బీటలు టిజెస్ కటీఫ్?

టిజెఎస్‌కు కేటాయించినవి 8 సీట్లు పోటీ చేస్తున్నట్లు ప్రకటించినవి 12 టిడిపి, కాంగ్రెస్ స్థానాలలో పోటీకి సిద్ధపడుతున్న అగ్గిపెట్టె బలహీనపడుతున్న బంధం కూటమిలో ఎవరికి వారే మన తెలంగాణ / హైదరాబాద్ : అధికార టిఆర్‌ఎస్‌ను గద్దె దింపడమే ఏకైక లక్షంగా ఏర్పడుతున్న మహా కూటమి చాలా బలమైనదని అందులోని నాలుగు పార్టీలూ చాలా గంభీరంగా చెప్తూ ఉన్నా రోజురోజుకూ బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ జన సమితికి ఎనిమిది సీట్లు మాత్రమే దక్కినా పన్నెండు చోట్ల పోటీ చేయనున్నట్లు […]

టిజెఎస్‌కు కేటాయించినవి 8 సీట్లు
పోటీ చేస్తున్నట్లు ప్రకటించినవి 12
టిడిపి, కాంగ్రెస్ స్థానాలలో పోటీకి సిద్ధపడుతున్న అగ్గిపెట్టె
బలహీనపడుతున్న బంధం
కూటమిలో ఎవరికి వారే

మన తెలంగాణ / హైదరాబాద్ : అధికార టిఆర్‌ఎస్‌ను గద్దె దింపడమే ఏకైక లక్షంగా ఏర్పడుతున్న మహా కూటమి చాలా బలమైనదని అందులోని నాలుగు పార్టీలూ చాలా గంభీరంగా చెప్తూ ఉన్నా రోజురోజుకూ బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ జన సమితికి ఎనిమిది సీట్లు మాత్రమే దక్కినా పన్నెండు చోట్ల పోటీ చేయనున్నట్లు ఆ పార్టీయే ప్రకటించింది. తెలుగుదేశంకు దక్కిన మహబూబ్‌నగర్, కాంగ్రెస్ పోటీ చేయనున్న ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ తదితర స్థానాల్లో పోటీ చేయడానికి టిజెఎస్ సిద్ధమవుతోంది. కూటమిలోని ఇతర పార్టీలకు ఖరారు చేసిన స్థానాల్లో టిజెఎస్ పోటీ చేయనున్నట్లు ప్రకటించడంతో అది బీటలువారే దిశగా ప్రయాణిస్తోందా అనే సందేహం కలుగుతోంది. కాంగ్రెస్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్న టిజెఎస్ ఇప్పుడు అదే తీరులో పన్నెండు స్థానాలకు నిలబెట్టే అభ్యర్థుల జాబితాను కూడా సిద్ధం చేసింది.

గురువారం సాయంత్రంకల్లా ప్రకటన చేస్తామని టిజెఎస్ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు తెలిపారు. కోదండరాం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ పన్నెండు స్థానాలను తాము ప్రకటిస్తున్నామని, కాంగ్రెస్ హై కమాండ్‌తో ఆయన చర్చలు జరిపిన అనంతరమే తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని బుధవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. కూటమి గెలుపు ఖాయమని, చాలా బలంగా ఉన్నదని అందులోని కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, టిజెఎస్ పలు సందర్భాల్లో చెప్తూ ఉన్నప్పటికీ సీట్ల సర్దుబాటుకు భిన్నంగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కూటమి పార్టీల మధ్య ఉన్నది బలమా లేక బలహీనతా అనేది ఆ పార్టీల భిన్న ప్రకటనలను, నిర్ణయాలను చూస్తుంటేనే తెలిసిపోతోందని టిఆర్‌ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు. కూటమి పూర్తిస్థాయిలో ఏర్పాటు కాకముందే బీటలు వారుతుండడం గమనార్హం.

పన్నెండు చోట్లా పోటీ చేస్తాం : టిజెఎస్
కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా టిజెఎస్‌కు దక్కింది ఎనిమిది స్థానాలైనా ఇందులో తాము ప్రతిపాదించినవాటికి భిన్నమైనవి వచ్చాయని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు వ్యాఖ్యానించారు. అందువల్లనే తమకు బలముందని భావిస్తున్న మెదక్, సిద్దిపేట, దుబ్బాక, వర్ధన్నపేట, మల్కాజిగిరి, అంబర్‌పేట తదితర స్థానాలతో పాటు మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, ఆసిఫాబాద్, జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, వరంగల్ తూర్పు తదితర నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని, ఇక్కడ పోటీ చేయడానికి టిజెఎస్ తరఫున పలువురు ఆశావహులు ఉన్నందువల్ల స్క్రీనింగ్ కమిటీ, కోర్ కమిటీ సమావేశంలో చర్చించుకుని అభ్యర్థులను ఖరారు చేస్తామని, గురువారం అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. తమ పార్టీ అధినేత కోదండరాం ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌తో రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నారని, వాటి పర్యవసానంగానే పన్నెండు స్థానా ల్లో అభ్యర్థులు ప్రచారం చేసుకోడానికి వీలుగా ఈ ప్రకటన చేయాల్సిందిగా తమను ఆదేశించారని, అందువల్లనే ప్రస్తుతానికి స్థానాలను ప్రకటిస్తున్నామని, గురువారం అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని వ్యాఖ్యానించారు.

