పర్యావరణానికి వరం వెగనిజం

మారుతున్న జీవన విధానంలో పనిగంటలు, తినే తిండి అన్నీ  పూర్తిగా మారిపోయాయి. ప్రతి పది మందిలో ఎనిమిది మందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటోంది. ఎవర్ని కదిలించినా నిద్రలేమి, అజీర్ణం, అధిక బరువు, మల బద్దకం, కంటి సమస్యలు , గుండెకు సంబంధించిన సమస్య , రక్తపోటు, డయాబెటీస్ ఇలాంటివన్నీ చిన్న వయసు లోనే తెచ్చుకుంటున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటే అంతా ఖర్మ అంటుంటారు. అదేం కాదు ..ఆరోగ్యంగా ఉండటం అనేది మన చేతుల్లోనే […]

మారుతున్న జీవన విధానంలో పనిగంటలు, తినే తిండి అన్నీ  పూర్తిగా మారిపోయాయి. ప్రతి పది మందిలో ఎనిమిది మందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటోంది. ఎవర్ని కదిలించినా నిద్రలేమి, అజీర్ణం, అధిక బరువు, మల బద్దకం, కంటి సమస్యలు , గుండెకు సంబంధించిన సమస్య , రక్తపోటు, డయాబెటీస్ ఇలాంటివన్నీ చిన్న వయసు లోనే తెచ్చుకుంటున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటే అంతా ఖర్మ అంటుంటారు. అదేం కాదు ..ఆరోగ్యంగా ఉండటం అనేది మన చేతుల్లోనే ఉంది. మనం తినే ఆహారం, వ్యాయామం, కంటినిండా నిద్ర లాంటి విషయాల్లో క్రమశిక్షణ పాటిస్తే పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉండొచ్చని అంటున్నారు వైద్యనిపుణులు. వెజిటేరియన్స్, నాన్‌వెజిటేరియన్స్ అని రెండు రకాలుగా ఆహారాన్ని తీసుకునే వారు మనకు తెలుసు. మరో రకం ఆహారం తీసుకునే వారు కూడా ఉన్నారు వారినే ‘వెగాన్స్’ అంటారు..ఈ పదం కొద్దిమందికే పరిచయం ఉండొచ్చు. అసలీ వెగాన్స్ ఎవరు..వీరేం తింటారు..వీళ్ల ఆహార నియమాలేంటి..మన ఇండియాలో ఇలాంటివారున్నారా అనే సందేహాలకు సమాధానమే ఈ కథనం…

తాజా  పండ్లు, కూరలు, నట్స్, తృణధాన్యాలు, బీన్స్, పల్స్‌లాంటివి ఆహారంలో ప్రధానంగా తీసుకుంటారు.  ప్రస్తుతం యుకెలో దొరికే ఔషధాలను ముందుగా జంతువులపై ప్రయోగిస్తారన్న విషయం తెలిసిందే.

పర్యావరణ ప్రేమికులే వెగన్స్. పర్యావరణంతోపాటు జంతువులను రక్షించడం వీరి తమ విధిగా భావిస్తారు. వీరిలో ఎంతటి నిబద్ధత ఉంటుందంటే జంతువులను చంపకుండా ఉండటం కోసం, వాటి నుంచి వచ్చిన ఉత్పత్తులను ఉపయోగించరు. వాటిని చంపి వండుకునే ఆహారానికి ఆమడ దూరంలో ఉంటారు. అంటే మొత్తంగా శాకాహారిగా మారడం. ఈ విషయం మీద ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది నవంబర్‌ను ‘వెగాన్స్ మన్త్’గా నిర్వహిస్తారు. అడవులను కాపాడటంతోపాటు, జంతువుల సంరక్షణకు అంతా కృషి చేయాలని అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. 1944లో యుకెలో వెగనిజం అనే పేరుతో ఓ సొసైటీ ఏర్పాటయింది. 1994లో అక్కడి సెలబ్రిటీ లూయిస్ వ్యాలిస్ తన 50వ జన్మదినం సందర్భంగా వెగన్ సొసైటీ స్టాపించి ఉద్యమంగా తీసుకొచ్చాడు. ప్రపంచం మొత్తంమీద వరల్డ్ వెగన్ నెలను ఎలా జరుపుకుంటారంటే..ఎగ్జిబిషన్లు, సెమినార్లు, పబ్లిక్ డిబేట్‌లు, వర్క్‌షాపులు లాంటివి ఏర్పాటుచేస్తారు. ఈ నెలలో ఎవరైనా సరే వెగన్‌గా మారేందుకు అవకాశం ఉంటుంది. ఎల్లిన్ డిజెనెరేస్, అరేయనా గ్రేండ్రే, స్టీవీ వండర్, పీటర్ డిన్క్‌లేగ్, బెల్లిమీ యంగ్, జేమ్స్ కేమ్‌రాన్, పమీలా ఆండిర్‌సన్‌లాంటి హాలీవుడ్ సెలబ్రిటీలు వెగన్‌లుగా మారారు. వెగనిజం అంటే మన జీవన విధానంలో ఎక్కడా క్రూరత్వం ఉండకూడదు. అందులో భాగంగా జంతువుల నుంచి వచ్చే ఎటువంటి ఆహారమైనా సరే, అలాగే ధరించే వస్త్రాలు కూడా వాడకూడదు. చేపలు, షెల్‌ఫిష్, కీటకాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, తేనెలాంటివన్నీ తినరు. అదేవిధంగా ప్రయోగశాలలో టెస్టింగ్ కోసం జంతువులను ఉపయోగించరు.
వెగన్స్ ఏం తింటారు.. కర్రీ నుంచి కేక్ వరకు, పేస్టరీ నుంచి పిజ్జా వరకు ప్లాంట్ నుంచి తీసిన ఉత్పత్తులతో తయారుచేసినవే తింటారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా జంతువులను చంపరు. మాంసం ముట్టరు. అంతేకాదు మేకప్, బాత్‌రూమ్ ఐటమ్స్, జంతువుల ఉత్పత్తులతో తయారుచేసిన సబ్బులు, కాస్మొటిక్స్‌లాంటివి అస్సలు వాడరు. సుమారు 30వేల ఉత్పత్తులు వెగన్స్ సర్వీస్‌లో రిజిస్టర్ అయి ఉన్నాయి. తాజా పండ్లు, కూరలు, నట్స్, తృణధాన్యాలు, బీన్స్, పల్స్‌లాంటివి ఆహారంలో ప్రధానంగా తీసుకుంటారు. ప్రస్తుతం యుకెలో దొరికే ఔషధాలను ముందుగా జంతువులపై ప్రయోగిస్తారన్న విషయం తెలిసిందే.

