ఆధునిక తెలుగు వచన కవిత్వం ప్రపంచ కవిత్వంతో సాపేక్షత

కవిత్వం ఒక రసవిద్య. మనిషిని రంజింపజేసి, ఆనందింపజేసి, ఆలోచింపజేసి, సంఘర్షింపజేసి, అనేకానేక అలజడుల సముద్రాలను పిడికెడు గుండెలో బీభత్సింపజేసి కాలాన్ని జయిస్తూ నిరంతరం వెంటాడేది. అందుకే సాహిత్యప్రపంచాన్ని శతాబ్దాలకు శతాబ్దాలుగా శాసిస్తున్నదీ, సకల మానవ సంవేదనలన్నింటినీ శ్వాసిస్తున్నదీ కవిత్వమే. వాస్తవానికి కవిత్వానికి భాషలేదు. దానికి ఉన్నది కేవలం హృదయమే. కవిత్వం నిజానికి హృదయలిపి. మనిషితోనే పుట్టి మనిషి ఉన్నంతకాలమూ మహోజ్జ్వలంగా శాశ్వతమై మిగిలి ఉండేది కవిత్వమే. కవిత్వం మానవసంబంధాల గురించీ, రాజకీయాల గురించీ, విప్లవాల గురించీ, తిరుగుబాట్లూ, […]

కవిత్వం ఒక రసవిద్య. మనిషిని రంజింపజేసి, ఆనందింపజేసి, ఆలోచింపజేసి, సంఘర్షింపజేసి, అనేకానేక అలజడుల సముద్రాలను పిడికెడు గుండెలో బీభత్సింపజేసి కాలాన్ని జయిస్తూ నిరంతరం వెంటాడేది. అందుకే సాహిత్యప్రపంచాన్ని శతాబ్దాలకు శతాబ్దాలుగా శాసిస్తున్నదీ, సకల మానవ సంవేదనలన్నింటినీ శ్వాసిస్తున్నదీ కవిత్వమే. వాస్తవానికి కవిత్వానికి భాషలేదు. దానికి ఉన్నది కేవలం హృదయమే. కవిత్వం నిజానికి హృదయలిపి. మనిషితోనే పుట్టి మనిషి ఉన్నంతకాలమూ మహోజ్జ్వలంగా శాశ్వతమై మిగిలి ఉండేది కవిత్వమే. కవిత్వం మానవసంబంధాల గురించీ, రాజకీయాల గురించీ, విప్లవాల గురించీ, తిరుగుబాట్లూ, ధిక్కారాలూ, ప్రతిఘటనలూ, అధిక్షేపాల గురించీ, గత మానవ వైభవ పునరుల్మీనల గురించీ ప్రపంచ వేదికపై తన బాధ్యతతో కూడిన కర్తవ్యాన్ని మహాద్భుతంగా నిర్వహిస్తూ వస్తూనే ఉంది. లాటిన్ అమెరికా నుండి మొదలుకొ ని టర్కిష్, స్పెయిన్, అమెరికా, బ్రిటన్, రష్యన్, చైనా, భారతదేశం ఆదిగా ఈ కవిత్వ ప్రాభవాన్ని గగనమెత్తు ఉన్నతీకరించి మనిషిని ద్రవీకరించినవారే.
ఆధునిక వచన కవితను పరామర్శించడానికి ఈషణ్మా త్రం గతాన్నీ, వర్తమానాన్నీ స్పర్శిస్తూ ‘వచన కవిత యొక్క భవిష్యత్తు’ ను ఊహించగలగడం ఉచితమని భావిస్తాను.
ప్రజాకవి కాళోజీ తన ‘వ్యత్యాసాలు’ అన్న కవితలో, ‘అన్నపురాసులు ఒకచోట/ ఆకలి మంటలు ఒకచోట.. కమ్మని చకిలాలొక చోట/ గట్టి దౌడ లింకొకచోట’ వంటి జీవన వ్యత్యాసాలను అధిక్షేపిస్తూనే మాతృభాష తెలుగుపై ఉన్న మమకారాన్ని అత్యంత ధర్మాగ్రహంతో ఈ విధంగా ప్రకటించాడు. ‘ఏ భాషరా నీది యేమి వేషమురా?/ ఈ భాష ఈ వేష మెవరికోసమురా?.. అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు/ సకిలించు ఆంధ్రుడా ! చావవెందుకురా?’ అక్కడినుండి మొదలైన కవితాప్రస్థానం శ్రీశ్రీ, ఆరుద్ర, కుందుర్తి, సి. నారాయణరెడ్డి, దాశరథి, వేగుంట మోహనప్రసాద్, వరవరరావు వంటి వరిష్ఠ కవుల నిరంతర నూతన శిల్పీకరణలతో, క్రొంగొత్త రూపాన్ని సంతరించుకుంటూ వస్తున్న తెలుగు వచన కవిత 1990ల తర్వాత తన కవితాకృతినీ, పరిమళాన్నీ, తీవ్రతనూ, అభివ్యక్తినీ నవీనీకరించుకుంటూ, త్రిపురనేని శ్రీనివాస్ దాకా వచ్చేసరికి చాలా నిర్ధిష్టతను సంతరించుకుంది. అతనంటాడు.. ‘సమస్త మానవాళి ఆశ్చర్యపడేలా/ ఒక్క సాహసం చేయాలి/ ఎవరి రక్తచలనంతో వారు/ ఖడ్గచాలనం చేయాలి’ అని. అలాగే ‘పుట్టుమచ్చ ‘ఖాదర్ మొహియుద్దీన్’ ఎప్పటికైనా ఒక కన్ను/ కిరణఖడ్గమై కాంతివేగంతో/ శవమెత్తిన జాతి గరిమనాభిని/ తుత్తునియ లు చేస్తుంది/ శివ ధనుర్భంగంలోంచి/ పిడికిలి బిగబట్టిన ఒక/శైశవం తప్పక ఉదయిస్తుంది/ జంట పిడికిళ్ళతో అది/ జయధ్వానం చేస్తుంది’ అని. ఈ రెండు ఉదాహరణలతో మనకు మారుతున్న ఇటీవలి తరంలో వస్తున్న ఒక అతిస్పష్టమైన గుణాత్మకమైన మార్పు గోచరిస్తోంది. ఇటీవలి కవుల తరాన్ని తనదైన ఒక ప్రత్యేక శైలితో సంపన్నం చేసిన కవి అరుణ్ సాగర్ అంతరించిపోతున్న ఆదివాసులైన కోయల జాతి జీవన విషాదం గురించిన మౌన వేదనను ఇట్లా వ్యక్తీకరించాడు శక్తివంతంగా తన ‘మరణవాగ్మూలం’ కవితలో. ‘ఇచ్చోటనే/ గలగల ఘల్లుమన్న/ రేలా రేలా పరవళ్ళు/ మరియూ ఇచ్చోటనే కదా / ఏడేడు తరాలు/ ఎనకటెనకటి పాటలు/ అనాది రాగాలు/ ఆది పురాణాలు/ విల్లంబులు ఎద్దు కొమ్ములు/ తునికి చుట్ట పరిమళాలు/ గుప్పు గుప్పు గాలి గిరికీలు/ తరతరాల పాదముద్రలు/ హృదయాల శిలాజాలు/ పాయం బొజ్జిగాడు/ లాస్ట్ ఆఫ్ ది కోయాస్/ పెరిగి పెద్దయి/ అలెక్స్ హేలీ అవుతాడా/ ఆనకట్ట వెనుక అశ్రుజలధిలో/ సీతమ్మ ముక్కుపుడక వెదుకుతాడా/ లేక అంతర్థానపు అంచున వేలాడు/ రామాపితికస్ వలె/ ఆంత్రోపాలజీ/పాఠమౌతాడా/ పురాతన జనసమాధి/ జన సంస్కృతి జలసమాధి’