అది ఫ్రెండ్లీ పోటీయా లేక రెబల్‌గానా అనేది తమ పార్టీ అధినేత నిర్ణయిస్తారని తెలిపారు. ప్రస్తుతానికి పన్నెండు స్థానాలు అనుకుంటున్నా ఒక రోజు తర్వాత అది 13 కావచ్చు, 14కు కూడా పోవచ్చు అని వ్యాఖ్యానించారు. అదే పార్టీకి చెందిన అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, తాము కూటమిలో ఉండాలనే కోరుకుంటున్నామని, వీడే ప్రసక్తే లేదని అన్నారు. అయితే పన్నెండు స్థానాలకు పోటీ చేయడం ఖాయమని తెలిపారు. జనగాం స్థానంలో తాను పోటీచేసే ఉద్దేశం లేదని స్వయంగా కోదండరాం తేల్చి చెప్పిన తర్వాత కూడా ఆ పార్టీ ఆ స్థానంపై పట్టుబడుతోంది. కోదండరాంకు బదులుగా మరొకరు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. జనగాంలో అభ్యర్థి పేరును ఇప్పటికీ ఖరారు చేయకపోవడంతో కాంగ్రెస్‌లోని బిసి నేతలు హైదరాబాద్, ఢిల్లీ స్థాయిలో నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు పొన్నాల సైతం తన వంతు ప్రయత్నాలను చేస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో జనగాంలో పోటీ చేస్తామని టిజెఎస్ ప్రకటించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

కూటమిలో కుంపట్లు: టిజెఎస్ ప్రస్తావించిన పన్నెండు స్థానాల్లో మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్, వరంగల్ తూర్పు, స్టేషన్ ఘన్‌పూర్ తదితర స్థానాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. మహబూబ్‌నగర్‌లో తెలుగుదేశం తరఫున ఎర్ర శేఖర్, ఆసిఫాబాద్‌లో కాం గ్రెస్ తరఫున ఆత్రం సక్కు, స్టేషన్ ఘన్‌పూర్‌లో సింగాపూర్ ఇందిరలను కాంగ్రెస్‌పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఆత్రం సక్కు నామినేషన్‌ను కూడా దాఖలుచేశారు. అయితే కూటమిలోని పార్టీలే ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా అదే కూటమిలో ఉన్న టిజెఎస్ కూడా ఇప్పుడు ఈ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించడం ఆ కూటమిలోని లుకలుకలకు అద్దం పడుతోంది.

సిపిఐ సైతం నాలుగు స్థానాలు ఇవ్వకుండా విడిగానే పోటీ చేస్తామని హెచ్చరించినా చివరి నిమిషంలో కూటమి ధర్మానికి కట్టుబడి ముగ్గురు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికీ అదనపు సీటు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నామని, తాము కోరుకున్న మునుగోడు, కొత్తగూడెం స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ప్రకటించినందున మిగిలిన దేవరకొండ కోసం ప్రయత్నిస్తున్నామని సిపిఐ నాయకుడు పల్లా వెంకటరెడ్డి తెలిపారు. కూటమి పొత్తులో భాగంగా దేవరకొండ తమ పార్టీకి వస్తేనే పోటీ చేస్తామని, లేదంటే రెబల్‌గానో, ఫ్రెండ్లీ పోటీ పేరుతో అభ్యర్థిని నిలబెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కానీ టిజెఎస్ మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

ఇంకా వీడని సీట్ల సర్దుబాటు ముడి : నామినేషన్లకు నోటిఫికేషన్ వెలువడి మూడు రోజులైనా ఇంకా కూటమిలో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాలేదు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా తెలుగుదేశంకు 14, తెలంగాణ జన సమితికి 8, సిపిఐకు 3 చొప్పున కాంగ్రెస్ సీట్లను కేటాయించింది. ఏయే స్థానాలు అనేది ఆ మూడు పార్టీలకూ చెప్పిన కాంగ్రెస్ మిగిలిన 94 స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తును దాదాపు పూర్తిచేసింది. రెండు విడతల్లో 75 మంది అభ్యర్థులను ప్రకటించి తుది జాబితాగా మరో 19 మంది అభ్యర్థులను పేర్లను ప్రకటించనుంది. సీట్ల సర్దుబాటులో భాగంగా తెలుగుదేశం సైతం తనకు దక్కిన 14 స్థానాల్లో 9 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. మరో ఐదు స్థానాలకు త్వరలో ప్రకటించనుంది. సిపిఐ సైతం మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏయే స్థానాలు అనేదానిపై స్పష్టత ఏర్పడినా టిజెఎస్ మాత్రం సంఖ్యలోనే కాకుండా కూటమి భాగస్వామ్య పార్టీలకు కేటాయించిన స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం సంచలనం రేకెత్తించింది. ఒకవైపు కూటమిలోనే కొనసాగుతాం అంటూనే ఇతర పార్టీలకు కేటాయించిన సీట్లలోనూ పోటీ చేస్తామని ప్రకటించడంతో ఆ పార్టీల్లోనూ గుబులు మొదలుకానుంది. ఫ్రెండ్లీ పోటీ చేసినా, రెబల్ పేరుతో పోటీచేసినా కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఓట్లకే గండిపడే అవకాశం ఉంది. దీంతో కూటమి ఉనికే ప్రశ్నార్థకం కానుంది.

TJS were allotted 8 seats

Telangana Latest News

Related Stories: