25లక్షలు ఇస్తామన్నారు

మన తెలంగాణ / నిర్మల్: నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్ కేంద్రంలో ఎంఐఎం అధినేత  అసదుద్దీన్ ఒవైసీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ రాజకీయ కలకలానికి వేదికగా నిలిచింది. సోమవారం స్థానిక బైల్ బజార్ ప్రాంతంలో ఎంఐఎం నిర్వహించిన ఈ సభకు అసదుద్దీన్ ఒవైసీ ముఖ్య అతిథిగా హాజరై  కార్యకర్తలనుద్ధేశించి ప్రసంగించారు. నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి తనను ప్రచారానికి రావద్దని.. సభకు హాజరు కావద్దని… దీని కోసం రూ. 25 లక్షలు చెల్లిస్తానంటూ ప్రలోభ […]

మన తెలంగాణ / నిర్మల్: నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్ కేంద్రంలో ఎంఐఎం అధినేత  అసదుద్దీన్ ఒవైసీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ రాజకీయ కలకలానికి వేదికగా నిలిచింది. సోమవారం స్థానిక బైల్ బజార్ ప్రాంతంలో ఎంఐఎం నిర్వహించిన ఈ సభకు అసదుద్దీన్ ఒవైసీ ముఖ్య అతిథిగా హాజరై  కార్యకర్తలనుద్ధేశించి ప్రసంగించారు. నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి తనను ప్రచారానికి రావద్దని.. సభకు హాజరు కావద్దని… దీని కోసం రూ. 25 లక్షలు చెల్లిస్తానంటూ ప్రలోభ పెట్టాడని ఆరోపించారు. తన సన్నిహితునితో ఆయన ప్రలోభాల పర్వాన్ని కొనసాగించారని పేర్కొన్నారు. దీనికి తన సన్నిహితుడు తిరస్కరించారని తెలిపారు. కాగా మహేశ్వర్ రెడ్డి ఒవైసీని సభకు హాజరు కాకుండా చూడాలని కోరుతూ ముథోల్ కాంగ్రెస్ అభ్యర్థి రామారావ్ పటేల్‌తో మాట్లాడినట్లు ఎంఐఎం నేత ఆరోపించారు. రామారావ్ పటేల్ భైంసా మున్సిపల్ చైర్మన్ జాబిర్ అహ్మద్‌తో ఈ డీల్‌పై మాట్లాడిన ఆడియో రికార్డింగ్‌ను ఎంఐఎం శ్రేణులు సోషల్ మీడియా ద్వారా వైరల్ చేశారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. దీనికి తోడుగా పలు ఎలాక్ట్రానిక్ చానళ్లలో కూడా ఈ వ్యవహారం ప్రచారమైంది. అయితే మహేశ్వర్ రెడ్డి దీనిపై స్పందిస్తూ ఒవైసీ ఆరోపణలను ఖండించారు. తాను ఎవరినీ ప్రలోభ పెట్టలేదని, తనకు అలాంటి అవసరం లేదని వివరించారు.

ఓటమి భయంతో టిఆర్‌ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి ఈ కుట్రకు పాల్పడ్డాడని దుయ్యబట్టారు. తాను ఇప్పటి వరకు అసదొద్దిన్‌ను స్వయంగా కలవ లేదని, ఎన్నడూ కూడా ఆయనతో మాట్లాడలేదని వివరించారు. ఆరోపణలు రుజువు చేస్తే ఎన్నికల్లో పోటీ నుండే కాకుండా రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని స్పష్టం చేశారు. ఆరోపణలు రుజువు చేయనట్లైతే వారు కూడా రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మహేశ్వర్ రెడ్డి దీనిపై ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. తన పట్ల రోజురోజుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక ఈ కుట్రకు రూపకల్పన చేశారని తెలిపారు. సోమవారం తన నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చిన వేలాది మంది జనాన్ని చూసి ఐకే రెడ్డికి మతి భ్రమించిందని, దీని కారణంగానే ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు ప్రయోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ వ్యవహారం నిర్మల్ సెగ్మెంట్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో కూడా అసదుద్దిన్ సోదరుడు అక్బరొద్దిన్ ఒవైసీ నిర్మల్‌లో చేసిన ప్రసంగం రాష్ట్ర స్థాయిలో వివాదాస్పదమవడమే కాకుండా ఆయనను అరెస్ట్ చేసే వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. మళ్లీ మరో సారి అసదొద్దిన్ ఒవైసీ మహేశ్వర్ రెడ్డిపై ఆరోపణలు సంధించి రాజకీయ దుమారానికి తెరలేపారు.
ముథోల్ కాంగ్రెస్ అభ్యర్థి రామారావ్ పటేల్, ఎంఐఎంకు చెందిన జబీర్ అహ్మద్‌ల మధ్య నాలుగు నిమిషాల పాటు జరిగిన సంభాషణలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది.
రామారావ్: ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మాట్లాడవచ్చా. పక్కన ఎవ్వరూ లేరు గదా!
జబీర్ : ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడే వచ్చాను. మాట్లాడవచ్చు. పక్కన ఎవ్వరూ లేరు. ఒక్కడినే ఉన్నాను.
రామారావ్ : నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి నన్ను కలిశారు. పాతిక లక్షలు ఇస్తామని చెప్పారు. నిర్మల్‌లో మజ్లిస్ బహిరంగ సభను ఆపాల్సిందిగా కోరారు.
జబీర్ : పాతిక లక్షలు కాదుగదా, యాభై లక్షలు ఇచ్చినా ఆ పని నా వల్ల కాదు. నేను చెప్తే కూడా ఆ సభ ఆగేది కాదు. నేను ఆ పని చేయను. నేను అసదుద్దీన్‌కు చెప్పలేను. మీరు మంచివారు కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను.
రామారావ్ : ఆప గలిగితే ఆపండి.
జబీర్ : పైసలు తీసుకునేవాడిని కాదు. నాకు పైసలే ముఖ్యమైతే కోట్లు సంపాదించగలరు. సారీ
రామారావ్ : ఎలాగైనా ఆ సభను ఆపాలి.
జబీర్ : అంతగా ఆపాలనుకుంటే ఆయన్నే (మహేశ్వర్‌రెడ్డిని ఉద్దేశించి) వెళ్లి ఆ పని చేసుకోమని చెప్పండి.
రామారావ్ : ఆ సభ ఆగిపోయేలా చూడండి.
జబీర్ : నేను ఆ పని చేయలేదు. ఇప్పటికే ఒకసారి చెప్పి నేను చివాట్లు తిన్నాను. పార్టీలో తగిన గౌరవంతోనే నేను ఉన్నాను. ఇప్పుడు పార్టీకి ద్రోహం చేసే పనిని నేను చేయలేదు. క్షమించండి. సార్ (అసదుద్దీన్) దగ్గరికి వెళ్ళి ఆయన్నే చెప్పమనండి, మాట్లాడుకోమనండి.
రామారావ్ : మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే&
జబీర్ : ఈ విషయంలో సార్ (అసదుద్దీన్) చాలా వేడిగా ఉన్నారు. నేను చాలా కష్టపడి కూల్ చేశాను. మళ్ళీ ఈ విషయంలో జోక్యం చేసుకోలేను.
రామారావ్ : నా కోసం ఒక్కసారి ప్రయత్నం చేయండి.
జబీర్ : ఇప్పటికే ఒకసారి ఈ విషయం నేను చెప్పి తిట్లు తిన్నాను. ఇంకోసారి ఈ ప్రయత్నం చేయదల్చుకోలేదు. నేను చాలా పరేషాన్‌లో ఉన్నాను.
రామారావ్ : మరోసారి ఆలోచించండి
జబీర్ : ఇప్పటికే మహేశ్వర్‌రెడ్డి కావచ్చు. ఇంద్రకరణ్‌రెడ్డి కావచ్చు& చాలా ఆఫర్‌లు వచ్చాయి. కానీ వాటిని నేను పట్టించుకోలేదు. అవసరమైతే మీరే వచ్చి సార్‌తో మాట్లాడుకోండి. మీరు వస్తానంటే నేను వద్దని చెప్పను.
రామారావ్ : నేను ఇంతసేపు మాట్లాడి నొప్పించానేమో.. ఏమీ అనుకోవద్దు.
జబీర్ : అలాంటిది ఉంటే నేను ఇంతసేపు మాట్లాడేవాడినే కాదు. మీరు చెప్పిన పని నేను మాత్రం చేయలేను.
పాతిక రూ.లక్షల ముడుపుల విషయమై నిర్మల్‌లో సోమవారం జరిగిన బహిరంగసభలో స్వయంగా ఒవైసీ ప్రస్తావించారు. నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి ఈ ఆరోపణను ఖండించడంతో తాను పాతిక లక్షల ఆఫర్‌ను మాట్లాడినట్లయితే ఆధారాలను బైటపెట్టాలని, తాను ఈ పనికి పాల్పడినట్లు రుజువైతే ఎన్నికల నుంచి మాత్రమే కాక రాజకీయాల నుంచే తప్పుకుంటానని స్పష్టం చేసి వాటిని బైట పెట్టాలని డిమాండ్ చేశారు. కానీ ఈ వ్యవహారంలో ఎక్కడా మహేశ్వర్‌రెడ్డిగానీ, అసదుద్దీన్ ఒవైసీగానీ లేకుండా ఇద్దరి తరఫున వకాల్తా పుచ్చుకున్న మధ్యవర్తుల మధ్య సంభాషణలు జరగడం గమనార్హం.

asaduddin owaisi election campaign in nirmal constituency

Telangana News

Related Stories: