ఆడపిల్లలపట్ల వివక్ష

భారత జనాభాలో మహిళల సంఖ్య దాదాపు ఆరు కోట్ల ముప్పయి లక్షల మేరకు తగ్గిపోయింది. దీనికి కారణాలు ఆడపిల్లల భ్రూణహత్యలు, వ్యాధులు, వారి పట్ల నిర్లక్ష్యం, పోషకాహారలోపం. ఈ కారణాల వల్ల మరణించిన మహిళలు, బాలికల సంఖ్యే ఇది. ప్రభుత్వ సర్వేలోనే ఈ లెక్కలు వెల్లడయ్యాయి. ప్రతి సంవత్సరం ఈ విధంగా దాదాపు ఇరవై లక్షల మంది మహిళలు జనాభాలో తగ్గిపోతున్నారు. ఎకెనమిక్ సర్వే 2017- 18లో బయటపడిన చేదు వాస్తవాలివి. సెప్టెంబర్ 12వ తేదీన ఈ […]

భారత జనాభాలో మహిళల సంఖ్య దాదాపు ఆరు కోట్ల ముప్పయి లక్షల మేరకు తగ్గిపోయింది. దీనికి కారణాలు ఆడపిల్లల భ్రూణహత్యలు, వ్యాధులు, వారి పట్ల నిర్లక్ష్యం, పోషకాహారలోపం. ఈ కారణాల వల్ల మరణించిన మహిళలు, బాలికల సంఖ్యే ఇది. ప్రభుత్వ సర్వేలోనే ఈ లెక్కలు వెల్లడయ్యాయి. ప్రతి సంవత్సరం ఈ విధంగా దాదాపు ఇరవై లక్షల మంది మహిళలు జనాభాలో తగ్గిపోతున్నారు. ఎకెనమిక్ సర్వే 2017- 18లో బయటపడిన చేదు వాస్తవాలివి. సెప్టెంబర్ 12వ తేదీన ఈ సర్వే వివరాలు విడుదల చేశారు. భారతదేశంలో మగపిల్లలకు సామాజికంగా లభించే ప్రాధాన్యత వల్ల దాదాపు రెండు కోట్ల పదిలక్షల ఆడపిల్లలు నిర్లక్ష్యానికి వివక్షకు గురవుతున్నారు. మగపిల్లవాడు పుట్టే వరకు పిల్లలను కనడం కూడా కొనసాగుతూ ఉంటుంది. మగపిల్లవాడు పుట్టిన వెంటనే కుటుంబ నియంత్రణ పాటించడం ఎక్కువ.

శతాబ్దాలుగా భారత ఉపఖండంలో మగపిల్లలకే ప్రాధాన్యత లభిస్తోంది. దేశంలో లింగనిర్ధారణ పరీక్షలను 1994లో నిషేధించారు. పుట్టబోయే శిశువు ఆడ లేదా మగ అనేది తెలుసుకునే ఈ పరీక్షలు చేయించడం చట్టపరంగా ఇప్పుడు నేరం. ఈ నేరానికి శిక్షలు కూడా ఉన్నాయి. అయినా ఇప్పటికీ దేశంలో గర్భంలో ఆడపిల్ల ఉందని తెలియగానే అబార్షన్లు చేయించడం నిరాటంకంగా కొనసాగుతోంది. జాతీయ నేర గణాంకాల బ్యూరో ప్రకారం 2002 2012 మధ్య దశాబ్ద కాలంలో గర్భంలో ఆడ శిశువు ఉందా లేదా తెలుసుకునే ఉద్దేశ్యంతో వైద్యులు నిర్వహించిన లింగ నిర్ధారణ పరీక్షల సంఖ్య 218. ఇందులో కేవలం 55 మందికి మాత్రమే శిక్షలు పడ్డాయి. 163 మంది ఎలాంటి శిక్షలు లేకుండా బయటపడ్డారు. కాని ఈ పదేళ్ళ కాలంలో కేవలం 218 పరీక్షలు మాత్రమే జరిగాయా? ఇది ఆలోచించవలసిన అతి ముఖ్యమైన ప్రశ్న.

ప్రపంచవ్యాప్తంగా ఆడశిశువుల భ్రూణహత్యల నివేదికలో భారతదేశంలో శిశువుల స్త్రీ పురుష నిష్పత్తి ప్రకటించింది. దీని ప్రకారం ప్రతి 100 మంది బాలికలకు 112 మంది బాలురు ఉన్నారు. అదృష్టవశాత్తు అబార్షన్ బారిన పడకుండా భూమిపై జన్మించిన ఆడపిల్లలకు ఆ తర్వాత వివక్ష తప్పడం లేదు. జాన్ హాప్కిన్స్ స్కూలు, ఇంటర్నేషనల్ వాక్సిన్ యాక్సెస్ సెంటర్ ప్రచురించిన న్యూమోనియా, డయేరియా ప్రాగ్రెస్ రిపోర్టు 2018 ప్రకారం ఐదేళ్ళ లోపు పిల్లల్లో ఆడపిల్లలకు టీకాలు వేయడం చాలా తక్కువగా జరుగుతోంది. ఇండియాలో వాక్సినేషన్ పొందుతున్న బాలురు 100 మంది ఉంటే బాలికలు 78 మంది మాత్రమే. బాలికల పట్ల ఎంత వివక్ష ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇది కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాదు. పట్టణప్రాంతాల్లోని మురికివాడల్లోనూ ఈ వివక్ష తీవ్రంగా ఉంది. బాలికలకు వాక్సినేషన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. మగపిల్లలకు మాత్రం చాలా జాగ్రత్తగా టీకాలు వేయిస్తారు. ప్రపంచంలో 2018 సంవత్సరంలో ఒక కోటి ముప్పయి ఆరు లక్షల మంది పిల్లలు వైద్యచికిత్సకు తగ్గిపోగల వ్యాధులతోనే మరణించారు. ఈ పిల్లల్లో అత్యధికులు కేవలం 15 దేశాల్లో ఉన్నారు. ఇండియా కూడా ఈ దేశాల జాబితాలో ఉంది.

భారతదేశంలో ఐదేళ్ళ లోపు పిల్లల్లో మరణాల రేటు చాలా తగ్గింది. ఇంతకు ముందు కన్నా ఈ మరణాల రేటు 9 శాతం తగ్గించగలిగారు. ఈ అభివృద్ధి వల్ల ప్రయోజనం కేవలం మగపిల్లలకు మాత్రమే లభించింది. మగపిల్లల్లో ఐదేళ్ళ లోపు మరణాలు తగ్గాయి.కాని ఆడపిల్లలకు ఈ ప్రయోజనాలేవీ లభించలేదు. సమాజంలో మగపిల్లలపట్ల ఎంత మోజు ఉందంటే, చాలా కుటుంబాలు ఆడపిల్లలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. కొన్ని కుటుంబాలు ఆడపిల్లలను అనాథపిల్లలుగా వదిలేస్తున్నాయి. ఇంట్లో ఉండే అవకాశం దొరికిన ఆడపిల్లలకు కూడా నిత్యం బతుకు సమరమే. వారికి పోషకాహారం లభించదు. టీకాలు వేయించరు. తక్షణ వైద్యచికిత్స వారికి అందదు. ఆల్ ఇండియా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015- 16 ప్రకారం జబ్బుపడిన మగపిల్లలకు వెంటనే వైద్యచికిత్స లభిస్తుంది. మగపిల్లలకు తల్లిపాలు పట్టడం 11 శాతం ఎక్కువ. డయేరియాకు గురయిన మగపిల్లలను డాక్టరు వద్దకు తీసుకువెళ్ళడం ఆడపిల్లల కన్నా 7 శాతం ఎక్కువ. ఊపిరితిత్తుల రుగ్మతలకూ మగపిల్లలను డాక్టరు వద్దకు తీసుకెళ్ళడం ఎక్కువగా ఉంది. మగసంతానం ఉన్న తల్లులు ఆ తర్వాత లింగనిర్ధారణ పరీక్షలకు వెళ్ళడం తగ్గుతుంది. మగసంతానం లేని తల్లులు తర్వాతి గర్భంలో లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం చాలా ఎక్కువ.

పట్టణ ప్రాంతాల్లో అల్ట్రా సౌండ్ పరీక్షలు ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉన్నాయి. మగసంతానం కోరుకోవడం అన్నది అన్ని వర్గాల ప్రజల్లోను ఉంది. పిల్లలు పెరిగి పెద్దయిన కొద్దీ ఈ వివక్ష వల్ల స్త్రీపురుషుల మధ్య నిష్సత్తి మరింత దయనీయ స్థితికి చేరుకుంటోంది. పురుషుల సంఖ్య అత్యధికంగాను, స్త్రీల సంఖ్య చాలా తక్కువగాను ఉంటోంది. పురుషులు పెళ్ళాడడానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి తలెత్తుతోంది. కాని విచిత్రమేమంటే, కట్నం లేకుండా అమ్మాయిలకు వివాహాలు జరగవు. హర్యానాలో స్త్రీపురుష నిష్పత్తిలో తేడా చాలా ఎక్కువయ్యింది. అక్కడ పురుషులకు భార్యలు లభించని పరిస్థితి తలెత్తింది. కేరళ నుంచి వివాహాలు చేసుకుని రావడం ప్రారంభమయ్యింది. కేరళలో పురుషుల కన్నా స్త్రీల సంఖ్య కొద్దిగా ఎక్కువ. కాని ఈ వివాహ సంబంధాలు విఫలమైన సంఘటనలే ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఇలా హర్యానాకు పెళ్ళి చేసుకొని వచ్చిన మహిళలు అత్యంత దుర్భరమైన పరిస్థితులు అనుభవించారు. తీవ్రమైన అణిచివేతలకు గురయ్యారని తెలుస్తోంది.

హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో స్త్రీల సంఖ్య తగ్గిపోవడం అనేది మరో సమస్యకు దారితీసింది. ఈ రెండు రాష్ట్రాల్లో బయటి నుంచి మహిళలను ట్రాఫికింగ్ చేయడం ఎక్కువైంది. పేద కుటుంబాలకు చెందిన మహిళలకు పెళ్ళిళ్ళు చేయిస్తామన్న సాకుతో మోసంతో హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు తీసుకురావడం, ఎవరో ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్ళి చేయడం, ఆ ముసలివాడు మరణించాక మరో వ్యక్తితో వివాహం జరిపించడం వంటి సంఘటనలు కూడా ఉన్నాయి. చైనాలో కుటుంబానికి ఒకే సంతానం అనే విధానం వల్ల అక్కడ పురుషుల సంఖ్య పెరిగిపోయింది. మూడు కోట్ల 40 లక్షల మంది పురుషులు ఎక్కువయ్యారు. భారతదేశంలో మూడుకోట్ల 70 లక్షల మంది పురుషులు ఎక్కువగా ఉన్నారు.

చైనాలో చాలా మంది పురుషులు కాంబోడియా వంటి దేశాల అమ్మాయిలను పెళ్ళి చేసుకుంటున్నారు. కాని ఈ వివాహాలు కూడా విఫలమవుతున్నాయి. 2001 నుంచి 2011 మధ్య కాలంలో స్త్రీపురుష జనాభా నిష్పత్తి 1000 మంది మగవాళ్ళకు 927 మంది స్త్రీల నుంచి 918 స్త్రీలకు పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం బేటీ బచావ్ బేటీ పడావ్ నినాదమిచ్చింది. భారతదేశంలో స్త్రీలు అనేక రంగాల్లో పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు. ఆర్ధికంగా సాధికారత సాధిస్తున్నారు. కుటుంబాలను పోషించే స్థాయికి చేరుకున్నారు. కొన్న దశాబ్దాల క్రితం ఈ పరిస్థితి లేదు. కాని ఇప్పటికి కూడా సమాజం మగసంతానం ముఖ్యమనుకునే ఆలోచన నుంచి బయటపడలేదు. ఆడపిల్లల పట్ల వివక్షను దూరం చేసుకోలేదు. ఈ పరిస్థితి మారాలంటే సామాజిక చైతన్యం రావాలి.

                                                                                                                                               – సుబుహి సఫ్వీ  (డైలీ ఓ)

Women population has declined by nearly six crore million

Telangana Latest News