510 ఎంపిటిసిలు ఖరారు

  లెక్క తేల్చిన అధికారులు ఎంపిటిసిల పునర్విభజన పూర్తి నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ ఈ నెల 23, 24 తేదీల్లో అభ్యంతరాల పరిశీలన ఈ నెల 25న తుది జాబితా ప్రకటన మేలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మండల ప్రాదేశిక నియోజక వర్గాల (ఎంపిటిసి) పునర్వీభజన కసరత్తు పూర్తైంది. ఈ మేరకు బుధవారం ముసాయిదా ప్రతిపాదను ప్రకటించి దానిపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిం చనున్నారు. ఉమ్మడి ఖమ్మం […]

 

లెక్క తేల్చిన అధికారులు
ఎంపిటిసిల పునర్విభజన పూర్తి
నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ
ఈ నెల 23, 24 తేదీల్లో అభ్యంతరాల పరిశీలన
ఈ నెల 25న తుది జాబితా ప్రకటన

మేలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మండల ప్రాదేశిక నియోజక వర్గాల (ఎంపిటిసి) పునర్వీభజన కసరత్తు పూర్తైంది. ఈ మేరకు బుధవారం ముసాయిదా ప్రతిపాదను ప్రకటించి దానిపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిం చనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 510 ఎంపిటిసిలను ఖరారు చేశారు. పాత జిల్లాలో ఉన్న ఎంపిటిసిల సంఖ్యతో పోల్చితే ఇప్పుడు 24 ఎంపిటిసిల స్థానాలు తగ్గాయి.

మన తెలంగాణ/ఖమ్మం: అవిభాజ్య ఖమ్మం జిల్లాలో మొత్తం 587 ఎంపిటిసి స్థానాలు ఉండేవి. జిల్లాల విభజన అనంతరం ఖమ్మం జిల్లా పరిధిలోకి 306 ఎంపిటిసి స్థానాలు పోగా, భదాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోకి 242 స్థానాలు మిగిలాయి. మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి వెళ్ళిన గార్ల, బయ్యారం మండలాల్లో 23, ప్రస్తుతం ములుగు జిల్లా పరిధిలోకి వెళ్ళిన వెంకటాపురం, వాజేడు మండలాల్లో 23 ఎంపిటిసి స్థానాలు వెళ్ళాయి. అయితే జిల్లాల పునర్విభజన సమయంలో కొన్ని కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఆరు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. ఇక్కడ భద్రాచలం, సారపాక పంచాయతీలకు ఎన్నికలు కూడా జరపలేదు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో వైరా మండలం కేంద్రం మున్సిపాల్టీగా అప్‌గ్రేడ్ అయ్యింది.

ఖమ్మం రూరల్ మండలంలోని కొన్ని గ్రామాలు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం అయ్యాయి. ఉమ్మడి జిల్లా విభజన సమయంలో ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో వీలీనం అయ్యాయి. దీంతో 22 ఎంపిటిసి స్థానాలు ఆ రాష్ట్రం పరిధిలోకి వెళ్ళాయి. ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పంచాయతీల పునర్విభజన జరిగి కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. తండాలను, గూడెంలను నూతన పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఒక ఖమ్మం జిల్లాలోనే 167 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. ఈనేపధ్యంలో ఎంపిటిసిల పునర్విభజన అనివార్యం అయ్యింది. గత వారం రోజుల నుంచి జిల్లా పరిషత్ అధికారులు కసరత్తు చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేల లోపు జనాభాకు ఒక ప్రాదేశిక నియోజకవర్గం వచ్చేటట్లు పునర్విభజన చేశారు. దీంతో ఒక ఖమ్మం జిల్లాలోనే 18 ఎంపిటిసిలు తగ్గాయి.

ఈ జిల్లాలో గతంలో 306 ఎంపిటిసి స్థానాలు ఉండగా వివిధ కారణాల వల్ల 18 ఎంపిటిసి స్థానాలు రద్దు అయ్యాయి. దీంతో ఇప్పుడు ఈ జిల్లాలో ఎంపిటిసిల సంఖ్య 289కి చేరింది. గత ఎంపిటిసిల సంఖ్యతో పోల్చితే 18 తగ్గినట్లు చెప్పవచ్చు. వైరా మున్సిపాల్టీగా అవిర్భవించడం వల్ల వైరా, కొణిజర్లలోని కొన్ని ఎంపిటిసిలు రద్దు అయ్యి మున్సిపాల్టీలో విలీనమైయ్యాయి. దీంతో వైరా మండలంలో ఉన్న మొత్తం ఎంపిటిసిల సంఖ్య 16 నుంచి 10కి తగ్గిపోయాయి. అదేవిధంగా కొణిజర్ల మండలంలోని 18 ఎంపిటిసిల సంఖ్య 15కి తగ్గాయి. ఇక ఖమ్మం రూరల్ మండంలోని కొన్ని గ్రామాలు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో కలవడం వల్ల గతంలో ఇక్కడ 23 ఉన్న ఎంపిటిసిలు ఇప్పుడు 14కి తగ్గాయి. ఖమ్మం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రఘునాథపాలెం మండలంలో మాత్రం ఒక ఎంపిటిసి స్థానం పెరిగింది.

గతంలో (ఖమ్మం అర్బన్ మండలం)లో 13 ఎంపిటిసి స్థానాలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 15కి పెరిగింది. ఇక్కడ కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయడం వల్ల అదనంగా ఒక ఎంపిటిసి స్థానం పెరిగింది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 21 మండలాల్లో గతంలో 228 ఎంపిటిసి స్థానాలు ఉండగా ఇప్పుడు 221 ఎంపిటిసిలను ప్రతిపాదించారు. ఇక్కడ ఏడు ఎం పి టి సిలు తగ్గాయి. భద్రాచలం పంచాయతీ రద్దు అయినందున ఈ పరిస్థితి ఏర్పడింది. బూర్గంపహాడ్ మండలంలో గతంలో 18 ఎంపిటిసిలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 11కి చేరింది. గతంలో ఈ మండలంలో ఉన్న పంచాయతీలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. చండ్రుగొండ మండలం విడిపోయి కొత్తగా అన్నపురెడ్డిపల్లి మండలం ఏర్పాటైనందున గతంలో చండ్రుగొండ మండలంలో 18 ఎంపిటిసిలు ఉండగా ఇప్పుడు కేవలం ఎనిమిది ఎంపిటిసిలనే ప్రతిపాదించారు. మరో ఆరు ఎంపిటిసిలను అన్నపురెడ్డిపల్లి మండలానికి ప్రతిపాదించారు.

గుండాల మండలంలో గతంలో ఎనిమిది ఎంపిటిసిలు ఉండేవి. అయితే కొత్త పంచాయతీల ఏర్పాటు వల్ల ఈ మండలంలో ఇప్పుడు అదనంగా ఒక ఎంపిటిసి స్థానాన్ని ప్రతిపాదించడంతో ఆ సంఖ్య 9కి చేరింది. గుండాల నుంచి విడిపోయి కొత్తగా ఏర్పాటైన ఆళ్ళపల్లి మండలంలో నాలుగు ఎంపిటిసిలను ప్రతిపాదించారు. కొత్తగూడెం మండలం నుంచి వీడిపోయి కొత్తగా ఏర్పాటైన లక్ష్మిదేవిపల్లి మండలంలో 11, సూజాతనగర్‌లో 8, చుంచుపల్లిలో 12 ఎంపిటిసి స్థానాలను ప్రతిపాదించారు. అదేవిధంగా పినపాక మండలాన్ని విభజించి కొత్తగా కరకగూడెం మండలాన్ని ఏర్పాటు చేయడం వల్ల గతంలో పినపాక మండలంలో ఉన్న 14 ఎంపిటిసి స్థానాల్లో నాలుగు స్థానాలను కరకగూడెంలో చేర్చి పది స్థానాలను పినపాకకు పరిమితం చేశారు. ఇల్లందు మండలంలో మాత్రం గతంలో 17 ఎంపిటిసిలు ఉండగా ఇప్పుడు ఒక్క ఎంపిటిసిని తగ్గించారు.

ఇక మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి వెళ్ళిన గార్ల, బయ్యారం, ములుగు జిల్లా పరిధిలోకి వెళ్లిన వెంకటాపురం, వాజేడు మండలాల్లోని ఎంపిటిసిల సంఖ్యలో ఏలాంటి మార్పలు చేయలేదు. పాత వాటినే యధావిధిగా ప్రతిపాదించారు. ఇక మండలానికి ఒక జెడ్పిటిసి చొప్పున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 41 మండలాలకు గాను 41 జెడ్‌పిటిసిలను ప్రతిపాదించారు. ఖమ్మం జిల్లాలో 20, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21 జెడ్‌పిటిసిలను ప్రతిపాదించారు. ఎంపిటిసిల పునర్విభజన ముసాయిదా ప్రతిపాదనలను బుధవారం అధికారికంగా ప్రకటిస్తారు. వీటిపై నేటి నుంచి ఈ నెల 22 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను ఈ నెల 23, 24 తేదీల్లో పరిశీలించి పరిష్కరిస్తారు. తుది జాబితాను ఈ నెల 25న ప్రకటిస్తారు.

 

MPTCs final list announcement on Feb 25 in Khammam

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: