సీతారామ, పాలమూరుకు అటవీ భూమి

  ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అటవీ శాఖ మన తెలంగాణ/హైదరాబాద్: సీతారామ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు అవసరమైన అటవీ భూములను బదలాయిస్తూ రాష్ట్ర అటవీశాఖ అనుమతులిచ్చింది. కేంద్ర పర్యావరణశాఖ ఇటీవల ఇచ్చిన తుది అనుమతులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర అటవీ శాఖ సీతారామ ప్రాజెక్టు కోసం 1531.054 హెక్టార్ల, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 205.4811 హెక్టార్ల అటవీ భూములను రాష్ట్ర సాగునీటిపారుదల శాఖకు అప్పగిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొనింది. వేర్వురుగా రెండు ఉత్తర్వులను రాష్ట్ర అటవీశాఖ […]

 

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అటవీ శాఖ

మన తెలంగాణ/హైదరాబాద్: సీతారామ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు అవసరమైన అటవీ భూములను బదలాయిస్తూ రాష్ట్ర అటవీశాఖ అనుమతులిచ్చింది. కేంద్ర పర్యావరణశాఖ ఇటీవల ఇచ్చిన తుది అనుమతులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర అటవీ శాఖ సీతారామ ప్రాజెక్టు కోసం 1531.054 హెక్టార్ల, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 205.4811 హెక్టార్ల అటవీ భూములను రాష్ట్ర సాగునీటిపారుదల శాఖకు అప్పగిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొనింది. వేర్వురుగా రెండు ఉత్తర్వులను రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా జారీ చేశారు. ఇందులో సీతారామ ప్రాజెక్టు కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం డివిజన్లతో పాటు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం డివిజన్ల నుంచి మొత్తం 1531.0548 హెక్టార్ల అటవీ భూమిని బదలాయించారు.

సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన కాలువలు, సొరంగాల తవ్వకంతో పాటు విద్యుత్ లైన్ల నిర్మాణం కోసం ఈ భూమిని బదలాయిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇందులో ఇల్లెందు డివిజన్ నుంచి 35 హెక్టార్లు, భద్రాచలం డివిజన్‌లో 200 హెక్టార్లు, మణుగూరు డివిజన్ నుంచి 212 హెక్టార్లు, పాల్వంచ డివిజన్ నుంచి 454 హెక్టార్లు, కిన్నెరసారి వైల్డ్‌లైఫ్ ఫారెస్టు డివిజన్ నుంచి 100 హెక్టార్లు, కొత్తగూడెం ఫారెస్టు డివిజన్ నుంచి 230 హెక్టార్లు, సత్తుపల్లి ఫారెస్టు డివిజన్ నుంచి 52 హైక్టార్ల భూమిని బదలాయించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వివిధ దశల నిర్మాణం కోసం అచ్చంపేట ఫారెస్టు డివిజన్‌లో 205.4811 హెక్టార్ల భూమిని బదలాయించినట్లు ఆజయ్‌మిశ్రా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ తన తుది దశ అనుమతుల్లో పేర్కొన్న నిబంధనలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అటవీ చట్టంలోని నిబంధనలను సాగునీటిపారుదల శాఖ పాటించాల్సి ఉంటుందని, అటవీ భూమిని వాడుకున్నందుకుగాను ప్రత్యామ్నాయ అడవిని పెంచాల్సి ఉంటుందని ఈ ఉత్తర్వుల్లో అజయ్‌మిశ్రా పేర్కొన్నారు. అటవీ భూములే కాకుండా ఈ శాఖతోని సంబంధంలేని నాన్ ఫారెస్టు భూములను కూడా ప్రాజెక్టు అవసరాల నిమిత్తం వాడుకుంటున్నట్లు ఆయన ఆ ఉత్తర్వుల్లో గుర్తుచేశారు.

TS Forest Department land Approved for Sitarama Project

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: