తెలంగాణ సరిహద్దుల్లో ‘పాడేరు’ ప్లాన్

మంత్రి చందూలాల్, స్పీకర్ టార్గెట్? అప్రమత్తం చేసిన పోలీసులు, 30మంది మావోయిస్టుల ప్రవేశం ముందస్తుగా గుర్తించిన నిఘా వర్గాలు మన తెలంగాణ/హైదారాబాద్ : మావోయిస్టులు తెలంగాణ సరిహద్దుల్లో పాడేరు తరహాలో ప్రజా ప్రతినిధులను మట్టుబెట్టేందుకు పన్నిన వ్యూహాలను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు మావోయిస్టు యాక్షన్ టీం కుట్రలను సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఉత్తర తెలంగాణలో దాదాపు 30 మంది మావోయిస్టుల బృందం ప్రవేశించి ప్రజా ప్రతినిధులను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించిన విషయాన్ని […]

మంత్రి చందూలాల్, స్పీకర్ టార్గెట్?
అప్రమత్తం చేసిన పోలీసులు, 30మంది మావోయిస్టుల ప్రవేశం

ముందస్తుగా గుర్తించిన నిఘా వర్గాలు

మన తెలంగాణ/హైదారాబాద్ : మావోయిస్టులు తెలంగాణ సరిహద్దుల్లో పాడేరు తరహాలో ప్రజా ప్రతినిధులను మట్టుబెట్టేందుకు పన్నిన వ్యూహాలను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు మావోయిస్టు యాక్షన్ టీం కుట్రలను సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఉత్తర తెలంగాణలో దాదాపు 30 మంది మావోయిస్టుల బృందం ప్రవేశించి ప్రజా ప్రతినిధులను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించిన విషయాన్ని స్థానిక పోలీసులు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి చందూలాల్ ఆజ్మీర్‌కు వివరించారు. మావోయిస్టుల ముప్పు గురించి పోలీసులు సమాచారం ఇవ్వడంతో మంత్రి అజ్మీరా చందూలాల్ తాడ్వాయ్ మండలంలో ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే ముగించి వెనుదిరిగారు.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులను మావోయిస్టులు టార్గెట్ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోములను ఎలాగైతే హత్య చేశారో అదే తరహా తెలంగాణలోని ఎమ్మెల్యేలను అంతం చేస్తామని మావోయిస్టులు హెచ్చరిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మావోయిస్టు యాక్షన్ టీమ్స్ తెలంగాణకు చెందిన ఓ ఆపద్ధర్మ మంత్రి, స్పీకర్‌ను టార్గెట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అలాగే తాడ్వాయి టిఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. మావోయిస్టుల కుట్రను పసిగట్టిన తెలంగాణ పోలీసులు అలర్ట్ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రంగంలోకి దిగిన 30 మంది మావోయిస్టులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తుల గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుండగా ఛత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలోకి మావోయిస్టు యాక్షన్ బృందాలు ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీసులు మూడు రోజుల క్రితమే ఉన్నతాధికారుల సమాచారం అందించారు.

అంతేకాకుండా యాక్షన్ టీం సభ్యుల ఫోటోలు సైతం విడుదల చేశారు. జయశంకర్ భూపాల్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో యాక్షన్ టీం కదలికలు ఉన్నయని, రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలని సమాచారం చేరవేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎజెన్సీ ప్రాంతాలలో ప్రచారం చేపట్టవద్దని పోలీసులు ఎన్నికల బరిలో ఉన్న నాయకులకు తరచూ ఆదేశాలతో పాటు సమాచారం ఇస్తూనే ఉన్నారు. మరోవైపు మావోయిస్టు యాక్షన్ టీం ఆచూకీ కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు మావోయిస్టు జాడ పసిగట్టి వారి కుట్రను భగ్నం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులను మట్టుబెట్టేందుకు రంగంలోకి దిగిన మావోయిస్ట్ యాక్షన్ టీం సభ్యుల పోస్టర్ల పోలీసులు విడుదల చేశారు.

Telangana Elections: Maoists Attack on Leaders

Telangana news

Related Stories: