ఓటుకు మద్యం!

   ఎన్నికలలో ఓటర్లకు అభ్యర్థులు, పార్టీలు నగదు, బహుమతులతోపాటు మద్యం పోయించడం కూడా ఒక తప్పనిసరి అవసరంగా, అలవాటుగా మారిపోవడం అత్యంత బాధాకరం, ఆందోళనకరం. దీనికి బాధ్యులెవరు, ఎలా నిరోధించాలి అనే ప్రశ్నలకు సుళువుగా సమాధానం దొరకదు. ‘త్రాగుడు మనిషిని తననుతాను మరిచిపోయేలా చేస్తుంది. తాగినప్పుడు అతడు దాదాపు మృగంలా మారుతాడు. తన నాలుక మీద, ఇతర అవయవాల మీద అదుపు కోల్పోతాడు. భార్యకు, చెల్లెలికి తేడా కూడా తెలుసుకోలేడు’ అని గాంధీ మహాత్ముడన్నాడు. అలాగే ‘మత్తు […]

   ఎన్నికలలో ఓటర్లకు అభ్యర్థులు, పార్టీలు నగదు, బహుమతులతోపాటు మద్యం పోయించడం కూడా ఒక తప్పనిసరి అవసరంగా, అలవాటుగా మారిపోవడం అత్యంత బాధాకరం, ఆందోళనకరం. దీనికి బాధ్యులెవరు, ఎలా నిరోధించాలి అనే ప్రశ్నలకు సుళువుగా సమాధానం దొరకదు.

‘త్రాగుడు మనిషిని తననుతాను మరిచిపోయేలా చేస్తుంది. తాగినప్పుడు అతడు దాదాపు మృగంలా మారుతాడు. తన నాలుక మీద, ఇతర అవయవాల మీద అదుపు కోల్పోతాడు. భార్యకు, చెల్లెలికి తేడా కూడా తెలుసుకోలేడు’ అని గాంధీ మహాత్ముడన్నాడు. అలాగే ‘మత్తు పదార్థాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వాలు పిల్లల చదువులకోసం, ఇతర ప్రజా సేవల కోసం వినియోగించడం నేరం. అటువంటి రాబడిని జాతి నిర్మాణ అవసరాలకు చేయాలనే ఉత్సుకతను అవి విడనాడుకోవాలి’ అని కూడా ఆయన అభిప్రాయపడ్డాడు. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వాలు ఆయన వద్దన్నవే చేస్తున్నాయి.

దేశమంతటా అన్ని ప్రాంతాల్లో మామూలు రోజుల్లోనే మద్యం విక్రయాలు నిరాఘాటంగా సాగిపోతున్నాయి. ఎన్నికలలోనైతే అమ్మకాలు మరింత జోరై మద్యం ఏరులై పారుతున్నది. ఓటర్లలో మంచి, చెడు విచక్షణ జ్ఞానాన్ని తుడిచిపెట్టడం ద్వారా వారి ఓట్లను వేయించుకోవడమే లక్షంగా ఈ మద్యభారతం హద్దు, ఆపు లేకుండా సాగుతున్నదని భావించాలి. ప్రజాస్వామ్య పరమోద్దేశం గురించిన అవగాహన, చైతన్యం సాధారణ ఓటర్లలో బొత్తిగా లేకపోవడం తాము తమ ఓటుపై స్వతంత్ర నిర్ణయాధికారంగల సంపూర్ణ, సమగ్ర, నిటారు వ్యక్తులమనే స్పృహ వారిలో కొరవడడం కూడా ఇందుకు కారణమని చెప్పుకోవాలి. ఓటరుకు ‘మందు’ బాటిల్‌తోపాటు బిర్యానీ ప్యాకెట్టు ఇచ్చే పద్ధతి సైతం వేళ్లూనుకుంటున్నది.

అంతిమంగా ఎంత మంచి పాలన అందించినా, ఎటువంటి గొప్ప అభ్యర్థులను నిలబెట్టినా ఓటర్లకు డబ్బు, మద్యం, కానుకల సరఫరా అనేది అన్ని పార్టీలకు, అభ్యర్థులకు తప్పనిసరి అయిపోయింది. ఈ కారణంగానే ఎన్నికల్లో వారు పెట్టితీరవలసిన ఖర్చు అపారంగా పెరిగిపోతున్నది. పర్యవసానంగా ఎన్నికల బరిలో దిగడం డబ్బులేని సామాన్యులకు, మంచివారికి, మేధావులకు బహుదూరమైన వ్యవహారం అయిపోతున్నది. ఇంత డబ్బు పెట్టి ఎన్నికయ్యే వ్యక్తి దానిని అసలు, వడ్డీలతో తిరిగి రాబట్టుకోడానికి అవినీతిని ఆశ్రయించడం ఆనవాయితీ అయిపోయింది. ఆఖరుకు ప్రజాధనమే ప్రజల కంట్లో కారం చల్లడానికి, వారి ఓటును నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడుతున్నది. ఓటరుకు లంచమివ్వడం అవినీతికి మంచం వేయడం ఇదొక విష వలయంగా మారింది.

ఫ్యూడల్ పెత్తందారీతనం రాజ్యం చేసిన రోజుల్లో చెప్పనలవికాని శారీరక శ్రమతో సంపద సృష్టించిన గ్రామీణ శ్రామిక ప్రజలు కల్లు వంటి వాటిని ఆశ్రయించేవారు. పెత్తందార్లు కూడా వారికి వాటిని అలవాటు చేసి చౌకగా వారి శ్రమను దోచుకునేవారు. ఫ్యూడల్ పెత్తనం అంతరించి దశాబ్దాలు గడిచిపోయినా జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న పేదల సామాజిక, ఆర్థిక స్థితిలో చెప్పుకోదగిన మెరుగుదల లేదు. అలాగే ఇప్పటికీ ఎక్కువ శాతం అభ్యర్థులు, పార్టీల పెద్దలు ఆనాటి ఫ్యూడల్ కుటుంబాల వారసులే. కొత్త ధనికులు వచ్చి చేరినప్పటికీ పాత శ్రీమంతులదే పైచేయిగా ఉంటున్నది. ఈ కారణంగా పూర్వం మాదిరిగానే పేదల మత్తు సేవనం కొనసాగుతున్నది. ఏటెల్లకాలం కష్టాలు, కడగండ్లలో గడిపిన తమకు ఎన్నికల వేళ ఆ కొద్ది రోజులైనా మత్తిల్లి, జల్సాచేసి, మజా అనుభవించే అవకాశం అయాచితంగా వస్తున్నందున పేద ఓటర్లు అందుకోసం క్యూ కడుతున్నారు. పోలింగ్ రోజుల్లో అభ్యర్థులు ఓటర్లకు మద్యం టోకెన్లు సరఫరా చేసే విధానం నడుస్తోందని ఎన్నికల సంఘానికి చెందిన ఒక ఉన్నతాధికారే ఒక ఇంటర్వూలో వెల్లడించారు.

పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే నిషేధం విధించినా ప్రయోజనం లేకుండా పోతున్నది. ముందుగానే నిల్వలుంచుకొని రాత్రింబవళ్లు తాగించడం మితిమించిపోతున్నది. పేదల ఓటు మద్యం బాట పట్టక తప్పని పరిస్థితి కొనసాగుతున్నది. 2014 ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని జబువా జిల్లాలో ఓటు వేయడం మరిచిపోవద్దు, అది మన బాధ్యత అనిచెప్పే స్టిక్కర్లను నేరుగా మద్యం బాటిళ్లమీదే, వాటిపైన ఉండే వార్నింగ్‌ను కప్పివేస్తూ అధికారులే అతికింపించారంటే మద్యం మన ఎన్నికల వ్యవస్థను ఎంతగా పీడిస్తున్నదో చెప్పుకోనక్కరలేదు. మద్యం తాగిన ఓటు మంచికి చేటు అనే విషయాన్ని గుర్తించి, గౌరవించి ఓటు వేళ ఓటర్లు చైతన్యంతో మెసులుకుంటేగాని ప్రజాస్వామ్యానికి, ప్రజాధనానికి మంచి రోజులు రావు.

Supplying liquor tokens for voters in polling days

Telangana Latest News