అద్భుత దీవులకు నిలయం.. ఇండోనేషియా

అందాలకు, ఆహ్లాదాలకు, అద్భుతాలకు నెలవైన దేశమే ఇండోనేషియా! లెక్కలేనన్ని దీవులు, ద్వీపాలు, అగ్నిపర్వతాలతో నిండిపోయింది.. ఈ ప్రదేశం. ఇవన్నీ ఒకప్పటి భరతఖండంలో అంతర్భాగాలే!  మొత్తం ఇండోనేషియా 17,000 దీవుల సముదాయం. ఇక్కడ పేరు తెలియని, జనసంచారం లేని దీవులే ఎక్కువ. మిగిలిన దీవుల్లో పాతిక కోట్ల మందికిపైగా జీవనం సాగిస్తున్నారు.  ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డవారు ఎందరో. అందుకే ఈ దేశంలో ఎవరి భాష వారిది. ఎవరి సంస్కృతి వారిది. 300కు పైగా భాషలు […]

అందాలకు, ఆహ్లాదాలకు, అద్భుతాలకు నెలవైన దేశమే ఇండోనేషియా! లెక్కలేనన్ని దీవులు, ద్వీపాలు, అగ్నిపర్వతాలతో నిండిపోయింది.. ఈ ప్రదేశం. ఇవన్నీ ఒకప్పటి భరతఖండంలో అంతర్భాగాలే!  మొత్తం ఇండోనేషియా 17,000 దీవుల సముదాయం. ఇక్కడ పేరు తెలియని, జనసంచారం లేని దీవులే ఎక్కువ. మిగిలిన దీవుల్లో పాతిక కోట్ల మందికిపైగా జీవనం సాగిస్తున్నారు.  ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డవారు ఎందరో. అందుకే ఈ దేశంలో ఎవరి భాష వారిది. ఎవరి సంస్కృతి వారిది. 300కు పైగా భాషలు వినిపిస్తాయి. అయినా ‘భిన్నత్వంలో ఏకత్వం’ ఇండోనేషియా జాతీయ విధానం. అందుకే, దీవులుగా విడిపోయినా.. దేశంగా కలిసి విరాజిల్లుతున్నాయి ఈ దీవులు. ఇన్ని ప్రత్యేకతలున్న అందాల దీవులకు ఘనమైన గుర్తింపు ఉంది. ప్రతీ సంవత్సరానికి ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 

ఇండోనేషియా రాజధాని జకార్తా. ఈ దేశంలోని ప్రముఖ నగరం పాలెంబ్యాంగ్ . జకార్త నుంచి పాలెంబ్యాంగ్ సుమారు 620 కి.మీ దూరంలో ఉంటుంది. విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మన హైదరాబాద్‌లోనే కాదు.. పాలెంబ్యాగ్‌లోనూ మూసీ నది ఉంది. ఈ మూసీపై ముక్కు మూసుకోకుండా విహరించవచ్చు. జకార్త, పాలెంబ్యాంగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన మైదానాలు పర్యాటకులను అబ్బురపరుస్తాయి.

సాహస క్రీడలు… అద్భుత ప్రకృతి సంపత్తి కలిగిన ఇండోనేషియాలో మరెన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. సుమత్రా, జావా, న్యూగినియా, బాలీ, బాండా, టెర్నేట్ ఇలా ఎన్నెన్నో ద్వీపాలు. సముద్ర క్రీడలకు ఈ దీవులన్నీ వేదికలే! సర్ఫింగ్, స్కూబా డైవింగ్, బనానా రైడింగ్, స్నోర్కలింగ్ వంటి సాహస క్రీడలు పర్యాటకులకు వినోదాన్ని పంచుతాయి.

డ్రాగన్స్ ప్రపంచం… యునెస్కో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందిన ప్రదేశాలు ఇండోనేషియాలో ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి ఫ్లోర్స్ ద్వీపంలోని కొమొడో నేషనల్ పార్క్. ఇక్కడ పది అడుగుల పొడవుండే బల్లులు ఉంటాయి. కొమొడో డ్రాగన్స్‌గా పేరున్న ఈ బల్లులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. డ్రాగన్స్ పార్క్ సమీపంలోని పింక్ బీచ్ తప్పకుండా సందర్శించాలి.

చిట్టి చిట్టి దీవుల్లో… ఇండోనేషియాలోని పాపువా రీజియన్‌లో ఉంటాయి రాజా అంపత్ దీవులు. సలావటి, మిసూ, బటాంట, వైజియో ద్వీపాలను కలిపి రాజా అంపత్ అంటారు. ఇదే ప్రాంతంలో ఉద్యానవనం మాదిరి 600 చిట్టిపొట్టి ద్వీపాలు ఉన్నాయి. ఇక్కడ రిసార్ట్‌లు అద్భుతంగా ఉంటాయి. రకరకాల పక్షులు ఈ దీవుల్లో ఉంటాయి. జకార్త నుంచి లాంబక్‌కు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుంచి మర పడవల్లో కొమొడో నేషనల్ పార్క్‌కు చేరుకోవచ్చు.

రగులుతున్న బ్రహ్మపర్వతం… ఇక్కడ మరో అందమైన దీవి జావా. ఇక్కడ ఎన్ని విశేషాలున్నా.. అందరి కళ్లూ.. బ్రోమో అగ్ని పర్వతంపైనే ఉంటాయి. తూర్పు జావా పరిధిలో సెమేరు నేషనల్ పార్క్ కొండలు, పర్వతాలతో ఉంటుంది. సెమేరు పర్వతానికి కాస్త దూరంలో ఈ కొండ పొగలు కక్కుతున్న మేఘాలను మరిపిస్తుంది. ఒకప్పుడు ఈ పర్వతంపైకి ట్రెక్కింగ్ అవకాశం ఉండేది. ప్రస్తుతం ఇక్కడికి వెళ్లడాన్ని నిషేధించారు. ఇక్కడికి సమీపంలోని పెనంజకన్ పర్వతంపై ఉన్న వ్యూ పాయింట్ నుంచి బ్రోమో దర్పాన్ని దర్శించవచ్చు.

మౌంట్ బ్రోమోను బ్రహ్మ పర్వతం అని కూడా పిలుస్తారు. సెమేరు నేషనల్ పార్క్‌లో మరెన్నో విశేషాలు ఉన్నాయి. అందులో ఒకటి మడకరిపుర జలపాతం. నిండా పచ్చదనం ఉన్న పర్వతాల నుంచి జాలువారే జలధారలను చూస్తూ ఎంతసేపైనా ఉండిపోవచ్చు. సురబయ నుంచి సెమేరు నేషనల్ పార్క్ 110 కి.మీ దూరంలో ఉంటుంది. జకార్త, కౌలాలంపూర్, సింగపూర్ నుంచి సురబయకు విమాన సర్వీసులు ఉన్నాయి. అక్కడి నుంచి ట్యాక్సీలో వెళ్లాలి. జకార్త నుంచి దక్షిణ పాపువా రీజియన్‌లోని సొరోంగ్ నగరానికి విమాన సర్వీసులు ఉన్నాయి. అక్కడి నుంచి రాజా అంపత్ దీవులకు మర పడవల్లో వెళ్లొచ్చు.

ఇలా వెళ్లొచ్చు..
హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్, సింగపూర్ మీదుగా జకార్తాకు విమాన సర్వీసులు ఉన్నాయి. జకార్త నుంచి ఇండోనేషియాలోని ప్రధాన నగరాలన్నింటికీ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇండోనేషియా వెళ్లాలంటే వీసాతో పనిలేదు. జకార్తాలో దిగాక అనుమతి తీసుకోవచ్చు.

Indonesia is home to the fantastic islands

Telangana Latest News