ఓ జ్ఞాపకం పుట్ల హేమలత!

  నెల్లూరు పట్టణంలోని ఓ సంప్రదాయ క్రిష్టియన్ కుటుంబంలో నల్ల కలువలా పుట్టి అందమైన తెల్లని పలువరసతో ఎవరు చూసినా ఇట్టే గుర్తుంచుకునే చందమామ లాంటి గుండ్రని ముఖంతో, స్వచ్ఛమైన నవ్వుతో ఏ మనిషినైనా తనవైపు తిప్పుకునే నా అందాల సుందరి పుట్ల హేమలత. తన పరిచయం ప్రజాస్వామిక రచయిత్రుల వేదికతోనే అయినప్పటికీ నాకు గత 5,6 సంవత్సరాలుగా అత్యంత సమీపంగా చేరువైన నేస్తం. ఇద్దరం కల్సి పంచుకున్న అనుభూతులు,అనుభవాలు చాలా ఎక్కువ. ఏమనిషినైనా సున్నితంగా విమర్షించగల […]

 

నెల్లూరు పట్టణంలోని ఓ సంప్రదాయ క్రిష్టియన్ కుటుంబంలో నల్ల కలువలా పుట్టి అందమైన తెల్లని పలువరసతో ఎవరు చూసినా ఇట్టే గుర్తుంచుకునే చందమామ లాంటి గుండ్రని ముఖంతో, స్వచ్ఛమైన నవ్వుతో ఏ మనిషినైనా తనవైపు తిప్పుకునే నా అందాల సుందరి పుట్ల హేమలత. తన పరిచయం ప్రజాస్వామిక రచయిత్రుల వేదికతోనే అయినప్పటికీ నాకు గత 5,6 సంవత్సరాలుగా అత్యంత సమీపంగా చేరువైన నేస్తం. ఇద్దరం కల్సి పంచుకున్న అనుభూతులు,అనుభవాలు చాలా ఎక్కువ. ఏమనిషినైనా సున్నితంగా విమర్షించగల నేర్పున్న మనిషి. జాలీ,దయలతో పాటు ఇతరుల అస్తిత్వాల పట్ల గౌరవభావం కలిగివుండటం, వారికి సహానుభూతిని పంచగల మనసున్న మనిషి. అలాంటి మంచి మనిషి అర్ధంతరంగా తన దేహాన్ని విడిచి వెళ్లడం వ్యక్తిగతంగా నాకు, మా స్నేహానికి తీరని వ్యధ.

ప్రజాస్వామిక రచయిత్రుల వేదికలో ఆమె ప్రయాణం మొదలైనప్పటి నుండి జాతీయ అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. గత సంవత్సరం జరిగిన నాయకత్వ మార్పులలో తన అనారోగ్య కారణాల వలన ఎక్కువ బాధ్యతలు మోయలేనని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ఏ విషయాన్నైనా ధైర్యంగా చర్చలోకి తెచ్చి తప్పొప్పులను సరిదిద్దుకునేలా సభ్యులను మెప్పించి పదేళ్ల ప్రరవే ప్రయాణాన్ని ముందుకు నడిపించిన కార్యదక్షురాలు. ఎప్పటికప్పుడూ సహకరించని తన అనారోగ్యాన్ని పక్కకునెట్టి ఉత్సాహంగా ప్రరవే అన్ని కార్యక్రమాల్లో ముందుండి విజయవంతం చేయడంలో కృషి చేసిన గొప్ప నాయకురాలు. బయటనుండి తన వర్గం వారు ఆమెపై వ్యక్తిగతంగా జరుపుతున్న దాడికి కొంత అసహనాన్ని ప్రకటించినప్పటికీ మరికొంత వెసులుబాటుతో అందరిని అస్తిత్వ పోరాటాలవైపు దృష్టి సారించేలా ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తూ ఆవైపుగా అడుగులు వేయించిన పోరాట యోధురాలు. ఒక కవయిత్రిగా,కథ,నవలా రచయిత్రిగా కన్నా అంతర్జాల పత్రిక విహంగానికి సంపాదకురాలిగా, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ప్రధాన నాయకురాలుగా స్వదేశంలోనే కాదు విదేశాలలో కూడా ఆమె ఉనికిని చాటుకున్నారు.

ప్రపంచం అంతా కంప్యూటర్ యుగంలోకి మునిగి తేలుతున్న వేళ తెలుగు సాహిత్యంలో కంప్యూటర్ వినియోగాన్ని గుర్తించి తన పరిశోధనను ఆదిశగా నడిపి అంతర్జాలంలో తెలుగు సాహిత్యం అంటూ ప్రయోగాత్మకంగా రెండుతరాల సాహిత్య కారులకు బోధనా మరియు సూచనలు చేస్తూ అంతర్జాల జ్ఞానాన్ని అందించిన ఉపాధ్యాయురాలు. గత ఎనిమిది సంవత్సరాలుగా ’విహంగ’ తెలుగు సాహిత్య వెబ్ పత్రికను నడుపుతూ ఎందరో తెలుగు రచయితలను సమాజానికి అతి సమీపంగా పరిచయం చేసిన నిబద్ధత కలిగిన ఒక మంచి మార్గదర్శకురాలు.

రచయితగా పుట్ల హేమలత తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి తన ఉనికిని చాటుకున్నారు. తన మొదటి కథ ’తిరిగిరాని పయనం’ అతి పిన్నవయసులో తన స్నేహితురాలి మరణాన్ని జీర్ణించుకోలేక బాధాతప్త హృదయంతో రాసారు. అది ఆనాటి ’క్రీస్తు రాజదూత’ అనే పత్రికలో ప్రచురించబడింది. మధ్యమధ్యలో కవిత్వం రాసినప్పటికీ 1982లో ’గూడు చేరిన గువ్వ’ నవల ఆనాటి ’స్పందన’ పత్రికలో ధారావాహికగా ప్రచురించబడింది. ఆతర్వాత 30 కథల వరకు రాసారు. కాకపోతే కవిత్వం గానీ,చాలా మటుకు కథలను ఆమె గ్రంథస్థం చేసుకోలేకపోవడం విచారించదగ్గ విషయం.

పుట్ల హేమలత గారికి తాను ఇంటర్మీడియట్ చదువుకుంటున్న రోజుల్లోనే ఎండ్లూరి సుధాకర్ గారితో పరిచయం ఏర్పడటం జరిగింది. ఆ స్నేహ పరిచయం ప్రేమగా,ప్రేమ పెండ్లిగా రూపాంతరం చెంది ఇద్దరినీ కులాంతర(కొద్ది తేడా)వివాహానికి ప్రోత్సహించిందిగా తను మనసువిప్పి చెప్పుకున్నారు. ప్రేమ వివాహాల్లో కొన్ని ఒడుదుడుకులు ఉన్నప్పటికినీ, ప్రేమ అన్నదే భగ్నమైపోతున్న కాలంలో వారి దాంపత్యం విజయవంతంగా నిలబడి ఇద్దరు ఆడ బిడ్డలని వారికి అందించిందని గర్వంగా చెప్పవచ్చు. డా. ఎండ్లూరి సుధాకర్ గారు కూడా ప్రగతిశీల భావజాలం, వర్గ దృక్ఫధం,అస్థిత్వవాదంతో ముందుకుపోతున్నప్రముఖ కవిగా తెలుగు సాహిత్యంలో సుపరిచితులే. గత కొన్ని సంవత్సరాలుగా వారు రాజమండ్రి తెలుగు యూనివర్సిటీ శాఖకు సంచాలకులుగా పనిచేసి ఇటీవలే ఉద్యోగరీత్యా సెంట్రల్ యూనివర్సిటీకి బదిలీ అయి హైదరాబాదులో స్థిరపడ్డారు. ప్రస్తుతం వారు అక్కడి తెలుగుశాఖలో ప్రొఫెసర్ పనిచేస్తున్నారు. వారి పెద్ద బిడ్డ మానస ఎండ్లూరి కూడా తల్లిదండ్రుల సాహిత్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని యువ, వర్ధమాన, కథారచయిత్రిగా తెలుగు సాహిత్యంలో దూసుకుపోతున్నారు. రెండవ బిడ్డ మనోజ్ఞ హైదరాబాదులో సాఫ్టువేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు.

పుట్ల హేమలత గారు ఉద్యోగ ధర్మాన్ని తన జీవితాంతం వరకు రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయంలో తాత్కాలిక ఇంస్ట్రక్టర్ గా నిర్వహిస్తూ ఎంతోమంది దళిత,బహుజన,పేద విద్యార్థులను తెలుగు సాహిత్యానికి పరిచయం చేసేపనిలో నిమగ్నమై వున్నారు. తెలుగు సాహిత్యంలో స్త్రీల దృక్పధం ఏవిధంగా ఉందని ప్రశ్నిస్తూ జెండర్ అస్తిత్వంలోంచే కుల, మాత, వర్గ, ప్రాంత అస్తిత్వాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకునేవారు. స్త్రీలపై జరుగుతున్న అన్ని రకాల హింసలపై, అత్యాచారాలపై తన స్పందనను వివిధ రూపాల్లో తెలియచేస్తూ వారికి సంఘీభావంగా ముందున్నారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కుల దురహంకార,ప్రేమ హత్యల యెడల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సమాజంలో యుగాలుగా నెలకొని వున్న నిచ్చెనమెట్ల అంతరాలను కూల్చి సమసమాజ స్థాపన దిశగా ప్రతివారు ఎందుకు ఆలోచించరూ అని బాధపడేవారు. స్త్రీ, పురుష సమానత్వం రావాలంటే స్త్రీల కన్నా ముందు పురుషులు బాగా ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉందని అనేవారు.

దళిత సాహిత్యం క్రైస్తవ సాహిత్యంతో పాటు స్త్రీవాద సాహిత్యానికి పుట్ల హేమలత గారు తన గొంతును వినిపిస్తూ వచ్చారు. తానొవ్వక, నొప్పించక అన్నట్లుగా ఏ ఒక్క వాదానికి పరిమితం కాకుండా అన్ని వాదాలను సమర్ధిస్తూ తన సాహిత్య ప్రయాణం కొనసాగించారు. మంచి విశ్లేషకురాలిగా పేరు గాంచారు. అటు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ప్రచురిస్తున్న వివిధ సాహిత్య రచనలకు సంపాదకులుగా, ఇటు తన సొంత వెబ్ సాహిత్య పత్రిక సంపాదకురాలిగా ‘విహంగ’ బాధ్యతలు నిర్వహిస్తూనే ‘లేఖన’ సాహిత్య పరిశోధక వ్యాసాల మొదటి వ్యాస సంకలనాన్ని విహంగ ప్రచురణల ద్వారా 2016లో ప్రచురించారు.

2019లో దళిత స్త్రీ సాహిత్యం పేరా అనేక మంది దళిత రచయిత్రులను,వారి రచనలను పరిచయం చేస్తూ ‘లేఖన” రెండవ పరిశోధక వ్యాసాల సంకలనానికి అన్ని హంగులను సమకూర్చి అర్ధంతరంగా అందరిని దుఃఖ సాగరంలో ముంచి వెళ్లారు. ప్రరవే పది సంవత్సరాల వేడుకల ఆనందం పంచుకుని ఎవ్వరికీ అందనంత సుదుర తీరాలకు వెళ్లిపోవడం నిజంగానే ఇటు తెలుగు సాహిత్యానికి అటు మా ప్రజాస్వామిక రచయిత్రుల వేదికకు,ఇంకా నాలాంటి ఎందరో ఆప్తమిత్రులకు తీరని ఆవేదన. వారి అకాల మరణాన్ని జీర్ణించుకోవడం కష్ట సాధ్యం. ‘పోయినోళ్ళు అందరూ మంచోళ్ళే’ అని ఓ ప్రముఖ కవి అన్నట్లు నెచ్చెలి డా.పుట్ల్ల హేమలత గారితో నాకున్న అనుబంధాన్ని స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను.

Article about Putla Hemalatha Life Story

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: