మన తెలంగాణ/మిడ్జిల్: మండల కేంద్రంలోని 133 కెవి సబ్ స్టేషన్ ప్రక్కన 2009 సంవత్సరంలో ఏర్పాటు చేసిన వెంచర్లో గ్రామ పంచాయతీకి చెందాల్సిన 10 శాతం బహిరంగ భూమిని మండలానికి చెందిన కొందరు దళారులు స్థిరాస్తి వాపారులతో కుమ్మక్కై 2400 చదరపు గజాల స్థాలన్ని కాజేశారని మిడ్జిల్ బిజెపి గ్రామ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసిల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జడ్చర్ల, కల్వకుర్తి ప్రధాన రహదారి ప్రక్కన వెలసిన వెంచర్లో గ్రామ పంచాయతీకి చెందాల్సిన బహిరంగ భూమిలో ప్రజల ఉపయోగార్థం, 2009 సంవత్సరంలో అప్పటి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతులమీదుగా ప్రభుత్వ బాలికల వసతి గృహం నిర్మాణానికి శంకుస్థాపన చేయటం జరిగిందని.
వసతి గృహ నిర్మాణానికి నోచుకోకపోవడంతో మండల నాయకులు కొందరు స్థిరాస్తి వ్యాపారులతో కుమ్మక్కై 70 39, 40, 41లలో కొత్తగా ఏర్పాటు చేసిన వెంచర్లో కలపటం జరిగిందన్నారు. బహిరంగ భూమి ఆక్రమణపై గతంలో పలు మార్లు స్థానిక అధికారుల దృష్టికి తెచ్చినా వారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని వారు ఆరోపించారు. ఇకనైనా ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకుని అక్రమార్కులు కాజేసిన 2400 చదరపు గజాల బహిరంగ భూమిని కాపాడి ప్రజలకు ఉపయోగపడే విధంగా తగిన చర్యలు చేపట్టాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్, తిరుపతి, రాములు, గోపాల్ తదితరులు వున్నారు.