విశ్వసనీయత ముఖ్యం

ఎన్నికల హామీలు, మేనిఫెస్టోల ద్వారా ఇపుడు ప్రజలను కొత్తగా మెప్పించవలసిన అవసరం కేసీఆర్‌కు ఏమీ లేదు. ఎన్నికల క్రమంలో రొటీన్‌గా ఆ పని చేస్తే చేయవచ్చుగాక. కాని అది అగత్యమేమీ కాదు. అటువంటి అగత్యం అంటూ ఉందంటే అది కాంగ్రెస్‌కు, ఇతర ప్రతిపక్షాలకే. వారు లోగడ తాము పరిపాలించిన ఆరు దశాబ్దాల కాలంలోగాని, ప్రతిపక్షంలో ఉన్న సమయాలలో తమ వ్యవహారణా ధోరణితోగాని విశ్వసనీయతను పొందలేకపోయారు. 2014 తర్వాత కూడా ఇదే పరిస్థితి. సంక్షేమానికి, అభివృద్ధికి సంబంధించిన పది […]

ఎన్నికల హామీలు, మేనిఫెస్టోల ద్వారా ఇపుడు ప్రజలను కొత్తగా మెప్పించవలసిన అవసరం కేసీఆర్‌కు ఏమీ లేదు. ఎన్నికల క్రమంలో రొటీన్‌గా ఆ పని చేస్తే చేయవచ్చుగాక. కాని అది అగత్యమేమీ కాదు. అటువంటి అగత్యం అంటూ ఉందంటే అది కాంగ్రెస్‌కు, ఇతర ప్రతిపక్షాలకే. వారు లోగడ తాము పరిపాలించిన ఆరు దశాబ్దాల కాలంలోగాని, ప్రతిపక్షంలో ఉన్న సమయాలలో తమ వ్యవహారణా ధోరణితోగాని విశ్వసనీయతను పొందలేకపోయారు. 2014 తర్వాత కూడా ఇదే పరిస్థితి. సంక్షేమానికి, అభివృద్ధికి సంబంధించిన పది విషయాలలో ఒకటి రెండు ఇంకా జరగక తక్కిన ఏడెనిమిది జరిగితే, జరగని వాటి గురించి రాత్రింబవళ్లు హోరెత్తటం మినహా జరిగిన వాటిని చూసేందుకు నిరాకరించే వారికి విశ్వసనీయత ఎట్లా లభిస్తుంది? 

ఎన్నికల కోసం హామీలు ముఖ్యమే. కాని పార్టీల విశ్వసనీయత అంతకన్నా ముఖ్యం. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు తమ హామీలనిస్తున్నాయి. అవి ఒకరిని మించి ఒకరివి ఉంటున్నాయి. అంటువంటి స్థితిలో ప్రజలు కేవలం హామీలనుగాక, ఆయా పార్టీలు అందుకు కట్టుబడేది ఎంతో చూస్తారని వేరే చెప్పనక్కరలేదు. దానినే విశ్వసనీయత అంటున్నాము.

ఇందుకు గతం నుంచి ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు గట్టిపోటీ మొదటిసారిగా ఏర్పడింది. ఎన్‌టిఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినపుడు. ఆయన పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తామని ప్రకటించారు. దీర్ఘకాలంపాటు తమిళనాడులో ఉండిన ఆయనపై అక్కడి సంక్షేమ పథకాల ప్రభావం బాగా ఉండేది. బియ్యం పథకం అక్కడ ఉంది. అదిగాక, ప్రజా సంక్షేమానికి కట్టుబడిన అప్పటి ఆంధ్రప్రదేశ్ అధికారులు కొద్ది మంది ఎన్‌టిఆర్‌కు దీనిపై అనుకూల సలహాలు ఇచ్చారు.

ఎన్‌టిఆర్‌కు స్వయంగా కూడా పేదల పక్షపాతి అనే ప్రతిష్ట ఎందుకైతెనేమి అప్పటికే కలిగింది. ఇవి అన్నీ కలగలిసి ఆయన బియ్యం పథకం ప్రకటించారు. అపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌కు చెందిన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి. ఆయన ఎన్‌టిఆర్‌తో పోటీ పడుతూ, రూ. 1.90కే కిలో బియ్యం ఇవ్వగలమని ప్రకటించారు. కిలోకు పది పైసలు తేడా ఇపుడు పెద్దదిగా తోచకపోవచ్చు. కాని 35 సంవత్సరాల క్రితం అప్పటి పేదల ఆర్థిక పరిస్థితికి అది ఎక్కువే. ఆ విధంగా చూసినపుడు పేదల ఓట్లు కాంగ్రెస్‌కు పెద్ద ఎత్తున లభించవలసింది. కాని ఆ పార్టీ చిత్తుగా ఓడింది. అందుకు కారణం పేదలకు ఎన్‌టిఆర్ మాటపై కుదిరిన విశ్వసనీయత. ఆయన విజయానికి ఇదొక్కటే కారణం అనటం లేదు. కాని ఇది కూడా ఒక ముఖ్యకారణం అయింది.

తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబుకు మధ్య పోటీ ఏర్పడినపుడు కూడా ఇదే జరిగింది. వైఎస్‌ఆర్ మొదటిసారిగా 2004లో గెలిచిన తర్వాత, 2009 ఎన్నికలు వచ్చినపుడు తాను ఎట్లాగైనా గెలవాలని చంద్రబాబుకు పట్టుదల ఏర్పడింది. దానితో ఎడాపెడా హామీలు ఇస్తూపోయారు. గమనించదగిన దేమంటే, హామీలు ఇవ్వటంలో ఆయనతో రాజశేఖర రెడ్డి పోటీ పడలేదు. బియ్యం కోటా కొద్దిగా పెంచటం మినహా మరేమీ ప్రకటించినట్లు లేదు. ప్రజలు చంద్రబాబును నమ్మరని, తనను నమ్ముతారన్నది ఆయన విశ్వాసం. దానితో ఆయన చంద్రబాబుపై ఎదురు దాడి సాగించారు కూడా. చంద్రబాబు హామీలను ప్రజలు ఒక వేళ నమ్మగలరేమోననే అనుమానం కొంత కూడా ఆయనపై పని చేసినట్లున్నది. దానితో, చంద్రబాబుకు ఆయన ‘ఆల్ ఫ్రీ బాబు’ ని పేరు పెట్టారు.

టిడిపి అధ్యక్షుడు ఇస్తాననేవి మితిమీరినవని, ఆచరణ సాధ్యం కానివని ప్రచారం చేస్తూ పోయారు. “చంద్రబాబు అన్నీ ఫ్రీ అంటున్నాడు. అది సాధ్యమనుకుంటున్నారా?” అంటూ ప్రజలను బహిరంగ సభలలో నేరుగా ప్రశ్నించారు. అందుకు ప్రజలు “లేదు లే” దంటూ చేతులు ఊపుతూ కొట్టి వేయటాన్ని మనం టివి ఛానళ్లలో గమనించాము. ఆ విధంగా రాజశేఖర రెడ్డి తన విశ్వసనీయతను, చంద్రబాబు విశ్వాస రాహిత్యాన్ని రుజువు చేశారు. చివరకు, ‘ఆల్ ఫ్రీ బాబు’ను వరుసగా రెండవసారి ఓడించారు.

విశ్వసనీయత ముందు ఎంతటి హామీలు అయినా ప్రజల దృష్టిలో నిలవవు అని చెప్పేందుకు అది రెండవ ఉదాహరణకాగా, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ను మించిన హామీలను ఇచ్చేందుకు సాక్షాత్తూ రాహుల్ గాంధీ ప్రయత్నించారు. కాని ప్రజలు టిఆర్‌ఎస్‌ను విశ్వసించారు తప్ప కాంగ్రెసను కాదు. అప్పటికి టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇంకా ముఖ్యమంత్రిగా పాలించిన అనుభవం లేదు. ఉద్యమ నేతగా సంపాదించిన విశ్వసనీయత మాత్రమే ఉంది. అది ఎన్‌టిఆర్‌తో పోల్చదగ్గ స్థితి. ఆయనకు కూడా 1982లో పాలనానుభవం లేదు. ఒక వ్యక్తిగా విశ్వసనీయతను సంపాదించారు. వీరిద్దరికి భిన్నంగా 2009లో రాజశేఖర రెడ్డికి అప్పటికే ఒక విడత ముఖ్యమంత్రిగా తెచ్చుకున్న విశ్వసనీయత ఉంది. అందువల్లనే, ఏ విధంగా చూసినప్పటికీ ప్రజల విశ్వాసం పొందటమనేది ప్రధానమని, హామీలు ఆకాశాన్ని తాకినా విశ్వసనీయత లేనిదే ఉపయోగం ఉండదన్నది ఈ ఉదాహరణాలలోని నీతి.

ఇక ప్రస్తుతానికి వద్దాం. తెలంగాణ ప్రజలు గత ఎన్నికల నాటికి కేసీఆర్‌ను ఉద్యమ కాలంలో చూశారు. నమ్మారు. ఆ ఎన్నికలలో గెలిపించారు. ఆ ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్ తన వైపు నుంచి కొన్ని హామీలు ఇచ్చింది. వాటిలో సంక్షేమానికి, అభివృద్ధికి సంబంధించినవి ఉన్నాయి. తర్వాత నాలుగేళ్లకుపైగా పరిపాలన సాగింది. సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి ఇచ్చిన హామీలలో ప్రభుత్వం నిలబెట్టుకున్నవి ఏమిటో ప్రజలు చూస్తూ వచ్చారు. ఈ క్రమం గత ఎన్నికల అనంతరం కొంత కాలం నుంచే మొదలైంది. దాని ప్రభావం ఏమిటో 2014 నుంచి జరిగిన ఉప ఎన్నికలలో స్పష్టంగా కన్పించింది. ప్రభుత్వ విశ్వసనీయత ఒకటిరెండని గాక ప్రతి ఒక్క ఉప ఎన్నికలో రుజువైంది. అది కూడా బొటాబొటినగాక భారీ మెజారిటీలతో. ఇంకా గమనించదగినది ఏమంటే కొన్ని ఎన్నికలలో ప్రతిపక్షాలు అన్ని కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చేతులు కలిపి కూడా చిత్తుగా ఓడాయి. అందుకు కారణం కేసీఆర్ విశ్వసనీయత 2014 ఎన్నికల తర్వాత, తన పరిపాలన కారణంగా మరింత పెరగటమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.

ఇదంతా కల్పితమైన వాదన కాదు. పైన పేర్కొన్న ఉదాహరణలుగాని, ఇతర విషయాలుగాని అందరూ గత కాలంలో స్వయంగా గమనించిన వాస్తవాలు. మాటలు, అనుభవాలు, హామీలు, అట్టహాసాలకన్న ప్రజల విశ్వసనీయత కీలకమన్నది అడుగడుగునా రుజువైన విషయం. అటువంటి స్థితిలో మొదట ఉద్యమ కాలాన్ని, తర్వాత పరిపాలనను గమనించిన ప్రజలు కేసీఆర్‌పట్ల తమకు కుదిరిన విశ్వాసాన్ని ఉప ఎన్నికల కాలంలోనే చాటిన స్థితిలో ఇపుడు 2018 ఎన్నికల ఫలితాలు అందుకు భిన్నంగా ఉండగలవని భావించటం కష్టం. ఈ నాలుగు సంవత్సరాల సంక్షేమం, అభివృద్ధిని నిష్పాక్షికంగా విశ్లేషించే ఎవరికైనా అర్థమయ్యే విషయమిది. ప్రతిపక్షాలు, ఇతర విమర్శకులకు తమ లక్షాలు తమకు ఉండటం సహజం గనుక అందుకు తగినట్లు వ్యాఖ్యానిస్తారు. వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదు. దృష్టి పెట్టవలసింది ప్రజల పైననే. విశ్వసనీయత అని మనం అంటున్నది ఆ ప్రజల విషయంలోనేగాని, ప్రతిపక్షాలూ ఇతర విమర్శకుల విషయమై కాదుగదా.

ఎన్నికల హామీలు, మేనిఫెస్టోల ద్వారా ఇపుడు ప్రజలను కొత్తగా మెప్పించవలసిన అవసరం కేసీఆర్‌కు ఏమీ లేదు. ఎన్నికల క్రమంలో రొటీన్‌గా ఆ పని చేస్తే చేయవచ్చుగాక. కాని అది అగత్యమేమీ కాదు. అటువంటి అగత్యం అంటూ ఉందంటే అది కాంగ్రెస్‌కు, ఇతర ప్రతిపక్షాలకే. వారు లోగడ తాము పరిపాలించిన ఆరు దశాబ్దాల కాలంలోగాని, ప్రతిపక్షంలో ఉన్న సమయాలలో తమ వ్యవహారణా ధోరణితోగాని విశ్వసనీయతను పొందలేకపోయారు. 2014 తర్వాత కూడా ఇదే పరిస్థితి.

సంక్షేమానికి, అభివృద్ధికి సంబంధించిన పది విషయాలలో ఒకటి రెండు ఇంకా జరగక తక్కిన ఏడెనిమిది జరిగితే, జరగని వాటి గురించి రాత్రింబవళ్లు హోరెత్తటం మినహా జరిగిన వాటిని చూసేందుకు నిరాకరించే వారికి విశ్వసనీయత ఎట్లా లభిస్తుంది? ఈ చిన్న ఇంగిత జ్ఞానపు విషయాన్ని అయినా అర్థం చేసుకోని వారు, ప్రజలను మెప్పించేందుకు, లేదా భ్రమపెట్టేందుకు ‘ఆల్ ఫ్రీ బాబు’ పద్ధతిలో హామీలు గుప్పిస్తున్నారు. వారికి జీవితంలో ఎంత అనుభవమున్నా వృథా అవుతున్నది.

All parties committed to attracting voters in Assembly polls

Telangana Latest News