గోరటి ఎంకన్న కవిత్వం ప్రపంచీకరణ

  భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రారంభం కావడంతో ప్రపంచీకరణ మొదలయ్యింది. ఈ ప్రపంచీకరణ ప్రభావం అనేక రంగాలపై పడింది. సమస్త కులవృత్తులు, రైతులు ప్రపంచీకరణ ధాటికి రోడ్డున పడ్డారు. బహుళజాతి కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా రావడంతో భారతదేశ కంపెనీలు మూలకుపడ్డాయి. ఈ నేపథ్యంలో మనిషి ప్రపంచీకరణ మాయలో పడినందుకు కవులు, రచయితలు గళాలెత్తారు.ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ సాహితీ సృజన చేస్తున్నారు. సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో ప్రపంచీకరణ విరాట్ స్వరూపాన్ని బలంగానే చాటే ప్రయత్నం చేస్తున్నారు. కథ, నవల, కవిత్వం, […]

 

భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రారంభం కావడంతో ప్రపంచీకరణ మొదలయ్యింది. ఈ ప్రపంచీకరణ ప్రభావం అనేక రంగాలపై పడింది. సమస్త కులవృత్తులు, రైతులు ప్రపంచీకరణ ధాటికి రోడ్డున పడ్డారు. బహుళజాతి కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా రావడంతో భారతదేశ కంపెనీలు మూలకుపడ్డాయి. ఈ నేపథ్యంలో మనిషి ప్రపంచీకరణ మాయలో పడినందుకు కవులు, రచయితలు గళాలెత్తారు.ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ సాహితీ సృజన చేస్తున్నారు. సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో ప్రపంచీకరణ విరాట్ స్వరూపాన్ని బలంగానే చాటే ప్రయత్నం చేస్తున్నారు. కథ, నవల, కవిత్వం, గేయం మొదలైన సాహిత్య ప్రక్రియలలో ప్రపంచీకరణ నేపధ్యంతో రచనలు చేస్తూ సమాజాన్ని మేల్కోలిపే ప్రయత్నం చేస్తున్నారు.

తెలుగులో లబ్ద ప్రతిష్ఠులైన కవులు, రచయితలెందరో ప్రపంచీకరణ నేపధ్యంలో రచనలు చేశారు. 90వ దశకంలోనే ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వం మొదలైంది. మనదైన అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే బలమైన పరిశ్రమతో కవిత్వం పుంఖానుపుంఖానులుగా వచ్చింది. ప్రపంచీకరణ ధాటికి మనదైన సంస్క ృతి, సంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలు, పండుగలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే అనేక పుస్తకాలు వివిధ ప్రక్రియలలో వెలువడ్డాయి. ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ మొదటగా కవిత్వం వచ్చింది. ప్రపంచీకరణను బలంగా చాటిచెప్పింది కవిత్వమే. ఇలాంటి కవిత్వాన్ని బలంగా ప్రపంచానికి తెలియచెప్పింది గోరటి ఎంకన్న కవిత్వం. గోరటి ఎంకన్న రాసిన ప్రతి కవిత్వంలో ప్రపంచీకరణనే మూల సూత్రం.

మన కళ్ళముందు పల్లె ఎలా మారిపోయిందో కళ్ళకు కట్టించాడు. ఇలాంటి ప్రపంచీకరణ కవిత్వాన్ని ప్రతి పదంలో చాటాడు. ఇదే కవిత్వాన్ని ఎంకన్న గేయంగా ఆలపిస్తాడు.గాయకుడై నర్తిస్తాడు. గానమై మనలోకి ప్రవహిస్తాడు. కవిత్వమై మనల్ని రంజింపజేస్తాడు. అదీ ఎంకన్న కవిత్వానికున్న గొప్పదనం. ఎంకన్న తన కవిత్వంలో ప్రపంచాన్ని కళ్ళముందుపెడతాడు. ప్రకృతిని, పల్లె జీవితపు స్థితిగతులను, జీవన సంవేదనలను మనముందు నిలుపుతాడు. ఛిద్రమైపోతున్న మానవ జీవితాలను, సాంస్కృతిక విలువలను వెంకన్న తన కవిత్వంలో అక్షరీకరిస్తాడు. ప్రపంచంలోని ప్రతి వస్తువు ప్రపంచీకరణ దెబ్బకు మాయమైపోయిందని ఆవేదన చెందుతాడు.

ఎంకన్న ఏ వస్తువు గురించి రాసినా అందులో ప్రపంచీకరణ ప్రతిధ్వనిస్తుంది. ఒక్కొక్కసారి ఎంకన్న బైరాగిలా, తాత్త్వికునిలా, ప్రవక్తలా దర్శనమిస్తాడు. జీవితాన్ని వడబోసిన విరాగిలా కనిపిస్తాడు. ప్రపంచీకరణ ప్రభావంతో పల్లెలు కన్నీరు ఎలాపెడుతున్నాయో దు:ఖిస్తాడు. మానవ సంబంధాలు ఎలా కుంచించుకుపోతున్నాయో ఆవేదన చెందుతాడు. మధ్యతరగతి జీవితాలు ఎలా బతుకీడుస్తున్నాయో ఆందోళన చెందుతాడు. దీనికంతటికీ ప్రపంచీకరణ ప్రభావమేనంటూ కవిత్వాన్ని ఆశ్రయిస్తాడు. ప్రశాంతమైన మానవజీవితం ఎలా పగుళ్ళు వారుతుందో కైగట్టి చెబుతాడు. ప్రపంచీకరణ మానవ వికాసానికే తప్ప, విధ్వంసానికి కాదని గట్టిగా హెచ్చరిస్తాడు. ఆధునికత ఎంత అవసరమో అభివృద్ధి కూడా అంతే అవసరమంటాడు. ప్రపంచీకరణ గురించి బలంగా ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా చెప్పడం ఎంకన్న కవిత్వానికున్న జీవలక్షణం.

ప్రపంచీకరణ ఫలాలు పర్యవసనాలు ఎలా ఉన్నాయో మనముందు విశ్వరూపం చూయిస్తాడు. ఎవరూ దర్శించని అనేక అంశాలు ఎంకన్న స్పృశించాడు.ప్రతి కవిత్వం మానవీయకోణాన్ని దర్శించింది. మాయమైపోతున్న ప్రపంచాన్ని పట్టి చూపించింది. కోల్పోతున్న జీవితాలకు చుక్కానియై దారిచూపుతుంది ఎంకన్న కవిత్వం. గమ్యం లేని మానవ జీవితానికి బాటయై నిలుస్తుంది. ఎంకన్న ఏది రాసినా అది అందరికోసం. సమాజ మార్పుకోసం. అందుకే ఎంకన్న అందరివాడయ్యాడు.విశ్వకవిగా రూపాంతరం చెందాడు. ఒకపక్క ప్రకృతిని, మానవజీవితాన్ని ప్రేమిస్తూనే మరోపక్క ప్రపంచీకరణ పైత్యాన్ని గట్టిగానే ప్రశ్నిస్తున్నాడు.

సామ్రాజ్యవాద దోపిడీని కవిత్వంలో ప్రశ్నిస్తున్నాడు. ఆధిపత్య జాడ్యానికి కవిత్వంతో అడ్డుకట్ట వేస్తున్నాడు. ఎంకన్న రాసిన ప్రతి కవిత్వంలో తీవ్రత ఉంది. పల్లె జీవితాల కల్లోల బతుకు ఉంది. ఛిద్రమైన జీవితపు ఆనవాళ్ళు ఉన్నాయి.ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ ప్రభావమూ అటు పల్లె జీవితాన్ని, ఇటు పట్టణ జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసిందో ఎంకన్న గాఢంగానే కవిత్వ జెండాను ఎగరేసిండు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ‘పల్లెకన్నీరు పెడుతుందో’ గేయం. అంతరించిపోతున్న కుల వృత్తులే కాదు మాయమైపోతున్న పల్లె అందాలను ఈ గేయంలో చెప్పిన తీరు ప్రపంచీకరణ ప్రభావం ఎంత గాఢంగా ఉంటుందో తెలియజేసింది.

“పల్లెకన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
కుమ్మరి వాముల తుమ్మలు మొలిసెను
కమ్మరి కొలిమిల దుమ్ము చేరెను
పెద్ద బాడిస మొద్దు వారినది
సాలెల మగ్గం సడుగులిరిగినవి
చేతివృత్తుల చేతులరిగిపోయే నా పల్లెలోనా
గ్రామ స్వరాజ్యం గంగలోన పోయే నా పల్లెలోనా !” అని ఈ గేయంలో వర్తమాన పల్లె దృశ్యాన్నీ మన కళ్ళ ముందుంచుతాడు. ప్రపంచీకరణ ప్రభావంతో చేతివృత్తులు ఎలా ఇరిగిపోయాయో చెబుతాడు. ప్రపంచీకరణ ప్రభావాన్ని గట్టిగా పట్టుకొన్నవాడు గోరటి ఎంకన్న. ప్రాపంచిక అవగాహన లేకపోతే అంత గాఢమైన గేయం ఊపిరి పోసుకోదు.

కళ్ళముందు పచ్చగా ప్రవహించే వాగు ఎలా ఎండి పోయిందో మూలాలను వెతుకుతున్నాడు.
‘వాగు ఎండిపాయెరో
పెదవాగు తడి పేగు ఎండిపాయెరో’
ఒక మానవీయ కోణాన్ని ఆవిష్కరించిన తీరుకు జేజేలు చెప్పక మానదు. ఎంతోమంది రైతున్నలకు ఆసరా అయిన వాగు ఎండిపోవడం ఏ కుట్ర ఫలితం? కళ్ళముందే మనిషి మారిపోవడం ఏ విషబీజ ఫలం?. వీటి మూలాలను ఎంకన్న వెతికాడు. వెతకడమే కాదు కాలర్‌పట్టి లాగాడు. అది ప్రపంచీకరణ విధ్వంసం. మనిషిని రాక్షసుని చేసిన నిజరూపం.ఒకప్పుడు దర్జాగా బతికిన పేదల బతుకులు ఇప్పుడు ఎలా ఉన్నాయో వర్తమానాన్ని కౌగిలించుకోమంటున్నాడు.

“ఏమి మారే ఏమి మారేరా/ ఈ పేదల బతుకులు ఎందుకింత ఈనంగున్నవిరా ”అంటూ సామాన్యుని కష్టాలను వడబోస్తాడు. పేదలు ఇంకా నిరుపేదలుగా, బిచ్చగాళ్ళుగా దైన్యజీవితాన్ని గడుపుతున్న తీరును తన కవిత్వంలో ఎండగడతాడు. ప్రపంచీకరణ ప్రభావంతో పల్లెలతో పాటు పంటలు కూడా ఎలా బీడుగా మారాయో ఎంకన్ననే చెప్పాలి.
“కంపతారు సెట్టు కొట్టి అమ్ముకొని
కడుపు నింపుకునే కాలమొచ్చినాది
సేతాలమేడుందిరో పాలమూరు సేళ్ళన్నీ బీడాయెరా”
చివరికి మనిషి తన జీవనోపాధికోసం కంపతారు చెట్లను అమ్ముకొని జీవించే దుర్గతి పట్టిందని ఆవేదన చెందుతాడు. గ్రామీణ పలుకుబడులను జీవం పోసి కవిత్వం రాసిన ఎంకన్న అచ్చమైన తెలంగాణ మాండలిక పదకోశం.నేటి సమాజంలో అన్ని సమస్యలకు సామ్రాజ్యవాదమే కారణం. మనిషిని వ్యాపారవస్తువుగా భావిస్తూ లాభాలను దండుకుంటున్న బహుళజాతి కంపెనీల పెత్తనాన్ని ఎంకన్న కవిత్వంలో గట్టిగానే ఎదుర్కొన్నాడు. మనిషిని, రైతునీ, కూలిని, ప్రతి ఒక్కరిని బజారుకీడ్చి వారి ఆనందాలను ఆవిరిచేసిన వైనాన్ని గుర్తుచెప్పుకుం టూ…

“నీ ఆట ఏమాయెరో కూలన్న
నీ పాట ఎటుబోయెరో మాయన్న”
అంటాడు. మనదైన సంస్కృతిని ప్రపంచీకరణ ఎలా దెబ్బ తీసిందో పై గేయంలో వినిపిస్తాడు.
ప్రపంచీకరణ పైత్యానికి తెలంగాణ తల్లడిల్లింది. బీడుపొలంగా మారి నెర్రెలిచ్చింది. దీనినే ఎంకన్న కవిత్వం చేసుకున్నాడు. పల్లె తెలంగాణను ఆవిష్కరించాడు.
“రేలాదూలా తాలెల్లాడే నేల నా తెలంగాణ”
సుడిగాలికి సెదిరిన పక్షుల గూడులాయె తెలంగాణ”
ఒక పచ్చనైన తెలంగాణ ప్రపంచీకరణ ఆధిపత్యానికి ఎలా బలైపోయిందో ఈ కవిత్వంలో ఎంకన్న రూపుకట్టిస్తాడు. పల్లెల దాకా పాకిన సామ్రాజ్యవాదపు ఆధిపత్యాన్ని ఈ కవిత్వంలో ఎండగడతాడు. అంతేకాదు ఒకప్పటి పల్లె అందాలను జ్ఞాపకం తెచ్చుకుంటూ…
“నా పల్లె అందాలు చూసిితే కనువిందురో
ఎత్తు వంపులతోని డొంకదారులు సూడు”
అంటాడు. ఒకప్పటి పల్లె అందాలు అవి. ఇప్పుడవి కనుమరుగు. ప్రపంచీకరణ ప్రభావం అంత గాఢంగా ఉంటుంది. వలసెల్లిపోతున్న పల్లె తీరును ఎంకన్న అనేక గేయాల్లో ప్రస్తావించాడు.
“దేవదారు తుమ్మతియ్యలో దేవదారు తుమ్మతియ్యలో
వరుస కరువుతోని రైతు వలసెల్లుతున్నడో”
అంటూ రైతు వలసెల్లిన తీరును ఉదాహరిస్తాడు.
“పచ్చతనం తగ్గిపోయి పక్షులు వలసెల్లినాయి
సుక్కలేక పిట్టలన్ని దిక్కులెల్ల తిరిగినాయి
వొర్లివొర్లి పిట్లలన్ని వొరిగిపోయి తుప్పలల్ల
నీరులేక జీవరాశి దూరదేశ మెల్లిపాయె
పిండకూడు పెడితె కూడ దేవదారు తుమ్మ తియ్యలో
పిలిసినొక్క కాకి రాకపోయే దేవదారు తుమ్మ తియ్య లో” అంటూ చివరికి రైతు వలసపోయే తీరును ఈ గేయం లో కరువుతీరా వర్ణిస్తాడు.

గోరటి ఎంకన్న అంటే ఒక జలపాతపు ఊట. అన్ని రకాల వైవిధ్యాలను తనలో కలుపుకొని కొత్త రాగమై ప్రవహిస్తాడు. ఎవరూ పట్టుకోని, ఎవరూ వెతుక్కోని జాడను కనిపెడతాడు. అది ప్రపంచీకరణ కావచ్చు. ప్రాకృతిక విపత్తులు కావచ్చు. రాజకీయ సంఘటనలు కావచ్చు. ఎంకన్న రాసిన ప్రతి కవిత్వంలో ప్రపంచీకరణ అంతర్లీనంగానే కాదు బాహాటంగానే మనకు కనిపిస్తుంది. ప్రపంచ బాధను తన దు:ఖం లోకి ఒంపుకొని కవిత్వమై ప్రవహిస్తున్నాడు. ఆ కవిత్వం నిండా ప్రపంచీకరణ చేసిన ఒంటినిండా గాయాలు. మా నని మచ్చలు.సరళీకరణ చా చిన విషపు కోరలు.
నిత్యం కవిత్వమై ప్రవహిస్తూ, ప్రపంచాన్ని పహారాకాస్తూ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్న గోరటి ఎంకన్న నిజంగా మన కాలపు కవి. మనవాడైన విశ్వకవి.

                                                                                                            డా॥ భీంపల్లి శ్రీకాంత్

Globalization began is new economic reforms in India

Telangana Latest News

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: