ధన్యజీవి తెలంగాణ రాంరెడ్డి

తెలంగాణ రాంరెడ్డి! ఈ పేరు నేటి తరం రాజకీయ నేతలే కాదు, ప్రజలు కూడా విని ఉండరు. కానీ సరిగ్గా 62 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ అవతరించిన 15 నెలలకే 1958లో తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై నిలదీసి నినదించిన భూమిపుత్రుడు. ప్రభుత్వ అక్రమానికి, అధర్మానికి నిరసనగా 13 ఏళ్ల సర్వీసులోనే ఉన్నతోద్యోగానికి రాజీనామా చేసిన సాహసి, ధీశాలి. 1958 నుండి 1975 వరకు తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా నిలిచి తెలంగాణనే ఇంటి పేరుగా చేసుకొని […]

తెలంగాణ రాంరెడ్డి! ఈ పేరు నేటి తరం రాజకీయ నేతలే కాదు, ప్రజలు కూడా విని ఉండరు. కానీ సరిగ్గా 62 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ అవతరించిన 15 నెలలకే 1958లో తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై నిలదీసి నినదించిన భూమిపుత్రుడు. ప్రభుత్వ అక్రమానికి, అధర్మానికి నిరసనగా 13 ఏళ్ల సర్వీసులోనే ఉన్నతోద్యోగానికి రాజీనామా చేసిన సాహసి, ధీశాలి. 1958 నుండి 1975 వరకు తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా నిలిచి తెలంగాణనే ఇంటి పేరుగా చేసుకొని తెలంగాణ రాంరెడ్డిగా లబ్దప్రతిష్ఠుడైన చరితార్దుడు. మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు వరంగల్, నాగపూర్ లలో ఇంటర్మీడియ3ట్ క్లాస్ మేట్ అయిన గుండా రాంరెడ్డి తెలంగాణ తొలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మలిదశ ఉద్యమాన్ని వయోభారంతో ఇంటి నుండే పరిశీలిస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం కలవరించిన, పలవరించిన తపస్వి.

మట్టపల్లి లక్ష్మీనర్సింహస్వామి దయతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని చెప్పే రాంరెడ్డి 2014లో తన 56 ఏళ్ల కల సాకారమైనప్పుడు 95 ఏళ్ల వయస్సులో తనువెళ్ళా పులకరించగా అదే మట్టపల్లి లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసిన ధన్యజీవి. 1969 ఉద్యమంలో తెలంగాణను సాధించలేకపోయినప్పుడు అదే మట్టపల్లి నర్సింహస్వామిపై కోపంతో ఆంగ్లంలో To invoke the dead souls of my people (Telangana) I cast my bread, if, it goes in vain, me think, thou are too dead (జీవం బారిన గుండెలు నిర్జీవించగ జీవం బోయుటకు నా జీవనాధారం ధారపోసితిన ప్రభూ! అట్టి నా త్యాగము వమ్ము అయినచో నీకున్ జీవంబు లేదని తలంచుతూ చింతించుదున్) అని ధర్మాగ్రహ ప్రకటన చేసి ఆ స్వామి ఆలయ హుండీలో వేసిన ధన్యజీవి తెలంగాణ రాంరెడ్డి.

మరి ఇప్పుడు ఈయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటారా! ఈ నెల 19వ తేదీతో ఆయన 99 ఏళ్లు పూర్తిచేసుకొని 100వ ఏట అడుగిడుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈయన త్యాగం, పోరాటపటిమ, ఆశావాదాన్ని మననం చేసుకోవడం ఎంతో ఆవశ్యకమే కాక ఈ తరానికి స్ఫూర్తిదాయకం కూడా. ఉమ్మడి నల్లగొండ జిల్లా పాత హుజూర్ నగర్ తాలూకా, ప్రస్తుత సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామంలో 1919వ సంవత్సరం నవంబర్ 19న గుండా నర్సిరెడ్డి, అచ్చమ్మ దంపతులకు 3వ సంతానంగా జన్మించారు. ఆయన చదువు మొదటి తరగతి నుండి డిగ్రీ వరకు ఆయన విద్యాభ్యాసమంతా ఉర్దూ మాధ్యమంలోనే జరిగింది. అయినా ఆంగ్ల భాషపై ఆయనకు మంచి పట్టు ఉన్నది.

డిగ్రీ పూర్తయ్యాక తొలిసారిగా 1945లో పాత మహబూబ్ నగర్ జిల్లా, నేటి వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ లో ఆహార శాఖ తాలూకా కార్పొరేషన్ అధికారిగా భాధ్యతలు చేపట్టింది మొదలు 1958 జనవరి 27వ తేదీన డిప్యూటీ వాణిజ్య పన్నుల అధికారిగా రాజీనామా చేసేంత వరకు ఆయన కరీంనగర్ జిల్లా మంధని, హుజూరాబాద్, గద్వాల, హైదరాబాద్, బీదర్, హైదరాబాద్ లలో ఉద్యోగం చేశారు. మధ్యలో 1948లో రజాకార్ల దౌర్జన్యాల కారణంగా ఉద్యోగాన్ని వదిలి దాదాపు ఏడాది పాటు ఆంధ్రప్రాంతానికి వలసపోయిన ఆయనను హైదరాబాద్ ప్రభుత్వం గద్వాలలో అదే అధికారిగా పునర్నియమించింది.

1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ, ఆంధ్రప్రాంత ఉద్యోగుల సర్వీసులను సమీకృతం చేయడం ఆరంభించారు. దరిమిలా తెలంగాణకు చెందిన ఆరుగురు అధికారులకు వాణిజ్య పన్నుల అధికారులుగా పదోన్నతులు ఇవ్వడానికి బదులు వారిని డిప్యూటీ అధికారులుగా కుదించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు అధికారులకు సీటీఓ హోదా ఇచ్చారు. ఈ అక్రమంతో హోదా కోల్పోయి డిప్యూటీ హోదాకు వచ్చిన ఆరుగురిలో ఒకరైన గుండా రాంరెడ్డి ఈ అధర్మాన్ని నిరసిస్తూ 1958 రిపబ్లిక్ డే మరుసటి రోజున తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను నేరుగా రాష్ట్ర గవర్నర్ కు పంపారు. హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన నాటి ఉప ముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి ఇంట్లో ఉండేవారు. రాంరెడ్డి రాజీనామా విషయం తెలిసిన ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రాదు, వద్దని మేమే ఢిల్లీలో ఒప్పుకొని వచ్చాం, ఆంధ్రా ప్రాంత నాయకుల డబ్బు ముందు మన శక్తి సరిపోలేదు అని చెప్పినా రాంరెడ్డి వినలేదట. దాంతో ఆ రాజీనామా ఆమోదం పొందకుండా వెంకట రంగారెడ్డి ఏడాది పాటు అట్టిపెట్టారు. రాంరెడ్డి స్నేహితుడైన హైకోర్టు న్యాయమూర్తి కొండా మాధవరెడ్డి ఎంత నచ్చజెప్పినా రాజీనామాను రాంరెడ్డి వెనక్కు తీసుకోలేదు. దాంతో గుండా రాంరెడ్డి తెలంగాణ రాంరెడ్డిగా తెలంగాణ జనబాహుళ్యంలో స్థిరపడిపోయారు.

1968లో జరిగిన నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి అధికార కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ రావును రాంరెడ్డి ఓడించారు. ఆ ఎన్నికల్లో తెలంగాణ పట్ల రాంరెడ్డి నిబద్ధతకు, అంకిత భావానికి ముగ్ధులైన నాటి మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే తిప్పన కృష్ణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు చకిలం శ్రీనివాసరావులు, కమ్యూనిస్టులు ఆయనకే మద్దతునిచ్చారు. రాంరెడ్డి గెలిచిన అనంతరం ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి దూతలుగా అదే కృష్ణారెడ్డి, శ్రీనివాసరావులు వచ్చి కాంగ్రెస్ లో చేరవలసిందని ఒత్తిడి చేసినా తనకు కమ్యూనిస్టులు కూడా మద్దతిచ్చారు కనుక నేను స్వతంత్ర అభ్యర్థిగానే ఉంటానని రాంరెడ్డి వారికి చెప్పి పంపారు. 1969 ఉద్యమంలో చెన్నారెడ్డి లాంటి నేతలతో కలిసి చురుగ్గా పాల్గొన్నారు.

మళ్లీ 1974లో అదే ఎమ్మెల్సీ స్థానానికి రాంరెడ్డి పోటీచేసినప్పుడు రాంరెడ్డిని ప్రతిపాదించిన కొండ్రపోలు సర్పంచ్ పుల్లయ్య, వేములపల్లి సర్పంచ్ పాండురంగారెడ్డిలను అధికార కాంగ్రెస్ నేతలు లొంగదీసుకొని రాంరెడ్డి నామినేషన్‌పై సంతకాలు తమవి కావని జిల్లా కలెక్టర్ ముందు ఆ సర్పంచులచే చెప్పించారు. అయినా రాంరెడ్డి విజ్ఞప్తి మేరకు పంచాయతీ సమితి, బ్యాంకులలో ఆ సర్పంచుల సంతకాలతో నామినేషన్ పత్రంపై సంతకాలు పోల్చిచూసిన నాటి నల్లగొండ జిల్లా కలెక్టర్ విలియమ్స్ సంతకాలు నిజమేనని రూఢి పర్చుకున్నా అధికారంలోని పెద్దల ఒత్తిళ్ళకు లోనై రాంరెడ్డి నామినేషన్‌ను పరిశీలన దశలో తోసిపుచ్చారు. తత్ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ఎన్నికయ్యారు. 1969 ఉద్యమానికి చెన్నారెడ్డి చేసిన ద్రోహానికి మండిపడ్డ రాంరెడ్డి 1978లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పదవి ఇస్తాను రమ్మని కబురు పంపిన చెన్నారెడ్డి ముఖం కూడా చూడని అభిమాన ధనుడు.

ఈ సందర్భంలో ఒక విషయం గుర్తుచేయాల్సిన అవసరముంది. ఎమ్మెల్సీగా రాంరెడ్డి ఉండగానే ముఖ్యమంత్రి అయిన పీవీ నర్సింహారావు శాసనమండలిలో కలిసినప్పుడు ఏం రాంరెడ్డీ నీకు ఇంకా తెలంగాణ పిచ్చి వదల్లేదా అన్న దానికి ప్రతి సందర్భంలోనూ నర్సింహారావు గారూ తెలంగాణ కచ్చితంగా వచ్చి తీరుతుందని రాంరెడ్డి బదులిచ్చేవారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు అయ్యో పీవీ నర్సింహారావు గారు లేకపోయినే అని చింతించి ఆయన మాటలను గుర్తుచేసుకున్నారు. మరో సందర్భంలో రావి నారాయణరెడ్డి గారికి తెలంగాణ రాంరెడ్డిని పరిచయం చేసినప్పుడు తెలంగాణ మీ ఇంటి పేరా అని రావి అడిగారట. కాదు ఇంటి పేరుగా పెట్టుకున్న పేరని రాంరెడ్డి బదులిచ్చినప్పుడు తెలంగాణ రాదు అని నిర్మొహమాటంగా రావి అన్నారట. ఇలా ఎన్నో ఎగతాళ్లు, పరిహాసాలు తట్టుకుంటూ కూడా తెలంగాణపై ఆశావాదాన్ని ఏనాడూ వదల్లేదు.

తెలంగాణ రాష్ట్రం అవతరించాక 2015లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దృష్టికి తెలంగాణ రాంరెడ్డి గురించి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తీసుకెళ్లి ఆయనకు ఏదైనా చేయాలని కోరగా అయ్యో రాంరెడ్డి గారు ఇంకా జీవించి ఉన్న విషయమే నాకు తెలియదు. కచ్చితంగా చేద్దాం అని కేసీఆర్ చెప్పిన మరుసటి రోజే రాంరెడ్డి సతీమణి మరణించగా ఆ విషయాన్నీ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా అప్పటికప్పుడు రూ.10లక్షలు చెక్కు రాసిచ్చి వెళ్లి రాంరెడ్డి గారికి అందజేయండని విశ్వేశ్వరరెడ్డికి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి చెప్ప గా వారు వచ్చి రాంరెడ్డి గారికి ఆ చెక్కునందజేశారు. తన జీవితకాల స్వప్నం సాకారమైన, ఆశ ఫలించిన రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఈ నెల 19న తెలంగాణ రాంరెడ్డి 100వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న శుభసందర్భాన ఆయనకు యావత్ తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలుపుదాం.

                                                                                                                                                       – కె.ఎస్.ఎన్. ప్రసాద్

Ram Reddy was active in the early Telangana movement

Telangana Latest News