో, అణచివేతతో అల్లాడిపోతున్న తాడిత పీడిత హృదయాల్లో స్వేచ్ఛా భావాల్ని అంకురింప చేయడంలో, శ్రామిక వర్గాలు దోపిడీ వర్గాల కబంద హస్తాల నుండి విడివడే ప్రతిఘటనాశక్తిని పెంపొందించడంలో, త్యాగాన్ని, ధైర్యాన్నీ రగిలించడంలో విజయాల్ని సాధించడానికి ఎంతగానో తోడ్పాటిచ్చిందనే చెప్పొచ్చు. ప్రజాస్వామిక స్వభావాన్ని, విలువల్ని గుర్తు జేస్తూనే సైద్ధాంతిక పరమైన విలువలతో కూడిన ఉద్యమ స్ఫూర్తి కోకొల్లలుగా వీరి కవిత్వంలో కనిపిస్తుంటుంది. పనికిమాలిన పాత తనాన్ని శిథిల పరచుకుంటూ ప్రగతి శీలమైన నూతనత్వాన్ని ఆహ్వానించే సృజన శీలి శివారెడ్డి.
ప్రతి సామాజిక సందర్భానికి, ప్రజల్లో రగులుతున్న అల్లకల్లోలానికి, జన జీవన ఘర్షణలకి, పోరాటాలకి, ఉద్యమాలకి, పాలక వర్గపు దగుల్బాజీతనానికి స్పందించే చైతన్యవంతుడు. జీవన తాత్తిక గరిమతో సమస్యను వ్యూహాత్మకంగా ఉద్యమ యుక్తితో ఎత్తి చూపే చేవ గల కవి శివారెడ్డి. సాంస్కృతిక రంగంలో కవిత్వాన్ని ఆయుధంగా జేసి సామాజిక విధ్వంసాల మీద ఎక్కుబెట్టిన మహా కవుల్లో శివారెడ్డి ఒకరుగా చెప్పుకోవచ్చు. కవితా తపన, తపస్సు, ఆవేదన ముప్పిరిగొన్న లోచూపుతో వస్తువును దర్శించి, సామాజిక స్పృహతో అక్షరానికి ఆయుష్షు పోసే తత్తం వీరిది. వీరి కవిత్వం వర్గ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అనిర్వచనీయుతకు అద్దం పట్టేదిగా, విలక్షణమైన వ్యక్తీకరణతో సరళమైన భాషతో సాగిపోతుంటుందీ కవిత్వం.
శివారెడ్డి ఏనాడూ తన మూలాలు మరచిపోయిన కవి కాదు. తన కవిత్వంలో బాల్యం అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఐదేళ్ల ప్రాయంలో తల్లిని పోగొట్టుకున్న లోటు, ఎంతో వెలితిగా చుట్టూ ఎంతమంది ఉన్నా బిక్కు బిక్కు మనే భయం, గుండెల్లో గుసగుసలు పోతుంటుందనే వాడు శివారెడ్డి. నాలుగు అక్షరం ముక్కల్ని సంచిలో వేసుకుని భిక్షార్థియై హైదరాబాద్ చేరినప్పుడు, కవిత్వంపట్ల ప్రేమో, పిచ్చి మమకారమో, ఏదో వ్యామోహమో తన్నువెంటాడు తుండేది అంటాడు శివారెడ్డి. ఆనాటి సామాజిక సంక్షోభాలయితేనేమి సాహిత్య రంగంలో అల్లకల్లోలాలయితేనేమి ఏదీ తెలిసీ తెలియని తన పరిస్థితికి, దిక్కు తోచని స్థితికి, సాహిత్య అధ్యయనమే కొంతవరకు ఊరట కలిగించిందంటారు. ఏభైయేళ్ల సాంస్కృతిక, సాహిత్య, రాజకీయ ఉద్యమాలతో శివారెడ్డి జీవితం ముడిపడి ఉంది. ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని, కొత్త ఊపిరితో సరికొత్త ఊపుతో కవిత్వాన్ని శ్వాసించిన, నేడు ఆధునిక కవిత్వాన్ని శాసిస్తున్న మహాకవి శివారెడ్డి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం వీరి నైజం. ప్రతి చినన కవిలో నుండి వెలువడిన కొత్త భావాన్ని చూస్తే అభినందించడం వీరి సంస్కారం.
మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టి, బాల్యాన్ని బడికే కాకుండా, సేద్యం పనులకు సగం వినియోగిస్తూ, ఇంటిపని, వంట పనిలో తండ్రికి సహకారిగా ఉంటూ గడిపిన పల్లె జీవితపు కష్టాలు కన్నీళ్లు, తన కవిత్వానికి సైదోడై నిలచినవి అంటాడు శివారెడ్డి. కష్టాల సానమీద అరిగి పదునెక్కిన కవీయన. అందుకే ఆయన కవిత్వంలో అమ్మతనం లాంటి ఆత్మీయత పలకరిస్తుంటుంది. కనుకనే పాఠకుణ్ణి ‘బన్’ చేసుకునే తత్తం మిక్కుటంగా కనిపిస్తుంటుంది. ఒక అనుభవం లోంచి అవగాహనలోంచి పుట్టిన కవిత్వం కనుకనే తనను నిత్యం వెంటాడి వేటాడిన ‘దుఃఖాన్ని గూర్చి చెప్తూ “దుఃఖాన్ని మాత్రం పిలవకు/ అది దరిద్రం కన్నా / దరిద్రాతి దరిద్రమైంది/ నిస్తేజమైన/ నిర్వీర్యపుటాలోచనల్ని పోగు చేస్తుంది/ … మహోజ్జల భవిష్యత్తును /ఖూనీ చేసే ఖూనీకోరు/ దుర్వినియోగం చేయబడ్డ / కాలానికది ప్రతిబింబం” అంటారు రక్తం సూర్యుడు కవితా సంపుటిలోని ఓ కవితలో (1973).
దిగులు, దుఃఖాన్ని, ఆత్మవిశ్వాసంతో అధిగమించి ‘చర్య’ (1975) కవితా సంపుటిలో ‘ఆశ చిరంజీవి’ “ఒక ఓటమిలో / కొన్ని వందల విజయాల్ని ఆవిష్కరించుకుంటాను/ ఒక ఎదురు దెబ్బతో/ ఎన్నో జాగ్రత్తలు జాగృతమైనట్లు/ … ఊహ ఊపిరిమీద / భవిష్యత్ గీతం రాసుకుంటాను” అంటూ బతుకు మీద ఓ నమ్మకాన్ని సమకూర్చుకుంటాడు.
1978 ‘నేత్ర ధనస్సు’ కవితా సంపుటిలో “ధ్వంసం” అనే కవితలో కవి శివారెడ్డి తన కవిత్వానికి దారి తెన్ను వెతుకున్నాడు. మార్కిస్టు భావజాలాన్ని ఒడిసి పట్టుకున్నాడు కనుకనే “ధ్వంసం చేయాల్సిన దాన్నే ధ్వంసం చేసి / మరో మహత్తరమైన దాన్ని చెమటతో కడదాం../.. దేన్నీ ధ్వంసం చేయకుండా / దేన్ని నిర్మిస్తావు? / ధ్వంసం చేయతగిందేదీ లేకపోతే నీకీలోకంలో / నువ్వు తప్పకుండా ధ్వంసం చేయదగిన వ్యక్తివి” అనే నిర్ధారణకు వస్తాడు.
కవిత్వానికి కాలం చెల్లిందనే వారికి సమాధానంగా 1983 ‘భారమితి’ కవితా సంపుటిలోని ‘భారమితి’ కవితలో సమాధానం చెప్పాడీ నిత్యకవి. “కవిత్వానికి కాలం చెల్లిందంటున్నారు… / రక్తమాగిపోయినవాడు స్పందనని కొలవలేడు/ కళ్లల్లో సూర్యుడు కదలాడని వాడు / ప్రపంచాన్ని స్పృశించలేడు/ నా కంతటా కవిత్వం కదలాడుతుందేమిటి? / అంటూ కవిత్వం రాయలేని వారి విషయాన్ని కవిత్వం యెడల తనలో ప్రతిది కవిత్వంగా పరివర్తన చెందే విధానాన్ని ఎత్తి చూపాడు కవి.
(1988) “మరణం గురించి కవితలో ‘మోహనా! మోహనా ! కవితా సంపుటిలోనిది. మరణం గురించి మాట్లాడుతూ “చావు అందరకీ ఒకటే అయినా/ అందరి చావూ మన కొక్కటి కాదు/ నియంతల అధికార దాహానికి సోపానాలయ్యే వాళ్లు/ దుష్ట వ్యవస్థని బతికించ చూచేవాళ్లు… / చావటమే మంచిది/ ముమ్మాటికీ ఆ చావుని మనం హర్షించటం కూడా సక్రమమైందే” అంటారు.
“అజేయం” కవితా సంపుటి (1974)లో “కవులేం జేస్తారు” కవితలో “కవులేం జేస్తారు / గోడలకు నోరిస్తారు/ చెట్లకు కళ్లిస్తారు/ గాలికి గొంతిస్తారు/ … ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారు/ ప్రజలకు చేతులిస్తారు/ ప్రజల చేతుల్లో అనంతశక్తి సంపన్నమైన పద్యాన్ని పెడతారు” అంటూ కవి యొక్క విధుల్ని, బాధ్యతల్ని చెప్తాడు శివారెడ్డి. 1997 లో రాసిన “నా కలల నడి అంచున” కవితా సంపుటి లోని అదే కవితలో “మనిషి బువ్వ తింటానికి ఎన్ని యుగాలు పట్టింది / తన బువ్వ తను తింటానికి ఇంకెన్ని యుగాలు పడుతుంది/ అంటూ దోపిడీ నుండి మనిషి ఎంత కాలానికి విముక్తి చెందుతాడోననే భావన వ్యక్తీకరిస్తాడు కవి.
1999లో రాసిన వర్షం వర్షం కవితా సంపుటిలో “వాళ్లు మాట్లాడుకుంటున్నారు” కవితలో “ఎన్‌కౌంటర్లన్నీ బూటకపు హత్యలే/ పదవ పౌర హక్కుల మహాసభల్ని జయప్రదం చేయండి” అనే వాక్యాలతో ఆనాడు జరుగుతున్న నీతి నిజాయితీని ఎత్తి చూపాడు కవి.
2003లో “వృత్త లేఖిని” కవితా సంపుటిలో ‘ఆగస్టు 28’ కవితలో పాలకుల దౌర్జన్యాలను ఖండిస్తూ “పేడిమూతి పరిపాలకుల వికృత చేష్టకు/ పిరికి తనానికి / ముళ్లతడికెలూ బాష్ప వాయువులు/ ఆశ్విక దాడులూ/ తుపాకీ కాల్పులూ/ ఒక కొండ గుర్తు/ ఎందుకంత భయం/ దమ్ముంటే జనం మధ్యకురా/ రక్షణ కవచాలు / పోలీసు వలయాలు లేకుండా’ అంటూ పాలకులకు సవాలు విసురుతాడు కవి.
ప్రజల రహస్య భాష తెలిసిన కవి శివారెడ్డి. అందుకే అంటాడు “ఇప్పుడు భాష పగుల్తుంది/ సమస్త పేలుడు పదార్థాలన్నిటినీ గర్భీకరించుకుని/ భాష పగులుతుంది/ శబ్దం మిగుల్తుంది/ నీ క్రోధానికి సరికొత్త భాష దొరుకుతుంది ” అంటాడు. ఈనాటి సామాజిక రుగ్మతలు, విధ్వంసక చర్యలు ఎత్తి చూపాలంటే సరికొత్త పదబంధాలు గల భాష అవసరమనేది శివారెడ్డి ఉద్దేశం. శివారెడ్డి అంతర్జనం, పొసగనివన్నీ, గగనమంత తలతో, అతని చరిత్ర మొదలగు కవితా సంపుటాల్లోని కవితల క్రమాన్ని పరిశీలించినట్లయితే ఈ కవి కాలంతో కలసి నడిచినట్లుగా, దిన దిన ప్రవర్ధమానంగా కవితా శక్తి ఇనుమడించినట్లుగా ఈయన దృష్టికి, చూపుకి, స్వచ్ఛత ఉన్నట్టుగా తోస్తుంది. ఈయనకు అనుభవాన్ని పునరనుసంధానం చేసుకునే శక్తి ఉంది. భాషా సామగ్రి వీరికుంది.
2018 నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్‌గా కె. శివారెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాల తరపున పని చేస్తున్నారు. అకాడెమీ కార్యకలాపాలకు ఎటువంటి విఘాతం కలుగకుండా అండదండలందిస్తూ సాహిత్య సేవ చేస్తున్నారు. ఎందరో నవ కవులను , యువ కవులను ప్రోత్సహిస్తున్నారు. వీరికి గత సంవత్సరం 2017కు గాను కబీరు సమ్మాన్ అవార్డు వచ్చింది. ఈ సంవత్సరం 2018 బిర్లా ఫౌండేషన్ వారి ‘సరస్వతి సమ్మాన్‌” అవార్డు వరించింది. ఈయన కవిత్వాన్ని ఓ సందర్భంగా ఓ సమూహంగా పరిగణింపవచ్చును. ప్రజాస్వామ్యానికి ప్రాణ గండ మొచ్చిందనే సందర్భాన్ని ఎత్తి చూపుతూ ఒక సంఘటిత శక్తిగా ఒంటరితనాన్ని వీడి సమూహంగా నిలబడి పోరాడినప్పుడే ప్రజాస్వామ్యం నాలుగు పాదాల మీద నడుస్తుందనే భరోసా ఇచ్చే కె. శివారెడ్డి గారికి అభినందనలు తెలియజేద్దాం. అవార్డు వచ్చిన సందర్భంగా వారి కవిత్వానికి జేజేలు పలుకుదాం.

కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి
9948774243

Article about Poet K. Shiva Reddy

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సరస్వతి సమ్మానితుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: