ఆసీస్‌పై హర్మన్‌ప్రీత్ సేన ఘనవిజయం
నాలుగో విజయంతో టాప్‌లో టీమిండియా
ప్రావిడెన్స్(గయానా) : మహిళల టి20 ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన జోరు కొనసాగిస్తుంది. ఇప్పటికే మూడు వరుస విజయాలతో ఊపుమీద ఉన్న భారత్ శనివారం పటిష్ట ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ స్మృతిమంధాన (55 బంతుల్లో 83) ఆరంభం నుంచి ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ (27బంతుల్లో 43) కూడా రాణించడంతో 48 పరుగుల భారీ తేడాతో మరో విజయాన్ని నమోదు చేసింది. మరో ఓపెనర్ మిథాలీరాజ్ గైర్హాజర్‌తో వికెట్ కీపర్ తాలియా భాటియాతో ఇన్నింగ్ ప్రారంభించిన మంధాన మొదట్లో ఆచితూచి ఆడినప్పటికి ఆ తర్వాత ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడింది.
ఫలితంగా ఇన్నింగ్స్ 9వ ఓవర్లోనే టి20 ప్రపంచకప్‌లో తొలి అర్థ శతకం పూర్తి చేసింది. దీంతో భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఆ తర్వాత స్పిన్నర్లు అనుజాపాటిల్, పూనం యాదవ్, రాధా యాదవ్, దీప్తి శర్మల ధాటికి ఆస్ట్రేలియా 9వికెట్ల నష్టానికి 119 పరుగులకే చాప చుట్టేసింది. ఇండియా ఇన్నింగ్స్సందర్భంగా గాయపడిన హీలీ బ్యాటింగ్‌కు రాలేదు. మొదటి మూడు మ్యాచులలో తక్కువ స్కోర్లకే అవుటయిన కారణంగా ఈ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని కృతనిశ్ఛయంతో బరిలో దిగినట్లు మ్యాచ్ అనంతరం మంధాన చెప్పింది. మరోవైపు ఛేదనకు దిగిన ఆసీస్‌ను తమ బౌలర్లు బాగా కట్టడి చేశారని ఫీల్డింగ్‌లో ఎలాంటి తప్పులు చేయకపోవడం కలిసొచ్చిందని ఆమె చెప్పింది. మొత్తంగా ఆసీస్‌పై ఈ విజయం తమకు ఎంతో ప్రత్యేకమైందని చెప్పుకుంది.
మరో రెండు అడుగులే..దూసుకెళ్ళండి
కాగా పటిష్టమైన ఆస్త్రేలియాపై ఘన విజయం సాధించిన హర్మన్‌ప్రీత్ సేనకు ప్రశంసల వర్షం కురుస్త్తోంది. మహిళల ప్రపంచకప్‌లో వరుసగా నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన జట్టును పలువురు మాజీ క్రికెటర్లు అభినందించారు. ‘ఆస్ట్రేలియాపై మీ ప్రదర్శన నిజంగా అద్భుతం. సెమీస్‌లోనూ ఇదే జోరు కొనసాగించాలని కోరుకుంటున్నా..’ అని వివిఎస్ లక్ష్మణ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. అలాగే ‘మీ ప్రదర్శన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇక మిగిలింది రెండు అడుగులు మాత్రమే.. దూసుకెళ్ళండి’ అని టీమిండియా వీరేంద్రసేహ్వాగ్ అన్నారు. గ్రూప్ దశలో అగ్రస్థానంతో సెమీస్‌కు చేరిన భారతజట్టును మాజీ మహిళా క్రికెటర్ అంజుం చోప్రా సైతం అభినందించింది.
Harmanpreet is great success on Aussie
Telangana Latest News