ఎందుకంటే వాటివల్ల మానవులకు ప్రయోజనమా, హానికరమా అని తెలుసుకుంటారు. కానీ వెగన్ సొసైటీ మాత్రం కచ్చితంగా ఇలాంటి మెడిసన్‌ను వాడరు. వెగన్ సొసైటీలో మెడికల్ ఛారిటీలున్నాయి. ఇవన్నీ జంతువుల సంరక్షణకే పాటుపడుతున్నాయి. వీరు కనీసం జూపార్క్‌లు, ఎక్వేరియంలను కూడా చూడటానికి ఆసక్తి కనబరచరంటే ఆశ్చర్యమే. కుక్కను లేక గుర్రాన్ని రేసింగ్‌లకు తీసుకెళ్లరు. గాయపడిన జంతువులను రక్షించడంలో మాత్రం ముందుంటారు.
వెగన్స్‌కి వెజిటేరియన్‌కి సంబంధం ఏంటి.. వెజిటేరియన్లు అంటే శాకాహారులు పాలపదార్థాలు తీసుకుంటారు. ఇష్టమైతే ఎగ్‌ను వెజిటేరియన్‌గా భావించి తింటారు కూడా. వారి ఇష్టానుసారంగా ఆహారాన్ని తీసుకుంటారు. కానీ వెగన్స్ మాత్రం మాంసం, పౌల్ట్రీ, సీ ఫుడ్, లాంటివి ముట్టనే ముట్టరు. జంతు రక్షణ తమ కర్తవ్యంగా భావిస్తారంతే. ఈ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు.
భారతీయ సెలబ్రిటీలలో చాలా మంది వెగన్స్ ఉన్నారు. వారిచ్చే సందేశం ఏమంటే వెగన్స్‌గా మారండి. ఫిట్‌గా ఉండండి, ఎకో ఫ్రెండ్లీగా ఉండి, జంతువులను ప్రేమించండి అంటారు. ప్రపంచవ్యాప్తంగా వెగన్స్‌కి సంబంధించిన అనేక సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు వెలిశాయి.
*వెగన్స్ తినే ఆహారం..- సోయాబీన్స్ తృణధాన్యాలు, సోయాబీన్ పెరుగును గార్లిక్ సాస్‌తో తీసుకుంటారు. ఇది పూర్తిగా ప్రొటీన్లు ఉండే ఆహారం. బీన్స్, పండ్లు, కాయగూరలు, ఎడిబుల్ మష్రుమ్స్, నట్స్, సోయాబీన్స్‌లో ఎస్సెన్షియల్ అమినో ఆసిడ్స్ ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందంతా బాగానే ఉంది మరి ప్లాంట్ మిల్క్ అంటే ఏంటి అనేగా సందేహం …సోయా పాలు, ఆల్మండ్ పాలు, గ్రెయిన్ మిల్క్ (ఓట్ , ఫ్లాక్స్, రైస్ మిల్క్), కొబ్బరి పాలు ఇవన్నీ గేదె, ఆవు, మేకపాలకు బదులుగా వాడతారన్నమాట.ఒక కప్పు సోయా పాలలో 7గ్రా. ప్రొటీన్ లభిస్తుంది. ఆవుపాలలో ఈ శాతం 8గ్రా. అంతే. ఆల్మండ్ పాలలో కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్లు సాధారణంగా లభిస్తాయి. సోయా పాలను మాత్రం తల్లిపాలకు బదులుగా వాడకూడదు. బటర్ స్థానంలో సన్‌ఫ్లవర్, జీడిపప్పు, బాదం , కొబ్బరి , బియ్యం నుంచి వచ్చిన చీజ్‌ను వాడతారు. ఉడకబెట్టిన ఆలూ గుడ్డుకు ప్రత్యామ్నాయంగా తీసుకుంటారు. ఒక గుడ్డులో ఉండే పోషకాలన్నీ సగం అరటిపండులో లభిస్తాయి. ఇంతకీ వెగన్స్‌గా మారినవాళ్ల జీవన విధానం ఎలా ఉంటుందంటే జంతువుల హక్కుల కోసం పోరాడటం. హ్యుమన్ రైట్స్‌తోపాటు హెల్దీ డైట్, నిరాడంబర జీవన విధానం కలిగి ఉంటారు.


వెగన్స్ డైట్ వల్ల ఉపయోగాలు

వెగన్స్ ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. పెరగకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యకరంగా ఉంటుంది. టైప్ 2డయాబెటీస్ రాకుండా కాపాడుతుంది.
వెగన్ డైట్ వల్ల పోషకాలు ఎక్కువగా శరీరానికి లభిస్తాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్‌లాంటివి పుష్కలంగా వుంటాయి. పొటాషియం. మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్లు ఎ, సి, ఇలుంటాయి.
– ఈ డైట్ వల్ల బరువు తగ్గుతారు. మొక్కల నుంచి తీసుకునే ఆహారం వల్ల అధిక బరువును అధిగమించవచ్చునని అనేక అధ్యయనాల్లో రుజువైంది.
-శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. కిడ్నీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఓ అధ్యయనం ప్రకారం 43శాతం మందిపై చేసిన అధ్యయనంలో వెగన్ డైట్ తీసుకున్న వారిలో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉన్నట్లు తెలిసింది.
*కొన్ని రకాల క్యాన్సర్‌లను నియంత్రిస్తుంది. ..ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం ముప్పావు 75శాతం మందికి క్యాన్సర్ రావడానికి కారణం వారి ఆహారపు అలవాట్లనే తేలింది. మన డైట్ సరిగ్గా ఉంటే క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు. తాజా పండ్లు, కూరగాయలు తినడం వల్ల క్యాన్సర్ దరిదాపులకు రాకుండా ఉంటుంది. ప్రొస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్‌లకు దూరంగా ఉండొచ్చు.
*గుండెజబ్బులకు దూరంగా… ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గుండెకు చాలా మేలు కలుగుతుంది. 75శాతం మందికి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉండదు.
– కీళ్ల నొప్పులకు చక్కని పరిష్కారం..ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఈ డైట్ ఎంతో మంచిది.

2016లో చేసిన ఓ సర్వే ప్రకారం 49 శాతం మంది అమెరికన్స్ ప్లాంట్ మిల్క్‌ను ఉపయోగిస్తున్నారు. ప్లాంట్ మిల్క్ మార్కెట్ కూడా చాలా విస్తరించింది. బెర్లిన్ లోని మొట్ట మొదటి వెగన్ సూపర్ మార్కెట్ వెగనేజ్ ఏర్పాటయింది. సెలబ్రిటీలు, అథ్లెటిక్స్, రాజకీయనాయకులు ఇలా చాలా మంది వెగన్స్‌గా మారారు.
– 2015– 16లో వెగన్ ఫుడ్ తీసుకుంటున్నవారిలో ఆస్ట్రేలియా ప్రథమంలో ఉంది. ‘ఎ యూరోమానిటర్ ఇంటర్నేషనల్ స్టడీ’ ప్రకారం వెగన్ ఫుడ్ 2015 లో చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తర్వాత వెగన్స్ మార్కెట్‌లో ఆస్ట్రేలియా మూడో స్థానాన్ని ఆక్రమించింది.
– కెనడాలో ఓ సర్వే ప్రకారం ఈ ఏడాదిలో 2.1 శాతంమంది వెగన్స్‌గా మారారు.
-ఆస్ట్రియాలో 2013లో 0.5 శాతం ఆస్ట్రియన్‌లు వెగన్స్‌లుండగా, వియన్నాలో ఆ శాతం 0.7 ఉంది.
-బెల్జియం లో ఐవోక్స్ ఆన్‌లైన్ సర్వేలో 0.3 శాతంగా తేలింది.
-జర్మనీలో 2016కి 0.1 శాతం మంది ఉన్నారు.
-మన దేశంలో 2005-06 నేషనల్ హెల్త్ సర్వే ప్రకారం 1.6 శాతం మంది ప్రజలు జంతువుల నుంచి వచ్చే ఎటువంటి ఉత్పత్తులను ముట్టను కూడా ముట్టడం లేదు. వెగనిజం అనేది ఇండియాలో గుజరాత్‌లో 4.9శాతం, మహారాష్ట్రలో 4.0శాతం మంది పాటిస్తున్నారు.
– ఇజ్రాయిల్‌లో 2014 నాటికి ఐదు శాంత మంది వేగనిజంలో ఉన్నారు. 2015లో జరిగిన గ్లోబ్స్ సర్వేలో తెలిసింది. ఇజ్రాయిలీ ఆర్మీ కోసం ప్రత్యేకంగా వెగన్ ప్రొవిజన్స్‌ను అందించేవారు. దాంట్లో భాగంగా లెదర్ కాని బూట్లు, ఊలు లేని బ్లాంక్లెట్స్‌ను అందించినట్లు తెలిసింది.
-స్వీడన్‌లో 4శాతం మంది ఉండగా, స్విట్జర్లాండ్‌లో ఒక శాతం, యుకెలో 1.16శాతం మంది ఉన్నారు. అమెరికాలో 0.5శాతం మంది ఉన్నారు.
వెగన్లు బీఫ్, పోర్క్, పౌల్ట్రీ, సముద్రపు జంతువులు, గుడ్లు, పాల ఉత్పత్తులు లతో పాటు జంతువుల నుంచి వచ్చిన ఉత్పత్తులను వాడరు. ఉదాహరణకు లెదర్, వూల్, సిల్క్‌లాంటివి.

వెగన్‌లుగా మారిన వారిలో హాలీవుడ్, బాలీవుడ్, సెలబ్రిటీలున్నారు. వీరంతా మాంసం, గుడ్డు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండి కూడా ఫిట్‌గా ఉన్నారు.   

సోనమ్‌కపూర్ ఐదేళ్లకు ముందు మాంసాహారి. తర్వాత వెగన్‌గా మారి పాల ఉత్పత్తులను అస్సలు తీసుకోవడం లేదంటోంది సోనమ్.
ఆయేషా టకియా..వాంటెడ్ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఆయేషా జంతువుల సంరక్షణ కోసం పాటుపడుతోంది. అందుకోసం వెగన్‌గా మారానంటోంది. ఆమెను చూసి తల్లి, చెల్లెలు కూడా వెగన్లుగా మారారంట. వెగన్‌గా మారిన తర్వాత తనెంతో సంతోషంగా ఉన్నానంటోంది.
కిరణ్‌రావు దర్శకురాలు, నిర్మాత, రచయిత అయిన కిరణ్‌రావు కూడా వెగన్. తన ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కాపాడుతున్నానంటోంది. భార్య స్ఫూర్తితో అమిర్‌ఖాన్‌కూడా వెగన్‌గా మారాడు. మాంసం తింటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో ఆయన ఓ వీడియో ద్వారా తెలిపాడు.
నేహా ధూపియా పెటా తరఫున అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. వెగన్‌గా మారిన తర్వాత మానసికంగా, శారీరకంగా తనెంతో ఫిట్‌గా మారానంటోంది.
రిచా చద్దా మొదట వెజిటేరియన్‌గా ఉండి తర్వాత వెగన్‌గా మారానంటోంది. పెటా తరఫున ప్రకటనలో పాల్గొంది. వెగన్ ఆహారం తన శరీరానికి సరిపోయిందని చెబుతోంది.
మల్లికాశెరావత్ మర్డర్, ప్యార్‌కే సైడ్ ఎఫెక్ట్, వెల్‌కమ్ చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న మల్లిక జంతువులను సంరక్షిద్దామంటోంది. 2011లో పెటా తరఫున ప్రచారం చేసిన హాటెస్ట్ వెగన్‌గా పేరుతెచ్చుకుంది.
కంగనారనౌత్ క్వీన్, తను వెడ్స్ చిత్రాల ద్వారా ప్రేక్షకుల మదిని దోచుకున్న కంగనా కూడా వెగన్‌గా మారింది. ఇలా మారిన తర్వాత నాజీవితంలో చాలా మార్పులు వచ్చాయని చెబుతోంది. తనకు పాల ఉత్పత్తుల వల్ల ఎసిడిటీ వస్తుందని, వెగన్‌గా మారిన తర్వాత చాలా ఆరోగ్యంగా ఉన్నానంటోంది. సెక్సీయస్ట్ వెగన్‌గా అవార్డును కూడా అందుకుంది.
అదాశర్మ వెగన్‌గా మారిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చినట్లు చెబుతోంది అదా. శరీరం మెరుపును సంతరించుకుందని, జుట్టు మంచి పోషణలో ఉందని చెబుతోంది. జంతువులను చంపడానికి మనమేం హంతకులం కాదంటోంది. అందుకే మనం తినే కంచంలో ఏం ఉందో ఒక్కసారి ఆలోచించండి అంటోంది.

జంతువుల రక్షణే పెటా లక్ష్యం 

పర్యావరణ అసమతుల్యత వల్ల జంతువులు, పక్షులు అంతరించిపోతున్నాయి. అంతేకాకుండా మానవుడు వాటిని ఆహారం కోసం, ప్రయోగాల కోసం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జీవరాశుల మనుగడ లేకపోతే మానవాళికి నష్టం జరిగే అవకాశం ఉందని గ్రహించి అమెరికన్లు జంతు పరిరక్షణ హక్కుల సంస్థ ‘పెటా’ ( పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఫర్ యానిమల్స్) ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద జంతువుల హక్కుల కోసం పోరాడే సంస్థగా పేరు తెచ్చుకుంది. జంతువుల హక్కుల కార్యకర్త అలెక్స్ పచేకోచే మార్చ్ 1980 మార్చి 22న స్థాపించిన ఈ సంస్థ, 1981 సిల్వర్ స్ప్రింగ్ మంకీస్ కేసుగా పిలుస్తారు.

ప్రస్తుతం ఈ సంస్థలో 400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంట్లో 6.5 మిలియన్ల మంది సభ్యులతో పాటు చాలా మంది మద్దతు దారులున్నారు. దీని నినాదం ‘జంతువులను తినడం, వాటి చర్మాలతో చేసిన వస్తువులను ధరించడం, ప్రయోగం చేయడం, వినోదం కోసం ఉపయోగించడం లేదా ఏ ఇతర విధంగా వాటిని ఇబ్బందులకు గురి చేస్తూ వాటి నుండి ఏ ప్రయోజనాన్ని ఆశించొద్దన్నది పెటా ముఖ్య ఉద్దేశం. 1985 లో అమెరికా జంతు సంక్షేమ చట్టంతో ఒక సవరణను తీసుకొచ్చింది అదే అంతర్జాతీయ పెటా. పెటా తరఫున చాలా మంది సెలబ్రిటీలు జంతువులను చంపొద్దంటూ ప్రచారం చేస్తుంటారు. ప్రతిఏటా పెటా సంస్థ శాకాహారులకు అవార్డులను అందజేస్తుంది. ఎక్కువ సార్లు అవార్డు తీసుకున్నవారిలో అమితాబ్ ఒకరు.

మల్లీశ్వరి వారణాసి