తరాలకు తరాలే అంతర్థానమౌతున్నప్పటి విధ్వంస దృశ్యాన్ని చూస్తున్న మౌన వేదన, రోదన భాషను తొడుక్కుని గుక్కపట్టి దుఃఖిస్తున్నపుడు కవిత్వానికి తప్ప ఏ ప్రక్రియకు సాధ్యమౌతుంది ఆసాంత విషాదానుభూతిని వ్యక్తపర్చడం. ఆధునిక తెలుగు వచన కవులు బహుముఖీనమైన, బహుసంక్లిష్టమైన, గాఢమైన, హృదయపు అట్టడుగు పొర ల్లో విస్ఫోటించే ప్రకంపనలను చాలా ఒడుపుగా అక్షరాల్లో శక్తివంతంగా చెప్పగలిగే నైపుణ్యాన్ని సాధించి తమ స్వంతగొంతును నిర్మించుకున్నారు. ఇది ప్రపంచ కవులతో పోల్చి మూల్యాంకనం చేసినప్పుడు తెలుగు జాతి గర్వించదగ్గ స్థాయిలోనే ఉందని చెప్పడానికి కోకొల్లల ఉటంకనలున్నాయి. ఒకసారి ప్రపంచ వచనకవుల భిన్న కవిత్వ సందర్భాల గురించిన అవలోకనం చేసినపుడు హృదయాన్ని కలచివేసే ఒక ఘటన మనల్ని దుఃఖితుల్ని చేస్తుంది.
5 ఆగస్ట్, 1945న అమెరికా హిరోషిమాపై అణుబాంబును ప్రయోగించి మొత్తం నగరాన్నే ధ్వంసించి దాదాపు ఎనభైవేల మందిని పొట్టనబెట్టుకున్న తర్వాత మూడు రోజులకు ‘నాగసాకి’ అనే మరో నగరంపైకి ఇంకో అణుబాంబును విసిరినప్పుడు రాక్షస ఆక్రమణదారులు తమ ‘ఆపరేషన్’ యొక్క వికృత దాడికి పెట్టిన పేరు ‘లిటిల్ బాయ్’ అని అంటే ‘చిన్ని బాబు’ అని అర్థం. ఒక అమానవీయ దుశ్చర్యకు పెట్టిన ఆ పేరు ఎంత విదారకంగా ఉందో.. తలుచుకుని ప్రపంచ సాహిత్య ప్రపంచం నివ్వెరబోయింది. అప్పుడే టర్కీ దేశపు వామపక్ష భావజాలంతో కవిత్వం రాసే కవి ‘నాజిం హిక్మత్’ ఒక అతి హృదయ విదారక కవితను రాశాడు..’ I come and stand at every door’ అన్న మకుటంతో. ఆ బాంబు దాడిలో మరణించిన ఒక ఏడేళ్ల వయసుగల పాప .. పదేళ్ల తర్వాత బూడిదగా మిగిలిన డొల్ల శవంగా దొరికి మనతో మాట్లాడుతున్న దీన దృశ్యాన్ని అక్షరీకరించాడు ఇలా…
‘నేనొస్తాను, నిలబడి ఉంటాను మీ ప్రతి గడప దగ్గరా/ కాని, ఎవరికీ నా నిశ్శబ్దపు అడుగుల చప్పుడు వినిపించదు/ తలుపు తడతాను కాని ఎవరికీ కనిపించను/ ఎందుకంటే నేను చనిపోయి ఉన్నాను కాబట్టి./ హిరోషిమాలో ఏనాడో చనిపోయినా/ నాకు ఏడేళ్లు మాత్రమే/ చనిపోయినప్పటిలాగే నాకు ఇప్పుడూ ఏడేళ్ళే/ పిల్లలుగా చనిపోయినవాళ్ళు ఇక పెరుగరుకదా/ ఎప్పుడూ పిల్లలుగానే ఉంటారు/ చుట్టూ ఆవరించిన మంటల్లో నా జుట్టు కాలిపోయింది/ నా కళ్ళు కాలిపోయి గుడ్డివైపోయినై/మరణం నన్నాక్రమించి నా ఎముకల్ని ధూళిగా చేస్తే/ ఆ ధూళి గాలిలోకెగిరిపోయింది/ ఇప్పుడు నాకు ఉనికే లేదు/ నాకు అన్నమూ, పళ్ళూ, మిఠాయిలూ కనీసం రొట్టెకూడా అవసరంలేదు/ మిమ్మల్ని ఏమీ అడగను నేను/ నేను చనిపోయిన పాపాయిని కదా/ నాకు కావల్సిందల్లా కాసింత శాంతి/ పోరాడండి.. యుద్ధం చేయండి మరణాలెరుగని శాంతికోసం/ నాలాంటి పిల్లలు చనిపోకూడదు/ పిల్లలు పెరగాలె.. పెద్దవ్వాలె/ హాయిగా ఆడుకుంటూ నవ్వులను చిందించాలె’. ఇదీ…దీన్ని చదువుతున్నప్పుడు హృదయం తల్లడిల్లిపోతుంది ఎవరికైనా…
శతాబ్దాలుగా ప్రపంచ కవిత్వాన్ని తేజోవంతం చేసిన రుడ్యార్ట్ కిప్లింగ్, గాబ్రియేలా మిస్ట్రాల్ , టి.ఎస్.ఇలియట్, హేరీ మార్టిన్ సన్, ఆక్టావియా పాజ్, థామస్ ట్రాంస్ట్రోహ్మర్ , మన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ వంటి నోబెల్ పురస్కార గ్రహీతలెందరో కవిత్వం అనే సృజన ఒక దేశానికో, ప్రాంతానికో, ఖండానికో , జాతికో, తెగకో చెందింది కాదనీ అది విశ్వ మానవ సంతతికందరికీ చెందిన ,’ వసుధైక కుటుంబ ’ భావనతో నిండిన సకల మానవీయ సంవేదనలన్నింటినీ వ్యక్తీకరించగల ఏకైక సాధనం అని ఋజువు చేశారు. వీళ్ల హృదయాలను రేఖామాత్రంగా తట్టి చూస్తే తెలుస్తుంది.. ఇలా.,
కిప్లింగ్ .. తన ‘విన్నపం’ కవితలో.,(The appeal): నోబెల్ పురస్కార గ్రహీత- 1907. (భారతదేశంలో జన్మించి నోబెల్ బహుమతి పొందిన బ్రిటిష్ నాగరికుడు )
‘నేను చేసిందేదైనా / మీకు సంతోషాన్ని ఇచ్చి ఉంటే / ఆ రాత్రి నన్ను హాయిగా పడుకోనివ్వండి /అది తిరిగి మీదే ’ … ’ కొద్దిసేపే అయినా/ పోయిన వాళ్ళు మనస్సులో కొస్తారు/ ఇక ఏ ప్రశ్నలూ అడగొద్దు/ నేను వదలిపోయిన పుస్తకాన్ని తప్ప’ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్, కవిత పేరు ‘రహస్యం’, నోబెల్ పురస్కార గ్రహీత- 1913 (భారతదేశం)
‘పిల్లన గ్రోవి ఒప్పుకుంటుంది : గొప్పతనాన్ని నేను తీసుకోలేను/ నన్ను పలికించేది శ్వాస ఒక్కటేనని శ్వాస తెలుపుతుంది : నేను శూన్యాన్ని, కేవలం గాలిననిబొత్తిగా ఎవరికీ తెలీదు నిజమైన ఆటగాడు ఎవరో’/ ప్రజాకవి ఫాబ్లో నెరోడా, కవిత పేరు ‘మచ్చుపిచ్చి శిఖరాలు’, నోబెల్ పురస్కార గ్రహీత- 1971 (లాటిన్ అమెరికా)/ ‘నిశ్శబ్దాన్ని, నీటిని, ఆశని నాకివ్వండి/ అయస్కాంతాల్లా నా శరీరానికి అంటుకుపోండి/ నా సిరల్ని, నా నోటిని తొందరపెట్టి/ నా పదాలతోనూ, నా రక్తంతోనూ మాటాడండి’
ఆక్టావియా పాజ్ , కవిత పేరు ’ చివరి వేకువ’, నోబెల్ పురస్కార గ్రహీత ( 1990) ( భారతదేశంలో చదువుకుని.. ఎదిగి.. ఇక్కడి ఆధ్యాత్మికతకు ప్రభావితుడైన మెక్సికన్ )
నీ జుత్తు అడవిలో పోయింది/ నీ కాళ్ళు నన్ను తాకుతున్నాయి/ నిద్రలో నువ్వు రాత్రికంటే పెద్ద/ కానీ ఈ గది లోపలికే నీ కలలు సరిపోతాయి/ మనమెంత – చాలా చిన్నవాళ్ళం/ దయ్యాల బరువుతో బయట టాక్సీ వెళ్తోంది/ ఎప్పుడూ పరిగెత్తే నది/ వెనక్కి పరిగెడుతోంది/ రేపు మరో రోజవుతుందా?’/ ఇప్పుడు ఒకసారి భారతదేశంలోని తెలుగేతర అగ్రగణ్య కవులు కొందరిని పరిశీలిస్తే.,/ 2013 సంవత్సర ’ జ్ఞానపీఠ ’ పురస్కార గ్రహీత కేదార్ నాథ్ సింగ్ కవిత ఒకటి మచ్చుకు., శీర్షిక ’ ఎత్తు ’
‘నేను అక్కడికి చేరుకున్నాను/ తర్వాత ఎంతో భయపడ్డాను/ ఓ నా పట్టణవాసులారా!/ పట్టణాల మెట్లన్నీ కలిసి/ ఎంత ఎత్తుకు తీసుకువెళతాయో/ ఆ చోటు ఎంత భయానకం!/ ఎందుకంటే/ అక్కడ ఎవ్వరూ ఉండరు!’/ ఇప్పుడు 2017వ సంవత్సరం కేంద్రసాహిత్య అవార్డ్ గ్రహీత దేవిప్రియ ( తెలుగు కవి ) యొక్క ఒక మచ్చు కవిత ’ అమరం’
‘రుతువులతో పనిలేని దొకటుంది/ కాలచక్రాన్ని గుర్తించని దొకటుంది/ వాతావరణ ధర్మాలని అతిక్రమించే దొకటుంది/ పంచభూతాల ప్రచండ శాసనాలని ఉల్లంఘించే దొకటుంది/ భీతావహ మృత్యువు కంకాళహుంకారాన్ని ధిక్కరించే దొకటుంది/ నెత్తురోడుతున్నా తలవంచని/ నా ఆత్మగౌరవ ప్రతిపత్తి…! ’
ప్రముఖ మలయాళ మరియు ఇంగ్లిష్ కవయిత్రి కమలాదాస్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత యొక్క కవిత ఒకటి ‘కీర్తి’ ని చూద్దాం.
‘వంట చేసేటప్పుడు/ వంటింటి నుంచి లేచే పొగలాంటిది,/ దాన్ని చూచి దిగ్భ్రాంతి చెందకు/ గర్వానికి ఆస్కారమివ్వొద్దు/ అది మామూలు పొగ,/ అదేం చేస్తుంది/ నీ దృష్టిని మేఘావృతం చేస్తుంది
(నవంబర్ 3, 4 – 2018 తేదీల్లో మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో TAAI ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన వంగూరి ఫౌండేషన్, ఇండియా నుండి వంశీ ఇంటర్నేషనల్ సహకారంతో నిర్వహించిన ‘6 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు’ లో సమర్పించిన ప్రసంగ పత్రంలో కొంతభాగం)

– ప్రొఫెసర్ రామా చంద్రమౌళి
93901 09993

Article about Telugu Poetry

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: