అసాధారణ ఆర్థిక ప్రగతి

ఢిల్లీకి రాజైనా.. సాధించామని కోనాయిపల్లిలో కెసిఆర్ ప్రకటన కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి యుద్ధం గెలిచా త్వరలోనే కాళేశ్వరం నీళ్లతో వెంకన్న పాదాలు కడుగుతాం నాలుగు సంవత్సరాల పాలనలో సమస్యలు పరిష్కరించుకున్నాం నిండు మనస్సుతో దీవించి హరీశ్‌ను లక్ష మెజార్టీతో గెలిపించండి మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి/నంగునూరు: కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ప్రజల దీవెనలతో దేశంలోనే కొద్ది పాటి సమయంలో ఆర్థిక ప్రగతిని సాధించిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సిద్దిపేట […]

ఢిల్లీకి రాజైనా..

సాధించామని కోనాయిపల్లిలో కెసిఆర్ ప్రకటన

కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి యుద్ధం గెలిచా
త్వరలోనే కాళేశ్వరం నీళ్లతో వెంకన్న పాదాలు కడుగుతాం
నాలుగు సంవత్సరాల పాలనలో సమస్యలు పరిష్కరించుకున్నాం
నిండు మనస్సుతో దీవించి హరీశ్‌ను లక్ష మెజార్టీతో గెలిపించండి

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి/నంగునూరు: కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ప్రజల దీవెనలతో దేశంలోనే కొద్ది పాటి సమయంలో ఆర్థిక ప్రగతిని సాధించిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి తన్నీరు హరీశ్ రావుతో కలిసి ఆయన బుధవారం నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్థులను ఉద్ధేశించి ప్రసంగించారు. తాను ఏ కార్యం చేపట్టినా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొంది వెళ్ళినా విజయాలే తప్పా ఓటమి పొందలేదన్నారు. తాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి స్వామి ఆశీస్సులు, ప్రజల దీవెనలతో అతి పెద్ద యుద్ధం చేసి ఎవరు నమ్మలేని పరిస్థితిల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.

సమస్యల్లో ఉన్న రాష్ట్రాన్ని నాలుగు సంవత్సరాల పాలనలో అభివృద్ధి పరుచుకొని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుకున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కష్టాలు, మోటర్లు కాలిపోవడం లాంటి అనేక సమస్యలు ఉండేవని ఈ సమస్యలను అందరం కలిసి పంచుకొని ప్రత్యేక రాష్ట్రంలో సమస్యలను లేకుండా చేసుకున్నామన్నారు. దేశంలోనే గొప్ప, ధనవంతమైన రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారనే విధంగా కృషి చేస్తామన్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని నాకు నాటి నుంచి ఆశీర్వదించి ఇంత పెద్ద చేసింది మీరే ఎల్లప్పుడు మీకు రుణపడి ఉంటానన్నారు. రైతులకు అప్పుల బాధలు లేకుండా చేసుకోవడం జరిగిందన్నారు. రైతులే స్వయంగా తమ బ్యాంక్ ఖాతాల్లో ఐదు నుంచి రూ.10లక్షలు జమ చేసుకున్నప్పుడే బంగారు తెలంగాణ సాధించుకున్నట్లని అన్నారు. ఆ దిశగా మన ప్రయాణం మొదలు పెట్టడం జరిగిందన్నారు. హరీశ్ రావును ప్రజలు నిండు మనస్సుతో దీవించి లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు.

వెంకన్న స్వామి దయ వల్ల మీ వద్దకు వచ్చానని ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 100 సీట్లు గెలిచి రానున్న ఐదు సంవత్సరాలల్లో ధనిక రాష్ట్రంగా మారుస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తి కాబోతుందని, వరాలు ఇచ్చే కొనాయిపల్లి వెంకన్న స్వామి పాదాలను కాళేశ్వరం నీళ్లతో అభిషేకం చేయాలని మంత్రి హరీశ్ రావును ఆదేశిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నామని త్వరలోనే రైలు కూడా ఈ ప్రాంతానికి రాబోతుందన్నారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.

KCR speech in Siddipet campaign

Telangana Latest News