బ్రెగ్జిట్ ప్రకంపనలు

   బ్రెగ్జిట్ పరిణామాలు బ్రిటన్‌ను మళ్లీ బలంగా ఊపుతున్నాయి. ప్రధాని థెరెసా మే కొనసాగడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగే బ్రెగ్జిట్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో దానితో కుదుర్చుకోవలసిన ఉపసంహరణ ఒప్పందం విషయంలో థెరెసా మే సొంత కన్సర్వేటివ్ పార్టీలోనే ఎదురీదుతున్నారు. ఆమె ప్రతిపాదించిన ఒప్పందం ఇయుకు బ్రిటన్ లొంగుబాటును ప్రతిబింబిస్తున్నదనే కారణమ్మీద ఆమె మంత్రివర్గంలోని ఇద్దరు జూనియర్లు రాజీనామా చేశారు. అందులో బ్రెగ్జిట్ పర్యవేక్షణ బాధ్యతలను చూస్తున్న మంత్రి […]

   బ్రెగ్జిట్ పరిణామాలు బ్రిటన్‌ను మళ్లీ బలంగా ఊపుతున్నాయి. ప్రధాని థెరెసా మే కొనసాగడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగే బ్రెగ్జిట్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో దానితో కుదుర్చుకోవలసిన ఉపసంహరణ ఒప్పందం విషయంలో థెరెసా మే సొంత కన్సర్వేటివ్ పార్టీలోనే ఎదురీదుతున్నారు. ఆమె ప్రతిపాదించిన ఒప్పందం ఇయుకు బ్రిటన్ లొంగుబాటును ప్రతిబింబిస్తున్నదనే కారణమ్మీద ఆమె మంత్రివర్గంలోని ఇద్దరు జూనియర్లు రాజీనామా చేశారు. అందులో బ్రెగ్జిట్ పర్యవేక్షణ బాధ్యతలను చూస్తున్న మంత్రి డొమెనిక్ రాబ్ కూడా ఉండడం గమనార్హం.

ఆయన స్థానంలో నియమితులవుతారనుకుంటున్న ప్రస్తుత పర్యావరణ శాఖ మంత్రి మైఖేల్ గోవ్ ఆ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా లేరని తెలుస్తున్నది. అలాగే థెరెసా మేను తొలగించాలంటూ పార్టీ ఎంపిలే అవిశ్వాస తీర్మాన నోటీసును ఎక్కుబెట్టారు. పార్టీ ఎంపిలలో 15 శాతం మంది నోటీసు ఇస్తే అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు స్వీకరించవలసి ఉంటుంది. అంటే 48 మంది ఎంపిలు తలచుకుంటే ఆమెకు గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో థెరెసా మే లండన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ రేడియో ద్వారా ప్రజలతో ముఖాముఖీ నిర్వహించారు. ఉపసంహరణ ఒప్పందం ద్వారా యూరోపియన్ యూనియన్ చట్టాల సారాన్నే బ్రిటన్‌లో అమల్లోకి తేవాలని చూస్తున్నారంటూ పలువురు ఆమెను ఈ సందర్భంగా విమర్శించారు. పార్టీలో వ్యతిరేకత పెరిగితే అతి త్వరలోనే ఆమె విశ్వాస పరీక్షను ఎదుర్కోవలసి రావచ్చు.

ఇయుతో ఉభయ తారకమైన ఉపసంహరణ ఒప్పందం కుదరకపోతే దానితో బ్రిటన్ వ్యాపార సంబంధాలు ప్రపంచ వాణిజ్య ఒప్పందం (డబ్లుటిఒ) నిబంధనలమేరకే సాగవలసి ఉంటుంది. ఇయు కూటమి దేశాల మధ్యగల రాయితీలు, ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు బ్రిటన్‌కు వర్తించవు. అలాగే బ్రిటన్‌కు ఇయు దేశాల విద్యార్థుల రాకడ దాదాపు ఆగిపోయే ప్రమాదం తల ఎత్తుతుంది. ఆమేరకు బ్రిటన్‌లోని ఉన్నత విద్య, పరిశోధన రంగాలకు హాని కలుగుతుంది. ఇటువంటి వ్యతిరేక పరిణామాలను పరిమితం చేసే ఉద్దేశంతో థెరెసా మే ప్రభుత్వం రూపొందించిన ఉపసంహరణ ఒప్పందంపట్ల ప్రతికూలత కారణంగా ప్రస్తుత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బ్రిటన్ 1973 నుంచి ఇయులో భాగస్వామిగా ఉంటున్నది. ఇయులో గల దేశాలు దాని బడ్జెట్‌కు వాటాను చెల్లించవలసి ఉంటుంది. అదే సమయంలో ఇయునుంచి వాటికి నిధులు వస్తాయి. 2016లో ఇయు బడ్జెట్‌కు బ్రిటన్ 13.1 బిలియన్ పౌండ్లు విరాళంగా ఇచ్చింది. ప్రతిగా ఇయు నుంచి కేవలం 4.5 బిలియన్ పౌండ్లు మాత్రమే బ్రిటన్‌కు వచ్చాయి. అయితే యూరోపియన్ యూనియన్ ఉమ్మడి మార్కెట్ కారణంగా సభ్యదేశాల మధ్య వాణిజ్య సుంకాలు ఉండవు. ఎగుమతులు దిగుమతులను స్వేచ్ఛగా చేసుకోవచ్చు. దీనివల్ల బ్రిటన్‌కు ప్రయోజనం ఉన్నది.

2015లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బ్రెగ్జిట్‌పై రెండేళ్లలో రెఫరెండం జరిపిస్తానని కన్సర్వేటివ్ పార్టీ వాగ్దానం చేసింది. ఆ ఎన్నికల్లో అది గెలిచి అధికారంలోకి వచ్చింది. ఆమేరకే 2016 జూన్ 23న అప్పటి ప్రధాని డేవిడ్ కేమెరాన్ రెఫరెండం జరిపించారు. రెఫరెండం సందర్భంగా ఇయులో కొనసాగడానికి అనుకూలంగా ఆయన ప్రచారం చేశారు. 52 శాతం మంది ప్రజలు బ్రెగ్జిట్‌కు ఓటేయడంతో ఆయన రాజీనామా చేశారు. అయితే అనుకూలురు, వ్యతిరేకుల మధ్య తేడా స్వల్పమే కాబట్టి అంతిమంగా ఇయులో కొనసాగడానికే బ్రిటన్ నిర్ణయం తీసుకోవచ్చని ఊహాగానాలు బయలుదేరాయి. ఈలోగా కాలం చకచకా సాగిపోయి ఇయు నుంచి బ్రిటన్ తొలగిపోవలసిన గడువు (వచ్చే మార్చిలో) చేరువయింది. ఇప్పుడు ఉపసంహరణ ఒప్పందం ఎలా ఉండాలనేదానిపై తర్జనభర్జనలు సాగి థెరెసా మే వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తున్నది.

ఈ తుపాను నుంచి ఆమె ఏ విధంగా బయటపడతారో లేక తల వొగ్గి అధికారం నుంచి తప్పుకోవలసి వస్తుందో వేచి చూడాలి. ఆది నుంచి బ్రిటన్‌ది ఒంటెత్తుపోకడగానే ఉంటున్నది. 1977లో తన కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్‌ను ఇయు దేశాల ఉమ్మడి నోటు యూరోలో కలపడానికి బ్రిటన్ వ్యతిరేకించింది. తమ వడ్డీ రేట్ల మీద తమకే అధికారం ఉండాలని ఆశించి యూరోలో కలపడానికి సిద్ధపడలేదు. బ్రిటన్ ప్రజలు బ్రెగ్జిట్ విషయంలో ఒక్క కంఠంతో లేకపోవడం ప్రస్ఫుటం. ఉపసంహరణ ఒప్పందం ఒక కొలిక్కి రాకపోయినా మరి కొంతకాలం ఓటింగ్ హక్కులేకుండా ఇయులో కొనసాగే అవకాశం బ్రిటన్‌కు ఉంటుంది. అయినప్పటికీ అది ముల్లులా దాని స్థిమితా న్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇయు నుంచి తప్పుకుంటే బ్రిటిషర్ల తలసరి ఆదాయం పడిపోతుందని, రెఫరెండంతోనే ఆర్థిక వ్యవస్థ కొంత బలహీనపడిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Brexit consequences are strongly backing Britain

Telangana Latest News