జోరు సాగిస్తారా

ఆత్మవిశ్వాసంతో భారత్, ఫేవరెట్‌గా కివీస్ నేడు తొలి వన్డే నేపియర్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా మరో సిరీస్‌పై కన్నేసింది. న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను దక్కించుకోవాలని భారత్ తహతహలాడుతోంది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్‌లో చారిత్రక విజయాన్ని అందుకున్న కోహ్లి సేన కివీస్ సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ సిరీస్‌లోనూ గెలిచి కిందటిసారి న్యూజిలాండ్ చేతిలో పరాజయానికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. మరోవైపు సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లో మరోసారి ఆధిపత్యం చెలాయించాలనే […]

ఆత్మవిశ్వాసంతో భారత్, ఫేవరెట్‌గా కివీస్

నేడు తొలి వన్డే

నేపియర్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా మరో సిరీస్‌పై కన్నేసింది. న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను దక్కించుకోవాలని భారత్ తహతహలాడుతోంది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్‌లో చారిత్రక విజయాన్ని అందుకున్న కోహ్లి సేన కివీస్ సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ సిరీస్‌లోనూ గెలిచి కిందటిసారి న్యూజిలాండ్ చేతిలో పరాజయానికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. మరోవైపు సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లో మరోసారి ఆధిపత్యం చెలాయించాలనే పట్టుదలతో కివీస్ కనిపిస్తోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లు, బ్యాట్స్‌మెన్ రెండు జట్లలోనూ ఉన్నారు. దీంతో సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయమనే చెప్పాలి. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమతుతుంది. కాగా, స్టార్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.
ఓపెనర్లే కీలకం
న్యూజిలాండ్ వంటి బౌన్సీ పిచ్‌లపై భారత్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు కీలకంగా మారారు. ఇద్దరు అందించే శుభారంభంపైనే జట్టు భారీ స్కోరు ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో జట్టు ఆశలన్నీ ధావన్, రోహిత్‌లపై నిలిచాయి. ఆస్ట్రేలియా సిరీస్‌లో ధావన్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. అయితే రోహిత్ మాత్రం ఓ సెంచరీ సాధించి సత్తా చాటాడు. ఈసారి కూడా జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో ఉన్నాడు. వన్‌డౌన్‌లో వచ్చే కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా జోరుమీదున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లి నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు.
అందరి కళ్లు ధోనిపైనే
ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్‌లో అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని జట్టుకు కీలకంగా మారాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఆసీస్ గడ్డపై వరుసగా మూడు అర్ధ సెంచరీలు సాధించి జోరుమీదున్నాడు. ఈ సిరీస్‌లోనూ నిలకడగా రాణించి రానున్న ప్రపంచకప్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భావిస్తున్నాడు. ధోని చెలరేగితే భారత్‌కు విజయం నల్లేరుపై నడకే. ఇక, తుది జట్టులో స్థానం కోసం అంబటి రాయుడు, కేదార్ జాదవ్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్‌లో జాదవ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఈసారి కూడా అతనికే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ, రాయుడుకు మరో అవకాశం ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, భువనేశ్వర్, విజయ్ శంకర్‌లతో బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్‌లో కూడా భారత్‌కు ఎదురులేదనే చెప్పాలి. భువనేశ్వర్, షమీ జోరుమీదున్నారు. కుల్దీప్, జడేజా, చాహల్‌లను కూడా తక్కువ అంచనా వేయలేం. ఖలీల్, సిరాజ్, శంకర్‌లతో బౌలింగ్ చాలా బలంగా మారింది. ఇలా బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా ఉన్న భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
తక్కువ అంచనా వేయలేం
మరోవైపు ఆతిథ్య న్యూజిలాండ్ జట్టును తక్కువ అంచనా వేయలేం. సొంత గడ్డపై కివీస్‌ను ఓడించడం ఏ జట్టుకైనా చాలా కష్టం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ సమతూకంగా కనిపిస్తోంది. విలియమ్సన్, టైలర్, మున్రో, గ్రాండోమ్, లాథమ్, గుప్టిల్, నికోలస్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇక, టిమ్ సౌథి, బౌల్ట్, బ్రేస్‌వెల్, గ్రాండోమ్, సాంట్నర్ వంటి ఒంటిచేత్తో ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లు ఉండనే ఉన్నారు. దీంతో కివీస్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. జట్టులో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో కివీస్ సిరీస్‌పై కన్నేసింది. వారిని ఓడించడం కోహ్లి సేనకు అంత తేలికకాదు. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

India vs New Zealand:1st ODI Start Today

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: