సర్పంచ్‌తోనే నవశకం

సంక్రాంతి సంబరాలకు ముందే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సంరంభం ఊపందుకుంది. కొత్తగా బంజారా ఆవాసాలతో పాటు ఏర్పాటైన మరికొన్ని గ్రామ పంచాయతీలను కలుపుకొని అన్ని గ్రామాల్లో ఎన్నికలు ఈ మాసాంతానికి పూర్తయి నూతన పాలక వ్యవస్థలు నెలకొననున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ అధికారాలను దృష్టిలో ఉంచుకొని ఆయా గ్రామాల ఓటర్లు ఇది వరకటికన్నా సృజనాత్మకంగా ఆలోచించి ఆదర్శ వ్యక్తులను, సేవానిరతితో పాటు గ్రామాభివృద్ధికి నిరంతరం పాటుపడే వారిని ఎన్నుకోవాలి. మద్యం, నోట్ల్లు పంపిణీ చేసే అభ్యర్థులను బేషరతుగా […]

సంక్రాంతి సంబరాలకు ముందే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సంరంభం ఊపందుకుంది. కొత్తగా బంజారా ఆవాసాలతో పాటు ఏర్పాటైన మరికొన్ని గ్రామ పంచాయతీలను కలుపుకొని అన్ని గ్రామాల్లో ఎన్నికలు ఈ మాసాంతానికి పూర్తయి నూతన పాలక వ్యవస్థలు నెలకొననున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ అధికారాలను దృష్టిలో ఉంచుకొని ఆయా గ్రామాల ఓటర్లు ఇది వరకటికన్నా సృజనాత్మకంగా ఆలోచించి ఆదర్శ వ్యక్తులను, సేవానిరతితో పాటు గ్రామాభివృద్ధికి నిరంతరం పాటుపడే వారిని ఎన్నుకోవాలి.
మద్యం, నోట్ల్లు పంపిణీ చేసే అభ్యర్థులను బేషరతుగా తిరస్కరించాలి. సర్పంచ్ పదవి చిన్నదే కావచ్చు, తలుచుకుంటే మాత్రం ఆ పదవిలోని వ్యక్తి గ్రామాన్ని అన్ని విషయాల్లో అగ్రగామిగా ఉంచగలరు. ఆ మేరకు ఆత్మవిశ్వాసం, దీక్ష, పట్టుదల పుష్కలంగా సర్పంచ్‌గా ఎన్నుకోబడే వ్యక్తికి ఉండాలి. కేవలం తమ ప్రాబల్యం చాటుకోవాలనే దుగ్ధ కాకుండా ఊరి బాగోగులపై శ్రద్ధ కనబరచే దిశగా ఆలోచించి ఉన్నంతలో రిజర్వు స్థానాల్లో సైతం విద్యావంతులు, ప్రగతి కాముకులను ఎన్నికోడానికి రాజకీయ పార్టీలు చొరవ చూపాలి. ఆదర్శ గ్రామ పంచాయతీల ఏర్పాటు బాధ్యత ప్రజల మీద కంటే రాజకీయ పార్టీల మీదే అధికంగా వుంది. ప్రజాస్వామ్యాన్ని క్రింద స్థాయి నుంచి బలోపేతం చేసే ఉద్దేశంతో భారత పార్లమెంటు 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం దేశానికి పట్టుగొమ్మలైన పల్లెవాసులకు వరం. గ్రామాల సుస్థిరతే దేశ సుస్థిరత అని ఊరకే వల్లెవేయడం కాదు ఏ గ్రామానికి ఆ గ్రామం సొంతంగా అభివృద్ధి చెందడానికి కావలసిన ప్రణాళిక రచన జరగాలి.్ర గామాభివృద్ధి ప్రణాళిక రూపొందించడంలో ‘గ్రామ సభ’ దే కీలక పాత్ర.
గ్రామ సభ నిర్వహణలో గ్రామ ప్రజల భాగస్వామ్యంతో పాటు వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, సర్పంచ్‌లు అతి ముఖ్యమైన వారు. గ్రామసభ చేసే తీర్మానాల అమలులో గ్రామ సచివాలయం ఒక అనుసంధాన సంస్థ. సాధారణంగా ఏ గ్రామానికైనా దాని సుస్థిరత కారకాల్లో మూడు అంగాలు ప్రధానమైనవి. అవి 1. విద్య 2. ఆరోగ్యం 3. మౌలిక సదుపాయాలు. అక్కడి ప్రభుత్వ పాఠశాలను పకడ్బందీగా నడుపుకోవడం ద్వారా స్థానిక బాలబాలికలకు ‘గుణాత్మక విద్య’ను అందించాల్సిన బాధ్యత గ్రామ పంచాయితీలదే. ప్రజారోగ్యం పారిశుద్ధ్యం పైనే అధారపడి వుంది. పారిశుద్ధ్యం వ్యవస్థను పటిష్ఠంగా అమలు పరచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లేదా ఆరోగ్య సిబ్బందిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా గ్రామ పంచాయతీదే. మురుగు కాల్వల నిర్వహణ, సామాజిక మరుగు దొడ్ల నిర్మాణం, ఇంటింటి మరుగు దొడ్లు, దోభీ ఘాట్లు నిర్మాణం, గృహవ్యర్థాల సేకరణ వంటి చర్యల ద్వారా జాతీయ స్థాయిలో నిర్మల్, స్వచ్ఛ భారత్ పురస్కారాలను అందుకోవచ్చు. వీధి దీపాల ఏర్పాటు, గ్రంథాలయ నిర్వహణ, మంచినీటి సరఫరా, రోడ్ల మరమ్మతు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం -నిర్వహణ, మెరుగైన సమాచార వ్యవస్థ, తపాలా కార్యాలయం, క్రీడా సాంస్కృతిక శాలలు, బ్యాంకు, మార్కెట్ తదితర ప్రజావసరాల్లో మండలం, జిల్లా, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని, సమన్వయాన్ని ఎప్పటికప్పుడు తీసికొని అభివృద్ధిలో నమూనాగా గ్రామ పంచాయతీ ఉండి తీరాలి. ఇందుకు సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు రాజకీయ అక్షరాస్యత కంటే అధికంగా స్థానిక సంస్థల విధులు-, నిధులు, నిర్వహణ పట్ల అవగాహన సమగ్రంగా ఉండాల్సి వుంది. అందుకే సర్పంచ్, ఉప సర్పంచ్‌లుగా విద్యావంతులను ఎన్నుకోవాల్సిన అవసరం గ్రామ ప్రజానీకానికి ఉంది.
గత కొంతకాలంగా గ్రామాలు రాజకీయ కక్షలు, కార్పణ్యాలకు నిలయాలుగా మారిపోయాయి. ఊళ్లు ప్రాతఃకాలం నుంచే మద్యం మత్తుతో తూలుతున్నాయి. గ్రామ రక్షక భటుల పర్యవేక్షణ పెరగడంతో నేర నమోదు తగ్గినప్పటికీ, మద్యం దుకాణాల కారణంగా ప్రజారోగ్యం పూర్తిగా క్షీణించింది. భర్తల అకాల మరణంతో వితంతువుల సంఖ్య పెరిగి ఇళ్లలో విషాదం అలుముకుంటున్నది. ‘మద్య రహిత గ్రామం’గా నడుపుకోవడంలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా గ్రామ పంచాయతీ పని తీరు, నిర్ణయాలు ఉండగలగాలి. వలసలకు నిలయాలుగా కాకుండా ఉత్పత్తి క్షేత్రాలుగా ఊళ్ల్లు విలసిల్లాలంటే స్థానికంగా కుటీర పరిశ్రమలు, ఉపాధి పనులు, వృత్తి నైపుణ్యాల శిక్షణా సంస్థలు నెలకొనేటట్టు గ్రామ పంచాయతీ ఒక మిషన్‌గా పనిచేయాలి. యువజన సంఘాలు, మహిళా పొదుపు గ్రూపులు, ఉద్యోగుల సేవాకేంద్రం, హితైషుల వితరణ కార్యక్రమాలను ప్రోత్సాహిస్తూ కలుపుకొని వెళ్తే సర్పంచ్‌లు తప్పక రాణించగలరు. పదవికి వన్నె తేగలరు. పదవికి వన్నెతెచ్చే వాళ్లే ఇవాళ తెలంగాణ అవసరం.
అధికారం చెలాయించడానికో, దర్ప ప్రదర్శన కొరకో పదవి కాదని సర్పంచ్ గుర్తెరగాలి. గతంలో గొప్పగా ప్రజల కొరకు పని చేసిన వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలి. గ్రామంలో కుల వ్యవస్థ పునాదులు బలిష్టంగా ఉంటాయి. శాంతి సామరస్య వైఖరులను అవలంబిస్తూ సమైక్యతను మరింత అభివృద్ధి పరచాలి. పండగలు, పర్వదినాల నిర్వహణలో గ్రామంలోని పెద్దల సలహాలు, సూచనలు పాటిస్తూ ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యూహంతో ముందు కెళ్లాలి. నిధులు కేంద్రం నేరుగా ఇచ్చినా, రాష్ట్రం ఇచ్చినా, స్థానిక వనరుల ఆధారంగా సమకూరినా వాటి ఖర్చు, వినియోగంలో పారదర్శకత, నిజాయితీ అడుగడుగునా పాటించాలి. ఎం.హెచ్.ఆర్.డి వంటి సంస్థలు నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు ఉత్సాహంతో హాజరవ్వాలి. స్ఫూర్తివంతంగా సర్పంచ్ పదవి నిర్వహణకు అవసరమైన సృజనాత్మకతను విభిన్న పద్ధతుల్లో అందిపుచ్చుకోవాలి. పంచాయతీరాజ్ చట్టానికి లోబడి మొక్కుబడిగా కాకుండా, విధిగా విశాల దృక్పథంతో ప్రజలందరి సమక్షంలో గ్రామ సభ జరిపి తీర్మానాలను తీసుకోవాలి. అంతే గుణవంతంగా తీర్మానాలను అమలు జరపాలి కూడా. ఒక్కసారి గ్రామాన్ని అభివృద్ధి గాడిలో పడేస్తే తర్వాత వచ్చే సర్పంచ్‌తోవ తప్పినా ప్రజలే ప్రశ్నిస్తారు. అభివృద్ధితో పాటు, ప్రజలకు ప్రశ్నించే శక్తినిచ్చే గ్రామ పంచాయతీయే ఉన్నతమైంది.
గ్రామ అభివృద్ధికి సర్పంచ్ సూత్రధారి. ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాత్రధారాలు. దీన్ని గ్రామ పంచాయతీలు చాటాలి. గ్రామ కార్యదర్శి పాలనా విధి విధానాలపరంగా రికార్డుల లేఖకుడిగా మాత్రమే కాకుండా ఒక దార్శనికుడిగా ప్రజలకు పాలకవర్గానికి అనుసంధానకర్తగా వ్యవహరించడం గ్రామాభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌కి తాను తప్పిదాలు చేస్తే తప్ప గ్రామ సర్వతోముఖాభివృద్ధికి ఎటువంటి ప్రతికూలతలు ఉండవు. వ్యవహారదక్షత మాటలకు చెందినది కాదు, ఆచరణకు సంబంధించినది. సర్పంచుల వ్యవహార దక్షత మీదనే తెలంగాణ రాష్ట్ర, గ్రామాల అభివృద్ధి ఆధారపడి వుంది. తెలంగాణ పునర్నిర్మాణంలో రెండో ప్రభుత్వం కాలంలో మూస పద్ధతికి స్వస్తి పలికి నూతన విధానానికి ప్రగతి శీలతకు అద్దం పట్టే పంచాయతీలకై సాగిన చిరకాల జన నిరీక్షణ ఫలించాలి.

‘Panchayat Raj is seen as good governance at the village level that can help in developing any village‘ –Mahathma Gandhi

‘Panchayat Raj is good governance at village level

Related Images:

[See image gallery at manatelangana.news]