ప్రమాదం అని తెలిసినా…. ఆగని అతి వేగం

మృత్యువాత పడుతున్న, వికలాంగులవుతున్న కుటుంబ పెద్దలు వీధిన పడుతున్న ఎన్నో కుటుంబాలు మూడు ప్రమాదాలు మన తెలంగాణ/నాగిరెడ్డిపేట:  అతివేగంతో వాహనాలు నడిపిస్తే ప్రమాదమని తెలిసినప్పటికీ నాగిరెడ్డిపేట మండలంలో వాహనాల అతివేగం తగ్గడం లేదు. అతివేగాన్ని ఆపేవారు లేక మండలంలో అధికశాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఆదివారం మెదక్ జిల్లాలోని ఓ గ్రామంలో నిశ్చితార్థం జరుపుకొని ఆటోలో తిరుగు ప్రయాణం అవుతుండగా పరమాల్ల గ్రామానికి చెందిన రాజు ఆటో బోల్తాపడి అక్కడికక్కడే మృతి చెందగా అతని తల్లి, తండ్రి, […]

మృత్యువాత పడుతున్న, వికలాంగులవుతున్న కుటుంబ పెద్దలు
వీధిన పడుతున్న ఎన్నో కుటుంబాలు
మూడు ప్రమాదాలు

మన తెలంగాణ/నాగిరెడ్డిపేట:  అతివేగంతో వాహనాలు నడిపిస్తే ప్రమాదమని తెలిసినప్పటికీ నాగిరెడ్డిపేట మండలంలో వాహనాల అతివేగం తగ్గడం లేదు. అతివేగాన్ని ఆపేవారు లేక మండలంలో అధికశాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఆదివారం మెదక్ జిల్లాలోని ఓ గ్రామంలో నిశ్చితార్థం జరుపుకొని ఆటోలో తిరుగు ప్రయాణం అవుతుండగా పరమాల్ల గ్రామానికి చెందిన రాజు ఆటో బోల్తాపడి అక్కడికక్కడే మృతి చెందగా అతని తల్లి, తండ్రి, వదిన పలువురు తీవ్రంగా గాయపడి వికలాంగ పరిస్థితి ఏర్పడింది. అంతకు ముందు గోలిలింగాల గ్రామం వద్ద ఓ ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 26న నాగిరెడ్డిపేటకు చెందిన బాల్‌రాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

జాన్కంపల్లి గేటు వద్ద ఆగివున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆటోలో ఉన్నవారికి తీవ్రగాయాలై ఇప్పటికీ చికిత్స పొందుతూనే ఉన్నారు. వాగులమోరి వద్ద మండల కేంద్రానికి చెందిన సాకలి దుర్గయ్య రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించాడు. జనవరి 22న తాండూర్ గేటు వద్ద రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న తాండూర్ గ్రామానికి చెందిన దివిటి విఠల్ అక్కడికక్కడే మృతి చెందగా సాయిబాబు అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అంతకు ముందు మండల కేంద్రంలోని పోచారం కెనాల్ బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాదంలో మాసానిపల్లి గ్రామానికి చెందిన సాయవ్వ మృతి చెందింది. ఇలా నాగిరెడ్డిపేట మండలం ప్రధాన రహదారి అటు మెదక్, ఇటు ఎల్లారెడ్డి మండల బార్డర్‌లో జిల్లాలో ఎక్కడ జరగనన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. జరిగిన ప్రమాదాలలో పోలీసు కేసు నమోదు కానివి మరెన్నో ఉన్నాయి. డ్రైవింగ్ చేసే వారికి లైసెన్సులు లేక ఇతరత్ర కారణాల వలన ప్రాణాపాయం జరగని ప్రమాదాల్లో గాయపడిన వారు నేరుగా ఆసుపత్రికి వెళ్ళి చికిత్సలు చేయించుకున్నారు.

ప్రమాదాల వలన వీధిన పడుతున్న ఎన్నో కుటుంబాలు:

ఈ అతివేగంతో జరుగుతున్న ప్రమాదాలలో కుటుంబాన్ని పోషించే యజమాని, ఆ కుటుంబానికి ఆధారమైన వ్యక్తులు చనిపోవడం లేదా తీవ్ర గాయాలు అయ్యి ఎటువంటి పని చేయలేని పరిస్థితిలో వికలాంగులు అవ్వడం వల్ల వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కుటుంబాలను పోషించే వారు ప్రమాదాలకు గురి కాగా వందల కుటుంబాల జీవన పరిస్థితులు దుర్భరమవుతున్నాయి. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోనే వాహనాలు అతివేగంగా వెళ్ళినా పట్టించుకునే నాథుడు లేడు. అందువల్ల నాగిరెడ్డిపేట మండలం పోచారం నుండి ఎల్లారెడ్డి వైపు ఆత్మకూర్ గేటు వరకు అధిక సంఖ్యలో వారానికి ఓ ప్రమాదం జరుగుతూనే ఉంది. జరిగిన ప్రమాదాలన్నీ ప్రాణనష్టం జరిగితే ప్రాణాపాయ పరిస్థితులు ఉంటే పోలీసు కేసులు నమోదు అవుతున్నాయి. పోలీసు కేసులు నమోదు కానివి అనేకం ఉన్నాయి.

ప్రమాదాల అడ్డ:

మండల కేంద్రం సమీపంలో ఉన్న వాగులమోరి అనగానే ప్రమాదాల బ్రిడ్జిగా పేరొందింది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళే లారీలు అతివేగంతో ఆ బ్రిడ్జిని ఢీకొనడం, వాగులో పడడం, ఎదురుగా వచ్చే వారిని ఢీకొనడం ఇలా గత అనేక సంవత్సరాల నుండి ఆ బ్రిడ్జి వద్ద ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డుకు ఇరుప్రక్కల ఉన్న బ్రిడ్జి గోడ పూర్తిగా ప్రమాదాలకు కూలిపోగా నాగిరెడ్డిపేటలో పని చేసిన ఎస్సై సీతారాములు బ్రిడ్జి పై శ్రద్ధ వహించి ప్రక్కగోడలు కట్టించాడు. అలా ఎన్నిసార్లు కట్టించినా బ్రిడ్జి వెడల్పు లేక ప్రమాదాలకు నిలయంగా వాగులమోరి పేరొందింది. ఇలా ప్రమాదాలను నియంత్రించేందుకు సంబంధిత అధికారులు శ్రద్ధ వహించి వేగంతో వెళ్తున్న వాహనాల పై పకడ్బందీ చర్యలు తీసుకుంటే తప్ప వేగంగా నడిపించే వాహనదారులకు భయం ఉండదని, అతివేగానికి పెద్దఎత్తున జరిమానాలు విధిస్తే అతివేగాలు తగ్గుతాయన్న అభిప్రాయాలున్నాయి. అధికారులు చర్యలు తీసుకొని అతివేగాలను తగ్గించి ప్రమాదాలు జరగకుండా ప్రమాదాలలో మరణించిన, తీవ్రంగా గాయపడి వికలాంగులై వారి కుటుంబాలు వీధిన పడుతున్న ఘోరమైన పరిస్థితులు ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకుంటారని పలువురు అడుగుతున్నారు.

 

More Accident in Kamareddy in Telangana

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: