రాహుల్ అనుచిత వ్యాఖ్య

  ఈ దేశంలో మహిళను కించపర్చడం, ఆమెపై అపవాదులు సృష్టించడం కంటె సునాయాసమైన పని వేరొకటి ఉండదు. తిట్లలో, సంబోధనలో, సంభాషణలో, బహిరంగ ప్రసంగాల్లో అన్నింటా ఆమె బలి పశువవుతుంది. పురుషాధిక్య, అహంకారపూరిత భావజాలం తల కెక్కివున్న సమాజంలో ఇది మామూలే అనుకున్నా సర్వసమానత్వాన్ని శాసిస్తున్న రాజ్యాంగం ప్రకారం ప్రగతిశీల పాలన అందించవలసిన ప్రభుత్వాధికారం కోసం పోటీపడే అగ్రనేతలు సైతం ఈ ధోరణిని వదిలిపెట్టకపోవడమే ఆందోళన చెందవలసిన అంశం. భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా కేంద్రంలో ఆధిపత్యం […]

 

ఈ దేశంలో మహిళను కించపర్చడం, ఆమెపై అపవాదులు సృష్టించడం కంటె సునాయాసమైన పని వేరొకటి ఉండదు. తిట్లలో, సంబోధనలో, సంభాషణలో, బహిరంగ ప్రసంగాల్లో అన్నింటా ఆమె బలి పశువవుతుంది. పురుషాధిక్య, అహంకారపూరిత భావజాలం తల కెక్కివున్న సమాజంలో ఇది మామూలే అనుకున్నా సర్వసమానత్వాన్ని శాసిస్తున్న రాజ్యాంగం ప్రకారం ప్రగతిశీల పాలన అందించవలసిన ప్రభుత్వాధికారం కోసం పోటీపడే అగ్రనేతలు సైతం ఈ ధోరణిని వదిలిపెట్టకపోవడమే ఆందోళన చెందవలసిన అంశం. భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా కేంద్రంలో ఆధిపత్యం కోసం నిర్విరామంగా శ్రమిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇందుకు మినహాయింపు కాలేకపోయారు. ఆయన ఇటీవల జైపూర్ రైతు మహాసభలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మీద చేసిన వ్యాఖ్య మహిళలను దారుణంగా కించపరుస్తూ సాగింది. ‘56 అంగుళాల ఛాతీ గల చౌకీదారు (కాపలాదారు ప్రధాని మోడీ) రాఫెల్ కుంభకోణంపై చర్చలో తనను తాను రక్షించుకోలేక పారిపోయారు. తనను రక్షించవలసిందిగా ఒక మహిళను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ను వేడుకున్నారు’ అని రాహుల్ చేసిన వ్యాఖ్యను ఎవరూ హర్షించజాలరు.
యుద్ధంలోనైనా ప్రత్యర్థి నడుముపై భాగమ్మీదనే ఆయుధం ప్రయోగించాలనే ధర్మం పాటిస్తారు. అటువంటిది, స్త్రీ పురుష సమానత సాధనే ధ్యేయంగా ప్రకటించుకున్న మనవంటి ప్రజాస్వామిక దేశంలో మహిళలను బలహీనులుగా, చేతగానివారుగా పరిగణించి మాట్లాడడం కడుహీనమే కాదు అమానుషం కూడా. గాజులు తొడుక్కున్నారు, నీకంటే ఆడదే నయం, మగాడివి కావా వంటి ఎద్దేవా మాటల ప్రయోగం, ఆటలోనో ఇతరత్రానో ఓడిపోయిన వారికి పోస్టులో పసుపు, కుంకుమ, భరిణ వంటి మహిళలను గుర్తుకు తెచ్చే వాటిని పంపించడం మాదిరి చర్యలన్నీ పురుషుడిని ఎక్కువగా, ఆమెను తక్కువగా చూసే దుశ్చర్యలే. అలాగే ఉద్యోగాల్లోనో, రాజకీయాల్లోనో ప్రవేశించడానికి సాహసించే మహిళల మీద అపవాదులు వ్యాప్తి చేసి వారిలోని నైతిక బలాన్ని దెబ్బతీయడం ద్వారా వెనక్కు పంపించడం వంటి దుర్మార్గాలు ఈ దేశంలో కొత్తకాదు.
పితృస్వామిక ఆలోచనలు కరడుగట్టుకుపోయిన సమాజం మనది. ఆడపిల్లకు చదువు అక్కరలేదని ప్రవచించే సంప్రదాయాలు, నమ్మకాలు ఘనీభవించిపోయిన లోకమిది. ఈ స్థితి నుంచి స్త్రీకి సమాన గౌరవ మర్యాదలిచ్చే సమాజ నిర్మాణ లక్షంతో సాగుతున్న ప్రయాణంలో మనమింకా ప్రాథమిక దశలోనే ఉన్నాము. ఇటువంటి నేపథ్యంలో దేశానికి సారథులు కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ వంటి వారిలో ఈ చైతన్యం బొత్తిగా కరువు కావడం అభ్యుదయ కాముకులను అమితంగా బాధించేదే. చేసిన పొరపాటునో, తప్పునో అంగీకరించి తక్షణమే క్షమాపణ చెప్పుకోవలసింది పోయి రాహుల్ ఆ బాధ్యత నుంచి తప్పుకోబోవడం మరింత శోచనీయం. నిర్మలా సీతారామన్ స్థానంలో ఒక మగవాడున్నా తాను అలాగే మాట్లాడే వాడేనని ప్రకటించి ఆయన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. లోక్‌సభలో రాఫెల్ పై చర్చలో నిర్మలా సీతారామన్‌కు బదులు పురుష మంత్రి మాట్లాడి ఉంటే ప్రధాని మోడీ అతడిని ముందు పెట్టి తప్పుకున్నారని అనవలసి వస్తుందేగాని ఒక మహిళ వెంట దాక్కున్నారనే వ్యక్తీకరణకు ఆస్కారం కలిగి ఉండేది కాదు. తనకు చేతకాక నిర్మలా సీతారామన్‌ను ఆశ్రయించి ఆమె సాయం తీసుకున్నారనేసి అక్కడితో ఆగిపోయి ఉన్నా రాహుల్ గాంధీని ఎవరూ ఆక్షేపించి ఉండేవారు కాదు. ఒక స్త్రీని అడ్డంపెట్టుకున్నారని అనడం వల్లనే ఆయన మాటలకు అభ్యంతరం చెప్పవలసి వచ్చింది. శబరిమల అయ్యప్ప ఆలయ ప్రవేశానికి ప్రయత్నిస్తున్న మహిళలను రెండుగా కోసి ఒకటి ఢిల్లీకి మరొకటి కేరళ ముఖ్యమంత్రికి పంపాలని మళయాల నటుడు, కేరళ బిజెపి నాయకుల్లో ఒకరు అయిన కొల్లం తులసి చేసిన వ్యాఖ్య గమనించదగినది. స్త్రీని మాత అని, తల్లిని దేవత అని కీర్తించి పూజిస్తున్నట్టు కనిపించే సమాజంలో ఆమెను ఇంటా బయటా అడుగడుగునా అవమానపర్చడం, హింసించడం, హత్యాచారాలు నిరాఘాటంగా సాగిపోవడం, స్త్రీని ద్వితీయ శ్రేణి లేదా ఏ శ్రేణి లేని అల్ప జీవిగా చూడడం నాయకత్వ స్థానాలలోని వారు సైతం వారిపట్ల చిన్నచూపుతో మాట్లాడడం మన దేశం, మన సమాజం పరువును పదేపదే గంగలో కలుపుతున్నాయి.