మేడారం జాతరకు కలగా మిగిలిన జాతీయ హోదా

మేడారానికి ఇవ్వని గుర్తింపు ఉపరాష్ట్రపతి మాటకు దక్కని విలువ వచ్చే మహాజాతర వరకైనా ప్రయోజనం కలిగేనా నిరీక్షణలో భక్తజనం మనతెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన మేడారానికి అర్హమైన జాతీయ హోదా కల్పిస్తామన్న మాట కలగా మిగిలినట్టయింది. కుంభమేళాను తలపించే స్థాయిలో రాష్ట్రేతర  ప్రాంతాల నుంచి అసంఖ్యాక భక్తజనం హాజరయ్యే ఆదివాసీ ఆరాధ్య దైవలైన సమ్మక్క, సారలమ్మల జాతరకు హామీ ఇచ్చి రోజులు గడుస్తున్నాయే తప్ప  ప్రయోజనం చేకూరలేదు. మొత్తానికి పాలకుల నిర్లక్ష్యం వల్ల  […]

మేడారానికి ఇవ్వని గుర్తింపు
ఉపరాష్ట్రపతి మాటకు దక్కని విలువ
వచ్చే మహాజాతర వరకైనా ప్రయోజనం కలిగేనా
నిరీక్షణలో భక్తజనం

మనతెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన మేడారానికి అర్హమైన జాతీయ హోదా కల్పిస్తామన్న మాట కలగా మిగిలినట్టయింది. కుంభమేళాను తలపించే స్థాయిలో రాష్ట్రేతర  ప్రాంతాల నుంచి అసంఖ్యాక భక్తజనం హాజరయ్యే ఆదివాసీ ఆరాధ్య దైవలైన సమ్మక్క, సారలమ్మల జాతరకు హామీ ఇచ్చి రోజులు గడుస్తున్నాయే తప్ప  ప్రయోజనం చేకూరలేదు. మొత్తానికి పాలకుల నిర్లక్ష్యం వల్ల  ఆశ నెరవేరనందువల్ల భక్త జనాన్ని నిరాశకు గురిచేస్తున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చిన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భక్తులు అంటున్నారు. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, భారత ఉపరాష్ట్రపతి అంతటి ప్రముఖులు నాడు అమ్మల సాక్షిగా భక్త జనానికి ఇచ్చినమాట ఏకారణం చేతనో ఇంత వరకు ఆచరణకు రాలేదు. అదే జరిగితే మేడారం ఖ్యాతి విశ్వవ్యాప్తమయ్యేది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మాఘశుద్ధ పూర్ణిమ సందర్భంగా రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు రోజులపాటు మహాజాతర జరుగుతుంది. దీంతో అభయారణ్యం భక్తజన గుడారంగా జనారణ్యంగా మారుతుంది. అప్పుడు అడవిలో ఏచెట్టూ పుట్టను చూసిన ఎటూ 30కిలోమీటర్ల వైశాల్యంతో ఇసుకవేస్తే రాలనంత భక్తజనంతో మేడారం కిటకిటలాడుతుంది. గత సంవత్సరం జరిగిన మహాజాతర అనంతరం సరిగ్గా సంవత్సరానికి అదేమాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా అప్పుడు కూడా మూడు రోజులపాటు ఈనెల 20నుంచి 23వరకు చిన్న మేడారం జాతర జరగనున్నది.

ఆరు రాష్ట్రాల భక్తులు హాజరు

ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా వంటి రాష్ట్రాల నుంచి మహాజాతరకు సుమారు రెండు కోట్లకు మించి భక్తజనం హాజరవుతారు. అయితే మహిమగల తల్లులు అని భావించి వచ్చే భక్తులు మేడారంలో ఈసందర్భంగా బంగారు తల్లులకు ఎత్తు బంగారం(బెల్లం) తూకం వేయడం జరుగుతుంది. సంప్రదాయం ప్రకారం ఒడివాల బియ్యం, కాలిగజ్జలు, వీరగోల ధరించి పూనకాలతో చీరజాకెట్‌లు ధరించి వచ్చే స్త్రీ, పురుష భక్తులతో జాతరలో ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. ఎదురుకోడి పిల్లలను ఇచ్చి జంతుబలులను చేసే ఆపసుపు కుంకుమల తల్లులకు తలనీలాలతోపాటు కానుకలు ఇచ్చి గిరిజన దేవతలకు మొక్కలు అందజేస్తారు. మహాజాతరకు అయితే విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కలు తీర్చుకుంటారు.
నాడు మేడారం పరిసర ప్రాంతాలకే పరిమితం

సుమారు వంద సంవత్సరాల క్రితం కాలినడకన, ఎడ్లబండ్లతో వచ్చే పరిసర ప్రాంతాల వారికే ఈజాతర పరిమితమయ్యేది. నాడు రాత్రులు దివిటీల వెలుగులలో ఉన్నంతలో కన్నులపండువగా మేడారం వేడుక జరిగేది. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు ప్రవర్థమానమవుతున్న ఈజాతర ఇప్పుడు విద్యుత్‌దీప కాంతుల వెలుగులే కాకుండా హెలీక్యాప్టర్‌లు, బస్సులు, ప్రైవేటు వాహనాల రద్దీతో మేడారం ఇప్పుడు కలకలలాడుతుంది. ఈవిధంగా మేడారానికి ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఆదరణ, రద్దీకి తోడు ఎక్కువవుతున్న హుండీ ఆదాయం జాతరకు ప్రాధాన్యతను చేకూర్చింది. ఈజాతర దేవాదాయశాఖ పరిధిలోకి సుమారు రెండు దశాబ్దాల కాలం క్రితం 1996లో దీనిని రాష్ట్రీయ పండగగా ప్రభుత్వం గుర్తించింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, సీఎంల తాకిడి ఈ గిరిజన జాతరకు పెరిగింది.

ఉపరాష్ట్రపతి సందర్శన

2018లో జరిగిన మహాజాతర సందర్భంగా ఛత్తీస్‌గడ్ సిఎం రమణ్‌సింగ్, భారత గిరిజన సంక్షేమశాఖ మంత్రి జూయల్ బెరం, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులు తల్లులను దర్శించి మొక్కులను చెల్లించారు. గిరిజన సంప్రదాయంతో ప్రత్యేక ఆకర్షణగా జరిగే ఆ జాతరకు హాజరైన అసంఖ్యాక భక్తజనాన్ని చూసి వారు మురిసిపోయారు.

జాతీయ హోదా కల్పిస్తాం

అంతర్జాతీయ స్థాయిలో కుంభమేళాను తలపించే ఈ ఆదివాసీ జాతరకు త్వరలో జాతీయ హోదా కల్పిస్తామని తల్లుల గద్దెల వద్ద భక్తులకు ఉపరాష్ట్రపతితోపాటు గిరిజన సంక్షేమశాఖ మంత్రి హామీ ఇచ్చారు. వారు మాట ఇచ్చి సంవత్సరం గడిచి మినీ జాతర వచ్చినా ఆ హామీ కనీసం ప్రతిపాదనలకు కూడా నోచుకోలేదు. జాతీయ హోదాను ఇస్తే జాతర నిర్వహణకు రాష్ట్ర వాటాకు మించి కేంద్రం అదనంగా భారీగా నిధులు కేటాయించి ప్రత్యేక గుర్తింపు కలిగి జాతర ఖ్యాతి ఊహించని స్థాయికి చేరుతుంది. ఇప్పటికైనా ఇచ్చిన హామీ మేరకు వచ్చే మహాజాతరనాటికైనా కేంద్రం మేడారానికి జాతీయ హోదా కల్పించి అదనపు నిధులు కేటాయిస్తే భక్తులకు మరింత సౌకర్యం కలుగుతుంది. ఆదిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని భక్తులు కోరుతున్నారు.

 

National Status not Give to Medaram Jatara

 

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: