బిసిల జనగణన ఏదీ?

భారతదేశంలో సామాజిక ఆర్థిక కులసముదాయాల జనాభా లెక్కల (సోషియో ఎకనమిక్ అండ్ కాస్ట్ సెన్సస్) కోసం 2011 నుంచి ఇప్పటి వరకు 4,893 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, ఇప్పటి మోడీ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఏడేళ్ళు గడిచిపోయినా ఇంతవరకు ఈ జనాభా లెక్కల వివరాలు విడుదల చేయలేదు. ఎందువల్ల ప్రభుత్వాలు కులసముదాయాల జనాభా లెక్కల విషయంలో వెనుకాడుతున్నాయి? ఏం దాచాలనుకుంటున్నాయి? కులసముదాయాల జనాభా లెక్కలు ఇంతకు ముందు […]

భారతదేశంలో సామాజిక ఆర్థిక కులసముదాయాల జనాభా లెక్కల (సోషియో ఎకనమిక్ అండ్ కాస్ట్ సెన్సస్) కోసం 2011 నుంచి ఇప్పటి వరకు 4,893 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, ఇప్పటి మోడీ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఏడేళ్ళు గడిచిపోయినా ఇంతవరకు ఈ జనాభా లెక్కల వివరాలు విడుదల చేయలేదు. ఎందువల్ల ప్రభుత్వాలు కులసముదాయాల జనాభా లెక్కల విషయంలో వెనుకాడుతున్నాయి? ఏం దాచాలనుకుంటున్నాయి?

కులసముదాయాల జనాభా లెక్కలు ఇంతకు ముందు బ్రిటీషు కాలంలో పదేళ్ళకు ఒకసారి జనాభా గణన జరిగినప్పుడు కులాల జనాభా గణన కూడా చేసేవారు. జనాభా లెక్కల్లో సామాజిక, ఆర్థిక అంతరాలను తెలుసుకునేలా జనాభా లెక్కలు సేకరించడం ప్రపంచమంతా జరుగుతున్నదే. ఈ లెక్కలు ప్రభుత్వ విధానాలు రూపొందించడానికి, అవసరమైన నిర్ణయాలు తీసుకోడానికి ఉపయోగపడతాయి. సాధారణంగా వివిధ దేశాల్లో జాతి, తెగలు, భాష, మతం, లింగభేదం వగైరాల ప్రాతిపదికన జనాభా లెక్కలు సేకరిస్తారు. భారతదేశంలోను మతం, భాష, లింగభేదం ప్రాతిపదికలపై జనాభా లెక్కలను సేకరించడం జరుగుతోంది. కాని కులాల వారిగా జనాభా లెక్కల సేకరణ విషయంలో ప్రభుత్వాలు సంకోచిస్తున్నాయి.

స్వాతంత్రం తర్వాత కేవలం షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యుల్డ్ ట్రైబ్స్ జనాభా లెక్కలు మాత్రమే కులాల వారీ జనాభా లెక్కలుగా సేకరిస్తున్నారు. లోక్‌సభలోను, రాష్ట్రాల అసెంబ్లీల్లోను వారికి రిజర్వేషన్లు ఉండడంవల్ల ఈ కులసముదాయాల జనాభా లెక్కలు సేకరించడం తప్పనిసరయింది. మిగిలిన కులాల విషయంలో జనాభా లెక్కలు సేకరించడం వల్ల కులతత్వం పెరుగుతుందన్న వాదన ఒకటి వినిపిస్తోంది. కులాలవారీ జనాభా లెక్కల వల్లనే కులవ్యవస్థ ఏర్పడిందన్నట్లుంది ఈ వాదన. భారతదేశంలో 1881లో మొదటిసారి దేశంలో జనాభా లెక్కల సేకరణ జరిగింది. ఆ తర్వాతి నుంచి పదేళ్ళకు ఒకసారి ఫిబ్రవరి నెలలో జనాభా లెక్కల సేకరణ ప్రారంభమవుతూ వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా స్కూలు టీచర్లు ఇంటింటికి వెళ్ళి, ప్రతి వ్యక్తి వివరాలు తెలుసుకుని సమాచారం నమోదు చేస్తుంటారు. 1941లో జనాభా లెక్కల సేకరణ జరగలేదు. అప్పట్లో రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా జనాభా లెక్కల సేకరణకు అడ్డంకులు ఎదురయ్యాయి.

2011లో జనాభా లెక్కల సేకరణ మారింది. సోషియో ఎకనమిక్ అండ్ కాస్ట్ సెన్సస్ జూన్ 29, 2011న ప్రారంభమైంది. ఇంటింటికి వెళ్ళి జనాభా లెక్కలు సేకరించే పద్ధతి లాంటిదే ఇది కూడా. కేంద్రప్రభుత్వం అప్పట్లో చేసిన ప్రకటన ప్రకారం 2011 డిసెంబరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలి. అలా సేకరించిన సమాచారాన్ని 12వ పంచవర్ష ప్రణాళిక (2012 -13 నుంచి 2016 -17 వరకు)లో ఉపయోగిస్తామని ప్రభుత్వం చెప్పింది. కాని ఈ చివరి తేదీ చాలా సార్లు మార్చారు. చాలా సార్లు వాయిదాలు వేశారు. చివరకు 2016 మార్చి 31న ఈ సర్వే పూర్తయ్యిందన్నారు. ఈ ప్రాజెక్టు అనుకున్న లక్ష్యాలన్నీ సాధించిందని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక వ్యవహారాల కేబినేట్ కమిటీ ఈ ప్రాజెక్టు వ్యయం పునస్సమీక్షించడానికి అంగీకరించింది. కాని నేటి వరకు సేకరించిన లెక్కలేమిటో సమగ్రంగా ప్రజల ముందుకు రాలేదు.

ఈ ప్రాజెక్టు ద్వారా క్షేత్రస్థాయిలో లభించిన సమాచారం చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉంది. దేశంలో దాదాపు 46,73,034 కులాల పేర్లున్నాయి. ఇందులో ఉపకులాలు, కులానికి పర్యాయపదాలు, ఇంటిపేర్లు, గోత్రాలు అన్నీ కలిసి ఉన్నాయి. కేంద్రప్రభుత్వం నీతిఆయోగ్ డిప్యూటీ చైర్మన్ అరవింద్ పనగారియా నాయకత్వంలో ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని 2015 జులై 16న నిర్ణయించింది. ఆ తర్వాత ఈ విషయంలో మరేమీ జరగలేదు. ఇప్పుడు ప్రొఫెసర్ పనగారియా నీతిఆయోగ్ డిప్యూటీ చైర్మన్ పదవిలో లేరు. ఆయన మళ్ళీ కొలంబియా విశ్వవిద్యాలయంలోకి వెళ్ళిపోయారు. నిపుణుల కమిటీ సమావేశం ఎన్నడూ జరగలేదు. అసలు కమిటీయే ఏర్పాటు చేయలేదు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ప్రభుత్వం రాతపూర్వకంగా ఈ జవాబు చెప్పింది. కాబట్టి అసలు కమిటీయే లేనప్పుడు కమిటీ నివేదిక కూడా ఉండదు.

కులాల వారి జనాభా లెక్కల వ్యవహారం ఏమైంది. అటకెక్కించారా? ఈ లెక్కల సేకరణలో చాలా తప్పులు, లోపాలున్నాయన్న వార్తలు వచ్చాయి. ఈ మొత్తం ప్రాజెక్టులో ఒక పెద్ద లోపం ఏమిటంటే, ఇది 2011 జనాభా లెక్కల్లో భాగంగా లేదు. పదేళ్ళకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తారు. సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం ఇది జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం తప్పు సమాచారం ఇచ్చినా లేక తప్పు సమాచారం నమోదు చేసినా నేరమవుతుంది. ఈ జనాభా లెక్కల సేకరణ పత్రంలోనే కులానికి సంబంధించి మరో కాలమ్ ఇచ్చి కులాల వారీ లెక్కలు సేకరిస్తే సులువుగా అయిపోయేది. కాని ప్రభుత్వం ప్రత్యేకంగా కులాలవారీ జనాభా లెక్కలు సేకరించాలని నిర్ణయించి దాని కోసం దాదాపు 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

ఈ జనాభా లెక్కల సేకరణకు అనుభవంలేని అంగన్‌వాడీ వర్కర్లను, స్వచ్ఛంద సంస్థలను నియమించారు. స్కూలు టీచర్ల సేవలు ఉపయోగించుకోలేదు. పైగా ఈ సమాచార సేకరణ బాధ్యతను రాష్ట్రప్రభుత్వాలకు అప్పగించారు. రాష్ట్రప్రభుత్వాలకు ఈ లెక్కల సేకరణ నిర్వహించిన అనుభవం లేదు. 2011 నుంచి 2016 వరకు ఈ లెక్కల సేకరణ ఒడిదుడుకులతో సాగింది. ఈ మొత్తం వ్యవహారం పరిశీలిస్తే ప్రభుత్వానికి ఈ జనాభా లెక్కల విషయంలో ఎన్నడూ ఆసక్తి లేదని అర్థమవుతోంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వమైనా, మోడీ ప్రభుత్వమైనా రెండు ప్రభుత్వాలు కూడా కులాలవారీ జనాభా లెక్కల సేకరణకు సానుకూలంగా వ్యవహరించలేదు. కులాల వారీ లెక్కలు లేకుండా ఇతర వెనుకబడిన కులాలు (ఒబిసి)లకు సంబంధించి పాలసీ నిర్ణయాలు ఎలా తీసుకోగలరు? ఎవరు ఎంత సంఖ్యలో ఉన్నారో, వారి సామాజిక ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతులు ఏమిటో తెలియకుండానే వారి కోసం రుణ సదుపాయం, స్కాలర్ షిప్పుల విషయంలో పాలసీ రూపొందించే పరిస్థితి ఇప్పుడు ఉంది.

ఒబిసి సంక్షేమానికి కేంద్రప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలకు గ్రాంటులు అందిస్తుంది. ఏ రాష్ట్రంలో ఎంతమంది ఒబిసిలు ఉన్నారో తెలియకుండానే వివిధ రాష్ట్రాలకు ఈ గ్రాంటుల పంపకం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర జనాభా ప్రాతిపదికన ఈ గ్రాంటులు ఇస్తున్నారు. ఇప్పటికి 1931 నాటి కులాలవారి జనాభా లెక్కలనే ఉపయోగిస్తున్నారు. భారత జనాభాలో ఒబిసిలు 52 శాతం ఉంటారని మండల్ కమిషన్ చెప్పింది. 1931 కులాలవారి జనాభా లెక్కలే దీనికి ఆధారం. జనాభా లెక్కల్లో కులాల వివరాలు కూడా సేకరించాలని మండల్ కమిషన్ సిఫారసు చేసింది. 2021లో ఒబిసి జనాభా లెక్కల సేకరణ చేస్తామని మోడీ ప్రభుత్వం చెబుతోంది. ఇది మరో అయోమయం. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో ఒబిసి జాబితాలు వేర్వేరుగా ఉన్నాయి. దాదాపు ఏడు రాష్ట్రాల్లో ఒబిసిలకు సంబంధించి ఒకటికి మించి జాబితాలు ఉన్నాయి. కాబట్టి అందరూ ఒక్క జాబితాకు ఒప్పుకోవడం అనేది తేలిక కాదు.

                                                                                                                                           – దిలీప్ మండల్  (ది ప్రింట్ )

Social and Economic Census opened on June 29, 2011

Telangana Latest News