పేదల వైద్యం పెనుభారం

  ఆయుర్వేదానికి మన భారత దేశమే పుట్టిల్లు. ఇక్కడి ఔషధాల ఉత్పత్తి ప్రపంచ ప్రఖ్యాతి కాంచడమే కాకుండా విదేశాలకు కూడా ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి. కానీ ఏం లాభం? పెరటి చెట్టు మందుకు పనికి రాదన్న చందంగా మన ఔషధాలు మనకే అందుబాటులో లేకుండా పోతున్నాయి. ధరాభారంతో పేద ప్రజలు కొనలేకపోతున్నారు. ఆరోగ్యం కోసం మన దేశంలో పేదలు సంపాదనలో చాలా వరకు ఖర్చు పెట్టవలసి వస్తోంది. చాలీచాలని ఆదాయంతో ఎలాగో బతుకులను నెట్టుకొస్తున్న పేద కుటుంబాలకు […]

 

ఆయుర్వేదానికి మన భారత దేశమే పుట్టిల్లు. ఇక్కడి ఔషధాల ఉత్పత్తి ప్రపంచ ప్రఖ్యాతి కాంచడమే కాకుండా విదేశాలకు కూడా ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి. కానీ ఏం లాభం? పెరటి చెట్టు మందుకు పనికి రాదన్న చందంగా మన ఔషధాలు మనకే అందుబాటులో లేకుండా పోతున్నాయి. ధరాభారంతో పేద ప్రజలు కొనలేకపోతున్నారు. ఆరోగ్యం కోసం మన దేశంలో పేదలు సంపాదనలో చాలా వరకు ఖర్చు పెట్టవలసి వస్తోంది. చాలీచాలని ఆదాయంతో ఎలాగో బతుకులను నెట్టుకొస్తున్న పేద కుటుంబాలకు నిత్యం ఆకలి, అనారోగ్యం వెంటాడడం సర్వసాధారణమయింది. ఎవరికి ఏ రోగం వచ్చినా వైద్యం చేయించడానికి తమ సంపాదనలో చాలా వరకు ఖర్చు పెట్టక తప్పడం లేదు. ఫలితంగా ఆయా పేద కుటుంబాలు కనీసం రెండు రోజులైనా పస్తులు ఉండాల్సిందేనని 2013లో సుప్రీంకోర్టు నగ్న సత్యాన్ని బయటపెట్టింది. భాగ్యవంతులకే ఆరోగ్యం తప్ప నిరుపేదలకు కాదన్న రీతిలో పరిస్థితులు తయారయ్యాయి. వైద్య సేవల ఖర్చులో 78 శాతాన్ని జనం తమ సంపాదనలో నుంచి భరిస్తుండగా, అందులో 72 శాతం మందుల కొనుగోలుకే ఖర్చవుతోందని 2013 నాటి అధ్యయనం వెల్లడించింది. ఫలితంగా పేద కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. మెడికల్ బిల్లుల భారం తడిసి మోపెడవుతుండడంతో చాలా కుటుంబాలు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తెచ్చుకుని అత్యవసరాలు తీర్చు కొంటున్నారు.
ప్రపంచం మొత్తం మీద 100 మిలియన్ ప్రజలు ఆరోగ్య భద్రతకే ఎక్కువ ఖర్చు పెట్టి మరింత కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తుండగా అందులో సగానికి సగం మంది మన దేశంలోనే ఉన్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వివిధ ప్రక్రియల ద్వారా సేకరించిన గణాంకాలను పరిశీలించగా 63 మిలియన్ మంది కన్నా ఎక్కువ మంది తమ సంపాదనలో అధిక భాగం వైద్యం కోసమే ఖర్చు పెడుతున్నట్టు స్పష్టమయింది. మొత్తం మీద 800 మిలియన్ మంది తమ కుటుంబ ఆదాయంలో 10 శాతం వైద్యానికే ఖర్చు పెడుతున్నారు. మొత్తం 97 మిలియన్ మందిలో 49 మిలియన్ మంది భారత దేశంలోని వారే కాగా వైద్యానికి తలకు మించి ఖర్చు పెట్టవలసి వస్తోంది. దీంతో వారు తమ కుటుంబ అవసరాల కోసం రోజువారీ రూ. 122 కన్నా ఎక్కువ వెచ్చించ లేకపోతున్నారని స్పస్టమయింది. ఒక బిలియన్ కన్నా ఎక్కువ మంది అత్యధిక రక్తపోటుతో బాధ పడుతుండగా వీరిలో 200 మిలియన్ మహిళలు కుటుంబ నియంత్రణ పరిధిలోకి రావడం లేదు. 20 మిలియన్ పసికందులు డిఫ్తీరియా, టిటానస్, తదితర వ్యాధుల నుంచి రక్షణ కోసం టీకాలు, ఇంజెక్షన్ల వంటివి పొందలేకపోతున్నారు.
దేశ జనాభాలో 17.3 శాతం కుటుంబాలు తమ సంపాదనలో 10 శాతానికి మించి ప్రతి నెలా ఆరోగ్య భద్రతకు ఖర్చు పెడుతున్నారని మరో అధ్యయనం వెల్లడించింది. అలాగే జనాభాలో 4 శాతం మంది తమ కుటుంబ ఆదాయం నుంచి 25 శాతం కన్నా ఎక్కువగానే ఖర్చు పెడుతున్నారు. దీన్ని బట్టి మన దేశంలో ప్రజారోగ్య భద్రత వ్యవస్థకు ప్రభుత్వం ఎంత నిధులు అందిస్తోందో, పేద ప్రజలు స్వంతంగా ఎంత భరించవలసి వస్తోందో తెలుస్తోంది. రెండేళ్ల క్రితం ఆరోగ్య మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్ దేశంలోని మొత్తం జనాభాలో 27 శాతం అంటే దాదాపు 35 కోట్ల మంది మాత్రమే ఆరోగ్య బీమాను పొందగలుగుతున్నట్టు అధ్యయనంలో వెల్లడించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ ఆఫ్ బ్యూరో (ఎస్‌సిఆర్‌బి) వివరాల ప్రకారం భారతదేశంలో 2015లో ఆత్మహత్యలు చేసుకున్న 1.3 లక్షల మందిలో 16 శాతం అంటే 20 వేల మంది తీవ్ర రోగాల బారినపడి చనిపోయారని తేలింది. చాలా మంది వైద్య చికిత్స ఖర్చులు భరించలేకనే ఆత్మహత్యల వరకు తెగిస్తున్నారు.
‘బ్రిక్స్’ ఇతర వర్ధమాన దేశాల్లో తలసరి వైద్యానికి ఖర్చును పరిశీలిస్తే బ్రెజిల్‌లో 947 డాలర్లు, రష్యాలో893 డాలర్లు, దక్షిణాఫ్రికాలో 570 డాలర్లు, టర్కీలో 568, మలేసియాలో 456, చైనాలో 420, ఇండోనేసియాలో 99, భారత్‌లో 75 డాలర్ల వంతున తలసరి ఖర్చు జరుగుతోంది. దీన్ని బట్టి మన దేశంలో ఆరోగ్య భద్రతకు ఎంత కనిష్టంగా ప్రభుత్వం ఖర్చు పెడుతుందో తెలుస్తోంది.
మందుల వ్యయ నియంత్రణ ఎక్కడ?
మందుల వ్యయ భారాన్ని నియంత్రిస్తామని ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తుండడం పరిపాటి. జాతీయ ఔషధ ధరల విధానాన్ని 2013లో కేంద్ర ప్రభుత్వం తెర పైకి తెచ్చింది. మందుల ధరల నియంత్రణ ఉత్తర్వులోని నిబంధనల మేరకు విధానాన్ని అమలు చేయడానికి ఒక వ్యవస్థ ఏర్పాటయింది. జాతీయ ఔషధాల అత్యవసర పట్టిక కింద 348 రకాల మందులను కేంద్రం చేర్చింది. కానీ తరువాత ధరల నియంత్రణ చిట్టాలో కేవలం 74 మందులే ఉన్నట్టు తేలింది. అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో హృద్రోగాలు, క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులకు ఉపయోగించే మందుల ధరలు 40 నుంచి 75 శాతం వరకు తగ్గుతాయని అధికార వర్గాలు ఆనాడు నమ్మ బలికాయి. గతంలో చైనా యుద్ధం తరువాత మొట్టమొదటిసారి మందుల ధరల నియంత్రణ ఆదేశాలు 1963లో వెలువడ్డాయి. ఆ తరువాత 1978, 1986, 1994 సంవత్సరాల్లో అప్పటి ఔషధ విధానాలకు తగినట్టు ధరల నియంత్రణ ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి. 2002లో అప్పటి ఔషధ విధానంపై వివాదాలు తలెత్తి సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి. దానిపై ప్రాణావసర మందులు ఏమిటో సమీక్షించాలని సుప్రీంకోర్టు 2002 మార్చిలో ఆదేశించగా, 2002 ఔషధ విధానాన్ని ఎత్తివేసి 1994 విధానాన్నే కొనసాగించారు. మళ్లీ సుప్రీంకోర్టు హెచ్చరించే వరకు దీనిపై దృష్టి పెట్టలేదు. నియంత్రణ జాబితాలోని మందుల విక్రయాల నుంచి కూడా అత్యధికంగా లాభాలు పిండుకున్నట్టు అధ్యయనంలో బయటపడింది.
1990లో రూ. 5000 కోట్లుగా ఉన్న ఔషధ పరిశ్రమ టర్నోవర్ 2009 10 నాటికే లక్ష కోట్లు దాటింది. ఇందులో 40 శాతం వరకు ఎగుమతులే ఉన్నాయి. మందుల ఉత్పత్తిలో ప్రపంచంలో మూడవ స్థానంలో మన దేశం ఉన్నప్పటికీ పేదలకు వచ్చే ప్రయోజనం ఏమీ కనబడడం లేదు. ప్రాణాంతక నకిలీ మందుల బెడదే ఎక్కువగా ఉంటోంది. దీంతోపాటు విదేశాల్లో నిషేధించిన మందులు కూడా ఇక్కడకు వచ్చి చేరుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలు నమ్మకంగా కొంటున్న మందుల్లో సగానికి సగం నకిలీవి, పనికి మాలినవిగా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అయినా ఆ దిశగా ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేకపోతోంది. మన దేశం నుంచే ప్రపంచ దేశాలకు ఆధునిక ఔషధాలు ఎగుమతి అవుతున్నా వాటి ధరలు మన దేశంలోనే అందుబాటులో ఉండడం లేదు. 2014 గణాంకాల ప్రకారం ఔషధాలు కొనలేక, ధరల భారం మోయలేక 3.8 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారుతున్నారన్నది వాస్తవం.

పి.వెంకటేశం
9985725591

India is Mother home to Ayurveda

Related Images:

[See image gallery at manatelangana.news]