భారత్ ఈసారైనా..

మన తెలంగాణ/క్రీడా విభాగం: కొంత కాలంగా ప్రపంచ క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగుతున్న టీమిండియాకు ఇప్పటికీ కొన్ని జట్లు కొరకరాని కొయ్యగా మారాయి. ఇందులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లను ప్రధానంగా చెప్పాలి. న్యూజిలాండ్‌లో కూడా భారత్ అంతంత మాత్రంగానే రాణిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ దేశాల్లో పర్యటన అంటే భారత్‌కు ఓటములు ఖాయమని ముందే తేలి పోతోంది. సొంత గడ్డపై, ఉపఖండంలో, కరీబియన్ గడ్డపై వరుస విజయాలతో హోరెత్తించే టీమిండియా బౌన్స్‌కు సహకరించే పిచ్‌లపై కనీస […]

మన తెలంగాణ/క్రీడా విభాగం: కొంత కాలంగా ప్రపంచ క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగుతున్న టీమిండియాకు ఇప్పటికీ కొన్ని జట్లు కొరకరాని కొయ్యగా మారాయి. ఇందులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లను ప్రధానంగా చెప్పాలి. న్యూజిలాండ్‌లో కూడా భారత్ అంతంత మాత్రంగానే రాణిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ దేశాల్లో పర్యటన అంటే భారత్‌కు ఓటములు ఖాయమని ముందే తేలి పోతోంది. సొంత గడ్డపై, ఉపఖండంలో, కరీబియన్ గడ్డపై వరుస విజయాలతో హోరెత్తించే టీమిండియా బౌన్స్‌కు సహకరించే పిచ్‌లపై కనీస పోటీ కూడా ఇవ్వకుండానే చేతులెత్తేస్తోంది. ఇంగ్లండ్, సౌతాఫ్రికా గడ్డపై కాస్త బాగానే ఆడే భారత జట్టు ఆస్ట్రేలియాలో సిరీస్ అనే సరికి ముందే చేతులెత్తేస్తోంది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టెస్టు, వన్డే, ముక్కోణపు సిరీస్‌లలో భారత్‌కు ఉన్న పేలవమైన రికార్డే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.

ఆస్ట్రేలియా గడ్డపై పర్యటించిన ప్రతిసారి టీమిండియాకు చేదు అనుభవమే ఎదురైంది. ముఖ్యంగా టెస్టుల్లో ఘోర పరాజయాలు చవిచూసిన చెత్త రికార్డు భారత్‌కు ఉంది. సొంత గడ్డపై ఆస్ట్రేలియాను చిత్తుచిత్తుగా ఓడించే టీమిండియా కంగారు గడ్డపై మాత్రం ఆ జోరును కొనసాగించలేక పోతోంది. పలు టెస్టు సిరీస్‌లలో క్లీన్‌స్వీప్‌లకు గురైన రికార్డు భారత్‌కు ఉంది. ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు మాత్రం ఆస్ట్రేలియా గడ్డపై బాగానే ఆడుతాయి. భారత్ మాత్రం ఈ జట్లలాగా ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయించలేక పోతోంది. గతంలో మంకీగేట్ వివాదం సిరీస్‌లో మాత్రమే భారత్ కాస్త మెరుగైన ఆటతో ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ భారత్ ఆ సంప్రదాయాన్ని కొనసాగించలేక పోయింది.

ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ అంటేనే భారత్‌కు ఏదో భయం వెంటాడుతోంది. అక్కడి బౌన్సి పిచ్‌లపై భారత బ్యాట్స్‌మెన్‌లు సరిగ్గా ఆడలేక పోతారు. గతంలో లక్ష్మణ్, సచిన్, ద్రవిడ్‌లు మాత్రమే ఆస్ట్రేలియా బౌలర్లను వారి సొంత గడ్డపై ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఈ ముగ్గురు తప్ప కంగారు పిచ్‌లపై రాణించిన బ్యాట్స్‌మన్ ఒక్క విరాట్ కోహ్లి మాత్రమేనని చెప్పాలి. లక్ష్మణ్ తర్వాత ఆస్ట్రేలియాపై వరుస సెంచరీలతో ఆకట్టుకున్న ఘనత ఒక్క కోహ్లికి మాత్రమే దక్కుతోంది. కిందటి ఆస్ట్రేలియా పర్యటనలో ఇతర బ్యాట్స్‌మెన్‌లు ఘోరంగా విఫలమైనా కోహ్లి మాత్రం వరుస శతకాలతో ఆకట్టుకున్నాడు. ఒకప్పుడూ లక్ష్మణ్, ద్రవిడ్‌లు మాత్రమే ఆస్ట్రేలియా పిచ్‌లపై మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు.

అసలు పరీక్ష ఇక్కడే..
ఇక, సొంత గడ్డపై జరిగే సిరీస్‌లలో అద్భుత విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకున్న టీమిండియా విదేశి సిరీస్‌లలో మాత్రం నిరాశ పరుస్తోంది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు ముందు కూడా భారత్ సొంత గడ్డపై వరుస విజయాలతో అదరగొట్టింది. దీంతో ఈ సిరీస్‌లలో భారత్‌కు ఎదురు ఉండదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. కానీ, భారత ఆటగాళ్లు మాత్రం పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచారు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లలో భారత్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కూడా భారత్‌కు సవాలుగా తయారైంది. ఈసారి డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లు లేకుండానే ఆస్ట్రేలియా బరిలోకి దిగుతోంది. ఇది భారత్‌కు చాలా కలిసి వచ్చే అంశం.

గతంలో జరిగిన సిరీస్‌లలో స్మిత్, వార్నర్‌లు భారత్‌కు పెను సమస్యలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈసారి వివిధ కారణాలతో ఇద్దరు జట్టుకు అందుబాటులో లేకుండా పోయారు. వీరిద్దరూ జట్టుకు దూరం కావడంతో ఆస్ట్రేలియా వరుస ఓటములు చవిచూస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత జట్టు ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో భారత్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ, బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన ఆస్ట్రేలియాను ఎదుర్కొవడం అనుకున్నంత తేలికకాదు. హాజిల్‌వుడ్, సిడిల్, స్టార్క్, మిఛెల్ మార్ష్‌లకు తోడుగా ఆడమ్ జంపా, నాథన్ లియాన్ వంటి మ్యాచ్ విన్నర్ స్పిన్నర్లు ఆస్ట్రేలియాకు అందుబాటులో ఉన్నారు. వీరిని ఎదుర్కొని ముందుకు సాగడం భారత బ్యాట్స్‌మెన్‌కు అంత సులువు కాదనే చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో సిరీస్ భారత్‌కు సవాలు వంటిదేనని చెప్పక తప్పదు.

Even in New Zealand India is doing something worse

Telangana Latest News

Related Stories: